సివిల్స్ అభ్యర్థి, టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్.. వీరంతా భిక్షమెత్తుకోవడానికి కారణమేంటి

- రచయిత, సందీప్ సాహు
- హోదా, బీబీసీ కోసం
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలో ‘యాచక రహిత పూరీ’ కార్యక్రమాన్ని ఆ జిల్లా అధికారులు ప్రారంభించారు. అక్కడ భిక్షాటన చేస్తున్న వాళ్లందరినీ ‘నీలాద్రి నిలయాల’కు తరలించాలని నిర్ణయించారు.
వీటిలో ఉచితంగా తిండి, బట్టలు, వైద్యం సహా అన్ని సదుపాయాలను వారికి కల్పించబోతున్నారు. ప్రభుత్వం తరఫున ఐదు స్వచ్ఛంద సంస్థలు ఇందుకోసం పనిచేస్తున్నాయి.
యాచకులను గుర్తించడంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఈ స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి.
ఒక్కో వ్యక్తిపై నెలకు రూ.3,400 చొప్పున ప్రభుత్వం ఆ ఐదు స్వచ్ఛంద సంస్థలకు చెల్లిస్తుందని పూరీ జిల్లా మెజిస్ట్రేట్ బల్వంత్ సింగ్ బీబీసీతో చెప్పారు.
‘‘పూరీని ‘హెరిటేజ్ సిటీ’గా మార్చేందుకు ఏడాదిగా చేపడుతున్న ప్రణాళికల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రపంచ స్థాయి హెరిటేజ్ సిటిలో యాచకులు ఉండటం సరికాదు. వారితో భిక్షాటనను పూర్తిగా మాన్పించడం మా లక్ష్యం. అవకాశం ఉంటే వారిని వాళ్ల కుటుంబాల చెంతకు కూడా చేర్చుతాం’’ అని ఆయన అన్నారు.

యాచకులను ముందుగా పూరీ నగరంలోనే ఉన్న పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కొద్దిరోజుల పాటు వీటిలోనే ఉంచుతున్నారు.
‘యాచక రహిత పూరీ’ కార్యక్రమాన్ని మార్చి 3న మొదలుపెట్టామని, మొదటి ఐదు రోజుల్లో 146 మంది యాచకులను ఆ కేంద్రాలకు తరలించామని ఈ శిబిరం డైరెక్టర్ లోపాముద్ర పాయికరాయ్ చెప్పారు.
పూరీ పట్టణంలో సుమారు 700 మంది యాచకులు ఉండొచ్చని జిల్లా సామాజిక సాధికారణ అధికారి త్రినాథ్ పాఢీ చెప్పారు.

ధరిత్రీ చటర్జీ
ఈ శిబిరంలో ఆశ్రయం పొందుతున్న ధరిత్రీ చటర్జీ అనే ఆవిడను కలిసి, నేను షాక్‌కు గురయ్యా. ఆమె వయసు 54 ఏళ్లు. చక్కగా ఇంగ్లిష్ మాట్లాడగలుగుతున్నారు. ఆమెను చూస్తే యాచకురాలు అని ఎవరికీ అనిపించదు.
ధరిత్రీ కోల్‌కతాలోని కాళీఘాట్‌కు చెందినవారు. పూరీలోని జగన్నాథ మందిరం వద్ద భిక్షాటన చేసేవారు. ఆమెను అధికారులు అక్కడి నుంచి ఈ శిబిరానికి తరలించారు.
‘‘జగన్నాథ ప్రభువంటే నాకు చిన్నప్పటి నుంచి అమితమైన ఇష్టం. ఐహిక బాధ్యతలన్నీ పూర్తయ్యాక, గత మేలో ఫొనీ తుఫాను వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేశా. అప్పటి నుంచి ఇక్కడే అంటున్నా’’ అని ఆమె చెప్పారు.
ఆమె పూరీకి రావడం వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాకుండా, కుటుంబ కారణాలు కూడా ఉండొచ్చని నాకు అనిపించింది. కానీ, ఆ వివరాలు చెప్పేందుకు ఆమె సిద్ధంగా లేకపోవడంతో నేను ఆ విషయం ఎక్కువగా అడగలేదు.
తనకు 22 ఏళ్ల కొడుకు ఉన్నాడని మాత్రం ఆమె చెప్పారు.
తనకు శాస్త్రీయ సంగీతం వచ్చని, ఒకప్పుడు వెల్లూరులోని సీఎంసీ ఆసుపత్రిలో పనిచేశానని కూడా వివరించారు.

