విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా మధ్య అంతుపట్టని ఆ బంధం ఏంటి?

ఫొటో సోర్స్, GETTY IMAGES/VICTORIA & ABDUL
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటన్ మహారాణి విక్టోరియా తన జీవితంలో చివరి 13 ఏళ్లలో ఎక్కువ సమయాన్ని తన భారత గుమస్తా అబ్దుల్ కరీం సమక్షంలోనే గడిపారు.
కరీంను మొదట ఆగ్రా నుంచి ఆమె కోసం నౌకరుగా పంపించారు. కానీ, ఆయన మెల్లమెల్లగా ఆమెకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారారు.
దీనిపై ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా, ఎంతోమంది ఎన్నో అన్నప్పటికీ ఆమె ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించారు.
ప్రస్తుతం ఇద్దరి మధ్య ఆ సంబంధాన్ని ఎలా నిర్వచిస్తున్నారు? నేను అదే ప్రశ్నను 'విక్టోరియా అండ్ అబ్దుల్: ద ట్రూ స్టోరీ ఆఫ్ ద క్వీన్స్ క్లోసెస్ట్ కాన్ఫిడంట్' రచయిత్రి శ్రావణి బసు ముందు ఉంచాను.

ఫొటో సోర్స్, Getty Images
సమాధానంగా "నిజానికి ఈ సంబంధం చాలా పొరలుగా ఉంది. దీనికి ఒక నిర్వచనం ఇవ్వలేం. అప్పట్లో మహారాణి తన 70వ దశకంలో ఉన్నారు. అబ్దుల్ కరీం యువకుడు. ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఆయన వయసు 24 ఏళ్లు. కరీం చూడ్డానికి చాలా బాగుండేవాడు. ఇద్దరి మధ్యా కచ్చితంగా ఆకర్షణ ఉంది. రాణి జూబ్లీ వేడుకల సందర్భంగా ఆగ్రా నుంచి ఇద్దరు టేబుల్ వెయిటర్లను పంపించారు. వారిలో ఆమె అబ్దుల్ కరీంను ఎంచుకున్నారు. కరీం ద్వారా ఆమెకు భారత్ గురించి తెలుసుకునే అవకాశం లభించింది" అని శ్రాబణి చెప్పారు.
"ఆమెకు భారత్ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. ఆమె భారత్‌కు రాణి. కానీ, ఆమెకు ఎప్పుడూ భారత్ వచ్చే అవకాశం దొరకలేదు. అలా ఒక విధంగా అబ్దుల్ కరీం ఆమెకు ‘భారత్’ అయ్యాడు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా, రెండు దేశాల మధ్య ఆకర్షణ అయ్యింది. అప్పుడప్పుడూ మనకు ఆమె తల్లి రూపంలో కనిపిస్తే, ఒక్కోసారి అతడికి దగ్గరి స్నేహితురాలుగా ఉంటారు. కరీంకు రాసిన కొన్ని లేఖల్లో 'నీకు నా మనసులో ఏ స్థానం ఉందో తెలీదు' అని రాశారు. కొన్ని లేఖల చివర్లో ఆమె మూడు ముద్దులకు గుర్తుగా మూడు 'X'లు రాసేవారు. భారత సామ్రాజ్ఞి ఒక సామాన్యుడికి బహిరంగంగా అలా లేఖలు రాసేవారంటే, నాకది చాలా ఆసక్తిగా అనిపించింది" అన్నారు.

ఫొటో సోర్స్, VICTORIA & ABDUL
ఆగ్రా జైల్లో క్లర్కుగా పనిచేసిన కరీం
కరీంను ఆగ్రా నుంచి విక్టోరియాకు సేవలు అందించేందుకు పంపించారు. కానీ ఏడాదిలోపే ఆయన 'కిచెన్ బాయ్' నుంచి మహారాణి గుమస్తా స్థాయికి చేరారు.
