ఆంధ్రప్రదేశ్: ఉప్పలపాడు పక్షుల పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి?

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ప్రతి ఏటా ఖండాలు దాటుకుని వలస వచ్చే దేశదేశాల పక్షులకు ఉప్పలపాడు వలస పక్షుల సంరక్షణ కేంద్రం ఆవాసం. దీనికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. అయినా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో వలస పక్షుల సంఖ్యతో పాటు పర్యటకుల సంఖ్య కూడా రానురాను తగ్గుతోంది.
ఆంధ్రపదేశ్ రాజధాని ప్రాంతానికి చేరువలో గుంటూరు శివార్లలో ఉంటుంది ఉప్పలపాడు గ్రామం.
ఈ గ్రామంలోని మంచినీటి చెరువును ఒకప్పుడు గ్రామ అవసరాలకు వినియోగించేవారు. అయితే, వివిధ రకాల వలస పక్షులు సీజన్ల వారీగా ఇక్కడికి వస్తుండటంతో ఆ చెరువు ఇప్పుడు పక్షుల సంరక్షణ కేంద్రంగా మారిపోయింది.
ఆస్ట్రేలియా, సైబీరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలతో పాటు హిమాలయాల నుంచి కూడా పక్షులు ఆయా కాలాలను బట్టి వలస వస్తూ ఉంటాయి. దీంతో ఉప్పలపాడు ఎప్పుడూ పక్షుల సందడితో కళకళలాడుతుంటుంది.
సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువు, మధ్యలో లంకల మాదిరిగా మట్టి దిబ్బలు, వాటిపై తుమ్మ చెట్లు గుబురుగా పెరిగి ఉంటాయి. ఆ చెట్ల మీద వేలాది పక్షుల సందడి చూడానికి పర్యాటకులను ఆకర్షిస్తోంది.
''యాభై ఏళ్లుగా చూస్తున్నాం...''
ఉప్పలపాడుకి చాలాకాలంగా పక్షులు వస్తున్నప్పటికీ, దాదాపు 50 ఏళ్లుగా పెద్ద సంఖ్యలో రావడం తాము గుర్తించామని స్థానికుడు అమర లింగేశ్వరరావు తెలిపారు.
ఆయన వయసు ఇప్పుడు 70 ఏళ్లు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''మా చిన్నప్పుడు కొన్ని పక్షులు వచ్చేవి. కొన్నాళ్లు ఉండేవి. మళ్లీ వెళ్లిపోయేవి. రకరకాల కొంగలు వస్తున్నాయని అనుకునేవాళ్లం. కానీ, అవి విదేశాల నుంచి వస్తున్నాయని మా వాళ్లు గుర్తించారు. దాంతో వాటికి అనువుగా ఆ చెరువుని వదిలేశాం'' అని చెప్పారు.
''చెరువు మధ్యలో దిబ్బలు, వాటిపై తుమ్మ చెట్లు ఉండడంతో గుడ్లు పెట్టడానికి, అన్నింటికీ అనువుగా ఉంటుంది. అందుకే ఏటేటా పెరుగుతూ వస్తున్నాయని చిన్నప్పుడు అనుకునే వాళ్లం. వాటిని చూడడానికి కూడా చాలా మంది రావడం మొదలయ్యింది. ఇప్పుడు ఈ చెరువు అటవీశాఖ ఆధ్వర్యంలోకి పోయింది'' అని ఆయన వివరించారు.

ఎన్ని రకాల పక్షులు వస్తాయి?
ఉప్పలపాడులోని వలస పక్షుల సంరక్షణ కేంద్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ వన్యప్రాణి విభాగం పరిధిలో ఉంది.
''ఇక్కడికి మొత్తం 30 రకాల విదేశీ పక్షులు వస్తుంటాయి. సీజనల్‌గా వస్తాయి. వేసవిలో ఆస్ట్రేలియా నుంచి పక్షులు వస్తాయి. శీతాకాలంలో సైబీరియా నుంచి, చైనా నుంచి కూడా పక్షులు వస్తాయి. ఆగస్టులో దక్షిణాఫ్రికా నుంచి పక్షులు వస్తాయి. ఆయా పక్షులు రెండు, మూడు నెలలు మాత్రమే ఇక్కడ ఉంటాయి'' అని గుంటూరు వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ మోహన్‌రావు బీబీసీకి వివరించారు.

