తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాష్ట్రపతి కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images
పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాలపై నివేదిక సమర్పించాలని రాష్ట్రపతి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
"ఫలితాల్లో దొర్లిన తప్పిదాలు, అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న 27మంది తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సహా మరికొందరు దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం... దీనిపై తక్షణం వాస్తవాలతో కూడిన నివేదికను అందచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం" అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో లోపాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై అనేక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇంటర్ బోర్డు వ్యవహారశైలిపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి.
ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు వైఫల్యం చెందిందంటూ బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరడంపై బాలల హక్కుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
ఇప్పటికైనా బోర్డు తమ తప్పిదాలను అంగీకరించి, ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని వారి తరపున పోరాడుతున్న అచ్యుత రావు డిమాండ్ చేశారు.
ఈ అంశంపై తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల స్పందన కోసం ఫోన్‌లో ప్రయత్నించగా, వారు స్పందించలేదు.

అసలేం జరిగింది?
ఏప్రిల్ నెలలో విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తప్పులు దొర్లాయని ఇంటర్ బోర్డు అధికారులే అంగీకరించారు.
"ఫలితాలు వెల్లడించడంలో తప్పులు దొర్లాయి. సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉండడంతో సమస్యలు వచ్చాయి. ఓఎంఆర్ షీట్ల బబ్లింగ్ సరిగా జరగలేదు. కొందరికి ప్రాక్టికల్ మార్కులు నమోదు కాలేదు. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాల్లో మార్పు వల్ల కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయి. జంబ్లింగ్‌లో కూడా కొన్ని తప్పులు జరిగాయి. సాఫ్ట్‌వేర్ లోపంతో కోడింగ్, డీకోడింగ్‌లో కొంత సమస్య తలెత్తింది. బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం" అని అప్పట్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
ఫెయిలైన వారందరికీ ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్... ఇంటర్మీడియట్‌లో ఫెయిలయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, కాబట్టి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు.

కానీ, ఈ ఫలితాలను చూసి నిరాశ చెందిన కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఇంటర్మీడియెట్ బోర్డు ముందు నిరసనలకు దిగారు.
ఇవి కూడా చదవండి.
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు: ‘‘సాఫ్ట్‌వేర్‌లో లోపాలు.. కోడింగ్, డీకోడింగ్‌లో సమస్యలు’’
- ‘ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు దేనికి?’.. ఈ ప్రశ్నకు కారణాలేంటి?
- ఆర్టికల్ 370 రద్దు: అరెస్టుకు ముందు షా పైజల్ ఏమన్నారు
- రాజస్తాన్ మూక హత్య కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
- కశ్మీరీ యువతి డైరీలో ఆ అయిదు రోజులు
- విజయవాడ గోశాలలో ఆవుల మృతి పట్ల ఎవరేమంటున్నారు?
- 'అమెజాన్ చాయిస్' లేబుల్ ఎలా ఇస్తారు?'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








