కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బ్రయాన్ లుఫ్కిన్
    • హోదా, బీబీసీ కోసం

గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విటర్. హిటాచి, యాపిల్, అమెజాన్. చెవ్రాన్, సేల్స్‌ఫోర్స్, స్పాటిఫై. బ్రిటన్ నుంచి అమెరికా వరకూ, జపాన్ నుంచి దక్షిణ కొరియా వరకూ.. ఈ ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ సిబ్బంది తప్పనిసరిగా ఇంటి నుంచే పని చేసే విధానాన్ని అమలులోకి తెచ్చాయి. దీనికి కారణం.. కోవిడ్-19 విస్తరిస్తుండటమే.

కరోనావైరస్ 'మహమ్మారి' స్థాయిని చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించటంతో.. ఇప్పుడిక చాలా మంది ఉద్యోగులు కొంత కాలం పాటు 'ఇంటి ఆఫీసు'కు మారటం మామూలు విషయంగా మారుతోందనటంలో సందేహం లేదు.

కొంతమందికి ఇంటి నుంచి పనిచేయటం కొత్త కావచ్చు. అలాంటపుడు కొత్త వాతావరణంలో పని మీద దృష్టి కేంద్రీకరించటం, విడివిడిగా ఉన్న టీమ్‌ సభ్యులతో సమన్వయం చేసుకోవటం, విధులు కొనసాగించటం కష్టం కావచ్చు. అది ఉత్పాదకత మీద ప్రభావం చూపొచ్చు.

అయితే.. ఇంట్లో మంచి పని స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటానికి, టీమ్ సభ్యులతో సంప్రదింపులు జరపటానికి, ఫలితాలు అందించటానికి కొన్ని మార్గాలున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Getty Images

నిరంతరం మాట్లాడుకోండి...

కారణం కరోనావైరస్ కానీ, కాకపోనీ.. ఇంటి నుంచి పనిచేసేటపుడు కీలకమైన విషయం మీ బాస్‌తో సమాచర సంబంధాలు స్పష్టంగా ఉండటం.. మీరు చేయాల్సిన పని ఏమిటో విస్పష్టంగా తెలుసుకుని ఉండటం.

''ఏ రోజుకారోజు ఏ పనులు పూర్తిచేయాలో విస్పష్టంగా తెలుసుకోండి. ప్రతి రోజూ పని మొదలు పెట్టటానికి ముందు, ముగిసిన తర్వాత ఆ పనికి సంబంధించి మీ మేనేజర్‌తో కొన్ని నిమిషాలు మాట్లాడే వీలుంటుందేమో చూడండి'' అని.. రిమోట్ వర్కింగ్ (దూరం నుంచి పనిచేయటం) మీద అధ్యయనం చేస్తున్న బోస్టన్‌లోని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బార్బరా లార్సన్ సూచిస్తున్నారు.

సాధారణంగా చాలా మంది తమ బాస్‌లకు దగ్గరగా ఉండి పనిచేస్తుంటారు. అంటే సమాచార మార్పిడికి సమస్యలు, ఇబ్బందులు ఉండవు. కానీ దూరం నుంచి పనిచేసేటపుడు ఇలా ఉండదు. ఒకవేళ మీరు పనిచేసే స్థలంలో రిమోట్ వర్కింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు లేకపోయినట్లయితే.. పనికి సంబంధించిన సమాచార వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దూరంగా ఉండి పర్యవేక్షించటం మీ మేనేజరుకు అలవాటు లేకపోవచ్చు. మీ సంస్థ దగ్గర రిమోట్ వర్కర్లకు అవసరమైన స్లాక్, జూమ్ వంటి యాప్‌లు, పనిముట్లు లేకపోవచ్చు.

ఇంటి నుంచి పనిచేసేటపుడు ఒంటరితనం అతి పెద్ద సవాలు అని.. గత ఏడాది బఫర్ అనే ఆన్‌లైన్ బ్రాండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ 2,500 మంది రిమోట్ వర్కర్ల మీద నిర్వహించిన ఒక అధ్యయనంలో 19 శాతం మంది చెప్పారు. ఒంటరితనం వల్ల ఉత్సాహం, ఉత్పాదకత తక్కువగా ఉండొచ్చు.

కాబట్టి స్కైప్, జూమ్ వంటి యాప్‌లతో వీడియో కాల్స్ ద్వారా బాస్‌తోను, సహచరులతోనూ మాట్లాడుతూ పనిచేయటం ఉత్సాహాన్నిస్తుందని లార్సన్ చెప్తారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

ఫొటో సోర్స్, Getty Images

నిజమైన ఉద్యోగంలా చేయండి...

మన ఇంట్లో మనం పైజమాలతో తిరగవచ్చు కాబట్టి ఇంటి నుంచి పని చేసేటప్పుడు కూడా అలాగే ఉండటం సరికాదు. ''ఇంటి నుంచి పనిచేసినా కూడా ఆఫీసుకు వెళ్లేటప్పుడు రెడీ అయినట్లుగానే స్నానం చేసి, ఆఫీస్ దుస్తులు వేసుకుని రెడీ అవ్వండి. నిజమైన ఉద్యోగంలా పరిగణించండి'' అని లార్సన్ సూచిస్తున్నారు.

ఇంట్లో ఆఫీసు లేకపోతే.. తాత్కాలికంగా, ప్రత్యేకంగా ఆఫీసును తయారు చేసుకోవాలి. ఇంట్లో సరైన ఆఫీసు స్థలం లేకపోతే ఉత్పాదకత తాత్కాలికంగా తగ్గిపోవచ్చునని ఫ్లెక్స్‌జాబ్స్ సీఈఓ సారా సటన్ వివరిస్తున్నారు. ఇంట్లో రెండు మానిటర్లు, వైర్‌లెస్ కీబోర్డు, మౌస్ వంటివి.. తాను ఎక్కువ ఉత్పాదకంగా పనిచేయటానికి తోడ్పబతాయని ఆమె చెప్పారు.

కాబట్టి ల్యాప్‌టాప్ పట్టుకుని మంచం మీద పడుకోవటం కాకుండా.. ఆఫీస్‌లో లాగానే ఒక టేబుల్, కుర్చీ వంటి వాటిని ఏర్పాటు చేసుకుని నిటారుగా కూర్చుని పని మొదలుపెట్టాలి. ''ఎటువంటి అవాంతరాలూ రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు పని చేస్తున్నారన్న విషయాన్ని ఇంట్లో వారికి అర్థమయ్యేలా చెప్పాలి: 'తలుపు మూసి ఉందంటే నేను ఇంట్లో లేననట్లు భావించండి' అని చెప్పటం వంటివి చేయాలి'' అని యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో సైకాలజీ ప్రొఫెసర్ క్రిస్టెన్ షాక్లీ పేర్కొన్నారు.

Sorry, your browser cannot display this map