కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే? ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి?

కొన్ని దేశాల్లో వైద్య సిబ్బంది కోవిడ్-19కు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని దేశాల్లో వైద్య సిబ్బంది కోవిడ్-19కు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.

కోవిడ్-19పై జరుగుతున్న పోరులో ప్రపంచవ్యాప్తంగా వైద్య సిబ్బంది కూడా త్యాగాలు చేయాల్సి వస్తోంది. వేలాది మంది కరోనావైరస్ బారిన పడ్డారు. వారి మరణాల గురించి వార్తలు పెరుగుతున్నాయి.

రక్షణ దుస్తులు, మాస్కులు ఉన్నప్పటికీ, సాధారణ ప్రజల కంటే వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని అనిపిస్తోంది. వారు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం వారి శరీరంలో వైరస్ లోడ్ ఎక్కువగా ఉండడమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

జింబాబ్వే మూడు వారాలపాటు లాక్ డౌన్‌లోకి వెళ్లడంతో ఆరోగ్య కార్యకర్తలు సమ్మెకు దిగారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జింబాబ్వే మూడు వారాలపాటు లాక్ డౌన్‌లోకి వెళ్లడంతో వైద్య సిబ్బంది సమ్మెకు దిగారు

వైరల్ లోడ్ అంటే?

కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స అందించేందుకు, అంటే వైరస్‌ చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వైద్య సిబ్బంది పనిచేస్తారు. వైద్యులు, నర్సులు తీవ్ర అనారోగ్యానికి గురవడానికి అదే ప్రధాన కారణం.

మనిషి శరీరంలోకి వైరస్ ప్రవేశించిన తరువాత, శరీర కణాలపై దాడి చేస్తూ, కొత్త వైరస్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఆ కొత్త వైరస్‌లు కూడా అలాగే దాడి చేస్తూ, మరిన్ని వైరస్‌లను ఉత్పత్తి చేస్తుంటాయి. అలా రోగి శరీరంలో వైరస్‌ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. ఆ వైరస్‌ల మోతాదునే "వైరల్ లోడ్" అంటారు. అది ఎంత ఎక్కువగా ఉంటే ఆ రోగి ఆరోగ్యం అంతగా క్షీణిస్తుంది, ఆ రోగి నుంచి ఇతరులకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒక వ్యక్తి శరీరంలో వైరస్ ఎంత ఎక్కువ ఉంటే, అంత ఎక్కువగా ఇతరులకు సోకుతుందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ వెండి బార్కలే బీబీసీతో చెప్పారు.

వైద్యులు, నర్సులు తరచూ వైరస్ ఎక్కువగా సోకిన రోగులకు చాలా దగ్గరగా పనిచేస్తారు. అందుకే, వారికి భారీ మొత్తంలో వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది.

చైనాలోని వుహాన్‌లో ఉన్న ఒక ఆస్పత్రిలో ఒక్క రోగి నుంచి 14 మంది వైద్య సిబ్బందికి వైరస్‌ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అప్పటికి ఆ రోగిలో జ్వరం లాంటి లక్షణాలు కూడా కనిపించలేదని నిపుణులు చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

“కొద్దిపాటి వైరస్‌ దాడి చేస్తే మనలోని రోగనిరోధక వ్యవస్థ దానితో పోరాడగలుగుతుంది. కానీ, మనలో రోగనిరోధక వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, భారీ మొత్తంలో వైరస్‌ దాడి చేసినప్పుడు, దానిని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది’’ అని ప్రొఫెసర్ బార్కలే అంటున్నారు.

“మనకు సోకిన వైరస్ మోతాదు, మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు, వైరస్‌కు మధ్య జరిగే యుద్ధంలో బలాబలాలను నిర్ణయిస్తుంది. ఎక్కువ మోతాదులో వైరస్ దాడి చేసినప్పుడు మనం ఎక్కువ అనారోగ్యానికి గురవుతాం. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది” అని ప్రొఫెసర్ బార్కలే వివరించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

కోవిడ్-19 మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది?

కోవిడ్-19తో బాధపడుతున్న వ్యక్తి ఎగువ శ్వాసకోశ నాళంలో వైరస్ దాగి ఉంటుంది. ఆ వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే సన్నని తుంపర్ల ద్వారా అది బయటకు వచ్చేస్తుంది.

