CoronaVirus చెక్ రిపబ్లిక్‌లో ప్రజలంతా ఎవరికి వారు నిర్బంధంలోకి వెళ్లాలని ఆదేశాలు

ఈఫిల్ టవర్‌ను నిరవధికంగా మూసివేసినట్లు చూపిస్తున్న బోర్డు 2020 మార్చి 14న తీసిన ఫొటో

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈఫిల్ టవర్ సహా చాలా పర్యాటక ప్రాంతాలను ఫ్రాన్స్‌లో మూసేశారు

చెక్ రిపబ్లిక్‌లో 214 మందికి కరోనావైరస్ సోకడంతో దేశ ప్రజలంతా ఎవరికి వారు నిర్బంధంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని ఆండ్రెజ్ బాబిస్ ప్రకటించారు.

ఇండోనేసియాలో రవాణా మంత్రికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కావడంతో అక్కడి మంత్రులంతా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడోకూ కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

యురోపియన్ యూనియన్‌లోని రెండు అగ్రరాజ్యాలైన స్పెయిన్, ఫ్రాన్స్‌లు కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎమర్జెన్సీ నియంత్రణల్ని ప్రకటించాయి.

అత్యవసరం అయితే తప్ప ఇళ్లనుంచి ప్రజలు బయటకు రావటాన్ని స్పెయిన్ నిషేధించింది. నిత్యావసర వస్తువులు, మందులు కొనుగోలు చేసేందుకు, పనికి వెళ్లాలనుకున్నప్పుడే ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలని తెలిపింది.

యూరప్‌లో ఇటలీ తర్వాత అత్యంత ఎక్కువగా కరోనావైరస్‌ ప్రభావం పడింది స్పెయిన్‌పైనే. ఈ దేశంలో ఇప్పటి వరకూ 191 మంది చనిపోయారు.

ఫ్రాన్స్ దేశంలో 91 మంది చనిపోయారు. ఇక్కడ కూడా కెఫేలు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, చాలావరకు షాపుల్ని కూడా మూసేశారు.

ఇటలీలో కరోనావైరస్ మరణాలు 1440కు చేరుకున్నాయి. దీంతో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అన్నీ మూసేయాలని ఇటలీ నిర్ణయించింది. ఇప్పటికే చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

కరోనావైరస్ మహమ్మారికి ఇప్పుడు యురోపియన్ యూనియన్ కేంద్రస్థానం అయ్యిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తాజాగా ప్రకటించింది.

దేశాలన్నీ చాలా దూకుడుగా వ్యవహరించి, కరోనావైరస్ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అద్హనమ్ గెబ్రెయెసస్ విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు సమాజంలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.

స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రొ సాంచెజ్, ఆయన భార్య బెగొన్న గోమెజ్‌

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రొ సాంచెజ్, ఆయన భార్య బెగొన్న గోమెజ్‌

దేశంలో ఎమర్జెన్సీ

స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రొ సాంచెజ్ భార్య బెగొన్న గోమెజ్‌కు కరోనావైరస్ సోకిందని ప్రభుత్వం శనివారం రాత్రి ధృవీకరించింది.

దీంతో ప్రధానమంత్రి, ఆయన భార్య ఇద్దరూ మాడ్రిడ్ నగరంలోని అధికారిక నివాసానికే పరిమితమయ్యారని, ఇద్దరూ ప్రస్తుతం బాగానే ఉన్నారని తెలిపింది.

దేశవ్యాప్తంగా 6,300 మంది కరోనావైరస్ బారిన పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 1800 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికం రాజధాని నగరంలోనే ఉన్నాయి.

స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరంలోని ఒక సూపర్ మార్కెట్‌లో మాస్కు ధరించి కూరగాయలు ఎంచుకుంటున్న వ్యక్తి. 2020 మార్చి 14వ తేదీన తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్పెయిన్‌లో ఆహారం, నిత్యావసర వస్తువులు విక్రయించే షాపులు మాత్రం తెరిచే ఉంటాయి

ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని మ్యూజియంలు, సాంస్కృతిక కేంద్రాలు, క్రీడా వేదికలను మూసేశారు. రెస్టారెంట్లు, కెఫేలు కేవలం డోర్‌డెలివరీకే పరిమితమయ్యాయి.

అయితే, బ్యాంకులు, పెట్రోలు బంకుల్ని మాత్రం తెరిచే ఉంచారు. దేశం మొత్తం పాఠశాలల్ని ఇప్పటికే మూసేశారు.

దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సైద్ధాంతిక భావజాలాలను పక్కనపెట్టి, పౌరులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన మంత్రి పెడ్రొ సాంచెజ్ పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా ప్రకటించిన ఈ అత్యయిక స్థితి మరో రెండువారాలు కొనసాగనుంది. అవసరాన్ని బట్టి దీన్ని పొడిగించొచ్చు కూడా.

స్పెయిన్ జనాభా 4.67 కోట్లు. 1975లో ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రెండుసార్లు మాత్రమే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. మొదటిసారి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె నేపథ్యంలో 2010లో ఎమర్జెన్సీ అమలు చేశారు.

Sorry, your browser cannot display this map