"కరీం కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆయన ఆగ్రా జైల్లో క్లర్కుగా పనిచేసేవారు. ఏడాదికి 60 రూపాయల జీతం వచ్చేది. ఆయన తండ్రి కూడా అదే జైల్లో హకీంగా ఉండేవారు. మహారాణి జూబ్లీ వేడుకల సందర్భంగా ఆగ్రా జైలు సూపరింటెండెంట్ మహారాణికి ఒక మంచి బహుమతి పంపించాలని అనుకున్నాడు. ఇద్దరు భారత నౌకర్లను బ్రిటన్ పంపించారు. వారు ప్రత్యేకంగా కనిపించేలా సిల్కుతో యూనిఫాం కుట్టించి, తలపాగాలు కూడా పెట్టించారు. కానీ మహారాణి మెల్లమెల్లగా అబ్దుల్ కరీంకు దగ్గరవడం మొదలైంది" అంటారు శ్రాబణి.

ఫొటో సోర్స్, VICTORIA & ABDUL
మహారాణి విక్టోరియాకు ఉర్దూ నేర్పిన కరీం
విక్టోరియా ఆయనకు ఎంత ప్రభావితం అయ్యారంటే, కరీంను తనకు ఉర్దూ నేర్పించమని అడిగారు. దాంతో ఆయన రాణి నోట్‌బుక్‌లో ఉర్దూలో ఒక లైన్ రాసేవారు. తర్వాత దానిని ఇంగ్లిష్‌లో అనువదించి రాసేవారు. మహారాణి విక్టోరియా వాటిని అలాగే తన పుస్తకంలో రాసుకునేవారు.
మహారాణి నిజానికి ఉర్దూ నేర్చుకోవాలని అనుకున్నారు. కరీం ఆమెకు టీచర్ అయ్యారు. 13 ఏళ్లు ఆమెకు ఉర్దూ నేర్పించారు. రాణికి ఉర్దూ చదవడం, రాయడం తెలుసనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు. ఆమెకు దానికి చాలా గర్వంగా ఉండేది. జీవిత చరమాంకంలో ఒక కొత్త భాషను నేర్చుకోవాలని ఆమె అనుకోవడం, అందులో సక్సెస్ కావడం చాలా వింతగా అనిపిస్తుంది. ఆమె పర్యటనల్లో ఉన్నా, సెలవుల్లో ఉన్నా ఉర్దూ పాఠాలు నేర్చుకోవడం మాత్రం ఆపేవారు కాదు. ప్రతి రాత్రీ ఆమె కాసేపు ఉర్దూ ప్రాక్టీస్ కూడా చేసేవారు.

ఫొటో సోర్స్, VICTORIA & ABDUL
ఏడాదిలోపే ఉర్దూలో ప్రావీణ్యం
మహారాణి విక్టోరియాకు ఉర్దూపై ఉన్న ప్రేమ గురించి, లండన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హుమయూన్ అన్సారీ చాలా పరిశోధన చేశారు. "మహారాణి తన డైరీలో ఉర్దూలో రాసేవారు. అందులో, ఈ రోజు చాలా బాగా అనిపించింది. షా పర్షియా వజీర్లతో మమ్మల్ని కలవడానకి వచ్చారు అని ఏవేవో రాసేవారు. రాణి విక్టోరియా రాతల్లో ఉత్సాహం కనిపించేది. తనకు ఏమాత్రం పరిచయం లేని భాషలో ఆమె ప్రావీణ్యం సంపాదించారు. దానికి ఆమె ప్రయత్నించడం మామూలు విషయం కాదు. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఆమె ఏడాదిలోపే ఆ భాష నేర్చుకోగలిగారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, VICTORIA & ABDUL
రాణికి చికెన్ కర్రీ తినిపించారు
కానీ, వారి మధ్య స్నేహంతో ఇంకొకటి కూడా జరిగింది. ఇంగ్లండ్‌లో అప్పటికే అందరికీ నచ్చిన చికెన్ కర్రీ మరింత పాపులర్ అయ్యింది. కరీం రాణి కోసం చికెన్ కర్రీ, దాల్, పలావ్ వండేవారు.
మహారాణి విక్టోరియా 1887, ఆగస్టు 20న తన డైరీలో "ఈరోజు నేను నా భారత నౌకరు తన చేతులతో చేసిన అద్భుతమైన చికెన్ కర్రీ తిన్నాను" అని రాశారు. కానీ మహారాణి చికెన్ కర్రీ రుచి చూడడం అది మొదటిసారి కాదు.
