ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం- ప్రభుత్వం మధ్య వివాదం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా?

ఏపీ ఎన్నికల అధికారి, ముఖ్యమంత్రి
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

కరోనావైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా సాకుతో ఎన్నిక‌లు వాయిదా వేయ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సరిగ్గా ఇక్కడే ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం మొదలైంది.

మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. వెంటనే వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ఈ ప‌రిణామాల‌ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పిలిచి గవర్నర్ వివరణ తీసుకున్నారు.

కరోనావైరస్
ఫొటో క్యాప్షన్, స్థానిక సంస్థల ఎన్నికల్ని యథావిథిగా కొనసాగించాలంటూ ఎస్ఈసీకి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ సీఎస్

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారాలేంటి ?

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స్వ‌యం ప్ర‌తిప‌త్తిగ‌ల సంస్థ‌. రాష్ట్రాల‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం ఆర్టికల్ 243K ప్రకారం 1994లో ఏర్పాటు చేశారు. అంత‌కుముందు కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే అన్నీ చూసుకునేది.

అయితే, 1989లో ఎలక్షన్ కమిషన్ అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న ఒక్క క‌మిష‌న‌ర్ స్థానంలో ముగ్గురు క‌మిష‌నర్ల‌ను నియమించింది. ఆ త‌ర్వాత కొద్దికాలానికే రాష్ట్రాల‌లో పంచాయితీ, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌తో పాటుగా ప‌ట్ట‌ణాల్లోని మునిసిపాలిటీ, కార్పోరేష‌న్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌త్యేకంగా ఆయా రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల సంఘాల‌ను నియ‌మించారు.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ఎన్నికల సంఘం విధులేంటి?

రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్ని ఆర్టికల్ 243K నిర్దేశిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషనర్‌ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఆయన ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది. సాధార‌ణంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల‌ను క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తారు.

ఆయ‌న‌తో పాటుగా మ‌రో నాన్ కేడ‌ర్ ఐఏఎస్ అధికారి కార్య‌ద‌ర్శిగా ఉంటారు. ఆర్టిక‌ల్ 243K ప్ర‌కారం గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణ, నిర్వహణ ఎస్‌ఈసీ ముఖ్య‌మైన బాధ్య‌త‌. అలాగే 243ZA ప్ర‌కారం మునిసిపాలిటీలకు సంబంధించిన అన్ని ఎన్నికల ప‌ర్య‌వేక్ష‌ణ‌, నియంత్రణ అధికారాలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయి.

ఆయా ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓట‌ర్ల జాబితా త‌యారీ నుంచి పాల‌క‌వ‌ర్గాలు బాధ్య‌త‌లు స్వీక‌రించే వ‌ర‌కూ మొత్తం ప్ర‌క్రియ ఎస్ఈసీ చూస్తుంది. రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం నిబంధనలకు లోబడి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాచ‌ర‌ణ ఉంటుంది. ప‌ద‌వీకాలం ఐదేళ్లుగా నిర్ణ‌యించారు. నిబంధన (1) ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కేటాయించిన‌ విధులను నిర్వర్తించడానికి అవసరమైన సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందుబాటులో ఉంచాలి.

ఏదైనా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఎస్ఈసీని తొల‌గించాలంటే అభిశంస‌న ప్ర‌క్రియ చేప‌ట్టాల్సి ఉంటుంది. దానికి అసెంబ్లీ తీర్మానం చేసి, గ‌వ‌ర్న‌ర్‌కు పంపిస్తే, ఆయ‌న సిఫార్సు చేసిన త‌ర్వాత కేంద్రం అనుమ‌తించాల్సి ఉంటుంది.

ఏపీ ఎన్నికల అధికారి
ఫొటో క్యాప్షన్, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌నర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్

ఏపీలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తీరు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1994లో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కూ 1995, 2001, 2007-08, 2013-14 సంవ‌త్స‌రాల‌లో నాలుగు సార్లు స్థానిక ఎన్నిక‌లను నిర్వ‌హించింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పంచాయతీ, మున్సిప‌ల్, జిల్లా- మండ‌ల ప‌రిష‌త్ పాల‌క‌వ‌ర్గాల‌కు 2018లోనే గ‌డువు ముగిసింది.

