ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?

ఫొటో సోర్స్, Telangana Intermediate board
- రచయిత, జి ఎస్ రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నిర్వాకం పిల్లల ఉసురు తీసింది. అది బోర్డులో జరిగిన తప్పిదాల పరిధిని దాటి మొత్తంగా విద్యావ్యవస్థ తీరుతెన్నులపై చర్చకు దారితీసింది. ఏం జరిగిందన్నది మనందరి ముందూ స్పష్టంగానే ఉంది.
తొలిదశలోనే పొరబాటును ఒప్పుకుని సరిచేస్తామని భరోసా ఇవ్వలేదు. దాని బదులు పెద్దలు బుకాయింపులకు దిగారు. సంక్షోభం ముదిరాక స్వరం మార్చారు.
బోర్డు కార్యదర్శి తప్పు ఒప్పుకుని కమిటీ వేశాక కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి అస్సలేమీ జరగలేదని చెప్తూ వచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక సమస్య తలెత్తినపుడు ఎట్లా వ్యవహరించకూడదు అనేదానికి క్లాసిక్ నమూనాగా ఇక్కడ యంత్రాగం వ్యవహరించిన తీరును చెప్పుకోవచ్చు.
దాని మూల్యం అనామిక లాంటి 22 ప్రాణాలు. క్లరికల్ తప్పులా, నిర్లక్ష్యమా, లేక గ్లోబరీనా తప్పులా అనేది విచారణ కమిటీలో తేలొచ్చు. బోర్డు కానీ ప్రభుత్వం కానీ స్పందించిన తీరు సజావుగా లేదు.

యంత్రాంగం నిర్లక్ష్యం
మంత్రి చెప్పినట్టు ఫలితాలు వెల్లడైన ప్రతి సందర్భంలోనూ కొన్ని ఆత్మహత్యల ఘటనలు ఉంటే ఉండొచ్చును. మంత్రి అన్నింటినీ నేరుగా పర్యవేక్షించకపోవచ్చు. కానీ బాధ్యతనుంచైతే తప్పుకోకూడదు కదా! తాను పడ్డ కష్టానికి చదివిన చదువుకు న్యాయమైన ప్రతిఫలం రాలేదని ఇంకెవరో చేసిన తప్పు వల్ల తనకు అన్యాయం జరిగిందనే బాధ, నిస్సహాయత కలగలిసినపుడు దాని తీవ్రత ప్రమాదకరంగా ఉంటుంది.
ముఖ్యంగా నేటి పోటీ విద్యావిధానంలో విద్యార్థులపై ఆ ఒత్తిడి ప్రాణాంతకంగా ఉంటుంది. అలాంటి అనుమానాలు తలెత్తిన సందర్భాల్లో ఎవ్వరికీ అన్యాయం జరగదు, మేమున్నాం, పొరబాట్లు సరిదిద్దుతాం అనే భరోసా గట్టిగా యంత్రాంగం వైపు నుంచి వెంటనే వస్తే కొంత ఉపశమనం ఉంటుంది.
99 మార్కులొచ్చే విద్యార్థికి ఈసారి 0 వచ్చింది అనేది బయటపడినప్పుడైనా పొరబాటు తెలుసుకుని స్పందిస్తే బాగుండేది. అలాంటి ఉదాహరణలు ఇతర విద్యార్థులందరిలోనూ అనుమానాలకు గందరగోళాలకు తావిస్తుంది.
తెలీని శక్తులేవో తమను దెబ్బకొట్టాయన్న నిస్సహాయత చిన్ని మనసులను కుంగదీస్తాయి. ఒత్తిడి వాతావరణం ప్రమాదకరంగా పరిణమిస్తుంది. నిస్సహాయత ప్రమాదరకమైనది, రైతుకైనా, చేనేత కార్మికుడికైనా, విద్యార్థికైనా కూడా. ఎవ్వరూ నిస్సహాయులు కారు, వారి బాధలు వినేందుకు పరిష్కారాలు చూపేందుకు యంత్రాగంలో వెసులుబాటు ఉంది అనే భరోసా ఉండాలి. అదిక్కడ మిస్ అయ్యింది. యంత్రాంగం చాలా ఆలస్యంగా మేల్కొన్నది.
