కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు

1350లో బ్యుబోనిక్ ప్లేగు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరప్‌లో ప్లేగు మహమ్మారి అంతం కోసం ప్రార్థనలు నిర్వహించారు

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవనశైలిని కరోనావైరస్ మహమ్మారి మార్చేస్తోంది.

ఈ మార్పుల్లో చాలా వరకూ తాత్కాలికమే. కానీ.. చరిత్రలో చూస్తే ఇలా ప్రబలిన వ్యాధులు.. సామ్రాజ్యాల పతనం నుంచి.. వలస రాజ్యాల విస్తరణ వరకూ శాశ్వత ప్రభావాలు వేసిన ఉదంతాలు ఉన్నాయి.

1. బ్లాక్ డెత్... పశ్చిమ యూరప్ మహావిషాదం

యూరప్‌లో 1350వ సంవత్సర కాలంలో చెలరేగిన ప్లేగు జనాభాలో మూడో వంతు మందిని సంహరించింది.

అయితే, కోట్లాది మంది ప్రజల మరణం వల్ల ఆ ప్రాంతంలోని చాలా దేశాలు మరింత పురోగమించటానికి దోహదపడి ఉండవచ్చు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఈ దేశాలు ఉండటానికి ఇది తోడ్పడింది.

బ్యుబోనిక్ ప్లేగుగా భావించే ఆ మహమ్మారి వల్ల జనాభాలో ఎక్కువ శాతం మంది చనిపోవటంతో రైతుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఫలితంగా భూముల యజమానులకు శ్రామికుల కొరత తలెత్తింది.

అంటే, వ్యవసాయ కార్మికులకు ఎక్కువ వేతనాలు డిమాండ్ చేసే శక్తి లభించింది.

దీంతో, కౌలు చెల్లించటానికి బలవంతంగా పనిచేయాల్సిన పరిస్థితి పోవడంతో.. పాత భూస్వామ్య వ్యవస్థ విచ్ఛిన్నమవటం మొదలైంది.

ఈ పరిణామంతో పశ్చిమ యూరప్.. ఆధునికీకరణలో, వాణిజ్య పరంగా, నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మరింతగా పురోగమించింది.

బ్లాక్ డెత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్లేగు మహమ్మారిని నియంత్రించటానికి దుస్తులు దగ్ధం చేశారు

ప్రజలను పనిలో నియమించుకోవటం చాలా ఖరీదైన వ్యవహారం కావటంతో.. మనుషుల స్థానంలో సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించే మార్గాలపై వ్యాపారాల యజమానులు పెట్టుబడులు పెట్టటం మొదలైంది.

యూరోపియన్ వలసవాదాన్ని కూడా ఆ ప్లేగు మహమ్మారి ప్రోత్సహించిందనే వాదన కూడా ఉంది.

అప్పటివరకూ సముద్ర ప్రయాణం, కొత్త ప్రాంతాల అన్వేషణను అత్యంత ప్రమాదకరంగా పరిగణించేవారు. కానీ స్వదేశంలో ఈ స్థాయి మరణాలు సంభవిస్తుండటంతో జనం సుదీర్ఘ సముద్ర ప్రయాణాలకు చాలా ఎక్కువగా మొగ్గుచూపారు.

ఇది.. యూరోపియన్ వలసవాదం విస్తరించటానికి దోహదపడింది.

ఆర్థికవ్యవస్థ ఆధునీకరణ కావటం, టెక్నాలజీలో పెట్టుబడులు పెరగటం, విదేశీ విస్తరణలకు ప్రోత్సాహం లభించటం.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రాంతాల్లో పశ్చిమ యూరప్ ఒకటిగా అవతరించటానికి తోడ్పడ్డాయని భావిస్తారు.

1520లో మెక్సికో నుంచి హెర్నాండో కోర్టెస్ తిరుగుముఖం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్పెయిన్ ఆక్రమణదారులు తమతో పాటు ప్రాణాంతక వ్యాధులను దక్షిణ అమెరికాకు తీసుకొచ్చారు

2. అమెరికా ఖండాల్లో మశూచి... వాతావరణ మార్పు

పదిహేనో శతాబ్దం చివర్లో అమెరికా ఖండాలను వలసలు ఆక్రమించటం.. ఎంతో మంది ప్రజల మరణాలకు కారణమైంది. ఇది ప్రపంచ వాతావరణాన్ని మార్చివేసి ఉండొచ్చు.

బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో.. యూరప్ విస్తరణతో ఈ ప్రాంతంలోని జనాభా కేవలం 100 సంవత్సరాల వ్యవధిలోనే ఆరు కోట్ల (ఆ సమయంలో ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం) నుంచి 60 లక్షలకు పడిపోయిందని గుర్తించారు.

ఈ మరణాలకు ప్రధాన కారణం.. వలస ఆక్రమణదారులు ప్రవేశపెట్టిన వ్యాధులే.

అందులోనూ.. మశూచి (స్మాల్‌పాక్స్) అత్యధికులను బలితీసుకుంది. తట్టు (మీజిల్స్), ఫ్లూ (ఇన్‌ఫ్లుయెన్జా), బ్యుబోనిక్ ప్లేగ్, మలేరియా, డిప్తీరియా, టైఫస్, కలరా వంటి వ్యాధులు కూడా చాలా మంది ప్రాణాలను హరించాయి.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

అయితే, ఈ ప్రాంతంలో అనూహ్య ప్రాణ నష్టం, భయానక మానవ విషాదం కలిగించినప్పటికీ.. మొత్తం ప్రపంచం మీద కూడా ఈ పరిణామాల ప్రభావం ఉంది.

జనాభా తగ్గిపోవటంతో ప్రజలు ఆక్రమించుకుని, సాగు చేసే భూమి పరిమాణం గణనీయంగా తగ్గిపోయింది. విస్తారమైన భూమి మళ్లీ సహజమైన అడవులుగా మారిపోయింది.

ఈ రకంగా మారిపోయిన భూమి 5,60,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుందని అంచనా. ఇది ఫ్రాన్స్ లేదా కెన్యా విస్తీర్ణంతో సమానం.

పెరూలో స్పెయిన్ ఆక్రమణదారులు, స్థానికుల కలయిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్పెయిన్ అన్వేషకుల ఆగమనం తర్వాత కోట్లాది మంది చనిపోయారు

ఇంత విస్తీర్ణంలో చెట్లు, అడవులు పెరగటం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి తగ్గిపోయింది. (ఇది అంటార్కిటికాలోని మంచు పొరల నమూనాల్లో నమోదైంది.) దానివల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి.

ఈ పరిణామంతో పాటు భారీ అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరగటం, సౌర కార్యకలాపాలు తగ్గటం వల్ల చాలా భూభాగాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి 'చిన్న మంచు యుగం' అని వ్యవహరించే కాలానికి దారితీశాయని శాస్త్రవేత్తలు భావిస్తారు.

విషాదం ఏమిటంటే, దీనివల్ల అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో యూరప్ ఒకటి. అక్కడ పంటలు విఫలమై కరవులు తలెత్తాయి.

1791 ఆగస్టు 21 రాత్రి బానిసల తిరుగుబాటు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల్లో ఫీవర్, బానిసల తిరుగుబాటు కారణంగా హైతీలో ఫ్రాన్స్ పాలన అంతమైంది

3. ఎల్లో ఫీవర్.. ఫ్రాన్స్ మీద హైతీ తిరుగుబాటు

హైతీలో ఒక వ్యాధి విజృంభించటంతో తలెత్తిన పరిణామాల వల్ల ఉత్తర అమెరికా నుంచి ఫ్రాన్స్ గెంటివేతకు గురికావాల్సి వచ్చింది. దానివల్ల యునైటెడ్ స్టేట్స్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) విస్తీర్ణంలోనూ, బలంలోనూ వేగంగా పెరిగింది.

యూరప్ వలస శక్తుల మీద బానిసల తిరుగుబాటు అనంతరం 1801లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న టోసాయింట్ లావెర్చర్ హైతీని పాలించాడు.

ఫ్రాన్స్ నాయకుడు నెపోలియన్ బోనపార్టీ తనను తాను జీవితకాల గవర్నర్‌గా ప్రకటించుకున్నాడు. ఈ దీవిని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్న నెపోలియన్.. వేలాది మంది సైనికులను యుద్ధానికి పంపించాడు.

