మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో త్రివిధ దళాల ముఖ్య అధికారిని నియమిస్తామన్నారు.... ఆ హోదా ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)ను నియమిస్తామని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఆధునిక కాలానికి తగ్గట్లుగా మార్పు దిశగా ఇదొక ముందడుగు అని అన్నారు. "త్రివిధ దళాలకు సమర్థవంతమైన పర్యవేక్షక నాయకత్వాన్ని అందించడంతో పాటు, రక్షణ సంస్కరణలను కూడా సీడీఎస్ ముందుకు తీసుకువెళ్తారు" అని ప్రధాని చెప్పారు.
సీడీఎస్ అంటే ఏంటి?
సైన్యం, నేవీ, వైమానిక దళాల అధిపతుల కంటే పై స్థానంలో ఉండే సీడీఎస్, ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ సైనిక సలహాదారుగా వ్యవహరించే అవకాశం ఉంది.
రక్షణ శాఖ కార్యదర్శిగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారే సీడీఎస్‌గా విధులు నిర్వహిస్తారా? లేక సీడీఎస్‌ను ప్రత్యేకంగా నియమిస్తారా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆ రెండు పోస్టులు వేర్వేరు అనేది అందుకు సమాధానం.
సీడీఎస్ నియామకం, విధులు, బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ, సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలలో ఏదైనా ఒక దళంలో పనిచేసిన సీనియర్ అధికారిని సీడీఎస్‌గా నియమించే అవకాశం ఉంటుంని పరిశీలకులు భావిస్తున్నారు.
అత్యున్నత స్థాయి పదవి అయినందున సీడీఎస్‌కు సైనిక వ్యవహారాలకు సంబంధించి ఎక్కువ సమాచారం అందుతుండొచ్చు. ఎందుకంటే, రక్షణ కార్యదర్శికి సైనిక వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉండదు.

మోడీ నిర్ణయం కొత్తదా?
గత ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై సమాలోచనలు జరిపాయి. కానీ, అవి ఆరంభంలోనే ఆగిపోయాయి.
వాస్తవానికి, సింగిల్ పాయింట్ మిలటరీ సలహాదారు పోస్టును సృష్టించడం అనేది కార్గిల్ అనంతర జరిగిన చర్చలలో ఒక భాగం.
సీడీఎస్ నియామకం గురించి మాజీ రక్షణ మంత్రిగా మనోహర్ పారికర్ ఉన్నప్పుడు కూడా సమాలోచనలు జరిపారు. ప్రధాని మోదీ ఆ విషయాన్ని పలు సందర్భాల్లోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తావించారు.
2015 డిసెంబర్‌లో కోచిలో నౌకాదళ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగించారు. "త్రివిధ దళాలకు అత్యున్నత స్థాయిలో ఉమ్మడి సలహాదారు నియామకం చాలాకాలంగా చర్చల్లో ఉంది. ఉమ్మడి సలహాదారుకు త్రివిధ దళాలలో పనిచేసిన అనుభవం ఉండాలి. ఉన్నతస్థాయి రక్షణ నాయకత్వంలోనూ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రతిపాదించిన అనేక రక్షణ సంస్కరణలను అమలు చేయలేదు. కానీ, నేను అధిక ప్రాధాన్యత ఇచ్చే అంశం ఇదే" అని అన్నారు.

