సైబీరియన్ కొంగలు... చింతపల్లి వారి చుట్టాలు

- రచయిత, రాజేష్ పెదమళ్ల
- హోదా, బీబీసీ కోసం
ఇళ్ల మధ్య చెట్లపైనే దాదాపు రెండు వేలకు పైగా కొంగలు.. 24 గంటలూ వాటి అరుపులు. ఈ శబ్దాలు సాధారణంగా ఎవరికైనా చిరాకు పుట్టిస్తాయి. కానీ తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామస్థులకు మాత్రం కాదు. దాదాపు అయిదు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఏటా తమ గ్రామానికి వచ్చే సైబీరియా పక్షులను వాళ్లు బంధువుల్లా చూస్తారు.
ఈ కొంగల రాకతో ఊరికి మేలు జరుగుతుందని చింతపల్లి వాసులు నమ్ముతారు కూడా. ఎవరైనా వాటికి హాని తలపెడితే అందరూ ఒక్కటవుతారు. వారిని పట్టుకుని గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ చేస్తారు. జరిమానా విధిస్తారు. కేసులు పెడతారు.
మధ్య ఆసియా దేశమైన సైబీరియా నుంచి దాదాపు అయిదు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ కొంగలు ఖమ్మం సమీపంలోని చింతపల్లి గ్రామానికి ఏటా వస్తుంటాయి.
సైబీరియాతో పోలిస్తే చింతపల్లిలో వేడి వాతావరణం ఉండటం, వేసవిలోనూ దగ్గరల్లోని చెరువుల్లో నీళ్లుండటం వల్ల తమ ఊరికే వస్తుంటాయని, ఊళ్లో చింతచెట్లు ఎక్కువ ఉండటం మరో కారణమని గ్రామస్థులు చెబుతున్నారు.
"ఒంటరిగా వస్తాయి, పిల్లలతో తిరిగి వెళ్తాయి"
ఒంటరిగా వచ్చే ఈ పక్షులు గుడ్లు పెట్టి పిల్లలతోపాటే తిరిగి సైబీరియా వెళ్లిపోతాయని గ్రామస్థులు చెబుతున్నారు.
తమ తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయని, మధ్యలో రెండు మూడేళ్లు మాత్రమే రాలేదని, ఆ సమయంలో గ్రామంలో పంటలు పండక 'అరిష్టం' జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ జగన్ బీబీసీతో చెప్పారు. ఈ పక్షులు చింతపల్లికి అదృష్టాన్ని తెస్తాయని తాము నమ్ముతామన్నారు.
గతంలోనూ పక్షులను వేటాడేందుకు వేర్వేరు ప్రాంతాల వారు యత్నించేవారని, వారందరిని పట్టుకుని గ్రామం నుంచి వెళ్లగొట్టిన, కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

డిసెంబరు మూడో వారం లేదా నాలుగో వారంలో కొన్ని సైబీరియన్ కొంగలు చింతపల్లి వచ్చి గ్రామంలో వాతావరణ పరిస్థితులు, చెరువులు, చెట్లు చూసుకుంటాయని, నాలుగైదు రోజులు ఉండి వెళ్లిపోతాయని గ్రామస్థుడు కొట్టె తిరుపతి తెలిపారు. తర్వాత డిసెంబరు చివరి రోజులు మొదలుకొని సంక్రాంతి నాటికి దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు వస్తాయని వివరించారు.
ఒక గూడులో జంట పక్షులుంటాయని, గుడ్లు పెట్టి పిల్లలను చేసిన తర్వాత వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటే ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయని ఆయన చెప్పారు.

"నీళ్లు గొంతు వరకు నింపుకొని పిల్ల పక్షులకు అందించేందుకు మళ్లీ మొత్తం నీరు బయటకు తీసి ఇవ్వడం మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. అందరికీ అవి సైబీరియన్ కొంగలు, మాకు మాత్రం ఎర్రబోలు కొంగలే" అని ఆయన బీబీసీకి వివరించారు.
ఏడు నెలలు ఇక్కడే
ఎర్రబోలు కొంగలు ఆహారం కోసం ఊరికి 50 కిలోమీటర్ల దూరంలోపు ఉండే పాలేరు, వైరా, బయ్యారం, ములకలపల్లి చెరువులకు పోతాయని, అక్కణ్నుంచి చేపలు తెచ్చుకుంటాయని తిరుపతి వివరించారు.
చింతపల్లి చివర ఉండే చెరువు, పక్కఊళ్లలో ఉండే చెరువుల్లో వేసవిలో నీరు తక్కువగా ఉంటుందని, అందుకే జలాశయంగా వినియోగించే పాలేరు, వైరా చెరువులపై ఇవి ఆధారపడతాయని తెలిపారు.
ఈ కొంగలు సైబీరియాలో ఏడాదిలో ఐదు నెలలే ఉంటాయని, కానీ చింతపల్లిలో ఏడు నెలలు ఉంటాయని, అందుకే ఇవంటే తమకు ప్రత్యేక అభిమానమని ఆయన తెలిపారు.
అటవీశాఖ అధికారులు పట్టించుకున్నా లేకున్నా ఈ కొంగల రక్షణ తమ బాధ్యతని, అవి తమ బంధువులని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ పక్షుల రాక తమ గ్రామానికే ప్రత్యేకమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నీటి చుక్క కోసం అల్లాడిపోతున్న మన్యం.. చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల నడక
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
- క్రికెట్ వరల్డ్ కప్లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- శ్రీలంక పేలుళ్లు: ఆత్మాహుతి దాడుల వెనుక ‘ఫ్యామిలీ నెట్వర్క్’లు.. ‘ఇదో కొత్త తరహా తీవ్రవాదం’
- ‘పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నా మనం ఇంకా కళ్ళు తెరవడం లేదు’
- తల్లితండ్రుల వలసలు... దాడులకు బలవుతున్న పిల్లలు
- ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని మీరు చాలా రోజులు తింటారా?
- కోల్కతా: అమిత్ షా ర్యాలీలో ఘర్షణలు.. హింసకు పాల్పడిందెవరు
- మోదీ నిజంగానే మిరాజ్ విమానాలను మేఘాలతో పాక్ రాడార్ నుంచి కాపాడారా...
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









