కోబ్ బ్రయాంట్: బాస్కెట్ బాల్ సూపర్ స్టార్, ఆయన 13 ఏళ్ళ కుమార్తె హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం

ఫొటో సోర్స్, Getty Images
బాస్కెట్ బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కోబ్ బ్రయాంట్ కాలిఫోర్నియాలో ఒక హెలీకాప్టర్ ప్రమాదంలో ఆదివారం మరణించారు.
ప్రమాదానికి గురైన ఈ హెలీకాప్టర్‌లో బ్రయాంట్‌తో పాటు ఆయన 13 ఏళ్ల కుమార్తె గిన్నాతో పాటు మరో ఏడుగురు కూడా ఉన్నారు.
అయిదు సార్లు ఎన్బీఏ ఛాంపియన్‌గా నిలిచిన బ్రయాంట్ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారన్న వార్త సుమారు రెండు దశాబ్దాల పాటు ఆయన ప్రాతినిధ్యం వహించిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ జట్టును తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ఒలింపిక్స్ లో అమెరికా జట్టు తరపున రెండు సార్లు స్వర్ణం సాధించిన బ్రయాంట్ ఎన్బీఐ చరిత్రలోఅత్యధిక స్కోర్ చేసిన క్రీడాకారుల్లో నాలుగో వ్యక్తిగా రికార్డులు సృష్టించారు. 2016లో బాస్కెట్ బాల్ క్రీడకు వీడ్కోలు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
3 ఏళ్లకే బాస్కెట్ బాల్
బ్రయాంట్ తండ్రి జెల్లీ బీన్ ఒకప్పటి ఎన్బీఏ ప్లేయర్. 1975 నుంచి 83 మధ్యలో మూడు జట్లకు 8 సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించారు.
1978 ఆగస్టు 23న జన్మించిన బ్రయాంట్ 3 ఏళ్ల నుంచే బాస్కెట్ బాల్ ఆడటం మొదలు పెట్టారు.
ఆయనకు ఫుట్ బాల్ అన్నా ఇష్టమే. ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ ఎసీ మిలన్ ఆయన ఫేవరెట్.
1996లో ఫిలడెల్ఫియాలోని ప్రముఖ పాఠశాల తరపున రాష్ట్ర జట్టులో ఆడారు. ఆ తరువాత హైస్కూల్ నుంచి నేరుగా షార్లెట్ హార్నెట్స్ జట్టులో చేరారు.
ఆపై లాస్ ఏంజెల్స్ లేకర్స్ జట్టుకు 20 ఏళ్లు నాయకత్వం వహించారు.

ఫొటో సోర్స్, Reuters
టాప్ స్కోరర్ నుంచి ఆస్కార్ విజేత వరకు:
2016లో బాస్కెట్ బాల్ క్రీడకు గుడ్ బై చెప్పిన తర్వాత వ్యాపారం, వినోద రంగాలపై ఆయన దృష్టి సారించారు.
ప్రముఖ స్పోర్ట్స్ డ్రింక్ బాడీ ఆర్మర్‌లో 60 లక్షల డాలర్లతో వాటను కొనుగోలు చేయడం ద్వారా టాప్ షేర్ హోల్డర్స్‌లో ఒకరుగా మారారు. ప్రస్తుతం ఆ సంస్థలో ఆయన వాటా విలువ సుమారు 20 కోట్ల డాలర్లు.
2018లో డియర్ బాస్కెట్ బాల్ పేరిట ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డ్ అందుకుంది.
ఫోర్బ్స్ లెక్కల ప్రకారం బ్రయాంట్ రిటైర్ అయ్యేనాటికి ఆయన ఆదాయం సుమారు 77 కోట్ల డాలర్లు (రూ. 5,500 కోట్లు). టీమ్ స్టోర్ట్స్ లో అత్యధిక వేతనం అందుకున్న అథ్లెట్‌గా అప్పట్లో ఆయన చరిత్ర సృష్టించారు.

ఫొటో సోర్స్, Reuters
అత్యాచార ఆరోపణలు
కెరియర్ పరంగా ఎన్నో విజయాలు సాధించిన బ్రయాంట్‌ను... 2003లో అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు చిక్కుల్లోకి నెట్టాయి.
2003 జులై నెలలో కొలోరాడో రిసార్ట్‌లో పని చేస్తున్న 19 ఏళ్ల మహిళ... బ్రయాంట్ తనపై లైంగికదాడి చేశారని ఆరోపించారు. దాంతో ఆయనను అరెస్ట్ చేశారు.
అయితే, తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించిన బ్రయాంట్ పరస్పర అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నామని చెప్పారు.
బ్రయాంట్‌పై ఆరోపణలు చేసిన మహిళ కోర్టులో సాక్ష్యమిచ్చేందుకు నిరాకరించడంతో ఆ కేసును కొట్టేశారు.
అప్పుడున్న పరిస్థితుల్లో తాను అనుకున్నట్టుగా ఆమె భావించలేదంటూ బ్రయాంట్ తరువాత తనంతట తానే క్షమాపణ చెప్పారు.
ఈ వివాదాన్ని ఆ తరువాత కోర్టు బయటే పరిష్కరించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
షాక్‌కు గురైన క్రీడా ప్రపంచం
41 ఏళ్ల బ్రయాంట్ ఆకస్మిక మరణం యావత్ క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.
బాస్కెట్ బాల్ రైజింగ్ స్టార్ గా ఇప్పుడిప్పుడే గుర్తింపు సాధిస్తున్న ఆయన 13 ఏళ్ల కుమార్తె గిన్నా సహా మరో 9 మంది కూడా ఇదే హెలీకాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి:
- పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్ పాత్ర కూడా ఉందా
- ఏపీ మండలి రద్దుని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం.. అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక.. 133-0 మెజార్టీతో బిల్లుకు ఆమోదం
- ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ
- కరోనావైరస్: చైనాలో 80 మంది మృతి... విదేశాలకు విస్తరిస్తున్న భయం
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- ఉత్తర కొరియా: కిమ్ జాంగ్ ఉన్ మేనత్త బతికే ఉన్నారు... ఆరేళ్ళ ఊహాగానాలకు తెర
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









