'అమెజాన్ చాయిస్' లేబుల్ ఎలా ఇస్తారు? ఆ ఉత్పత్తులను ఎప్పుడైనా పరిశీలించారా? - ఈకామర్స్ సంస్థకు అమెరికా సెనేటర్ల లేఖ

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా దిగ్గజ వ్యాపార సంస్థ 'అమెజాన్' ఆన్‌లైన్ స్టోర్లో కొన్ని ఉత్పత్తులకు 'అమెజాన్ చాయిస్' అనే లేబుల్ ఎలా వస్తుంది? ఈ లేబుల్ ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటి? ఇద్దరు అమెరికా సెనేటర్లు ఈ ప్రశ్నలు అడుగుతూ అమెజాన్‌కు లేఖ రాశారు. వీటికి సమాధానాలు ఇవ్వాలని చెప్పారు.
ఏయే ఉత్పత్తులకు 'అమెజాన్ చాయిస్' లేబుల్ ఇవ్వాలనేది సంస్థ సిబ్బంది నిర్ణయిస్తున్నారా, లేక అల్గారిథమ్‌లు నిర్ణయిస్తున్నాయా అని సెనేటర్లు సంస్థను అడిగారు.
నకిలీ సమీక్షల(ఫేక్ రివ్యూస్)తో ఏకంగా అమెజాన్ చాయిస్ కేటగిరీనే ఏమార్చే ఆస్కారముందని, ఫలితంగా వినియోగదారులు తప్పుదోవ పట్టొచ్చని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
అమెజాన్ చాయిస్ కేటగిరీలోని చాలా ఉత్పత్తుల నాణ్యత బాగోలేదని, నకిలీ సమీక్షలతో వాటికి ఎక్కువ రేటింగ్ ఇస్తున్నారని తమ పరిశోధనలో వెల్లడైందని వార్తాసంస్థ 'బజ్‌ఫీడ్' వెల్లడించింది. ఈ వార్త వచ్చిన తర్వాత సెనేటర్లు అమెజాన్‌కు లేఖ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెజాన్ చాయిస్ లేబుల్ ఉన్న ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని అధ్యయనంలో తేలింది.
అమెజాన్ చాయిస్ లేబుల్ పొందే ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు 300 శాతం పెరుగుతున్నట్ల 'ఓసీ&సీ స్ట్రాటజీ కన్సల్టంట్స్' తెలిపింది.
వినియోగదారుడు ముందెన్నడూ కొనని విభాగంలో 'అమెజాన్ ఎకో' స్పీకర్ ద్వారా వస్తువును కొంటుంటే, అతడికి చాయిస్ లేబుల్ ఉన్న ఉత్పత్తులు వస్తాయి. ఈ లేబుల్ ఉన్న అమ్మకాలు అధికంగా ఉండటానికి ఇది ఒక కారణం.
'చాయిస్' లేబుల్ ఏకపక్షంగా లేదా మోసపూరిత సమీక్షల ప్రాతిపదికగా ఇస్తుండటంపై తమకు ఆందోళన ఉందని డెమొక్రటిక్ పార్టీ సెనేటర్లు బాబ్ మెనెండెజ్, రిచర్డ్ బ్లూమెంథల్ తమ లేఖలో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ లేబుల్ గురించి అమెజాన్ పారదర్శకత పాటించకపోవడం వల్ల వస్తువును కొనే ముందు వినియోగదారులు పూర్తి సమాచారం తెలుసుకోలేకపోతున్నారని వారు తెలిపారు.
చాయిస్ లేబుల్ ఇచ్చే ప్రక్రియను, ఈ లేబుల్ ఉన్న ఉత్పత్తుల నాణ్యతను అమెజాన్ సిబ్బంది ఎప్పుడైనా పరిశీలించారో, లేదో వెల్లడించాలని సెనేటర్లు కోరారు. తమ లేఖకు సెప్టెంబరు 16లోగా సమాధానమివ్వాలని వారు సూచించారు.
అమెజాన్ నుంచి అన్ని వివరాలతో సమాధానాలు కావాలని బజ్‌ఫీడ్‌తో మెనెండెజ్ చెప్పారు. తమ లేఖతో చాయిస్ లేబుల్ జారీలో ఆ సంస్థ అవసరమైన మార్పులు చేపట్టవచ్చన్నారు. అమెజాన్ అలా చేయకపోతే ఏదైనా ఫెడరల్ నియంత్రణ సంస్థ ద్వారా లేదా చట్టం ద్వారా అమెజాన్ చర్య చేపట్టేలా చేస్తామని తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
అమెజాన్ ఏమంటోంది?
నిజమైన సమీక్షలు, కచ్చితత్వంతో కూడిన సమీక్షలే ఉండేలా చూసేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామని అమెజాన్ తెలిపింది.
నకిలీ సమీక్షలను గుర్తించి, తొలగించేందుకు సిబ్బందిని, ఆటోమేటిక్ సాధనాలను వాడతామని సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. నకిలీ సమీక్షలను అడ్డుకొనేందుకు సోషల్ మీడియా సైట్లతో కలిసి పనిచేశామని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకొన్నామని తెలిపారు.
తామెంతో కష్టపడి, నిజమైన వినియోగదారులు రాసిన కచ్చితమైన సమీక్షలతో వినియోగదారులకు, వస్తు విక్రేతలకు మంచి షాపింగ్ అనుభూతి కలిగేలా చూస్తున్నామని చెప్పారు. మోసపూరిత సమీక్షలు రాయాలనే అభ్యర్థనలు ఎవరి నుంచైనా వస్తే కస్టమర్ సర్వీస్‌కు తెలియజేయాలని వినియోగదారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి:
- 'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'
- పని చేయాలంటే విసుగొస్తోందా? పరిష్కారాలేమిటి?
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