తీవ్రమైన సంక్షోభం నెలకొన్నపుడు మనుష్యులు ఎమోషనల్గా స్పందిస్తారు. మార్కులు ముఖ్యం కావని, పోటీ విద్యావిధానం నశించాలని , కార్పోరేట్ విద్యామాఫియాపై చర్యలు తీసుకోవాలని చాలా రాడికల్‌గా మాట్లాడతారు. తర్వాత మళ్లీ మామూలే. తర్వాత అని కూడా ఎందుకనాలి. ఈ మృత్యువాసన ఇంకా మనల్ని ఆవరించి ఉండగానే పత్రికల్లో పోటీ పరీక్షల స్పెషలిస్టు కళాశాలల ప్రకటనలు ఎప్పట్లాగే వచ్చాయి.
పోటీ విద్యావ్యవస్థ అంతా నష్టమే చేస్తే వాటిపై అంత వ్యతిరేకతే ఉంటే ఇంతమంది తల్లిదండ్రులు ఇంకా తమ పిల్లలను వాటిలో చదివించరు. అవి ప్రయోజనకరమే అయితే ప్రతియేటా ఆ కళాశాలల్లో ఇంతమంది పిల్లల ఆత్మహత్యలుండవు. సమస్య పైకి కనిపిస్తున్నదానికంటే సంక్లిష్టమైనది.

ఫొటో సోర్స్, Getty Images
బాల్యం నుంచే కెరీర్ భారం
30 ఏళ్ల క్రితం.. అంటే స్కూల్ విద్య ప్రధానంగా ప్రభుత్వ బడులలోనే సాగుతున్న కాలంలో మీ పిల్లాడేం చదువుతున్నారు అంటే గ్రామాల్లోని కొందరు తల్లిదండ్రులు దిక్కులు చూడడమో..లేదంటే ‘చెప్పరా ఏం చదువుతున్నావో’ అని పిల్లాడి వంక చూడ్డమో ఉండేది.
ఇవాళ ఈ పూట ఏం హోంవర్క్ చేశారో చేయలేదో కూడా తల్లిదండ్రుల ఆజమాయిషీలో సాగుతున్నది. ఓ వైపు అంతులేని ప్రేమ మరోవైపు అంతులేని ఒత్తిడి. గ్రామీణ సమాజం పట్టణ సమాజంగా మారుతున్న వేళ, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు చిన్న సన్న జీవుల్లో ఆశను లేపాయి. అంతవరకూ పెద్ద పెద్ద కలలు కనలేని వారు, యంత్రాంగంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో వనరుల్లో తమ వాటాపైన నమ్మకం అంతగా లేనివారు చిన్నచిన్న చదువులతో చిన్న చిన్న పనులతో ఉద్యోగాలతో సరిపెట్టుకునే వారు. పేదలనుంచి కింది కులాలనుంచి పైకెదిగిన వారున్నప్పటికీ ఇప్పటివేగంతో పోలిస్తే స్వల్పం. కొత్త వ్యవస్థ చదువు పై మెట్టుకు చేరుకోవడానికి ప్రధాన ఆయుధంగా ఉపకరించగలదననే నమ్మకాన్ని పెంచింది. విద్యపైన మొత్తంగానే కేంద్రీకరణ పెరిగింది. అది అవసరమైన మార్పు. తర్వాత్తర్వాత చుట్టుపక్కల కుటుంబాల్లో వస్తున్న మార్పుల ప్రోత్సాహంతో పిల్లల చదువులపై తల్లిదండ్రుల ఫోకస్ అన్నీ తాకట్టు పెట్టైనా సరే చదివించాలి అనేంతగా పెరిగిపోయింది. మార్కులు పరమార్థంగా మారాక ర్యాంకులు- దానితో ముడిపడిన కెరీర్ ఆదర్శపు నమూనాగా మారాక చదువు ఖరీదైపోయింది. చదువు తప్ప వేరే ఆస్థి లేదనుకునే వారి బతుకు భారమైపోయింది. ఇది వినాశకరమైన మార్పు.