"శ్వాసక్రియలో భాగంగా గాలి వదిలేటప్పుడు, మాట్లాడేటప్పుడు ప్రతిసారీ మన ముక్కుల నుంచి, నోటి నుంచి కొన్ని తుపర్లు బయటకు వచ్చి గాలిలో కలుస్తుంటాయి. ఆ తుంపర్లలోనే వైరస్ ఉంటుంది. కాబట్టి, ఆ తుంపర్లు ఎక్కడ పడినా అక్కడ వైరస్ అంటుకుంటుంది. నేలపై పడొచ్చు, ఏదైనా వస్తువు మీదనో, ఉపరితలం మీదనో పడొచ్చు. కలుషితమైన ఆ ఉపరితలాలను చేతులతో ముట్టుకుని, అవే చేతులతో ముఖాన్ని తాకితే మనకు వైరస్ సంక్రమిస్తుంది. అందుకే, అందరూ సామాజిక దూరం పాటించాలి, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి" అని ప్రొఫెసర్ బార్కలే వివరించారు.

స్పెయిన్‌లో 12శాతం మంది వైద్య సిబ్బంది కరోనావైరస్ బారిన పడ్డారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్పెయిన్‌లో 12శాతం మంది వైద్య సిబ్బంది కరోనావైరస్ బారిన పడ్డారు

అయితే, ఎన్ని కోవిడ్-19 వైరస్ కణాలు శరీరంలోకి వెళ్తే ఒక వ్యక్తి అనారోగ్యానికి గురవుతారన్నది ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు.

“ఇన్‌ఫ్లూయెంజా వైరస్ గురించి చాలా విషయాలు తెలిశాయి. ఈ వైరస్‌కు సంబంధించిన మూడు కణాలు మన శరీరంలోకి వెళ్లినా సరే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కోవిడ్-19కు సంబంధించి ఆ సంఖ్య గురించి ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ, తక్కువ మొత్తంలో ఈ వైరస్ సోకినా మనిషి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని అనిపిస్తోంది” అని ప్రొఫెసర్ బార్కలే అన్నారు.

వైరస్‌కు ప్రభావితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వైరస్‌కు ప్రభావితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

వైద్యులపై ప్రభావం ఎలా ఉంది?

ప్రస్తుత కరోనావైరస్‌ ప్రభావం వైద్య సిబ్బందిపై ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు కచ్చితమైన వివరాలు ఇంకా తెలియడంలేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, 2002-03లో విజృంభించిన సార్స్‌ బాధితుల్లో 21 శాతం మంది వైద్య సిబ్బంది ఉన్నారు.

కోవిడ్-19 విషయంలోనూ దాదాపు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇటలీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 6,200 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. స్పెయిన్‌లోని కరోనావైరస్ బాధితుల్లో 6,500 మంది (మొత్తం కేసుల్లో 12 శాతం) వైద్య సిబ్బంది ఉన్నారని అంచనా.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

తమ దేశంలో సుమారు 3,300 మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనావైరస్ సోకిందని మార్చి ప్రారంభంలో చైనా చెప్పింది. ఆ దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 4 నుంచి 12 శాతం మంది వైద్య సిబ్బంది ఉంటున్నారు. వైద్యులకు సరైన రక్షణ పరికరాలు అందుబాటులో లేని కొన్ని ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో దాదాపు 50 శాతం మంది సిబ్బంది అనారోగ్యానికి గురవుతున్నారని బ్రిటన్‌కు చెందిన ఒక వైద్య నిపుణుడు చెప్పారు.

వైద్యులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైతే, ఈ కరోనా మహమ్మారికి ఆసుపత్రులే ప్రధాన కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

న్యూయార్క్‌లో కోవిడ్-19 టెస్టులు చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్న వైద్య సిబ్బంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లో కోవిడ్-19 టెస్టులు చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్న వైద్య సిబ్బంది.

రక్షణ పరికరాల కొరత

రోగులకు అత్యంత దగ్గరా వైద్య సిబ్బంది పనిచేస్తారు. కానీ, చాలా దేశాల్లో వారికి అవసరమయ్యే వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ కిట్లు) కొరత కనిపిస్తోంది. దాంతో, వైద్య సిబ్బంది ప్రభుత్వాలపై ఆగ్రహంతో ఉన్నారు.

ఫ్రాన్స్‌లో మాస్కుల తయారీని పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని వైద్యులు కేసు వేశారు. మాస్కుల కొరత కారణంగా తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మూడు వారాలపాటు లాక్‌డౌన్‌లో ఉన్న జింబాబ్వేలో పీపీఈ కిట్లు లేకపోవడాన్ని నిరసిస్తూ వైద్యులు, నర్సులు సమ్మెకు దిగారు.

బ్రిటన్‌లో తగినన్ని రక్షణ పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యులు, నర్సులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారని యూకే వైద్యుల సంఘం ప్రతినిధి అన్నారు.

(బీబీసీ న్యూస్‌నైట్ హెల్త్ కరస్పాండెంట్ డెబోరా కోహెన్ సహకారంతో ఈ కథనం అందిస్తున్నాం)

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)