యుద్ధ రంగంలో ఈ సైనికులు దాదాపు విజయం సాధించారు కానీ.. ఎల్లో ఫీవర్ మాత్రం వారిని చావుదెబ్బ తీసింది. దాదాపు 50,000 మంది సైనికులు, అధికారులు, వైద్యులు, నావికులు చనిపోగా.. కేవలం 3,000 మంది మాత్రమే తిరిగి ప్రాన్స్ చేరుకోగలిగారు.

నెపోలియన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హైతీలో తన సైన్యం ఓడిపోవటంతో అమెరికాల మీద నెపోలియన్ ఆంక్షలు ఆవిరయ్యాయి

ఆఫ్రికాలో పుట్టిన ఈ వ్యాధి నుంచి యూరప్ బలగాలకు సహజమైన రోగనిరోధక రక్షణ లేదు.

తన సైనికులు ఓడిపోయి, నిస్పృహలో కూరుకుపోవటంతో నెపోలియన్ హైతీని వదిలిపెట్టేశాడు. దానితో పాటు ఉత్తర అమెరికాలో ఫ్రాన్స్ వలస ఆకాంక్షలకు కూడా నీళ్లు వదిలేశాడు.

హైతీ తిరుగుబాటును అణచివేయటానికి నెపోలియన్ బలగాలు రంగంలోకి దిగిన రెండేళ్ల తర్వాత.. ఫ్రాన్స్ నాయకుడు 21 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని యూఎస్ ప్రభుత్వానికి అమ్మేశాడు. (దీనినే లూసియానా కొనుగోలుగా వ్యవహరిస్తారు.) దీంతో అప్పుడే శైశవ దశలో ఉన్న అమెరికా విస్తీర్ణం రెట్టింపయింది.

రిండర్‌పెస్ట్ వల్ల మరణించిన ఎడ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆఫ్రికాలో రిండర్‌పెస్ట్ పెద్ద సంఖ్యలో పశువులను సంహరించింది

4. ఆఫ్రికా రిండర్‌పెస్ట్... ఆఫ్రికాలో వలసరాజ్య విస్తరణ

ఆఫ్రికాలో జంతువులను బలితీసుకునే ఒక ప్రాణాంతక వ్యాధి.. ఆ ఖండాన్ని యూరప్ వలసపాలకుల ఆక్రమణ వేగవంతం కావటానికి సాయపడింది.

ఇది ప్రజలను నేరుగా చంపిన మహమ్మారి కాదు. పశువులను చంపిన వ్యాధి.

1888 నుంచి 1897 వరకూ రిండర్‌పెస్ట్ వైరస్ (పశువుల ప్లేగు) ఆఫ్రికాలోని పశుసంపదలో 90 శాతాన్ని సంహరించింది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, సౌత్‌వెస్ట్ ఆఫ్రికాలలో ప్రజా సమాజాలు దారుణంగా దెబ్బతిన్నాయి.

పశువుల మరణంతో ఆహారలేమి తలెత్తింది. జనం తిండి లేక మాడిపోయారు. సమాజం కుప్పకూలింది. ప్రభావిత ప్రాంతాల నుంచి జనం వలసల రూపంలో పారిపోయారు.

భూములు దున్నటానికి చాలా మంది ఎడ్ల మీద ఆధారపడి ఉండటంతో.. పంటలు పండించే ప్రాంతాల మీద కూడా ఆ వ్యాధి తీవ్ర ప్రభావం చూపింది.

బెర్లిన్ సదస్సు చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిండర్‌పెస్ట్ విజృంభణకు కేవలం కొన్నేళ్ల ముందు ఆఫ్రికాను ఎలా పంచుకోవాలనే అంశం మీద యూరప్ దేశాలు బెర్లిన్‌‌లో ఒక సదస్సు నిర్వహించాయి

పశువుల ప్లేగు సృష్టించిన కల్లోలం.. యూరప్ దేశాలు 19వ శతాబ్దంలో ఆఫ్రికాలోని భారీ భూభాగాలను ఆక్రమించుకోవటానికి సాయపడింది.

రిండర్‌పెస్ట్ విజృంభించటానికి కేవలం కొన్ని సంవత్సరాల ముందే యూరప్ దేశాల వలస ప్రణాళికలు మొదలయ్యాయి.