బ్రిటన్ ప్రముఖ వంటకాల చరిత్రకారులు యానీ గ్రే తన 'ద గ్రీడీ క్వీన్: ఈటింగ్ విత్ విక్టోరియా' పుస్తకంలో "కరీం వంటకు ముందు రాణీ విక్టోరియా అంతకు ముందెప్పుడూ చికెన్ తినలేదని కాదు. డిసెంబర్ 29న విండ్సర్ కాజిల్ మెనూలో Curry de Poulet (కరీ ద పాలె) గురించి ఉంది. కానీ ఆ కర్రీలో, కరీం తయారు చేసిన కర్రీలో చాలా తేడా ఉంది. అప్పట్లో మిగిలిన మాంసం, కూరగాయలను కలిపి కర్రీ చేసేవారు. దానిని ఉన్నత స్థాయి వంటకంగా భావించేవారు కాదు. కానీ కరీం వచ్చాక, భారత కుక్‌లు అందరూ తమ చేతులతో వంటకాలు తయారు చేయడం మొదలుపెట్టారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, VICTORIA & ABDUL
రోట్లో రుబ్బిన మసాలా
యానీ గ్రే తన పుస్తకంలో "భారత కుక్‌లు హలాల్ చేసిన మాంసం ఉపయోగించేవారు. వాళ్లు వంటింట్లోని ఏ మసాలాలూ వాడేవారు కాదు. భారత్ నుంచి తెచ్చిన మసాలాలను రోట్లో నూరేవారు. 1880 దశకంలో వారానికి రెండు సార్లు అంటే ఆదివారం మధ్యాహ్నం, మంగళవారం రాత్రి రాణి కోసం కరీం చికెన్ కర్రీ చేసేవాడు" అని చెప్పారు.
అంతే కాదు, కరీం భారత్ అంటే మహారాణి మనసులో ఒక ప్రత్యేక ముద్ర ఏర్పడేలా చేశారు. పేరుకు విక్టోరియా భారత రాణి. కానీ ఆమె ఎప్పుడూ భారత్ రాలేకపోయారు. ఆమె సముద్ర యాత్ర చేసేవారు కాదు.
"భారత్ రాణి కిరీటంలో రత్నం లాంటిది. కానీ ఆమెకు ఎప్పుడూ భారత్ వెళ్లే అవకాశం దొరకలేదు. ఆమెకు భారత్ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. భారత్‌లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఆమె అనుకునేవారు. కరీం ఆమె కోరిక తీర్చారు. భారత ఆత్మను ఆమె వరకూ చేర్చారు. ఆమెకు భారత్‌లో వేడి, సంస్కృతి, పండుగలు, ఇక్కడి రాజకీయాల గురించి కూడా చెప్పేవారు. రాణికి కరీం హిందూ-ముస్లిం అల్లర్ల గురించి కూడా తెలిసేలా చేశారు. ఆ సమాచారంతోనే విక్టోరియా వైస్రాయ్‌కు లేఖ రాసి సమాధానాలు కోరేవారు".

ఫొటో సోర్స్, Getty Images
కరీంను చూడ్డానికి ఆయన ఇంటికే వెళ్లిన విక్టోరియా
రాణీ విక్టోరియా, అబ్దుల్ కరీం సాన్నిహిత్యం ఏ స్థాయికి చేరిందంటే, ఆమె అతడికి నీడలా అయిపోయారు. కరీం ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు ప్రొటోకాల్ ఉల్లంఘించిన ఆమె అతడిని చూడ్డానికి తన ఇంటికే వెళ్లారు.
