కరోనావైరస్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న వదంతులు... వాటిలో నిజమెంత?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, బీబీసీ మానిటరింగ్
- హోదా, యూజీసీ న్యూస్ గ్యాదరింగ్
కరోనావైరస్ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చైనాను దాటి ఈ వైరస్ మరో 15 దేశాలకు విస్తరించింది.
అయితే, ఆ వైరస్ కన్నా వేగంగా దాని గురించి లేనిపోని వదంతులు, పుకార్లు ప్రపంచం అంతటా వ్యాపిస్తున్నాయి.
చైనా బయోవార్ ప్రయత్నం వికటించి ఈ వైరస్ బయటకువచ్చిందని, చైనీయుల విచిత్ర ఆహారపు అలవాట్ల వల్లే ఇది సోకిందని.. ఇలా చాలా కథనాలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి.



ఫొటో సోర్స్, Getty Images
గబ్బిలం సూప్
చైనాకు చెందిన ఓ మహిళ గబ్బిలం తింటున్న వీడియోను ఒకటి సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యింది.
చైనీయుల విపరీత ఆహారపు అలవాట్ల వల్లే ఈ వైరస్ వ్యాపించిందంటూ ఈ వీడియోపై చాలా మంది స్పందించారు.
కానీ, నిజానికి ఆ వీడియో చైనాలో తీయలేదు. 2016లో పలావు అనే చిన్న ద్వీప దేశంలో దీన్ని తీశారు. చైనాలో ప్రముఖ ట్రావెల్ షో వ్యాఖ్యాత మెంగ్యున్ వాంగ్ ఇందులో మాట్లాడుతూ కనిపించారు.
ఈ వీడియోను, కరోనావైరస్‌తో ముడిపెడుతూ గత ఏడాది చివరి నుంచి వదంతులు వ్యాపిస్తున్నాయి.
పలావులోని స్థానికుల జీవనశైలిని చూపించేందుకే తాను ఆ వీడియో తీశానని, గబ్బిలాలు వైరస్‌ను వ్యాప్తి చేస్తాయని తనకు తెలియదని వాంగ్ అన్నారు.
వుహాన్‌లోని చేపల మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్న సముద్ర జీవుల నుంచి కరోనా వైరస్ వ్యాపించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
చైనాలో ఇటీవల జరిగిన పరిశోధన గబ్బిలాల నుంచి కూడా ఈ వైరస్ వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. కానీ, చైనాలో గబ్బిలాలను తినడం సహజమేమీ కాదు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
పథకం ప్రకారం చేశారంటూ...
ఈ వైరస్ వ్యాప్తి పథకం ప్రకారం జరిగిందేనని మరో వదంతి సోషల్ మీడియాలో వ్యాపించింది. కొన్ని పేటెంట్ పత్రాలను వీటిలో చూపిస్తున్నారు.
జోర్డాన్ సాథర్ అనే యూట్యూబర్ కూడా ఇలాంటి ఆరోపణ చేశారు.
2015లో ఇంగ్లండ్‌లోని పిర్‌బ్రైట్ ఇన్‌స్టిట్యూట్ ఫైల్ చేసిన ఓ పేటెంట్ పత్రాలను ఆయన షేర్ చేశారు. శ్వాసకోస వ్యాధులకు వ్యాక్సిన్‌ను తయారుచేసేందుకు కరోనావైరస్ బలహీన వెర్షన్‌ను ఉపయోగించే అవకాశం ఉందని ఆ పత్రాల్లో ఉంది.
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పిర్‌బ్రైట్ దాతల్లో ఒకటిగా ఉంది.
వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు రావడం కోసం ఈ వైరస్‌ను పథకం ప్రకారమే వ్యాప్తి చేశారని జోర్డాన్ ఆరోపించారు.
కానీ, పిర్‌బ్రైట్ ఫైల్ చేసిన పేటెంట్ ఇప్పుడు వ్యాపిస్తున్న కొత్త కరోనావైరస్‌కు విరుగుడు కాదు.