1884-1885లో బెర్లిన్‌లో జరిగిన ఒక సదస్సులో - బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, బెల్జియం, ఇటలీ సహా యూరప్‌కు చెందిన 14 దేశాలు.. ఆఫ్రికా భూభాగం మీద తమ ఆక్రమణల మీద చర్చలు జరిపి వాటికి ఆమోదాలు తెలుపుకుని, మ్యాపులు తయారు చేసుకున్నాయి.

ఆ వ్యాధి ఆఫ్రికా ఖండం మీద అత్యంత దారుణమైన ప్రభావం చూపింది.

1870లలో ఆఫ్రికా భూభాగంలో కేవలం 10 శాతం మాత్రమే యూరప్ వలస పాలకుల ఆధీనంలో ఉండేది. కానీ 1900 సంవత్సరం నాటికి దాదాపు 90 శాతం భూమి వలసల చేతుల్లోకి వెళ్లిపోయింది.

1890ల ఆరంభంలో ఎరిత్రియాలోకి ఇటలీ ప్రవేశించింది. అందుకు పాక్షిక కారణం ఇథియోపియాలో తలెత్తిన కరవు. దానివల్ల అక్కడ మూడో వంతు జనం చనిపోయారు.

మింగ్ సామ్రాజ్య పతన సమయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మింగ్ సామ్రాజ్యం పదనం రక్తపాతమయంగా మారింది

5. చైనాలో ప్లేగు... మింగ్ సామ్రాజ్య పతనం

చైనాను మింగ్ రాజవంశం దాదాపు మూడు శతాబ్దాల పాటు పరిపాలించింది. ఆ కాలంలో తూర్పు ఆసియా అంతటా అది భారీ సాంస్కృతిక, రాజకీయ ప్రభావం చూపింది.

కానీ.. అదంతా ఒక్కసారిగా దారుణంగా అంతమైపోయింది. అందుకు పాక్షిక కారణం ప్లేగు విజృంభించటం.

చైనాలోని ఉత్తర ప్రాంతానికి 1641లో ఓ మహమ్మారి ప్రవేశించింది. భారీ సంఖ్యలో ప్రాణాలను హరించింది. కొన్ని ప్రాంతాల్లో జనాభాలో 20 శాతం మంది నుంచి 40 శాతం మందిని బలితీసుకుంది.

అప్పటికే కరవు, మిడతల దండుల దాడులతో సతమతమవుతున్న సమయంలోనే ప్లేగు కూడా పంజా విసిరింది.

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా రేఖా చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో చాలా భాగాన్ని మింగ్ సామ్రాజ్య వంశం పతనమవటానికి ముందు నిర్మించారు

పొలాల్లో పంటలు లేవు. జనానికి తిండి లేదు. ప్లేగు వల్ల చనిపోయిన వారి శరీరాలను కొంతమంది తినటం మొదలైనట్లు కూడా వార్తలు వచ్చాయి.

బ్యుబోనిక్ ప్లేగు, మలేరియాలు రెండూ ఏక కాలంలో విజృంభించటం ఈ సంక్షోభానికి కారణం కావచ్చు. ఉత్తర ప్రాంతం నుంచి వచ్చే ఆక్రమణదారులు ఈ వ్యాధిని వెంటబెట్టుకుని ఉండవచ్చు. వారు చివరికి మింగ్ సామ్రాజ్యాన్ని కూలదోశారు.

తొలుత బందిపోటు దాడులు, ఆ తర్వాత మంచూరియా ప్రాంతానికి చెందిన్ క్వింగ్ రాజవంశం ఆక్రమణ దాడులు కొనసాగాయి. వారు చివరికి మింగ్ రాజవంశాన్ని కూల్చేసి తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అది మరికొన్న శతాబ్దాలు కొనసాగింది.

మింగ్ సామ్రాజ్యాన్ని అప్పటికే అవినీతి, కరవు పీడిస్తున్నప్పటికీ.. ప్రాణాంతకమైన ప్లేగు మహమ్మారిలా దేశమంతటా విజృంభించటం.. ఆ సామ్రాజ్యం పతనమవటానికి దోహదపడింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)