వలస పక్షులతో పాటు పలు స్థానిక జాతులకు చెందిన పక్షులుకూడా ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి. అయితే అరుదుగా కనిపించే వలస పక్షులను చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని నిర్వాహకులు చెప్పారు.
''వలస పక్షుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని రకాల సదుపాయాలు కల్పించి, పక్షులను పరిరక్షించటానికి ప్రయత్నిస్తున్నాం'' అన్నారు డీఎఫ్ఓ.
పర్యటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని, పక్షులను వీక్షించటానికి టవర్ కూడా నిర్మించామని తెలిపారు.

ఉప్పలపాడుకే ఎందుకు వస్తున్నాయి?
ఉప్పలపాడుకు వచ్చే వలస పక్షుల్లో చైనా, నేపాల్, హిమాలయాల నుంచి పెలికాన్స్; సైబీరియా నుంచి పెయింటెడ్ స్టార్క్స్, శ్రీలంక నుంచి ఓపెన్ బీల్ స్టార్క్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్ ఐబిస్ పక్షులు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి. డార్టర్ స్నేక్ పక్షులు కూడా ఏడాది పొడవునా దర్శనమిస్తాయి.
ఈ పక్షులు ఉప్పలపాడుకు రావటం వెనుక అనేక కారణాలు ఉంటాయని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పక్షులు వలస రావటానికి ముఖ్యంగా భౌతిక పరిస్థితులు, వాతావరణ మార్పులు ప్రధాన కారణం. అననుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు తమకు సౌకర్యంగా ఉన్న ప్రాంతాలకు ఎంత దూరమయినా వలసలు పోతుంటాయని అని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జీవశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ డి.వి.కృష్ణ బీబీసీతో చెప్పారు.

''ప్రధానంగా ఆహారం కోసం, వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు, సంతానోత్పత్తి కోసం వందల నుంచి వేల కిలోమీటర్ల దూరం వలస పోతుంటాయి. ఈ పక్షుల వలసలు చలికాలంలో శీతల ప్రాంతమైన ఉత్తరం నుంచి ఉష్ణ ప్రాంతమైన దక్షిణం వైపుగా ఉంటాయి'' అని ఆయన వివరించారు.
''ఆంధ్రప్రదేశ్‌లో కొల్లేరు, నేలపట్టు, ఉప్పలపాడు ప్రాంతాలు ప్రధానంగా విదేశీ పక్షుల వలస ఆవాసాలుగా ఉన్నాయి. ఇక్కడ ఆయా పక్షులకు అనువైన భౌతిక పరిస్థితులు ఉండటంతో పాటు ఆహారం కూడా సమృద్ధిగా లభించటం ఇందుకు ముఖ్య కారణాలు'' అని ఆయన వివరించారు.

వలస పక్షుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది?
పక్షుల వలసలు సాగే క్రమం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. పరిశోధకులు చెప్తున్నదాని ప్రకారం.. పక్షులు వేల కిలోమీటర్లు వలస ప్రయాణం చాలా పగడ్బందీ వ్యూహంతో సాగిస్తాయి. కొన్ని పైలెట్ పక్షులు ముందుగా వలస ప్రాంతాలను సందర్శించి, ఆ ప్రాంతంలోని ఆహార లభ్యత, వాతావరణం తదితర విషయాలను పరిశీలిస్తాయి. ఆ తర్వాత మిగిలిన పక్షులకు సమాచారం అందిస్తాయి. ఏ వలస ప్రాంతంలో ఎన్ని పక్షులు ఉండాలో అవే నిర్ణయించుకుంటాయి. వాటికి అనువుగా ఉండే ప్రాంతాలను ఆవాసాలను పంచుకుంటాయి.
వలస ప్రయాణంలో ఇవి అనేక రాత్రుళ్లు, పగళ్లు నిర్విరామంగా ఎగురుతూనే ఉంటాయి. పగలు సూర్యకాంతి ఆధారంగా.. రాత్రి వేళల్లో చుక్కల ఆధారంగా ఇవి తమ గమనాన్ని నిర్దేశించుకుంటాయని ప్రొఫెసర్ డి.వి.కృష్ణ తెలిపారు.
''ఇవి దారి తప్పడమనే ప్రసక్తే ఉండదు. ప్రయాణం సుదీర్ఘంగా ఉంటే మధ్యలో ఆహారం, విశ్రాంతి తీసుకుంటాయి. ఆ తర్వాత తిరిగి తమ ప్రయాణం ప్రారంభించి గమ్యం చేరుకుంటాయి'' అని చెప్పారు.

