కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన వైరస్, 12 వేలు దాటిన మృతులు... తప్పు ఎక్కడ జరిగింది?

ఇటలీలో కరోనా తీవ్రత

ఫొటో సోర్స్, Getty Images

ఇటలీలో ఆంక్షలు విధించి ఆరు వారాలు అవుతోంది. అయినా, మిగతా దేశాలతో పోలిస్తే ఈ దేశంలో మరణాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? బుధవారం నాటికి ఈ దేశంలో 12 వేల మందికి పైగా చనిపోయారు. వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష దాటింది.

కరోనావైరస్ మొదటి కేసు చైనాలోని వుహాన్ నగరంలో గత ఏడాది డిసెంబర్‌లో బయటపడింది. కొన్ని నెలల్లోనే ఆ వైరస్ ప్రపంచమంతా దాదాపు ప్రతి దేశానికీ వ్యాపించింది. లక్షల మందికి వ్యాపించి, వేల ప్రాణాలు బలి తీసుకుంది.

భూమి మీద దాదాపు ప్రతి ప్రాంతాన్నీ గుప్పిట్లో నలిపేస్తున్న ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 8.6 లక్షల మందికి వ్యాపించింది. చనిపోయినవారి సంఖ్య 42 వేలు దాటింది.

అయితే, అదే సమయంలో 1.78 లక్షల కరోనా నుంచి రికవర్ కూడా అయ్యారు. అత్యధిక పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదైతే, ఈ వైరస్ వల్ల అత్యధిక మరణాలు ఇటలీలో సంభవించాయి.

ఇటలీలో వైరస్ వ్యాపించినప్పటి నుంచి ఇప్పటివరకూ 12 వేల మందికి పైగా మృతిచెందారు.

కరోనాను నియంత్రించేందుకు ఇటలీ కఠిన చర్యలు చేపట్టింది. అయినా, ప్రతి రోజూ ఇక్కడ సగటున 600 మరణాలు సంభవిస్తున్నాయి.

ఇటలీలో కరోనా తీవ్రత

ఫొటో సోర్స్, getty images

ఆరు వారాల నుంచి ఆంక్షలు

ఆంటోనియా మిలాన్‌లో ఉంటారు. తన కార్లో మరో వ్యక్తితో కలిసి వెళ్తున్నప్పుడు పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. తను అప్పుడు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. ఆమెతో పాటూ కూర్చున్న వ్యక్తిని వెనక కూర్చోమని, మాస్క్ కూడా పెట్టుకోవాలని హెచ్చరించడానికి వారు ఆమెను ఆపారు.

మిలాన్ నగరంలోనే నివసించే మరో మహిళ కారు ముందు సీట్లో ఇద్దరు పక్కపక్కనే కూర్చోకూడదని పోలీసులు తనకు చెప్పారని తెలిపారు. ఆమె అప్పుడు ఆస్పత్రిలో ఉన్న తన బంధువును కలవడానికి వెళ్తోంది. ఆయనకు కరోనా లేదు. వేరే ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో ఉన్నారు.

ఇటలీలో ఆంక్షలు విధించి ఆరు వారాలు అవుతోంది. అయినా, మిగతా దేశాలతో పోలిస్తే ఈ దేశంలో ఇంతమంది ఎందుకు చనిపోయారు?

దానికి ఒకటి కాదు, చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అతిపెద్ద కారణం దేశ జనాభాలో ఎక్కువ మంది వయసు పైబడిన వారు కావడం. ప్రపంచంలో జపాన్ తర్వాత వృద్ధుల జనాభా అత్యధికంగా ఉన్నది ఇటలీలోనే.

కోవిడ్-19 ఎక్కువగా వృద్ధుల మీదనే ప్రభావం చూపిస్తుంది అనేది కరోనావైరస్ గురించి ఇప్పటివరకూ స్పష్టంగా తెలిసిన ఒకే ఒక విషయం. టెస్టుల కోసం అమలు చేస్తున్న ప్రక్రియ కూడా ఈ మరణాలకు మరో కారణం. దేశంలో చేస్తున్న పరీక్షల్లో ఇది కచ్చితంగా ఎంతమందికి వ్యాపించింది అనేది సరిగా తెలీడం లేదు.

