కశ్మీర్‌లో ఆ 5 రోజుల్లో ఏమేం జరిగాయి

ఫొటో సోర్స్, Kavita Krishnan
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
కెమెరామెన్లు, జర్నలిస్టులు, పౌరహక్కుల సంఘాల కార్యకర్తలతో దిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నిండిపోయి ఉంది.
కశ్మీర్ లోయలో ఐదు రోజులు గడిపి తిరిగొచ్చిన ఆర్థికవేత్త జ్యాన్ డ్రెజ్, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్‌కు చెందిన విమల్ భాయి, సీపీఐ(ఎంఎల్) నుంచి కవితా కృష్ణన్, ఐద్వా నుంచి మైమూనా మొల్లా అక్కడ ఏం చెబుతారో వినాలని వారంతా చూస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దు, జమ్ము-కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలని కేంద్ర నిర్ణయించిన తర్వాత ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13 వరకూ శ్రీనగర్, సోపోర్, బాందీపురా, పంపోర్, షోపియా, అనంతనాగ్ జిల్లాల్లో తిరిగివచ్చిన వీరు అక్కడి పరిస్థితుల గురించి ఫొటోలు, వీడియోలు చూపిస్తామని చెప్పారు.
కానీ మీడియా సమావేశం ప్రారంభించడానికి ముందు హఠాత్తుగా అవన్నీ చూపించలేమని వారు చెప్పారు. "మీరు అవన్నీ చూపించడానికి ప్రొజెక్టర్ ఉపయోగించకూడదని, ఎందుకంటే మాపై చాలా ఒత్తిడి ఉందని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా మాతో చెప్పింది" అని కవితా కృష్ణన్ చెప్పారు.
అయితే నేను ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరిని దాని గురించి అడిగినపుడు ఆయన ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. వాళ్లు వీడియోలు, ఫొటోలు చూపించడానికి మా వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
కానీ మైమూనా మొల్లా మాత్రం "ప్రెస్ క్లబ్ స్పష్టంగా ఎలాంటి కారణం చెప్పలేదు. కానీ తమపై కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయని, అందుకే ఇక్కడ ఏవీ చూపించలేమని అన్నట్లు" చెప్పారు.

ఫొటో సోర్స్, Vimal Bhai
వారు అక్కడ చూపించలేకపోయిన ఫొటోలు, వీడియోలను మీడియా సమావేశం తర్వాత ఈమెయిల్ ద్వారా జర్నలిస్టులతో పంచుకున్నారు.
మీడియా సెన్సార్ షిప్ గురించి మాట్లాడిన జ్యాన్ డ్రెజ్ కశ్మీర్ నుంచి ఏ వార్తలు చూపించాలి అనేదానిపై ప్రస్తుతం ప్రభుత్వం ఒత్తిడి ఉందన్నారు. మీడియా ఒక వైపే చూపిస్తోందని అన్నారు.
"స్థానిక కశ్మీరీ మీడియా పనిచేయలేకపోతోంది. వారిపై ఒత్తిడి ఉంది, సమాచారం సేకరించే దారులు కూడా లేవు. జాతీయ స్థాయి మీడియా చాలావరకూ తమ పనిని నిష్పక్షపాతంగా చేయడం లేదు. కేవలం న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్, బీబీసీ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పనిచేసే భారతీయులు మాత్రమే కశ్మీర్ అంతటా తిరిగి రిపోర్టులు సేకరించగలుగుతున్నారు. వాటిని ప్రసారం చేస్తున్నారు" అని చెప్పారు.
డ్రెజ్ వివరాల ప్రకారం స్థానిక వార్తాపత్రికల్లో ముద్రించడానికి ధ్రువీకరించిన వార్తలు లేవు.
కవితా కృష్ణన్ తీసిన ఫొటోల్లో.. కశ్మీరీ వార్తాపత్రికల్లో కొన్ని పేజీల్లో కేవలం పెళ్లిళ్లు రద్దు చేసుకున్నామనే ప్రకటనలతో నిండిపోయి ఉండడం కనిపిస్తోంది.
మైమూనా కూడా అదే చెప్పారు. "వారి వద్ద వార్తాపత్రికల ముద్రణకు అవసరమైన న్యూస్‌ప్రింట్ అయిపోతోంది. దిల్లీ నుంచి దానిని తెప్పించే సౌకర్యాలు లేవు" అన్నారు.

