పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ఖైబర్ పఖ్తంఖ్వా ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లోని కొన్ని ప్రావిన్సుల్లో గోధుమ పిండి కొరత ఏర్పడింది. జనాలకు తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.
ఖైబర్ పఖ్తుంఖ్వాలో నాన్‌లు తయారు చేసే చాలా దుకాణాలు పిండి కొరత వల్ల మూతపడ్డాయి. బలూచిస్తాన్, సింధ్, పంజాబ్ ప్రావిన్సుల్లోనూ ఈ సమస్య ఉంది.
ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టి సారించింది.
ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలు మాత్రం పిండికి కొరత లేదని, ఇది కృత్రిమ సంక్షోభమని చెబుతున్నాయి.
క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రావిన్సుల్లో నాన్ల అమ్మకాలపై ప్రభావం పడింది.
ఖైబర్ పఖ్తుంఖ్వాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. పిండి ధరలు పెరగడంతో చాలా పట్టణాల్లో నాన్లను తయారుచేసే వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు నలుగురు వ్యాపారులను అరెస్టు చేశారు.


ఈ సమస్య గురించి ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నా, పరిస్థితిని చక్కదిద్దే చర్యలేవీ ఇంకా ప్రకటించలేదని బీబీసీ ప్రతినిధి అజీజుల్లా ఖాన్ చెప్పారు.
పెషావర్ నగరంలో నాన్ల దుకాణాలు మూతపడటంతో చాలా మంది బియ్యంవైపు మొగ్గుతున్నారు.
పెషావర్‌లో సాధారణంగా నాన్ల కొనుగోళ్లు ఎక్కువ. ఇక్కడ 2500కుపైగా నాన్ల దుకాణాలు ఉన్నాయి.
ఒక నెల క్రితం వరకూ 85 కిలోల మైదా పిండి రూ.4 వేలకు వచ్చేదని, ఇప్పుడు రూ.5వేల పైచిలుకు ధర పలుకుతోందని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని నాన్ తయారీదారుల సంఘం (బేకర్స్ అసోసియేషన్) అధ్యక్షుడు హాజీ మహమ్మద్ ఇక్బాల్ బీబీసీతో చెప్పారు.

పిండి కొరతతోపాటు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయినా, నాన్లు, ఇతర రొట్టెల ధరల పెంచకూడదని ప్రభుత్వం నుంచి తయారీదారులకు ఒత్తిడి ఉంది.
2013లో పెషావర్‌లో 170 గ్రాములతో తయారయ్యే నాన్‌ను రూ.10కి అమ్మాలని నిర్ణయించారని, ఇప్పటివరకూ ధరలు అలాగే ఉంచారని హాజీ ఇక్బాల్ అన్నారు. పిండి ధరలు మాత్రం చాలా సార్లు పెరిగాయని చెప్పారు.
150 గ్రాముల పిండితో చేసే రొట్టెను రూ.15కు అమ్మేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని నాన్ తయారీదారులు కోరుతున్నారు.
ప్రభుత్వం మాత్రం రూ.15 విలువ చేసే రొట్టె 170 గ్రాముల బరువు ఉండాలని అంటోంది.
పెషావర్‌లో నాన్ల అమ్మకాలు నిర్ణీత ధరల వద్ద జరగడం లేదు. చాలా దుకాణాలు 100 గ్రాముల బరువుండే రొట్టెలను అమ్ముతుంటాయి. కొన్ని దుకాణాలు ఇంతకన్నా తక్కువ బరువుతో రొట్టెలు తయారు చేస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇది చాలా కాలంగా ఉన్న సమస్యే. కానీ, ప్రభుత్వం ఇంతవరకూ పరిష్కారం కనుక్కోలేకపోయింది.
నెల క్రితం అఫ్గానిస్తాన్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం పిండి ఎగుమతి చేసిందని, ఆ తర్వాతే పిండి ధరలు పెరిగాయని హాజి మహమ్మద్ అన్నారు.
పెషావర్‌లోని రామ్‌పుర్ గేట్ వద్ద ఒక పెద్ద మార్కెట్ ఉంది. ఇక్కడ పిండి అమ్మకాలు కొనసాగుతున్నాయి. కానీ కొనుగోలుదారులే దొరకడం లేదు.
నెల క్రితం వరకూ ఇక్కడ ఒక్కో పిండి సంచి ధర రూ.850గా ఉండగా, ఇప్పుడు రూ.1100కు చేరుకుంది. ఫలితంగా కొనేవారూ తగ్గిపోయారు.
పంజాబ్ (పాకిస్తాన్) నుంచి త్వరలోనే పిండి వస్తుందని, ఖైబర్ పఖ్తుంఖ్వాలో కొరత తీరుతుందని ఇక్కడి ప్రభుత్వం చెబుతోంది.
బలూచిస్తాన్‌లో ఇదివరకు కూడా మిగతా ప్రాంతాలతో పోలిస్తే పిండి ధరలు ఎక్కువగా ఉండేవి.
పిండి ధరలు పెరిగాయన్న కారణంతో ఇక్కడి ఫుడ్ సెక్రటరీ, ఆహారశాఖ డైరెక్టర్ జనరల్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
సమయానికి గోధుమల కొనుగోళ్లు చేపట్టకోవడం వల్లే పిండికి కొరత ఏర్పడిందని ప్రభుత్వం భావిస్తోంది.
గోధుమలు, పిండి కొరత సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి లియాకత్ శాహ్వానీ చెప్పారు.
సింధ్ ప్రావిన్సు రాజధాని కరాచీలోనూ పిండి ధరలు పెరగడం వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
ఎడారి ప్రాంతమైన థార్‌లో సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ గోధుమలు పండవు.
థార్ ప్రాంతంలోని ముఖ్య పట్టణం మూథీలో కిలో పిండిని రూ.55కు అమ్ముతున్నారు. నంగర్‌హార్‌తోపాటు సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో కిలో పిండి ధర రూ.70 నుంచి రూ.80 వరకూ ఉంది.
థార్ ఎడారి ప్రాంతంలో కొన్నేళ్లుగా కరవు సమస్య ఉంది. ఇక్కడ పోషకాహార లోపంతో నవజాత శిశువులు మరణిస్తున్న వార్తలు తరచుగా వస్తుంటాయి.
గత ఏడాది ఇక్కడ వర్షాలు పడ్డాయి. దీంతో కొంతమేర జొన్నలు సాగు చేశారు. కానీ, మిడతల దాడులు, అకాల వర్షాలు, పెనుగాలుల వల్ల ఆ పంటలకు నష్టం జరిగింది.
ఖైబర్ పఖ్తుంఖ్వాలో కొరతను తీర్చేందుకు సహృద్భావ చర్యగా రోజూ 5 వేల టన్నుల పిండిని పంపాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
- రూల్ 71 అంటే ఏంటి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలి తిరస్కరిస్తే ఏం జరుగుతుంది?
- ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్?
- వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు
- అమెరికా, ఇరాన్‌ల మధ్య రాజీ కుదిర్చేంత పలుకుబడి పాకిస్తాన్‌కు ఉందా?
- పాకిస్తాన్ మాజీ సైనిక నియంతపై వ్యంగ్య నవల ప్రతులను స్వాధీనం చేసుకున్న 'ఐఎస్ఐ'
- విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..
- పాకిస్తాన్‌లో క్షమాభిక్షలు కొనుక్కుంటున్న హంతకులు
- విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










