‘పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నా మనం ఇంకా కళ్ళు తెరవడం లేదు’

ఫొటో సోర్స్, Getty Images
'పనిభారం ప్రాణాలు తీస్తోంది' అని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ పెఫ్ఫర్ అంటున్నారు. ఆయన చెబుతున్న మాటలు అతిశయోక్తి కాదు. ఆధునిక ఉద్యోగ జీవితంలో సుదీర్ఘ పనివేళలు, ఉద్యోగం-కుటుంబ జీవితాల మధ్య సంఘర్షణ, ఆర్థికపరమైన అభద్రత అన్నీ.. ఉద్యోగుల జీవితాలను మానసికంగా, శారీరకంగా ధ్వంసం చేస్తున్నాయని జెఫ్రీ చెబుతున్నారు.
ఈ అంశాలన్నింటినీ తన తాజా పుస్తకం 'డయ్యింగ్ ఫర్ ఎ పే ఛెక్'లో ప్రస్తావించారు.
సంస్థాగత సిద్ధాంతం, మానవ వనరుల నిర్వహణ అంశాల్లో ఇప్పటిదాకా ఆయన 15 పుస్తకాలు రాశారు. వీటిలో కొన్ని రచనలను ఇతరులతో కలిసి రచించారు. వర్తమాన కాలంలో ఈయన అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా చాలామంది అభివర్ణిస్తారు.
'అమానవీయం'
టోక్యోలో, ఆఫీసులో పని చేస్తూ, గుండెపోటుతో మరణించిన 42ఏళ్ల జపాన్ వ్యక్తి కెన్జీ హమాదా గురించి జెఫ్రీ ఈ తాజా పుస్తకంలో ప్రస్తావిస్తారు.
కెన్జీ ఇంటి నుంచి ఆఫీసుకు రావడానికి దాదాపు 2 గంటలు ప్రయాణించాలి. ఆయన పనిగంటలు వారానికి 75. ఆయన చనిపోవడానికి ముందు వరుసగా 40రోజులపాటు పని చేశారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నో జెఫ్రీ పుస్తకంలో ఉన్నాయి.
ఈ వైఖరిని ఆయన 'అమానవీయం' అంటారు. ఇలాంటి సంఘటనలు కేవలం జపాన్‌కు మాత్రమే పరిమితం కాలేదు.
జెఫ్రీ అధ్యయనం ప్రకారం, అమెరికా ఉద్యోగుల్లో 61% మంది, కుంగుబాటు తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని విశ్వసిస్తుంటే, 7% మంది మాత్రం ఉద్యోగానికి సంబంధించిన అంశాల వల్ల తాము ఆసుపత్రిపాలయ్యామని చెబుతున్నారు. ఉద్యోగం వల్ల కలిగే ఒత్తిడి కారణంగా అమెరికాలో ఏటా 1.2 లక్షల మంది చనిపోతున్నారని జెఫ్రీ అంచనా.

బీబీసీ స్పానిష్ సర్వీస్ 'బీబీసీ ముండో'తో జెఫ్రీ మాట్లాడారు. ఈ సందర్భంగా బీబీసీ ముండో వేసిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
బీబీసీ: ఉద్యోగ వ్యవస్థ విషపూరితం అవుతోందంటూ రాసిన మీ పుస్తకంలో ఆధునిక ఉద్యోగ జీవితం మనుషులపై ఎలా ప్రభావం చూపుతుంది అన్నదానికి మీ దగ్గర ఆధారాలేవైనా ఉన్నాయా?
జెఫ్రీ: పనిభారం.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందనడానికి ఆధారాలు ఉన్నాయి. సుదీర్ఘ పనివేళలు, పని భారం పెరగడం, ఉద్యోగులకు ఆరోగ్య భద్రత లేకపోవడం, ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఆర్థికపరమైన అభద్రత కూడా ఉద్యోగులను కమ్మేస్తుంది.
ఈమధ్యలో కుటుంబంలో గొడవలు, అనారోగ్యం. పని అన్నది అమానవీయంగా మారింది. ఒకవైపు.. ఉద్యోగులకు సంబంధించిన బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పుకుంటోంది. మరోవైపు, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ వల్ల ఉద్యోగుల్లో అభద్రతాభాం పెరుగుతోంది అన్నారు. ఇంకా ఈ విషయంపై సమగ్రంగా మాట్లాడుతూ...