రాణీ డాక్టర్ సర్ జేమ్స్ రీడ్ తన డైరీలో దీని గురించి రాశారు. "కరీం పడక మీద నుంచి లేవలేకపోయినప్పుడు, రాణీ అతడిని చూడ్డానికి రెండు సార్లు తన ఇంటికే వెళ్లారు. బెడ్ మీద ఉన్న కరీం దగ్గర ఉర్దూ నేర్చుకునేందుకు, ఆమె తన పుస్తకాలు కూడా తీసుకెళ్లేవారు. రాణి అప్పుడప్పుడూ అతడి దిండు సర్దడం కూడా నేను చూశాను. ప్రముఖ చిత్రకారుడు వాన్ ఏంజెలీతో కరీం వర్ణచిత్రం వేయించాలని కూడా రాణి అనుకున్నారు. అప్పటివరకూ అతడు భారతీయుల చిత్రాలేవీ వేయలేదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, VICTORIA & ABDUL
ఆగ్రాలో కరీంకు 300 ఎకరాల జాగీర్
రాణీ ఆయనకు ఎంత ప్రభావితం అయ్యారంటే, కరీంకు ఆగ్రాలో 300 ఎకరాల జాగీర్ ఇప్పించారు. తన మూడు రాజ మహళ్లలో ఆయనకు ఇళ్లు కూడా ఇచ్చారు. కరీం తన ఛాతీపై పతకాలు ధరించడానికి, కత్తి ఉంచుకోడానికి కూడా అనుమతించారు. ఆగ్రాలో హకీంగా ఉన్న కరీం తండ్రికి పెన్షన్ అందించాలని కూడా మహారాణి ఆదేశాలు జారీ చేశారు.
"అదే ఏడాది జూన్‌లో కరీం తండ్రి బ్రిటన్‌లో కొడుకు దగ్గరకు వచ్చారు. ఆయన రాకకు నెల ముందే రాణి ఎలెక్స్ ప్రాఫిట్‌కు ఆయన ఉండబోయే గదిని సరిగా ఫర్నిష్ చేయాలని ఆదేశించారు. అక్కడ సెంట్రల్ హీటింగ్ సరిగా పనిచేస్తోందో లేదో చూడాలన్నారు. కరీం తండ్రి విండ్సర్ కాజిల్‌లో హుక్కా తాగిన మొదటి వ్యక్తిగా నిలిచిపోయారు. సాధారణంగా ప్రధాని లార్డ్ సాలిస్‌బరీ బసచేసే గదిలో ఆయనకు విడిది ఏర్పాటు చేశారు. కరీం తండ్రికి తన సంతకం ఉన్న రెండు ఫొటో కాపీలు కూడా ఇవ్వాలని రాణి తన మనవడు జార్జికి ప్రత్యేకంగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజమహల్లో తిరుగుబాటు
దీంతో, రాజమహల్లో ఉన్న అందరూ గుమస్తా అబ్దుల్ కరీంకు వ్యతిరేకంగా మారారు. అతడికి వ్యతిరేకంగా మహారాణికి లేనిపోనివి చెప్పేవారు.
దీనిపై శ్రాబణి బసు "రాజమహల్లో పరిస్థితి కరీంకు వ్యతిరేకంగా ధర్నా చేస్తామని బెదిరించేవరకూ వచ్చింది. మహారాణి తనతోపాటూ కరీంను యూరప్ పర్యటనకు తీసుకెళ్తే, మేమంతా సామూహిక రాజీనామాలు చేస్తామన్నారు. కానీ రాణి వాళ్ల మాట వినలేదు. ఆమెకు వారి విషయం తెలీగానే, కోపంతో తన టేబుల్ మీద ఉన్న వస్తువులను చిందరవందర చేశారు. తర్వాత ఎవరూ రాజీనామా చేయలేదు. కానీ రాణి మాత్రం కరీంను తనతో యూరప్ తీసుకెళ్లారు. కరీంకు ఆమె అంత ప్రాధాన్యం ఇవ్వడం చూసి మహల్లో అందరికీ అసూయ కూడా ఏర్పడింది. ఒక సామాన్యుడికి ఆమె అంత విలువ ఎందుకిస్తున్నారనే అనుమానాలూ వచ్చాయి" అన్నారు.

ఫొటో సోర్స్, VICTORIA & ABDUL
కరీం, రాణీ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందా?
రాణి విక్టోరియా, అబ్దుల్ కరీం మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.
