కరోనావైరస్‌ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?

కరోనావైరస్

ఫొటో సోర్స్, EPA

గత 30ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ల వ్యాప్తి పెరిగిపోయింది. కరోనావైరస్‌లాంటి మహమ్మారుల విజృంభణ మామూలు విషయంగా మారిపోయింది. కానీ, ఇలా ఎందుకు జరుగుతోంది?

దీనికి జవాబు చాలా సులువు. భూమ్మీద గతంలో ఎన్నడూ లేనంత జనాభా, అంటే దాదాపు 770 కోట్ల మంది ఇప్పుడున్నారు. అందులో ఒకరికొకరు చాలా దగ్గరగా జీవిస్తున్నారు.

తక్కువ ప్రదేశంలో ఎక్కువమంది జీవిస్తున్నారంటే, వ్యాధులు కలిగించే క్రిములు విస్తరించే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లే లెక్క.

చైనాలో వృద్ధి చెందిన కరోనావైరస్‌నే తీసుకుంటే అది వ్యక్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడిన తుంపర ద్వారా వ్యాప్తిచెందినట్లు తెలుస్తోంది. ఆ వైరస్ నిజానికి శరీరం బయట చాలా కొద్దిసేపే జీవిస్తుంది. కాబట్టి, జనాలు చాలా దగ్గరగా ఉన్నప్పుడే అది ఒకరినుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది.

2014లో ఎబోలా అంటువ్యాధి కూడా దగ్గరగా ఉండేవారి రక్తం, ఇతర శరీర ద్రవాల గుండానే ఒకరి నుంచి మరొకరికి సోకింది.

దోమల నుంచి వచ్చే జికా వైరస్ ప్రభావం కూడా మనుషులు దగ్గరగా ఉన్నప్పుడే ఎక్కువగా ఉంటుంది. జన సాంద్రత ఎక్కువగా ఉండే వెచ్చటి ప్రాంతాల్లోనే జికా దోమల వృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది.

పశువులు

ఫొటో సోర్స్, Getty Images

2007 నుంచి పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో నివసించే మనుషుల సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పుడు కేవలం 1శాతం భూభాగంలోనే 400 కోట్లమంది ప్రజలు జీవిస్తున్నారంటేనే భూమ్మీద జనసాంధ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ, పట్టణాల్లో అంత మంది జనం ఆరోగ్యంగా జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు. చాలామంది ప్రజలు మురికివాడల్లోనే ఉంటున్నారు. అక్కడ శుభ్రమైన నీరు, మురుగునీటి వ్యవస్థ అందుబాటులో ఉండవు. దాంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ.

మరోపక్క ప్రపంచంలో రవాణ వ్యవస్థ బాగా వృద్ధి చెందింది. విమానాలు, రైళ్లు, వాహనాల ద్వారా 24 గంటల్లోపే వైరస్‌లు సగం ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. కరోనావైరస్‌నే తీసుకుంటే వ్యాధి బయటపడిన కొన్ని రోజుల్లోనే 16 దేశాల్లో వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి.

Presentational grey line
News image
Presentational grey line

కానీ, చరిత్రలో ఇలాంటి మహమ్మారులు విజృంభించడం కొత్తేం కాదు. 1918లో స్పానిష్ ఫ్లూ అనే విషజ్వరం ప్రపంచమంతా వ్యాపించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక భారీ స్థాయిలో వలసల కారణంగా ఇదే జ్వరం మరోసారి యూరప్‌లో విజృంభించింది.

ఈ జ్వరం విస్తరించే సమయంలో సైనికులంతా తమ తమ దేశాలకు వెనక్కి వెళ్తున్నారు. దాంతో వాళ్లు తమతో పాటు ఈ జ్వరాన్ని కూడా తీసుకెళ్లారు. ఆయా దేశాల్లో స్థానికుల్లో ఈ జ్వరానికి సంబంధించిన రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడంతో జ్వరం చాలా వేగంగా విస్తరించింది.

విమానం

ఫొటో సోర్స్, Getty Images

విమానయానం అందరికీ అందుబాటులో లేని రోజుల్లో కూడా ఈ వైరస్ సైనికుల ద్వారా అనేక దేశాలకు విస్తరించింది. దీని కారణంగా 5-10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా.

ఆ సమయంలో స్పానిష్ ఫ్లూ ప్రపంచమంతటా విస్తరించడానికి 6-9 నెలల సమయం పట్టింది. కానీ, ఇప్పుడు మనిషి ఒక్క రోజులో ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. అందుకే కొత్త వైరస్‌లు చాలా వేగంగా విస్తరించే అవకాశం ఉంది.

ఎబోలా, సార్స్, ఇప్పుడు కరోనావైరస్.. ఇవన్నీ కూడా జూనాటిక్ వైరస్‌లు. అంటే ఇవి జంతువుల నుంచి మనుషులకు సోకాయి. వుహాన్‌లోని ఓ మాంసాహార మార్కెట్ నుంచి కరోనావైరస్ ఉద్భవించిందని చెబుతున్నారు.

యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఈ రోజుల్లో ప్రతి నాలుగు కొత్త వ్యాధుల్లో మూడు జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మాంసాహార వినియోగం ఎక్కువైపోయింది. వివిధ దేశాల్లో సంపదతో పాటు మాంసంతో నిండిన ఆహారంపై మక్కువ కూడా పెరిగిపోయింది. ఫ్లూ వైరస్‌లు సాధారణంగా పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తాయి. కాబట్టి, జంతువులకు దగ్గరగా జీవించే మనుషులకు మొదట ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

చైనాలో జనాల రద్దీ ఉన్న ప్రాంతాల్లోనే జీవించి ఉన్న జంతువులు, మాంసం మార్కెట్లు ఉండటం మామూలే. దాన్ని బట్టి తాజాగా రెండు అంటువ్యాధులు ఆ దేశం నుంచే ఎందుకు ఉద్భవించాయో అర్థం చేసుకోవచ్చు.

1918లో విషపు జ్వరం కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1918లో విషపు జ్వరం కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు

మరోపక్క నగరాలు విస్తరిస్తుండటంతో శివార్లలో ఉన్న చెట్లను నరికేసి అక్కడ ఇళ్లు నిర్మిస్తున్నారు. దాని కారణంగా కూడా కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. లాసా ఫీవర్ అలా పుట్టిందే. వ్యవసాయం కోసం జనాలు అడవులను నరికేయడంతో అడవుల్లో ఉండాల్సిన ఎలుకలు ఇళ్లలోకి చేరాయి. వాటితో పాటు లాసా ఫీవర్‌ను కూడా తీసుకొచ్చాయి.

ప్రపంచం ప్రస్తుతం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ అన్ని రకాల పరిణామాలను ఎదుర్కోవడానికి అది సిద్ధంగా లేదు. ఏ సమస్య వచ్చినా ప్రజలు ప్రభుత్వంపైనే భారం వేస్తారు. ఆ ప్రభుత్వం విఫలమైతే మొత్తం ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది

ఎబోలా విజృంభించిన సమయంలో పశ్చిమ ఆఫ్రికాలో అలాంటి పరిస్థితే ఎదురైంది. గినియా, లైబీరియా, సియెరా లియోన్‌లలో స్థానిక ఆరోగ్య వ్యవస్థలు విఫలమవ్వడంతో వైరస్ వేగంగా విస్తరించింది.

ఒక్క పశ్చిమ ఆఫ్రికాలోనే ఎబోలా 11,310 మందిని బలితీసుకుంది.

కానీ, అది నెమ్మదిగా వ్యాపించే వైరస్ కాబట్టి ప్రపంచం దాని ప్రభావం నుంచి తప్పించుకుంది. కానీ, శ్వాసకోశ సంబంధిత వైరస్‌లు... అంటే కరోనా వైరస్ లాంటివి చాలా వేగంగా విస్తరిస్తాయి.

ఒకపక్క అవగాహన లేమి, నిరక్షరాస్యత, వ్యక్తిగత పరిశ్రుభ్రత లేమి, మరోపక్క నాణ్యమైన వైద్య నిపుణుల కొరతతో కొన్ని దేశాలు కొత్త వ్యాధులకు నెలవవుతున్నాయి.

Healthmap.org అనే వెబ్‌సైట్ ప్రపంచవ్యాప్తంగా ప్రభలుతున్న అంటువ్యాధులను ట్రాక్ చేస్తుంది.

ఫొటో సోర్స్, Healthmap.org

ఫొటో క్యాప్షన్, Healthmap.org అనే వెబ్‌సైట్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న అంటువ్యాధులను ట్రాక్ చేస్తుంది.

నిజానికి చాలాసార్లు ఇలాంటి వైరస్‌లను అంతం చేసే మందులను తయారు చేసే సాంకేతికత ప్రపంచంలో ఉంటుంది. కానీ, ఆ వైరస్ బారిన పడేది కొద్దిమంది మాత్రమే అయితే, మందుల తయారీ కంపెనీలకు అది లాభసాటిగా ఉండదు. అందుకే అవి వెనకడుగు వేస్తాయి.

మరోపక్క చాలాసార్లు అంటువ్యాధులు ఒక్కసారిగా విజృంభిస్తాయి. దాంతో, దానికి మందును తయారుచేసే లోపలే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

అయితే, గతంలో కంటే ఎక్కువ అంటువ్యాధులు విస్తరిస్తున్నప్పటికీ, వాటి కారణంగా చనిపోతున్నవారి సంఖ్య తక్కువేనని యూకేకు చెందిన రాయల్ సొసైటీ చెబుతోంది.

ఎబోలా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో మాదిరిగా ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యే కొద్దీ ప్రాథమిక శుభ్రత పెరుగుతుంది. వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. ఇన్ఫెక్షన్‌ను ఎలా నిరోధించాలనేదానిపై సమాచార వ్యాప్తికూడా పెరుగుతుంది. వ్యాధి నివారణ చర్యలు కూడా ఎక్కువవుతాయి. ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కొత్త వ్యాధులకు స్పందించే వ్యవస్థ మెరుగ్గా లేనప్పటికీ అంటువ్యాధులను గుర్తించడంలో, అవి ఎక్కువ దూరం విస్తరించకుండా చూడటంలో అయితే పురోగతి ఉంది.

చైనానే తీసుకుంటే, వారం రోజుల్లోనే అది వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తోంది. 1918లో అయితే అలాంటి ఊహ కూడా ఎవరికీ వచ్చి ఉండేది కాదు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)