ప్రస్తుతం సైన్యం, నౌకాదళం, వైమానిక దళం... దేని పరిధిలో అది స్వతంత్రంగా పనిచేస్తోంది. ఈ మూడు విభాగాల మధ్య సమన్వయానికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ప్రతి విభాగానికీ ప్రణాళికలు, వ్యూహాలు, కార్యాచరణను ఆయా విభాగాల ప్రధాన కార్యాలయాలు చూసుకుంటున్నాయి.
దేశ అణ్వాయుధాల నిర్వహణ బాధ్యతలు చూసే అండమాన్ & నికోబార్ కమాండ్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్‌సీ)లలో మూడు దళాలల్లోనూ వివిధ ర్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది ఉంటారు.
సీడీఎస్‌తో ఏం మార్పు వస్తుంది?
చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (సీఐఎస్‌సీ) హోదాలో పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చైట్ మాట్లాడుతూ, "ప్రస్తుతం ప్రతి దళమూ తన సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు నిధుల కోసం చూస్తోంది. సీడీఎస్ అంటే త్రివిధ దళాల ఉమ్మడి సామర్థ్యాన్ని పెంపొందించే ఒక యంత్రాంగం అన్నమాట. ఇంతకుముందు, ఎక్కడైనా త్రివిద దళాల బలగాలను రంగంలోకి దించాల్సి వస్తే, మూడు విభాగాలు దేనికి అదే సొంత వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకెళ్లేవి. ఇప్పుడు సీడీఎస్ నియామకం జరిగితే, మూడు దళాలకు ఉమ్మడిగా అత్యున్నత స్థాయి నాయకత్వం ఉంటుంది. దాంతో, త్రివిధ దళాలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే, తక్కువ వనరులతో మెరుగైన ఫలితం సాధించొచ్చు" అని వివరించారు.

ఫొటో సోర్స్, EPA
తర్వాత ఏంటి?
ప్రస్తుత త్రివిధ దళాల మాదిరిగానే సీడీఎస్‌కు కూడా ఫోర్ స్టార్ ర్యాంక్ ఉంటుందా? లేదా అంతకు మించి ఫైవ్ స్టార్ ర్యాంక్ హోదా ఉంటుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
"ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి తనకు నివేదించేలా సీడీఎస్ పోస్టు ఉండాలి. అత్యున్నత ర్యాంకులో ఉండాలి. ముఖ్యమైన అధికారుల నియామకాలను, సీనియర్ అధికారుల పనితీరును పర్యవేక్షించే హోదాలో ఉండాలి" అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని వైమానిక దళం మాజీ చీఫ్ ఒకరు చెప్పారు.
"సీడీఎస్‌కు 4 స్టార్ ర్యాంకు ఉంటుందా, 5 స్టార్ ర్యాంకు ఉంటుందా అన్నది ముఖ్యం కాదు" అని జనరల్ చైట్ అభిప్రాయపడ్డారు.
కార్గిల్ రివ్యూ కమిటీ చేసిన కీలక సిఫార్సుల్లో సీడీఎస్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఒకటి. ఆ సిఫార్సులను అమలు చేయకపోవడం పట్ల ఆ కమిటీలో సీనియర్ సైనికాధికారిగా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ కెకె హజారీ (రిటైర్డ్) అసంతృప్తి వ్యక్తం చేశారు.
"సీడీఎస్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రభుత్వం పట్టించుకోకుండానైనా ఉంటుంది. లేదా దేశ త్రివిధ దళాలను ఒకరి చేతిలో పెట్టడం పట్ల ఆందోళన చెంది ఉంటుంది. కానీ, ఈ రెండు అంచనాలూ సరికావు" అని హజారీ అన్నారు.
ఇవి కూడా చదవండి.
- ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను నియమిస్తాం’
- ఏక్తాయాత్రతో 1992లో కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో ఎగిరిన భారత జెండా.. అప్పడు నరేంద్ర మోదీ పాత్ర ఏంటి
- ఆంధ్రప్రదేశ్‌లోని పాత ఫొటోతో కశ్మీర్లో మహిళలపై పోలీసుల దాడి అంటూ ప్రచారం
- కశ్మీర్లో ఆ 5 రోజుల్లో ఏమేం జరిగాయి
- కశ్మీరీ యువతి డైరీలో ఆ అయిదు రోజులు
- విజయవాడ గోశాలలో ఆవుల మృతి పట్ల ఎవరేమంటున్నారు?
- 'అమెజాన్ చాయిస్' లేబుల్ ఎలా ఇస్తారు?'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








