లత భగవాన్ ఖరే: భర్త వైద్యం కోసం.. 65 ఏళ్ల వయసులో ఆమె పరుగు పందేల్లో పోటీ పడుతున్నారు

భర్త వైద్యం కోసం కిడ్నీ దానం చేయడం, బంగారం తాకట్టు పెట్టడం... ఇలాంటి కథలను చాలా వినుంటాం. కానీ, లత ఖరే కథ వీటికి భిన్నం.
ఆమె వయసు 65ఏళ్లు. ఆ వయసులో ఆమె భర్త వైద్య ఖర్చుల కోసం డబ్బు కూడబెట్టడానికి పరుగు పందేల్లో పాల్గొనడం మొదలుపెట్టారు.
ఇప్పుడు ఆమె కథతో ఓ సినిమా కూడా తీస్తున్నారు. అందులో ఆమె పాత్రలో ఆమే స్వయంగా నటిస్తున్నారు.
ఒక సాధారణ మహిళ లక్షలాదిమందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎలా చేరారో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.
65 ఏళ్ల వయసులోనూ లత ఎందుకు పరుగు కొనసాగిస్తున్నారో, ఆమె మాటల్లోనే...
''ఒకసారి నేను పరుగెడుతుండగా నా చెప్పులు తెగిపోయాయి. అయినా కూడా ఆగకుండా వాటిని విసిరేసి పరిగెడుతూనే ఉన్నాను.
నా భర్త వ్యాధి బారిన పడ్డారు. ఎంఆర్ఐ చేయించాలని డాక్టర్ చెప్పారు. కానీ, నాకు ఎంఆర్ఐ కోసం 5000 రూపాయలు ఎవరు ఇస్తారు? అప్పుడు నాకు ఒక మారథాన్ ఈవెంట్ గురించి తెలిసింది. మా చుట్టుపక్కల యువకులు... నువ్వు బాగా ఎక్కువ నడుస్తావు బామ్మ, నువ్వు మారథాన్ గెలిచే అవకాశం ఉంది అని నన్ను ప్రోత్సహించారు. గెలిస్తే ఏమిస్తారు అని నేను వాళ్ళని అడిగాను. అప్పుడు 5000 వస్తాయని వారు చెప్పారు. గెలిస్తే ఆ డబ్బు ఎంఆర్ఐ చేయించడానికి సరిపోతుంది అని నాకు అనిపించింది. అప్పుడు పరుగెత్తి మారథాన్ గెలవాలని నిర్ణయించుకున్నాను.
2014లో మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన 3 కిలోమీటర్ల పరుగు పోటీలో నేను పాల్గొన్నా.


నాకు అప్పటివరకు పరుగుపందెం అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. కానీ, ఎలాగైనా ఆ పోటీ గెలవాలని నేను నిర్ణయించుకున్నాను. ముగింపు రేఖకి నేను కొద్ది దూరంలో ఉండగానే అందరూ అరుస్తూ, చప్పట్లు కొడుతూ నన్ను ప్రోత్సహించారు. అప్పుడు ఆ పోటీ నేను గెలవబోతున్నాను అన్న విషయం నాకు అర్థమైంది. నాకు 5000 రాబోతున్నాయని చాలా ఆనందపడ్డాను.
ఇప్పుడు నా కథతో ఓ సినిమా కూడా తీస్తున్నారు'' అని లత గర్వంగా చెబుతారు.
''ఆవిడ గురించి ఒక తెలుగు వార్తాపత్రికలో చదివాను. భర్త కోసం 65 ఏళ్ల మహిళ ఈ విధంగా కష్టపడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. మొదట్లో డాక్యుమెంటరీ వరకే ఆలోచించా కానీ ఇప్పుడు సినిమా తీద్దాం అని దృఢంగా నిర్ణయించుకున్నా'' అంటున్నారు లత జీవితం ఆధారంగా సినిమా తీస్తున్న దర్శకుడు నవీన్ కుమార్.

''ఒక రోజు ఖాళీ సరస్సులో ఒక సీన్ షూట్ చేస్తున్నాం. పరుగెత్తుకుంటూ వచ్చే ఒక సీన్లో ఆవిడ జారి పడిపోయారు. మేమందరం కంగారుగా ఆవిడ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళాం. అప్పటికే లేచి నిలబడి మావైపు నవ్వుతూ చూస్తున్నారు. "నేను బాగానే ఉన్నాను. ఇది మళ్ళీ షూట్ చేద్దాం" అని అన్నారు. ఆవిడని చూసి నాకు కంట్లో నీళ్లు తిరిగాయి'' అన్నారు సినిమా నిర్మాణ బృందంలో ఒకరైన ప్రతీక్ కాచరే.
లత భర్త ఆవిడని చూసి చాలా గర్వపడతారు.
''తన గురించి ఆలోచించుకోకుండా నా చికిత్స కోసం లత పరుగులు పెట్టింది. ఈ వయసులో తను నాకోసం ఇలా చెయ్యడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ, తనని చూస్తే చాలా గర్వాంగా కూడా అనిపిస్తుంది'' అంటారు భగవాన్ ఖరే.

ఇవి కూడా చదవండి:
- విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి
- ఉత్తర కొరియా భారీ ఎత్తున రిసార్టులు, స్పాలు ఎందుకు నిర్మిస్తోంది
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా? చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా?
- రోడ్డుపై వేగంగా వెళ్లడానికి కారులో అస్థిపంజరాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు
- పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