ఫొటో సోర్స్, Getty Images
బాధ్యులుఎవరు?
1950-60 దశకాల్లో.. ఉద్యోగులకు, క్లైంట్స్‌కు(తమ ఉత్పత్తుల వినియోగదారులు), వాటాదారులకు మధ్య సమన్వయం అవసరమని యజమానులు భావించేవారు. కానీ ప్రస్తుతం యాజమాన్యం దృష్టి మొత్తం వాటాదారుల మీదే ఉంది.
ఉదాహరణకు పెట్టుబడులు పెట్టే కొన్ని బ్యాంకుల ఉద్యోగులు, కేవలం స్నానాలు చేయడానికి మాత్రమే ఇళ్లకు వెళుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి కదా.. ఆ స్నానాలు ముగించాక మళ్లీ ఆఫీసుకు పరుగు!
ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారు. అలసిపోయినపుడు నిద్రపోకుండా మెలకువగా ఉండటానికి కొకైన్‌తోపాటు మరికొన్నిరకాల డ్రగ్స్ తీసుకుంటున్నారు.
ఫ్యాక్టరీల్లో కార్మికులు, పైలట్స్, ట్రక్ డ్రైవర్లకు ఇక్కడ నిర్దిష్ట పనివేళలు ఉంటాయి. కానీ చాలా ఉద్యోగాల్లో పనివేళలకు హద్దు ఉండదు.
'ఉద్యోగం 5వ మరణకారకం'
మరణాలకు కారణాల్లో ఉద్యోగం ఐదవది అని ఆయన రాసిన పుస్తకంలో జెఫ్రీ అన్నారు. ఈ విషయం గురించి ప్రశ్నించినపుడు, ఐదవది కాదు.. అంతకు మించి కూడా కావొచ్చు అన్నారు.
యజమానులు, అంతా చూస్తూ ఏమీ చేయకుండా మౌనంగా ఉన్న ప్రభుత్వాలు ఇందుకు బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ నాయకులు ఏం చేయగలరు?
ఇందులో వారిదే కీలక పాత్ర. ఈ పరిస్థితిని ఆపడానికి మనం ఏదో ఒకటి చేయాలి. కానీ ఒక వ్యక్తిగా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఒక వ్యవస్థలో ఏదైనా మార్చాలనుకుంటే, వ్యవస్థీకృతమైన విధానం ఉండాలి. అది జరగాలంటే నియమాలు, నిబంధనలు రావాలి.
ఈ విషయాన్ని యాజమాన్యాలతో ప్రస్తావించినపుడు అందరూ వింటారు కానీ, ఎలాంటి ప్రయత్నం చేయరు. పని ఒత్తిడి వల్ల ఉద్యోగులకు డయాబెటిస్, గుండెజబ్బులు లాంటి దీర్ఘకాలిక రోగాలు వస్తున్నా, యాజమాన్యాలు మాత్రం స్పందించడం లేదు.
కార్మిక వ్యవస్థలో మార్పులు వస్తే, ఆ ప్రభావం కార్పొరేట్ లాభాలపై ఉంటుందని వ్యాపారులు భావించడంలో అర్థం లేదు. అది నిజం కాదు.
తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగులు రాజీనామా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగులలో మానసికంగా, శారీరకంగా ఉత్పాదక శక్తి తక్కువగా ఉంటుంది. ఉత్పాదకత తక్కువగా ఉన్నపుడు, ఆ ప్రభావం కంపెనీ లాభాలపై పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగులు ఏం చేయాలి?
ఉద్యోగులు తమ ఆరోగ్యం గురించి తామే బాధ్యత తీసుకోవాలి. ఉద్యోగ జీవితం, కుటుంబ జీవితాల మధ్య సమన్వయం కుదరని ఉద్యోగాలను వదిలేయాలి. కొందరు.. 'మేం ఉద్యోగాలను అంత సులభంగా వదల్లేం' అని సమాధానం ఇస్తారు. వారికి నేను ఒకటే చెబుతాను..
''పొగ కమ్ముకుని, ఊపిరాడని గదిలో మీరు చిక్కుకున్నపుడు మీరు వెంటనే ఆ గది నుంచి బయటపడాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.''
చట్టం, తమ హక్కుల గురించి ప్రజలు డిమాండ్ చేయాలి. కలిసికట్టుగా ముందుకు కదలాలి. లేకపోతే నష్టపోయేది మన సమాజమే! అని జెఫ్రీ అంటారు.
ఇవి కూడా చదవండి
- ‘బంగాళాదుంపలు’ పండించారని భారతీయ రైతులపై కోట్ల రూపాయల దావా వేసిన ‘లేస్’
- మే డే - కార్మికుల హక్కులు: నాడు అంబేడ్కరే లేకుంటే...
- ముఖంపై ముసుగు ధరించడం ఏయే దేశాల్లో నిషిద్ధం?
- యతి వాస్తవంగా ఉందా? హిమాలయాల్లో తిరుగుతోందా?
- సీసీఎంబీ పరిశోధన: బ్యాక్టీరియా అసలు పెరగకుండా, పెద్దవి కాకుండా అదుపుచేసే దిశగా ముందడుగు
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