కాకపోతే గతంలో కనీసం ఇంటర్మీడియెట్ వరకు చదువు వ్యక్తిత్వం రూపొందడంలో భాగంగా తన అభినివేశం ఎందులో ఉందో తెలుసుకునే ప్రక్రియలో భాగంగా ఉండేది. కేవలం డిగ్రీ తర్వాతనే కెరీర్ గురించిన ఆలోచన ఉండేది, విద్యార్థికైనా తల్లిదండ్రులకైనా. ఇవ్వాళ అలా కాదు. స్కూల్ దశ నుంచే కెరీర్తో లింక్ మొదలైంది. కెరీర్ కోసం చదవడం అనేది స్కూల్ దశనుంచే మొదలుకావడం విద్యార్థి జీవితాల్లో ముఖ్యమైన మార్పు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులో నిరంతరం మార్కుల గురించిన ఆలోచన ఓ వైపు గాడ్జెట్స్ ఇతరత్రా ఆకర్షణ మరోవైపు రెంటి మధ్యా నలుగుతూ గడపాల్సిన పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. ప్రతిదానికి పక్కింటి పాపతోనే ఎదురింటి పిల్లాడితోనో పోలిక. ఈ పరిస్థితికి ఏ ఒక్కర్నో ఏ ఒక్క ఇన్ స్టిట్యూషన్నో బాధ్యురాల్ని చేయలేము.
మార్కెట్ పోటీలో తిలాపాపం తలా పిడికెడు. విద్య కెరీర్‌కు పర్యాయపదంగా మారిపోయాక మార్కులు పరమ ప్రమాణాలు గా మారాక దాని ప్రతిఫలనం అన్నివైపులా ఉంటుంది. పరుగుపందెంలో తల్లిదండ్రుల తిప్పలు తల్లిదండ్రులవి. మార్కెట్ పోటీలో తమదే మెరుగైన దుకాణం అని చాటుకునే కార్పోరేట్ల వ్యూహాలు కార్పోరేట్ వారివి.

రవి ట్యుటోరియెల్‌తో మొదలు
సివిన్ ధన్ ఆరంభించిన రవి ట్యుటోరియల్ ను తెలుగునాట కార్పోరేట్ విద్యా శకానికి పునాదిగా భావిస్తారు. అంతకుముందే తెనాలి పక్కన ఉన్న చిలుమూరు లోని శ్రీరామ్ రూరల్ కాలేజీ వంటివి కొన్ని ఉన్నప్పటికీ అవి పాత గురుకుల విద్యావిధానాన్ని నమూనాగా తీసుకున్నవి. కార్పోరేట్ టైపు కాదు. కార్పోరేట్ శైలిలో టీచర్లను ఎక్కడెక్కడినుంచో రప్పించి షార్ట్ టర్మ్ కోచింగులు సమ్మర్ కోచింగులు అంటూ ప్రాచుర్యం పొందింది మాత్రం రవిట్యుటోరియల్స్. దాని తర్వాత 80ల్లో మొదలైన విజ్ఞాన్ రత్తయ్య రెసిడెన్షియల్ స్కూల్ ప్రైవేట్ రెసిడెన్షియల్ విధానాన్ని మార్గంగా ఏర్పరచింది. కార్పోరేట్ కాలేజీలు ఆరంభించిన చాలామందికి అది గురుకులం లాంటిది. దానికి ముందు ప్రభుత్వమే ఏకంగా 1970ల్లో గురుకుల పాఠశాలలను గుంటూరులోని తాటికొండలోనూ, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని నాగార్జునసాగర్లోనూ ఆరంభించి ఉంది.
