కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు

కరోనావైరస్ చైనాలో వేగంగా వ్యాపిస్తోంది

ఫొటో సోర్స్, AFP

చైనాలో కరోనావైరస్ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య 106 చేరింది.

వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిన వారి సంఖ్య ఈ నెల 26 నాటికి 2,835 కాగా, 27 నాటికి 4,515కు పెరిగింది. కొత్తగా వైరస్ సోకినవారి సంఖ్య దాదాపు రెట్టింపైంది.

106 మరణాల్లో అత్యధికంగా 100 హుబేయ్ రాష్ట్రంలోనే సంభవించాయి. ఈ రాష్ట్రంలో వైరస్ సోకినవారి సంఖ్య 2,714కు పెరిగింది.

మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు లేదా ఇప్పటికే శ్వాసకోశ సమస్యలున్నవారు.

హుబేయ్‌లో వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణ, చికిత్స కార్యక్రమాల్లో ఐదు లక్షల మందికి పైగా వైద్య సిబ్బంది పాలుపంచుకొంటున్నారు.

గీత
News image
గీత

కరోనావైరస్ తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది.

దీనికి నిర్దిష్టమైన టీకాగాని, దీనిని నయం చేసేందుకు నిర్దిష్టమైన చికిత్సగాని లేవు.

దీన్ని నిరోధించాలంటే ఇన్‌ఫెక్షన్ సోకినవారి నుంచి ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడటమే మార్గం.

చైనాలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, చైనాలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఇతర దేశాల్లో పెరిగిన కేసులు

ఇతర దేశాల్లోనూ కరోనావైరస్ కేసులు పెరిగాయి. సింగపూర్, జర్మనీల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.

చైనా వెళ్లే అమెరికన్లు పునరాలోచించుకోవాలని అమెరికా అధికార యంత్రాంగం సూచించింది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న హుబేయ్ రాష్ట్రానికి వెళ్లొద్దని సలహా ఇచ్చింది.

వైరస్ కేంద్ర స్థానం, హుబేయ్ రాష్ట్ర రాజధాని అయిన వుహాన్ నుంచి రానున్న రోజుల్లో తమ కాన్సులర్ సేవల సిబ్బందిని విమానాల్లో రప్పించేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది.

అత్యవసరమైతే తప్ప చైనా వెళ్లొద్దని చాలా దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తున్నాయి. వుహాన్‌లో చిక్కుకుపోయిన తమ ప్రజలను రప్పించేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

వుహాన్‌ నగరంలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన చైనా ప్రధాని లీ కెకియాంగ్
ఫొటో క్యాప్షన్, వుహాన్‌ నగరంలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన చైనా ప్రధాని లీ కెకియాంగ్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), ఆయా దేశాల అధికారుల సమాచారం ప్రకారం చైనా వెలుపల థాయ్‌లాండ్, అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో మొత్తం 47 కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ వల్ల చైనా వెలుపల ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదు. చైనా వెలుపలి బాధితుల్లో దాదాపు అందరూ ఇటీవల వుహాన్‌కు వెళ్లి వచ్చినవారే. యూరప్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.

ఏ దేశంలో ఎన్ని కేసులు?

ఎనిమిది: థాయ్‌లాండ్

ఐదు: అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, తైవాన్

నాలుగు: మలేషియా, దక్షిణ కొరియా, జపాన్

మూడు: ఫ్రాన్స్

రెండు: వియత్నాం

ఒకటి: నేపాల్, శ్రీలంక, కెనడా, జర్మనీ, కంబోడియా

మాస్కులు ధరించిన చైనా పోలీసు అధికారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాస్కులు ధరించిన చైనా పోలీసు అధికారులు. ఇన్‌ఫెక్షన్ లక్షణాలు బయటపడక ముందే కరోనావైరస్ ఇతరులకు సోకగలదని చైనా అధికార యంత్రాంగం చెబుతోంది.

చైనాలో మరిన్ని ఆంక్షలు

వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా చైనా కొత్త సంవత్సర సెలవులను పాలనా యంత్రాంగం మరో మూడు రోజులు అంటే ఆదివారం వరకు పొడిగించింది.

వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు చైనా పాలనా యంత్రాంగం దేశంలో ప్రజల ప్రయాణాలపై మరిన్ని ఆంక్షలు విధించింది. వివిధ ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను నిలిపివేసింది. వుహాన్‌లో అత్యవసర సేవల వాహనాలను తప్ప ఇతర వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు.

రాజధాని బీజింగ్ నుంచి పొరుగునే ఉండే హుబేయ్ రాష్ట్రానికి బస్సు సర్వీసుల్లో అత్యధికం నిలిపివేశారు. బీజింగ్‌తోపాటు మరో ప్రధాన నగరం షాంఘైలో హుబేయ్ నుంచి వచ్చేవారిని రెండు వారాలపాటు పరిశీలనలో ఉంచుతున్నారు.

షాంఘై, హాంకాంగ్‌లలో డిస్నీలాండ్ పార్కులను మూసివేశారు.

హుబేయ్‌‌లో వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణ, చికిత్స కార్యక్రమాల్లో ఐదు లక్షల మందికి పైగా వైద్య సిబ్బంది పాలుపంచుకొంటున్నారు. ఈ రాష్ట్రంలో కనీసం రెండు వేల పడకలతో రెండు తాత్కాలిక ఆస్ప్రతులను నిర్మిస్తున్నారు. కర్మాగారాల్లో మాస్కుల ఉత్పత్తిని, వైరస్ నుంచి రక్షణ కోసం ధరించే దుస్తుల ఉత్పత్తిని పెంచారు.

వుహాన్ జనాభా కోటీ పది లక్షలు. రాకపోకలపై ఆంక్షలు అమల్లోకి రాక ముందే, చైనా కొత్త సంవత్సర సెలవుల నేపథ్యంలో లక్షల మంది వుహాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని నగర మేయర్ చెప్పారు.

వైరస్

ఫొటో సోర్స్, Getty Images

నావెల్ కరోనావైరస్(2019-ఎన్‌సీవోవీ)

చైనాలో వ్యాపిస్తున్న వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రస్తుతానికి నావెల్ కరోనా వైరస్(2019-ఎన్‌సీవోవీ) అని వ్యవహరిస్తోంది.

ఈ కొత్త వైరస్ కరోనావైరస్‌ల కుటుంబానికి చెందినది. గతంలో ఈ వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ బాధితుల్లో 9 శాతం మంది, మెర్స్ బాధితుల్లో ఇంచుమించు 35 శాతం మంది చనిపోయారు.

లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం. కరోనావైరస్‌ను మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో ఉండటంతో దీనికా పేరు పెట్టారు. ఈ వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు, ఇది గబ్బిలాల్లో కనిపించే కరోనావైరస్, పాములో ఉన్న వైరస్‌తో కలసి కొత్తగా పుట్టిందని పరిశోధకులు గుర్తించారు.

వీడియో క్యాప్షన్, చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)