శ్రీజిత్ పాఢీ
చదువుకుని భిక్షాటన చేస్తున్నవారి జాబితాలో ధరిత్రీ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు.
కటక్‌లోని రెవెన్షా కాలేజీలో ఎకనమిక్స్‌లో మంచి మార్కులతో ఎంఏ పూర్తి చేసిన శ్రీజిత్ పాఢీ కూడా అలాంటి వ్యక్తే.
ప్రస్తుత కటక్-భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ సుధాంశు షడంగి చదువుకుంటున్న సమయంలో శ్రీజిత్‌కు మిత్రుడు.
షడంగి, ఆయన బ్యాచ్‌లోని మరికొందరు శ్రీజిత్ గురించి తెలిసి, ఆయన్ను వెతికి పట్టుకున్నారు.
కానీ, శ్రీజిత్‌ని చూస్తే, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఎవరూ అనుకోరు.

పొడవుగా, అట్టలు కట్టుకుపోయిన జట్టుతో మతిస్థిమితం లేనివారిలా ఉంది ఆయన ప్రవర్తన. శ్రీజిత్ బ్యాచ్‌మేట్స్ ఆయన్ను పూరీ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి కటక్‌లోని ఎస్‌సీబీ మెడికాల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లోని మానసిక రోగుల విభాగానికి ఆయన్ను తరలించారు.
ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విఫలమయ్యాక శ్రీజిత్ నిరాశకు గురై, మతి భ్రమించినట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కటక్ ఆసుపత్రిలో ఆయన చేరి వారం కూడా గడవకముందే, ఆయనలో చాలా మార్పు కనిపిస్తోంది. ఆయన జట్టు, గడ్డాన్ని తీసేశారు. పరిశుభ్రమైన దుస్తులు వేశారు.
తనను కలిసేందుకు వచ్చినవారితో ఆయన నవ్వుతూ పలకరిస్తూ, బాగా మాట్లాడుతున్నారు. భవిష్యతులో ఏం చేయాలనుకుంటున్నారని అడిగితే.. పిల్లలకు చదువు చెప్పాలనుకుంటున్నానని బదులిస్తున్నారు.
లక్ష్మీప్రియ మిశ్రా
లక్ష్మీప్రియ మిశ్రా అనే మహిళ కూడా ధరిత్రీ, శ్రీజిత్‌ల్లాగే చదువుకుని భిక్షాటన చేస్తున్నవారిలో ఒకరు.
లక్ష్మీ ప్రియ కూడా ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. సంస్కృత శ్లోకాలు కూడా చక్కగా పాడతారు.
ఒకప్పుడు పూరీ బాలికా విద్యాలయలో ఐదేళ్లు టీచర్‌గా ఆమె పనిచేవారు. గుజరాత్, ఇథియోపియాలోని స్కూళ్లలోనూ భౌతిక, రసాయన శాస్త్రాల పాఠాలు చెప్పారు. గణితం కూడా బోధించిన అనుభవం ఆమెకు ఉంది.
కానీ, ఆమె అవతారాన్ని చూస్తే ఇవన్నీ నమ్మబుద్ధి కావు.