80ల్లో కేంద్రమే దేశవ్యాప్తంగా నవోదయ రెసిడెన్షియల్ స్కూళ్లను ఆరంభించింది. 1990ల దాకా వాటికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గ్రామాల్లోని మెరిట్ విద్యార్థులందరినీ అవి ఊరిస్తూ ఉండేవి. వాటికి డిమాండ్ విపరీతంగా ఉండేది. ప్రమాణాలు కూడా అలాగే ఉండేవి. అదే బాటలో అభ్యుదయ భావాలున్న వారు కూడా విశాలమైన ప్రాంగణాల్లో పొలాల్లో పంటల మధ్య స్కూళ్లు నడపడం అనేది కూడా కోస్తాలో ఒక ట్రెండ్గా సాగింది. అది ఇవాళ కిక్కిరిసిన కోళ్ల ఫారాల్లాంటి స్కూళ్ల రూట్ తీసుకున్నది. వీటన్నింటికి మూలం హరిత విప్లవంలో ఉంది. హరిత విప్లవం ఫలితంగా అంటే ప్రభుత్వం కొన్ని ప్రాంతాల మీద కేంద్రీకరించి కెనాల్ ఇరిగేషన్ సిస్టమ్స్ మీద, ఇతర అనుబంధ సదుపాయాల మీద పెట్టుబడులు పెట్టిన ఫలితంగా కోస్తాలో 1970ల్లో అదనపు ఉత్పత్తి పెరిగింది. అది పెట్టుబడిగా మారి సినిమాల్లోకి మీడియాలోకి విద్య వైద్య వ్యాపారంలోకి మెల్లగా విస్తరించింది. వాటిని ఆరంభించిన వారిలో కొందరికి లేదా ఆ కుటుంబాల్లో కొందరికి అప్పట్లో పురోగామి లేదా వామపక్ష భావాలు ఉండడం వల్ల చాలా చాలా విద్యా సంస్థలకు బౌద్ధానికి సంబంధించిన పేర్లు రకరకాల రూపాల్లో దర్శనమిస్తాయి. కోస్తాలో అభ్యుదయం మార్కెట్ తేడా తెలీనంతగా కలగలిసి పోయి కనిపిస్తాయి. మార్కెట్ పోటీలో రకరకాల రూపాలెత్తి విద్యా వ్యాపార సంస్థలు నేడు మనం చూస్తున్న దశకు చేరుకున్నాయి. ప్రాక్టికల్స్ కు వచ్చే అధ్యాపకులకు బహుమతులిచ్చి సెంట్ పర్సెంట్ ఫలితాలు వచ్చేట్టు చూడడం, ప్రశ్నాపత్రాలు ముందే వచ్చే ఏర్పాటు చేసుకోవడం వంటి విద్యలు చాలా కాలంగా సాగుతున్నవి. అలాంటి పోకడలు కాలక్రమేణా మరీ వికృతంగా కూడా తయారయ్యాయి.
వికృతత్వాన్ని పక్కనపెడితే పోటీ వాతావరణం వల్ల తెలుగు విద్యార్థులు దేశంలోనే ప్రత్యేక మైన పేరు సంపాదించుకున్నారు.