ఇటలీలో కరోనా తీవ్రత

ఫొటో సోర్స్, Getty Images

గణాంకాల వక్రీకరణ

“ఇటలీలో ఇప్పటివరకూ ధ్రువీకరించిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఆ దేశంలో ఉన్న మొత్తం ఇన్ఫెక్షన్ కేసుల గురించి చెప్పడం లేదు. ఆ గణాంకాలు ఇంకా చాలా ఎక్కువే ఉంటాయి” అని మిలాన్‌లోని ఒక ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మాసిమో గల్లీ అన్నారు.

“ఇన్ఫెక్షన్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్న కేసులు మాత్రమే పరీక్షిస్తున్నారు. మిగతా ఎవరికీ టెస్టులు చేయడం లేదు. దాంతో మృతుల గణాంకాలు పెరుగుతూ పోతున్నాయి.

ఇటలీలో కరోనాకు అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతం లోంబార్డీ. ఇక్కడ ప్రతి రోజూ 5 వేలకు పైగా స్వాబ్ టెస్టులు (ఒక పరికరంతో చేసే పరీక్షలు) జరుగుతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల కంటే చాలా ఎక్కువ స్థాయిలో టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, డయాగ్నసిస్ కోసం ఎదురుచూస్తున్న కొన్ని వేల మంది ఇళ్లలోనే ఉంటున్నారు” అని గల్లీ చెప్పారు.

అంతేకాదు, కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ దుస్తులు, పరికరాల కొరత కూడా ఉంది. మిగతా దేశాలకు ఇవి ఒక హెచ్చరిక కూడా.

“మా దేశంలో ఒక నేషనల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది. అది చాలా బాగా పనిచేస్తుంది. కానీ, దేశంలో, ముఖ్యంగా లోంబార్డీలో కరోనాతో పోరాడ్డంలో ఆ వ్యవస్థ చాలా ఘోరంగా ప్రభావితమైంది” అన్నారు.

“ఆస్పత్రిలో నమ్మలేని స్థాయిలో పడకల సంఖ్యను పెంచాం. కానీ మాకు మందుల కొరత ఉంది, మా అతిపెద్ద సమస్య అదే. మిగతా దేశాలను కూడా ఈ సమస్య వేధించబోతోంది” అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇటలీలో కరోనా తీవ్రత

ఫొటో సోర్స్, getty images

వృద్ధులకు ఎక్కువ ముప్పు

ఇటలీ ప్రభుత్వ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ చనిపోయినవారి సగటు వయసు 78 ఏళ్లు.

“ఇటలీ పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఇప్పటికే ఉన్న వైద్య సేవల ద్వారా చాలామంది వృద్ధులను కాపాడడంలో విజయం సాధించాం” అని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, దేశంలో మృతుల గణాంకాలు అంతకంతకూ పెరుగుతున్నా, కొన్ని కలిగించే కేసులు మిగతావారిలో జీవితంపై ఆశలు కలిగిస్తున్నాయి.

ఇటలీలో 102 ఏళ్ల గ్రోన్‌డోనా కరోనావైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరారు. ఆమె 20 రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఉత్తర ఇటలీలోని జెనేవా డాక్టర్లు ఆమెకు, ఆమె మేనల్లుడికి చికిత్స చేశారు. ఇప్పుడు వారిద్దరూ బాగున్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఆంక్షల తీవ్రత

ఇటలీలో తమ ప్రాంతంలో కరోనావైరస్‌ను నియంత్రణ కోసం విధించిన ఆంక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయని దేశంలోని కొందరు నిపుణులు చెబుతున్నారు.

చైనాలో లాక్‌డౌన్ విధించిన మొదటి సిటీ వుహాన్. దీనిని జనవరి నెలలోనే మూసేశారు. అన్ని విమానసేవలపై ఆంక్షలు విధించారు. రైళ్లు, బస్సులు నిసిరివే. అన్ని హైవే సరిహద్దులను దిగ్బంధం చేశారు.