కరోనావైరస్ కుటుంబం చాలా పెద్దది. ఇందులో చాలా రకాల వైరస్‌లు ఉన్నాయి. కోళ్లకు వ్యాపించే బ్రోంకిటిస్ వైరస్‌ను నివారించేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ గురించి పిర్‌బ్రైట్ ఆ పేటెంట్ ఫైల్ చేసింది.
పక్షుల కోసం ఉద్దేశించిన ఆ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిదులు ఇవ్వదని పిర్‌బ్రైట్ ప్రతినిధి థెరెసా మాగన్ బజ్‌ఫీడ్ న్యూస్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘బయో ఆయుధమని పుకార్లు’
చైనా బయో ఆయుధంగా ఉపయోగించేందుకు కరోనావైరస్‌ను రూపొందించిందని, అది వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి లీక్ అయ్యిందని ఇంకో నిరాధార వదంతి ప్రచారంలో ఉంది. కొన్ని టీవీ ఛానెళ్లు కూడా దీనిపై కథనాలు ప్రసారం చేశాయి.
ఇజ్రాయెల్ మాజీ సైనిక నిఘా అధికారి చైనాలోనే రహస్య ప్రయోగశాలల్లో కరోనావైరస్ పుట్టి ఉండొచ్చని వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ టైమ్స్ న్యూస్ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తలను ఈ వదంతుల్లో ప్రస్తావించారు.
కానీ, ఆ వార్తల్లో ఆ ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ పేర్కొనలేదు.
వుహాన్‌లోని చేపల మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్న సముద్ర జీవుల నుంచి ఆ వైరస్ వ్యాపించి ఉండొచ్చని అధికారిక పరిశోధనలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘వుహాన్ నర్సు వీడియో’
వుహాన్‌లో వైరస్ వ్యాపించిన చోట నుంచి మహిళ మాట్లాడుతున్నట్లుగా చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అందులో మహిళ మాస్క్, రక్షణ సూట్ వేసుకుని ఉంది.
ఆమె మాట్లాడుతుంటే , వీడియెలో ఇంగ్లిష్‌లో సబ్‌టైటిల్స్ కనిపించాయి.
ఆ సబ్‌టైటిల్స్ ప్రకారం ఆ మహిళ వుహాన్‌లోని ఆసుపత్రిలో నర్సు. కానీ, వుహాన్‌లో నర్సులు, వైద్యులు అలాంటి రక్షణ సూట్ వేసుకోరు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో 90 వేల మందికి ఈ వైరస్ సోకిందని, ఒక్కొక్కరి నుంచి మరో 14 మందికి ఇది వ్యాపించగలదని ఆమె వ్యాఖ్యానించినట్లు ఆ సబ్‌టైటిల్స్‌లో ఉంది.
కానీ, కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి ఇంకో 1.4-2.5 మందికి వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాథమిక అంచనా వేసింది.
‘‘ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, వైద్యపరమైన వృత్తిలో ఉన్నట్లైతే అనిపించడం లేదు’’ అని చైనాఫైల్ ఆన్‌లైన్ మ్యాగజీన్ విజువల్స్ ఎడిటర్, వుహాన్ వాసి ముయి షియో అన్నారు.
‘‘తాను చెప్తోంది నిజమే అని ఆమె అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే, నిజం ఎవరికీ తెలియదు. పారదర్శకత లేకపోవడం వల్ల ఇలా జనాలు ఏది పడితే అది ఊహించేసుకుంటున్నారు’’ అని చైనాలోని రాజకీయ కార్యకర్త బడియుకావో చెప్పారు.

ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- బడ్జెట్ 2020: కొత్త పన్ను శ్లాబులు కావాలంటే వీటిని వదులుకోవాల్సిందే
- కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా? చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా?
- ఎన్నడూ కనిపించనంత స్పష్టంగా సూర్యుడు... ఇక్కడ చూడండి
- కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