దీనికి సమాధానంగా శ్రాబణి "లేదు, అలా ఎప్పుడూ రాయలేదు. కానీ దర్బారులో చాటుమాటుగా అలా ఎన్నో అనుకునేవారు. ఒకసారి ఆమె కరీంను ఒంటరిగా తనతో హైలాండ్‌లో ఒక కాటేజ్‌కు తీసుకెళ్లారు. వారిద్దరి మధ్య ఏదైనా శారీరక బంధం ఉందా అనేది మనం చెప్పలేం. అది వారిద్దరికీ మాత్రమే తెలుసు. కానీ, కచ్చితంగా ఇద్దరి మధ్య చాలా ఆత్మీయత ఉండేది. రాణి రాసిన లేఖల వల్ల అది స్పష్టంగా తెలుస్తుంది. రోజుకు ఆరు సార్లు కరీంకు లేఖలు రాసిన రాణి, వాటిలో 'నువ్వు రావాలి, నాకు గుడ్ నైట్ చెప్పాలి’ అనేవారు. ఆయన ఎప్పుడూ మహారాణి పక్కనే కనిపించేవారు. అందుకే దర్బారులో అందరూ చాలా రకాలుగా చెప్పుకునేవారు. ఆయన అంతకు ముందు రాణి సహాయకుడుగా ఉన్న జాన్ బ్రౌన్ స్థానం ఆక్రమించారని చెప్పుకునేవారు. రాణి జాన్ బ్రౌన్‌తో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. అందుకే కరీం, రాణి మధ్య ఏదో ఉందని అనిపిస్తుంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, VICTORIA & ABDUL
రాణి మృతితో కరీంకు కష్టాలు
1901 జనవరి 23న రాణీ విక్టోరియా తుదిశ్వాస విడిచినప్పుడు ఆమె మృతదేహాన్ని చూసేందుకు దర్బారులో ఆమెకు చాలా దగ్గరివారైన కొడుకు, వారసుడు ఎడ్వర్డ్ సెవంత్, ఆయన భార్య రాణీ అలెగ్జాండ్రా, వారి కొడుకు, మనవళ్లను పిలిపించారు.
ఆ తర్వాత అబ్దుల్ కరీం రాణి బెడ్రూంలోకి వెళ్లి శ్రద్ధాంజలి అర్పించేందుకు ఎడ్వర్డ్ సెవంత్ అనుమతించారు. ఆమె మృతదేహాన్ని ఏకాంతంలో చూసిన చివరి వ్యక్తి అబ్దుల్ కరీం. కానీ మహారాణి అంత్యక్రియలు జరిగిన కొన్ని రోజుల్లోనే అబ్దుల్ కరీం కష్టాల్లో కూరుకుపోయారు.

ఫొటో సోర్స్, VICTORIA & ABDUL
దీని గురించి చెప్పిన శ్రాబణి "రాణి మరణించగానే రాజమహల్లో వాళ్లంతా ఒక్కసారిగా కరీంను లక్ష్యంగా చేసుకున్నారు. అతడి ఇంటిపై రెయిడ్ జరిగింది. రాణి ఆయనకు రాసిన లేఖలన్నీ తీసి, తన ముందే తగలబెట్టారు. కరీం భార్య, మేనకోడలు కూడా అక్కడే ఉన్నారు. అందరి ముందు ఆయన్ను ఘోరంగా అవమానించారు. మీరు తిరిగి భారత్ వెళ్లిపోవాలని చెప్పారు. రాణి అతడికి ఆగ్రాలో చాలా భూమి ఇవ్వడంతో, వారు ఇంగ్లండ్ నుంచి తిరిగి భారత్ వచ్చేశారు. ఇక్కడ 8 ఏళ్ల తర్వాత 1909లో ఆయన కూడా మరణించాడు" అన్నారు.
ఆ తర్వాత యాష్‌బర్న్ హౌస్, విండ్సర్ కాజిల్‌లో భారత తలపాగాలు కనిపించలేదు, రాజకుటుంబం వంటగదిలో భారత మసాలాల ఘుమఘుమలూ రాలేదు.
కొత్త మహారాజు ఎడ్వర్డ్ సెవంత్ పాలనలో కూడా చికెన్ కర్రీ వండేవారు. కానీ భారతీయులకు బదులు, ఇంగ్లిష్ కుక్‌లు దానిని తయారు చేసేవారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే
- CAA: కేరళ దారిలో పంజాబ్... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