ఫొటో సోర్స్, Vimal Bhai
హింస జరిగిందనే వాదన
వారు మీడియాతో షేర్ చేసుకున్న ఫొటోల్లో పెలెట్ గన్స్ వల్ల దారుణంగా గాయపడిన ఒక వ్యక్తి ఫొటో ఉంది. దీనిపై జ్యాన్ డ్రెజ్ "మేం శ్రీనగర్ ఆస్పత్రిలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇద్దరిని కలిశాం. కానీ శుక్రవారం, ఆగస్టు 10న సౌరాలో పెద్ద నిరసన ప్రదర్శన జరిగిందని, అందులో జనం గాయపడ్డారని మాకు తెలుసు. కానీ మమ్మల్ని అక్కడకు వెళ్లనివ్వలేదు" అన్నారు.
ఆయన వివరాల ప్రకారం పెద్ద రాజకీయ నేతలతోపాటు, పార్టీ కార్యకర్తలు, పౌరహక్కుల కార్యకర్తలు, వకీళ్లు, వ్యాపారులు, ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, లేదా ప్రజలపై ప్రభావం చూపించగలరు అనుకున్న వారినందరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Kavita Krishnan
ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఏ చట్టం ప్రకారం వారిని కస్టడీలోకి తీసుకున్నారు అనేదానిపై వారి దగ్గర ఎలాంటి వివరాలూ లేవు.
శ్రీనగర్, దాని చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల ప్రజలు చాలా షాక్‌లో ఉన్నారని డ్రెజ్ చెప్పారు. తమ గుర్తింపు బయటపెట్టద్దనే షరతుతో వాళ్లు ఆయనతో మాట్లాడారు.
జమ్ము కశ్మీర్ పోలీసులు ఈరోజు శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ గత కొన్నిరోజులుగా పెల్లెట్ల వల్ల కొంతమంది గాయపడ్డట్లు చెప్పారు. వారికి చికిత్స అందించిన తర్వాత ఇంటికి పంపించామన్నారు.

ఫొటో సోర్స్, Kavita Krishnan
ఈద్ కర్ఫ్యూ
శ్రీనగర్ సహా చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది.
అధికారికంగా కర్ఫ్యూ లేకపోయినా, ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితే ఉందని మైమూనా మొల్లా చెప్పారు.
"మాకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా మమ్మల్ని భద్రతాదళాలు కర్ఫ్యూ పాస్ అడిగేవారు. కర్ఫ్యూ అధికారికంగా అమలులో లేదు. అందుకే అలాంటి పాస్ ఏదీ జారీ చేయలేదు. దాంతో, ముళ్ల కంచెలు, బ్యారికేడ్లతో మూసేసిన దారులను దాటలేకపోయాం" అన్నారు.

ఫొటో సోర్స్, Vimal Bhai
"ఈద్ రోజు కూడా ప్రత్యేకంగా కర్ఫ్యూ సడలింపు ఏదీ జరగలేదని, ఈద్ నమాజు మసీదుకు వెళ్లకుండా ఇంటి ఆవరణలోనే చేయాల్సి వచ్చిందని స్థానికులు ఫిర్యాదు చేశారని" వారు తమ రిపోర్టులో చెప్పారు.
ఈ టీమ్ లద్దాఖ్, జమ్మూ ప్రాంతాలకు వెళ్లలేదు. కానీ కశ్మీర్ లోయలో సెక్షన్ 370 రద్దుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ప్రభుత్వ వాదన తప్పని చెప్పారు.
"నేను చాలా మందిని కలిశా, కానీ ఒక్క బీజేపీ ప్రతినిధి మాత్రమే ఈ నిర్ణయంపై సంతోషంగా ఉన్నట్లు చెప్పారు" అని కవితా కృష్ణన్ అన్నారు.
స్థానికులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ అప్పుడప్పుడూ 'నాశనం, తుపాకుల దురాగతం, మోసం, శ్మశానం, వంచన' లాంటి అరుపులు వినిపించాయి.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: "రేపు నా కొడుకు తుపాకీ పడతాడు, భారత్‌పై పోరాడతాడు" - కశ్మీరీ యువకుడి ఆగ్రహం
- మోదీ ప్రసంగం: 'పాకిస్తాన్ ఆటలు ఇక సాగవు... జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే ఎన్నికలు'
- కేరళ వరదలు: తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలర్ట్.. ‘నలభై ఏళ్ల తర్వాత ఇంత విధ్వంసం చూస్తున్నాం’
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్‌పై సాధించిన పురోగతిని 30 ఏళ్లు వెనక్కినెట్టారు’
- ఆర్టికల్ 370: జమ్మూకశ్మీర్ అయిదు రోజుల కర్ఫ్యూ తరువాత ఎలా ఉంది...
- గోదావరి వరదలు: 12 రోజులుగా వరద ముంపులో ‘రామ్ చరణ్ రంగస్థలం’ గ్రామం
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- తెలంగాణ సచివాలయం తరలింపు ప్రారంభం.. కొత్త సచివాలయం వచ్చే వరకూ బీఆర్కే భవన్‌లోనే ఉద్యోగులు
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