లక్ష్మీప్రియకు కొడుకు ఉండేవాడు. అతడే ఆమెకు ఏకైక సంతానం. అతడిని కోల్పోయిన తర్వాత ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతింది.
ఆమె భిక్షాటన చేయడం మొదలుపెట్టారు.
‘‘నాకున్నది ఒక్క కొడుకే. వాడే నా కుటుంబం. ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు. ఇక ఇంటికి తిరిగి రాలేదు. వాడు బతికి ఉన్నాడో, లేదో కూడా నాకు తెలియదు’’ అని లక్ష్మీప్రియ చెప్పారు.
మానసిక అనారోగ్యానికి తోడు లక్ష్మీప్రియ కంటిచూపు కూడా దెబ్బతింది. పూరీలోని లయన్స్ క్లబ్ కార్యకర్తలు ఆమెను భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.
ప్లాస్టిక్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి, భిక్షాటన చేస్తున్న గిరిజా శంకర్ మిశ్ర అనే మహిళను కూడా నేను కలిశాను.
బాగా చదువుకుని భిక్షాటన చేస్తున్నవారిని యాచక రహిత పూరీ కార్యక్రమం ప్రారంభమైన తొలి ఐదు రోజుల్లో పదుల సంఖ్యలో గుర్తించామని దీని కోసం పనిచేస్తున్న వ్యక్తులు చెబుతున్నారు.

యాచకుల్లో చదువుకున్నవారు ఉంటుండటం గురించి ‘యాచక రహిత పూరీ’ ప్రాజెక్టుకు సలహాదారుగా ఉన్న సిద్ధార్థ్ రాయ్ స్పందించారు.
‘‘దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. తమ కష్టానికి తగిన ఫలితాలు రావట్లేదని అనిపిస్తే వ్యక్తులు నిరాశలో కూరుకుపోవచ్చు. శ్రీజిత్ పాఢీ ఇలాంటి రకానికే చెందినవారు’’ అని ఆయన అన్నారు.
కుటుంబ, సామాజిక, వృత్తిగత జీవితాల్లో ఎదురైన వైఫల్యాలు ఎదురవ్వడం వల్ల కూడా వ్యక్తులకు సగటు జీవితంపై విరక్తి కలగొచ్చని ఆయన వివరించారు.
‘‘కొందరు ఆధ్యాత్మిక కారణాలతోనూ ఇలా యాచకులుగా మారతారు. హిందూ ధర్మంలో ఇందుకు అనుమతి ఉంది. ఏ పనీ చేతగాక, దీన్ని ఎంచుకున్నవాళ్లు కూడా ఉంటారు’’ అని సిద్ధార్థ్ అన్నారు.
ఉత్కల్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న ప్రతాప్ రథ్ దీని వెనుకున్న మరో కారణాన్ని వివరించారు.
‘‘మన సమాజంలో, సంస్కృతిలో ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ (శ్రమకు గౌరవం ఇవ్వడం) అనేది లేదు. పాశ్చాత్య దేశాల్లో ఏ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ అయినా, తీరిక సమయంలో టాక్సీ నడపొచ్చు. హోటల్‌లో పనిచేయొచ్చు. వాళ్లను సమాజం తక్కువ చూపు చూడదు. మనం దేశంలో మాత్రం అలా కాదు’’ అని ప్రతాప్ అన్నారు.
‘‘చేస్తున్న పని వల్ల రావాల్సినంత పేరు గానీ, గౌరవం గానీ రావడం లేదని అనుకున్నప్పుడు కొందరిలో అసంతృప్తి పెరుగుతుంది. సమాజాన్ని పట్టించుకోవడం కూడా వాళ్లు మానేస్తారు. చదువుకున్నవారు యాచకులుగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: 'చైనీస్ వైరస్' అంటూ ట్రంప్ ట్వీట్.. చైనా ఆగ్రహం
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్: కోవిడ్-19 కేసుల నమోదు విషయంలో చైనాను దాటేసిన ప్రపంచ దేశాలు
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: 140కి పైగా దేశాలకు వ్యాపించిన మహమ్మారి... ఎక్కడ ఎలాంటి ప్రభావం చూపిస్తోంది
- ఆంధ్రప్రదేశ్: మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఏంటి? సంచయిత నియామకంపై అశోక్ గజపతిరాజు న్యాయపోరాటానికి నేపథ్యం ఏంటి?
- కరోనా వైరస్: మిగతా దేశాలు చైనా దారిలో ఎందుకు నడవలేకపోతున్నాయి
- కరోనావైరస్: ‘ఎవరిని బతికించాలి, ఎవరిని వదిలేయాలి’... తలలు పట్టుకుంటున్న ఇటలీ వైద్యులు
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