అయితే, ఈ పక్షులు ఎంచుకున్న ప్రాంతాల్లో పరిస్థితులు అనువుగా లేకపోతే వలసలు తగ్గిపోతాయని ఆయన చెప్పారు.
''ఇప్పటికే కొల్లేరులో ఈ పరిస్థితి ఏర్పడింది. అనేక జాతులు రావడం లేదు. ఉప్పలపాడులో కూడా క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. గడచిన నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో వలస పక్షులకు తగిన ఆహారం లభించే పరిస్థితి లేదు. 2006 నుంచి 2010 వరకూ పెద్ద సంఖ్యలో పక్షులు వచ్చాయి. కానీ ఇప్పుడవి క్రమంగా తగ్గుతున్నాయి. ఈసారి వర్షాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది'' అని చెప్పారు.
శీతల ప్రాంతాల నుంచి ఉప్పలపాడు వచ్చే పక్షులు కొన్ని నెలల పాటు ఇక్కడే ఉంటాయి. ఆ సమయంలోనే గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి, వాటికి ఎగరడం నేర్పుతాయి. ఆ తర్వాత పిల్లలతో పాటు తమ ప్రాంతాలకు తిరిగి వెళుతుంటాయని అధికారులు చెబుతున్నారు.

మంచినీటి వలస పక్షుల కేంద్రాలు అరుదు...
వలస పక్షులకు వాతావరణ, భౌగోళిక పరిస్థితులు అనువుగా ఉండడం అత్యంత కీలకం అని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. తాను ఇంతకుముందు కూడా ఉప్పలపాడు వచ్చానని ఆయన బీబీసీతో చెప్పారు.
''ఇక్కడికి వచ్చే పక్షులకు తగ్గట్టుగా నీరు, వాతావరణం ఉండాలి. మంచినీటి చెరువు కాబట్టే ఉప్పలపాడు రావడానికి పక్షులు ఆసక్తి చూపుతున్నాయి. సంవత్సరం పొడవునా ఇక్కడ పక్షుల కోలాహలం ఉన్నా, ఒక్కో సీజన్‌లో ఒక్కో రకం పక్షిని ఇక్కడ మనం చూస్తుంటాం. అదే ఉప్పలపాడు ప్రత్యేకత కూడా. అక్టోబర్ నుంచి మార్చి వరకూ ఎక్కువ రకాలు వస్తాయి. అయితే పక్షుల సంరక్షణ కేంద్రంలో చెరువు నీరు కలుషితం కాకుండా చూడాలి'' అని అన్నారు.

సదుపాయాలు మెరుగుపరచాలి...
ఉప్పలపాడు వలస పక్షుల సంరక్షణ కేంద్రంలో సదుపాయాలు మెరుగు పరిస్తే మరింత మంది పర్యాటకులు రావడానికి అవకాశం ఉంటుందని విశాఖపట్నానికి చెందిన ఉమ నూతక్కి అభిప్రాయపడ్డారు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. ''పక్షులకు తగిన పరిస్థితులు ఉండాలి. పర్యాటకులకు కూడా అనువుగా ఉండాలి. గతంలో చాలా సార్లు వచ్చాను. కొంత మెరుగ్గా చేశారు. కానీ చెరువులో నీరు వాసన వస్తోంది. టూరిస్టులు సేద తీరాలంటే కనీసం తాగునీరు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలి'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు?
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- నిరసన ప్రదర్శనలు, అహింసా ఉద్యమాలతో సమాజంలో మార్పు రాదా? ఎక్స్టింక్షన్ రెబెలియన్ ఏమంటోంది?
- జపాన్ ఎందుకంత క్లీన్గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