అయినా, గ‌త కొన్ని నెల‌లుగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ వివిధ కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తాజాగా 2020 జ‌న‌వ‌రిలో స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రంగం సిద్ధం చేసి రిజ‌ర్వేష‌న్లు కూడా ఖ‌రారు చేశారు.

అయితే, రాజ్యాంగం ప్ర‌కారం 50 శాతానికి లోబ‌డి ఉండాల్సిన రిజ‌ర్వేష‌న్లు 59.85 శాతంగా నిర్ణ‌యించ‌డంపై హైకోర్టు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లను స‌వ‌రించాల‌ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.

ఫలితంగా మార్చి 3వ తేదీన కోర్టు తీర్పు వ‌చ్చిన త‌ర్వాత హ‌డావిడిగా రిజ‌ర్వేష‌న్లను స‌వ‌రిస్తూ మార్చి 7న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అందుకు అనుగుణంగా నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌, అభ్యంత‌రాలు, ఉప‌సంహ‌ర‌ణ గడువు పూర్త‌య్యింది.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు కూడా మార్చి 9న నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఏపీలో మొత్తం 104 మున్సిపాలిటీలు ఉండ‌గా, ప్ర‌స్తుతం 75 మున్సిపాలిటీలకు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు.

మ‌రో 12 మున్సిపల్ కార్పోరేష‌న్ల‌కు కూడా ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేశారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ముగిసింది. ఈనెల 21న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్

వివాదాల మ‌ధ్య ఏక‌గ్రీవ ఎన్నికలు

నామినేష‌న్ల ప్ర‌క్రియలో అనేక చోట్ల వివాదాలు చెల‌రేగాయి. కొన్ని చోట్ల ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ప‌ల‌మ‌నేరు, మాచ‌ర్ల‌, తాడిప‌త్రి స‌హా పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయి.

చివ‌ర‌కు ఈ ప‌రిణామాల ప‌ట్ల హైకోర్టు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎన్నిక‌ల సంఘం, పోలీసు యంత్రాంగం త‌మ బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని సూచించింది. స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రుగుతున్న దాడులు అదుపుచేయ‌క‌పోతే కేంద్రానికి తెలియ‌జేయాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ముగిసిన త‌ర్వాత ప‌రిశీలిస్తే ఏపీలో 125 మండ‌లాల్లో జెడ్పీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు ఏక‌గ్రీవం అయిన‌ట్టు ప్ర‌క‌టించారు. 652 జెడ్పీటీసీ స్థానాల‌కు గానూ సుమారు నాలుగో వంతు సీట్లు ఏక‌గ్రీవం కావ‌డం విశేషంగా మారింది.

ఇక ఎంపీటీసీల‌లో కూడా సుమారు 2080 స్థానాల్లో ఏక‌గ్రీవం జ‌రిగాయి. వాటితో పాటుగా మున్సిపల్ వార్డుల్లో కూడా 159 చోట్ల ఏక‌గ్రీవం అయిపోయాయి. వాటిలో అత్య‌ధికంగా పులివెందుల‌, మాచ‌ర్ల వంటి చోట్ల ఉన్నాయి.

భారీ సంఖ్య‌లో ఏక‌గ్రీవం కావ‌డం వెనుక అధికార పార్టీ దౌర్జ‌న్యాలే కార‌ణ‌మ‌ని టీడీపీ ఆరోపించింది. గ‌తంలో ఎన్న‌డూ ఇలా జ‌ర‌గ‌లేద‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నిక‌లను ప్ర‌హ‌స‌నంగా మార్చేశార‌ని విమ‌ర్శించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
కరోనావైరస్

ఫొటో సోర్స్, FACEBOOL/ANDHRAPRADESH/CMO

ఫొటో క్యాప్షన్, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు

వాయిదా నిర్ణ‌యంతో వేడెక్కిన రాజ‌కీయాలు

మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌తో పాటుగా మున్సిపల్ ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ కూడా ముగింపు ద‌శ‌కు రావ‌డంతో ఇక గ్రామ పంచాయతీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స‌మాయ‌త్త‌మ‌వుతుంద‌నే సంకేతాలు వ‌చ్చాయి.

