కశ్మీర్: మంచు పెళ్లల కింద నరకయాతన.. 18 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన బాలిక

ఫొటో సోర్స్, Reuters
12 ఏళ్ల బాలిక హిమాలయ పర్వతాల్లో మంచు పెళ్లల కింద చిక్కుకుపోయింది. కాలు విరిగి, నోట్లో నుంచి రక్తం వస్తోంది. మంచు పెళ్లల కింద ఏడుస్తూ 18 గంటల పాటు అలాగే ఉంది. చివరికి ఆమెను ప్రాణాలతో కాపాడగలిగారు.
పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని నీలం లోయలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలిక పేరు సమీనా బీబీ.
ఆమె ఇంటి మీద భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబ సభ్యుల్లో పలువురు చనిపోయారు.
ఆ మంచు పెళ్లల కింద చిన్న గదిలో సమీనా చిక్కుకుపోయింది. ఆమె కాలు విరిగింది. నోట్లోంచి రక్తం బయటకు వచ్చింది.
అయినా, ఏడుస్తూ... రక్షించండంటూ పెద్దగా కేకలు పెట్టానని ఆమె రాయిటర్స్ మీడియా సంస్థతో చెప్పారు. రక్షించేలోపే ఆ మంచు కింద చనిపోతానేమోనని భయపడ్డానని ఆమె తెలిపారు.
ఇటీవల నీలం లోయలో పర్వతాల నుంచి మంచు, మట్టి పెళ్లలు విరిగిపడటంతో 70 మందికి పైగా చనిపోయారు. ప్రకృతి విపత్తుల ముప్పున్న ఈ హిమాలయ ప్రాంతంలో గత కొన్నేళ్లలో ఇంత భారీగా ప్రాణ నష్టం ఎప్పుడూ జరగలేదు.
భారత పాలిత కశ్మీర్‌తో పాటు, అఫ్గానిస్థాన్‌లలోనూ మంచు చరియలు విరిగిపడ్డాయి. కానీ, నీలం లోయలో నష్టం ఎక్కువగా సంభవించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ఇంకా వెతుకుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
'అంతా రెప్ప పాటులో జరిగిపోయింది'
సమీనాను వెంటనే ముజఫరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె కుటుంబ సభ్యుల్లో పలువురు చనిపోయారు.
"మాది బక్వాలీ గ్రామం. మా మూడంతస్తుల ఇంట్లో అందరమూ మంట చుట్టూ కూర్చుని చలి కాచుకుంటుండగా ఒక్కసారిగా మా ఇంటిపై భారీ మంచు పెళ్లలు పడ్డాయి" అని సమీనా తల్లి షాహనాజ్ బీబీ చెప్పారు.
మంచు పెళ్లలు కూలుతున్నప్పుడు ఎలాంటి శబ్ధం రాలేదని, అంతా రెప్ప పాటులోనే జరిగిపోయిందని ఆమె వివరించారు. తన బిడ్డ ప్రాణాలతో బయటపడుతుందనుకోలేదని ఆమె తెలిపారు.
మంచు పెళ్లల కింద గదిలో ఉండిపోయిన తనను ఎప్పుడు రక్షిస్తారోనని ఎదురుచూస్తూ నిద్రపోలేదని సమీనా చెప్పారు.
పాకిస్తాన్‌లోని మంచు ప్రభావిత ప్రాంతాల్లో 100 మందికి పైగా మరణించారని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
భారత పాలిత జమ్మూ కశ్మీర్‌లోనూ ఎనిమిది మంది చనిపోయారని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- అంటార్కిటికాలో పెంగ్విన్ల ఆకలి చావులు!
- సముద్ర తీరంలో మంచు బంతులు.. ఎలా వచ్చాయంటే..
- నీళ్లు, టాయిలెట్ పేపర్, మొక్కజొన్న పొత్తు... బాత్రూమ్లో ఒక్కో దేశానిది ఒక్కో అలవాటు
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- ఉప్పలపాడు పక్షుల పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









