ఆర్కిటిక్ హిమపాతంలో ప్లాస్టిక్ రేణువులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రోజర్ హరాబిన్
- హోదా, బీబీసీ పర్యావరణ విశ్లేషకులు
ఆర్కిటిక్ ప్రాంతమంటే ప్రపంచంలో కాలుష్యం సోకని శుద్ధమైన నీరు, స్వచ్ఛమైన గాలి ఉంటుందనుకుంటాం. కానీ, అక్కడా మంచు కురుస్తుంటే అందులో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
ఆర్కిటిక్‌లో లీటరు నీటిలో 10,000కు పైగా ప్లాస్టిక్ రేణువులను గుర్తించగానే తాము షాక్‌కు గురయ్యామని శాస్త్రవేత్తలు చెప్పారు. అక్కడ పీల్చే గాలిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉండొచ్చని, అవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇంకా తెలియదని అంటున్నారు.
జర్మనీ, స్విట్జర్లాండ్‌కు చెందిన కొందరు అధ్యయనకర్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో తాము చేసిన పరిశోధనల ఫలితాలు 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
వీరి పరిశోధనలో ఆర్కిటిక్ హిమపాతంలో ప్లాస్టిక్ మాత్రమే కాదు రబ్బర్, ఫైబర్ రేణువులూ కనిపించాయి.

ఫొటో సోర్స్, Alfred-wegener-institute/mine tekman
అధ్యయనం సాగిందిలా..
అధ్యయనకర్తలు తొలుత స్వాల్‌బార్ట్ దీవి నుంచి మంచు శాంపిళ్లను సేకరించారు. జర్మనీలోని ఆల్‌ఫ్రెడ్ వెగెనెర్ ఇనిస్టిట్యూట్ ప్రయోగశాలలో వాటిని పరీక్షించారు. ఆ పరీక్షల్లో వారు ఊహించిన కంటే ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ రేణువులను వారు గుర్తించారు.
వీటిలో చాలా రేణువులు అత్యంత సూక్ష్మమైనవి కావడంతో అవి ఎక్కడి నుంచి వచ్చుంటాయన్నది అంచనా వేయడమూ కష్టమవుతోందని చెప్పారు.
మొక్కలకు చెందిన సెల్యులోజ్, అక్కడి జంతువుల ఉన్నితో పాటు వార్నిష్, రబ్బర్ టైర్లకు చెందిన అవశేషాలు, రంగులు, ఇతర సింథటిక్ ఫైబర్‌లూ గుర్తించారు.
అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ మెలానీ బర్గ్‌మన్ బీబీసీతో మాట్లాడుతూ.. ''ఇక్కడి నీరు, మంచు కలుషితమై ఉంటుందని మేం ఊహించినప్పటికీ ఈ స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్ బయటపడడం షాక్‌కు గురిచేసింది'' అన్నారు.
ఇక్కడి మంచులో గుర్తించిన ప్లాస్టిక్ రేణువులన్నీ గాలి ద్వారా చేరినవేనని ఆమె తెలిపారు. 5 మిల్లీ మీటర్ల కంటే తక్కువ పరిణామంలో ఉండే రేణువులను మైక్రో పార్టికల్స్ అంటారు.
''ఈ సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు మానవుల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయో లేదో చెప్పలేం. కానీ, పర్యావరణ కోణంలో చూస్తే జాగ్రత్తపడాల్సిన అవసరం కనిపిస్తోంది'' అన్నారామె.
జర్మనీ, స్విట్జర్లాండ్‌లలోని పలు ప్రాంతాల నుంచి తీసుకున్న మంచు శాంపిళ్లలో ఆర్కిటిక్‌లో సేకరించిన శాంపిళ్లలో కంటే కూడా ఎక్కువగా ఇలాంటి మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Alfred-wegener-institute/mine tekman
అసలు ఆర్కిటిక్‌లోకి ప్లాస్టిక్ ఎలా వచ్చింది?
ఆర్కిటిక్ ప్రాంత మంచులో గుర్తించిన ప్లాస్టిక్ కణాలు గాలి ద్వారా వచ్చి చేరినవేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్‌కు చెందిన కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. ఫ్రెంచ్ పైరినీస్‌లో ఆకాశం నుంచి ఇలాంటి మైక్రో ప్లాస్టిక్స్ పతనమవుతున్నాయి. కానీ, ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంలో అధ్యయనకర్తలకు స్పష్టత లేదు.
అంతేకాదు, ఇక్కడి మంచులో వార్నిష్ కనిపించడానికి కారణమేంటన్నది ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. మంచును చీల్చుకుంటూ సాగే ఓడల కారణంగా కొంతవరకు ఇలాంటి కలుషితాలు వచ్చి చేరుతున్నాయని భావిస్తున్నారు. విండ్ టర్బయిన్లు కూడా కారణం కావొచ్చంటున్నారు.
ఇక ఫైబర్ రేణువులు దుస్తుల నుంచి వచ్చి చేరుతున్నాయని అంచనా వేస్తున్నారు.
డాక్టర్ బర్గ్‌మన్ దీనిపై మాట్లాడుతూ.. ''వస్తువులను ప్యాక్ చేసేటప్పుడు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వాడడం అవసరమా? రంగులలో ఇంతగా పాలిమర్లను వినియోగించాలా? కారు టైర్లను వేరేగా తయారుచేసుకోలేమా? ఇవన్నీ పర్యావరణాన్ని కాపాడుకొనే క్రమంలో ఆలోచించాల్సిన అంశాలే'' అన్నారు.
నార్వేయియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎయిర్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ ఎల్బోర్గ్ సోఫీ.. ''ఈ కలుషితాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. ఐరోపా, ఆసియా, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వస్తున్నాయి. ఈ రసాయనాల్లో కొన్ని పర్యావరణానికి, జంతుజాలానికి చేటు చేస్తాయ'న్నారు.

ఫొటో సోర్స్, Alice trevail
ఆర్కిటిక్ ప్రాంత ప్రజలేమంటున్నారు?
కలుషితం కాని, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న ప్రాంతం భూమ్మీద ఏదైనా ఉందంటే అది ఆర్కిటిక్ ప్రాంతమే అనుకునేవారందరికీ ఇది నిరాశపరిచే విషయం.
నార్వేలోని ఆర్కిటిక్ సమీప ప్రాంతానికి చెందిన లిలీ.. ''ఇది చాలా బాధాకరమైన విషయం. సముద్రంలోని మంచులో ప్లాస్టిక్ వచ్చిచేరింది. సముద్ర తీరంలోనూ ప్లాస్టిక్ వచ్చేసింది. ఇప్పుడు ప్లాస్టికే మంచు'' అంటూ అక్కడి పరిస్థితులను వివరించారు.
ఇంతవరకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అనుభవించామని, ఇప్పుడు అంతా మారిపోతోందని, కలుషితమవుతోందని.. చాలా బాధగా ఉందని చెప్పారామె.
ఇవి కూడా చదవండి:
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్లోని ఫొటోల్లో నిజమెంత
- ఆపరేషన్ కమల్: కర్ణాటకలో ముగిసింది, తర్వాత టార్గెట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