అయితే, అనూహ్యంగా పంచాయతీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు బ‌దులుగా మొత్తం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ఆరు వారాలు వాయిదా వేస్తున్న‌ట్టు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌నర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై ఏపీలో అధికారప‌క్షం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

నేరుగా సీఎం మీడియా ముందుకొచ్చి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం మాట‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన ఎస్‌ఈసీ రాజ్యాంగ బ‌ద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్‌కు హైకోర్టు జ‌డ్జితో స‌మాన అవ‌కాశాలుంటాయ‌ని పేర్కొంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

అయితే, ఎన్నిక‌లు నిలుపుద‌ల చేసే ఆలోచ‌న విర‌మించుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నేరుగా ఎస్ఈసీకి రాసిన లేఖ‌లో కోరింది. ప్ర‌భుత్వం త‌రుపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ లేఖను రాశారు. క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లోనే ఉంద‌ని, ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చేసిన ఫిర్యాదు మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ కూడా గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల ప్ర‌కారం, అసెంబ్లీ చ‌ట్టాల‌కు లోబ‌డి ప‌నిచేసే ఎస్ఈసీ నిర్ణ‌యం ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌లను కోర్టు ఆదేశాల ప్ర‌కార‌మే నిర్వ‌హిస్తున్నార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కుడు అచ్యుత్ దేశాయ్ వ్యాఖ్యానించారు.

"పిల్ 02/2020 ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్ల‌లో మార్పులు చేసిన తర్వాతే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సాగుతోంది. మార్చి 3 నాటికే ఎన్నిక‌లు పూర్తి చేస్తామ‌ని హైకోర్టుకు తెలిపారు. వాస్త‌వానికి 2018లో ఎన్నిక‌లు జరగాల్సి ఉంది. రాజ్యాంగం ప్ర‌కారం స్థానిక ఎన్నిక‌లు స‌కాలంలో నిర్వ‌హించాల్సి ఉండ‌గా ఇప్ప‌టికే చాలా ఆల‌స్యం అయ్యింది."

"ఆర్టిక‌ల్ 243K ప్రకారం రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ విధుల గురించి పేర్కొన‌లేదు. హైకోర్టు ఉత్త‌ర్వుల్లో కూడా ఆ విష‌యం ప్ర‌స్తావించారు. రాష్ట్ర ఎన్నికల క‌మిష‌న‌ర్‌ రాజ్యాంగబద్ధమైన ప‌ద‌వే అయిన‌ప్ప‌టికీ ఇలాంటి నిర్ణ‌యం తీసుకునే ముందు పంచాయతీరాజ్ క‌మిష‌న‌ర్‌ను సంప్ర‌దించి ఉండాల్సింది. దానికి భిన్నంగా జ‌రిగింది. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కూడా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ మీద చేసిన వ్యాఖ్య‌లు స‌రికాదు" అని అచ్యుత్ దేశాయ్ బీబీసీతో అన్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, http://sec.ap.gov.in/

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా

ఎన్నిక‌ల‌ను వివాదాస్ప‌దం చేయ‌డం మంచిది కాదు

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో వివాదాలు శ్రేయ‌స్క‌రం కాద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంలో ప‌నిచేసిన రిటైర్డ్ అధికారి పి. రామ‌కృష్ణ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ "ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో క‌మిష‌న‌ర్‌కు అధికారాలున్నాయి. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో విఫ‌ల‌మైన వారిని బాధ్య‌త‌ల నుంచి తొల‌గించేందుకు కూడా స‌ర్వాధికారాలు ఉంటాయి" అన్నారు.

"ఇటీవ‌ల తిరుప‌తి, మాచ‌ర్ల వంటి చోట్ల జ‌రిగిన ప‌రిణామాలు మీడియాలో చూస్తేనే చాలా అభ్యంత‌రకరంగా ఉన్నాయి. అలాంటి స‌మ‌యంలో వెంట‌నే స్పందించి ఉంటే సమస్య ఇంత వరకు వచ్చి ఉండేది కాదు. ఏక‌గ్రీవాలు కొత్త‌కాక‌పోయినా గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈసారి ప‌ది రెట్లు ఎక్కువ‌గా ఏక‌గ్రీవం కావ‌డం అనుమానాల‌కు తావిస్తోంది."

"క‌రోనావైరస్ కార‌ణంగా వాయిదా వేసేముందు క‌మిష‌నర్ త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉండాల్సింది. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే ఈ ప‌రిస్థితికి కార‌ణం. ఇలాంటివి త‌క్ష‌ణం స‌రిదిద్దాలి. గ‌వ‌ర్న‌ర్ త‌గిన నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆశిస్తున్నాను" అని రామకృష్ణ బీబీసీకి చెప్పారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)