తగిన కారణం లేకుండా ఇళ్ల బయటకు వచ్చే వారికి ఇటలీ ప్రభుత్వం సుమారు లక్షా 49 వేల రూపాయల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఇటలీలో కరోనాకు అత్యంత ప్రభావితమైన లోంబార్డీలో పౌరులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చే హక్కును రద్దు చేశారు. వారు తమ కుక్కలను కూడా ఇంటి నుంచి 200 మీటర్లు దాటి తీసుకెళ్లకుండా ఆంక్షలు విధించారు.

కొత్తగా ప్రకటించిన ఆంక్షల్లో ఏప్రిల్ 15 వరకూ ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం, వాకింగ్, రన్నింగ్ లాంటివి చేయకూడదు. బైక్ మీద బయకు వెళ్లడాన్ని కూడా నిషేధించారు (ఇంట్లో లాన్ ఉంటే అక్కడ వ్యాయామం చేయవచ్చు).

లోంబార్డీలో ఇళ్ల బయట ఎవరైనా ఏదైనా గుంపులో భాగమైతే, వారికి 5 వేల యూరోల జరిమానా విధిస్తారు. ఇటలీలోని మిగతా ప్రాంతాల్లో విధిస్తున్న జరిమానా కంటే ఇది 25 రెట్లు అధికం.

కరోనావైరస్

రాజ్యాంగ హక్కులు రద్దు

ఎవరికైనా రెండు ఇళ్లు ఉంటే, వారు తమ ప్రధాన నివాసంలోనే ఉండాలి. మరో ఇంటికి వెళ్లకూడదు.

దేశంలోని అన్ని పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు, ఫాం హౌస్‌లు మూసివేశారు. కానీ ఈ ఆంక్షలు విశ్వవిద్యాలయాల డార్మిటరీలపై అమలు కావు.

వీటితోపాటూ కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే బయట ఏదైనా దుకాణానికి వెళ్లే అనుమతి లభిస్తుంది. ఆహార సరుకులు, తాగే పదార్థాలు అమ్మే వెండింగ్ మెషిన్లను నిలిపివేశారు.

తాజా ఆదేశాల్లో, దేశంలో అన్ని నిర్మాణ కార్యక్రమాలను తక్షణం నిషేధించారు. అత్యవసర సేవల్లో పనిచేసేవారు, ముఖ్యంగా సూపర్ మార్కెట్ క్యాషియర్లకు గంటకోసారి ఉష్ణోగ్రత చెక్ చేస్తుండాలి. బహిరంగ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసులకు ఎవరినైనా అడ్డుకుని ఉష్ణోగ్రతలను చెక్ చేసే అధికారం ఉంటుంది.

లోంబార్డీ లాగే ఇటలీలో మూడో అత్యంత ప్రభావిత ప్రాంతం పీడమౌంట్‌లో కూడా కఠిన చర్యలు చేపట్టారు.

దేశంలో ఈ ఆంక్షలను తీవ్రంగా విమర్శిస్తుంటే, కొందరి అభిప్రాయాలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇటలీలో అమలవుతున్న ఆంక్షలు చైనాతో పోలిస్తే అంత కఠినంగా లేవని వారు భావిస్తున్నారు.

ఆంక్షలు విధించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని యూరోపియన్ అండ్ ఇటాలియన్ సొసైటీ ఫర్ వైరాలజీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పాలూ చెబుతున్నారు.

“మా నుంచి కొన్ని రాజ్యాంగ హక్కులను లాక్కుని ఉండచ్చు. కానీ ఒక ప్రజాస్వామ్య దేశంలో అలా చేయడం అత్యంత సమర్థవంతమైన చర్య” అన్నారు.

కానీ ఇటలీలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరగడం చూస్తుంటే, ప్రస్తుతానికి దేశంలో అమలు చేస్తున్న ఆంక్షల్లో ఎలాంటి సడలింపులు చేసేలా కనిపించడం లేదు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)