సాఫ్ట్ వేర్ బూమ్ని అందిపుచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. ఇవాళ ఆంధ్ర తెలంగాణల్లో గ్రామాల్లోని అనేక కుటుంబాలు విదేశాలనుంచి వచ్చే డబ్బుమీద ఆధారపడి జీవిస్తున్నాయి. రెమిటెన్స్ ఎకానమీ మన గడ్డమీద పెరిగింది. అదే సమయంలో పోటీ పెరిగి పిల్లలకు ఏ మాత్రం మానసిక వికాసం లేకుండా తోమడమే ఏకైక పనిగా పెట్టుకున్న ఇంటర్ మీడియెట్ కాలేజీలొచ్చాయి. అందులో పిల్లలను క్రీము, నాన్ క్రీము ప్రాతిపదికగా అనేకబ్యాచులుగా విభజించి విద్యార్థుల మార్కులను బట్టి అందులోంచి ఇందులోకి ఇందులోంచి అందులోకి మార్చి వారిలో న్యూనతను ఆధిక్యతను పెంచే దిక్కుమాలిన విధానాలు వచ్చాయి. అవి క్లాసు విద్యార్థుల్లో సహజంగా ఉండాల్సిన కామ్రేడరీని దెబ్బతీశాయి. ఒంటరి చేశాయి. నిస్సహాయులను చేశాయి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఇంజనీరింగ్ అయితే కొట్టాల, మీ పెదనాన్న గారబ్బాయి కొట్టాడు చూడూ అంతకంటే పెద్ద కాలేజీలో కొట్టాల లాంటి పోటీలు పెట్టే తల్లిదండ్రుల పాత్ర కూడా తక్కువేమే కాదు. వెరసి పిల్లలు పిల్లలు కాకుండా మన కలలను నెరవేర్చుకునే పెట్టుబడిగా మారిపోయారు. ఇవాళ ముదిరిన సంక్షోభం వెనుక ఇవ్వన్నీ ఉన్నాయి. అందరి పాత్రా ఉన్నది.

ప్రాధమిక విద్య-మార్కెట్ పోటీ
తెలంగాణ ఇంటర్ మీడియెట్ సంక్షోభం కేవలం నిర్వహణాలోపం ఫలితం. కానీ అది సంక్షోభపు ఒక పార్శ్యం మాత్రమే. కుటుంబంలాగే స్కూల్ కూడా మనిషి వ్యక్తిత్వరూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాలి. కానీ కెరీర్ యావలో ఆ పాత్రను స్కూల్ నుంచి తీసేస్తున్నాం. జ్ఞానసముపార్జన, సామాజిక అవగాహన, తోటి మనుషులతో కలవడం లాంటి కొన్ని ప్రాధమిక లక్షణాలను తీసేసి మార్కులు అనే పక్షికన్ను మీదే దృష్టిపెట్టమని బోధిస్తున్నాం. పోనీ ఆ ఖాళీని పూరించగలిగే సమయమూ శక్తీ కుటుంబానికి ఉంటున్నదా అంటే అదీ లేదు. మావాణ్ణి బాగా కొట్టి చదివించు సారూ అనే రోజుల్నించి గోడకుర్చీ వేయించే హక్కు మీకెవరిచ్చారండీ అని టీచర్లను గదమాయించగల స్థాయికి తల్లిదండ్రులు చేరారు. ప్రేమలు, హక్కుల స్పృహ పెరిగాయి. అదే సమయంలో మార్కుల ఒత్తిడి మాత్రం తగ్గలేదు. సరైన మార్కులు రాకపోతే వెనుకబడిపోతామేమో మళ్లీ వెనక్కు పోతామేమో అనే భయం అందరినీ వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయాన్ని పిల్లలనుంచి తల్లిదండ్రులనుంచి తీసేయగలిగేదేదో కావాలి. కనీసం ఒక దశ వరకు విద్యను మార్కెట్ పోటీకి దూరంగా ఉంచేదేదో కావాలి.
ఇవి కూడా చదవండి:
- ఆ గ్రహంపై వజ్రాల వర్షం
- భానుడి భగభగలు.. తప్పించుకునేందుకు జనాల అగచాట్లు
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- షోరూంలో వస్తువులు కొని, క్యారీ బ్యాగ్ కోసం డబ్బులిస్తున్నారా, ఇకపై ఇవ్వొద్దు
- ఆత్మకు శాంతి కలగాలని చనిపోయిన 17 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








