ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..

ఫొటో సోర్స్, Gustavo Valiente
బ్రిటన్‌లో ఉంటున్న జమీరా హజియేవా అనే మహిళ లండన్‌లోని ఓ లగ్జరీ షాపింగ్ మాల్‌లో అక్షరాల రూ.140 కోట్లు ఖర్చు చేయడం సంచలనంగా మారింది.
ఆమె భర్త జహంగీర్ హజియేవా మాత్రం అజర్బైజాన్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. అక్కడి ప్రభుత్వ బ్యాంకు నుంచి కోట్ల కొద్దీ సొమ్ము దోచుకున్న కేసులో 15 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు.
జమీరా అజర్బైజాన్ నుంచి లండన్‌కు వచ్చి, శాశ్వత నివాస అనుమతి పొంది విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
54 క్రెడిట్ కార్డులతో లండన్‌లోని లగ్జరీ షాపింగ్ మాల్ హరాడ్స్‌లో పదేళ్లలో ఆమె రూ.140 కోట్లు షాపింగ్ చేశారు. ఈ కార్డుల్లో చాలా వరకు ఆమె భర్త బ్యాంకుకు చెందినవే. ఇంత పెద్ద మొత్తంలో ఆమె ఖర్చు చేస్తున్నా హరాడ్స్‌లో ఎవరికీ అనుమానాలు రాలేదు.
బ్రిటన్‌లోని బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీ తప్ప, మరే ఆదాయ వనరు లేకుండా అంత సంపద ఎలా వచ్చిందో తెలియజేయాలని గతేడాది బ్రిటన్ కోర్టును ఆమెను ఆదేశించింది.
అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెల్త్ ఆర్డర్ (యూడబ్ల్యూఓ) కింద కోర్టు ఈ చర్య తీసుకుంది. మనీ లాండరింగ్‌ను అరికట్టేందుకు యూడబ్ల్యూఓను తీసుకువచ్చారు. దీని కింద చర్యలు ఎదుర్కొన్న తొలి వ్యక్తి జమీరానే.
ఆదాయ వనరులు వెల్లడించలేకపోతే జమీరాకు చెందిన రూ.132 కోట్ల ఇల్లుతోపాటు బెర్క్‌షైర్‌లో ఆమెకున్న గోల్ఫ్ కోర్సును కూడా ప్రభుత్వం జప్తు చేసుకోనుంది.
ఆమె షాపింగ్‌కు సంబంధించిన వివరాలున్న కోర్టు పత్రాలు తాజాగా బీబీసీ చేతికి వచ్చాయి.
ఆమె పేరును బయటపెట్టాలని బీబీసీతో పాటు మరికొన్ని మీడియా సంస్థలు నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ) పై న్యాయపోరాటం చేసి గెలిచాయి.
హరాడ్స్‌లో ఆమెకున్న లాయల్టీ కార్డుకు సంబంధించి 93 పేజీల స్టేట్‌మెంట్ కూడా తాజాగా వెల్లడైన పత్రాల్లో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నగా మొదలై..
2005లో అజర్బైజాన్‌లో జమీరా అపహరణకు గురయ్యారు.
ఆ మరుసటి ఏడాది ఆమె బ్రిటన్‌కు వలస వచ్చారు. అప్పుడే ఆమె షాపింగ్ ‘ఉద్యమం’ మొదలైంది.
పిల్లల పుస్తకాలపై రూ.74 వేలు, పెర్‌ఫ్యూమ్‌పై రూ.12వేలతో చిన్నగా ఖర్చు మొదలుపెట్టారు.
ఆ ఏడాది చివర్లో కార్టియర్ నగల దుకాణంలో రూ.15 వేలు, మ్యు మ్యు డిజైనర్ దుస్తుల కోసం రూ.1.4 లక్షలు, ఫెరాగామో షూస్‌పై రూ.1.35 లక్షలు వెచ్చించారు.
2007 మార్చిలో మ్యు మ్యులో మళ్లీ రూ.9.3 లక్షలు ఖర్చు చేశారు.
ఇక్కడి నుంచి జమీరా షాపింగ్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి.
హరాడ్స్‌లో వస్తువుల వివరాలేవీ లేకుండా జమీరా రూ.58 లక్షలు కొనుగోలు చెల్లింపు చేశారు. టామ్ డిక్సన్ డిజైనర్ వస్తువలపై మరో రూ.14 లక్షలు వెచ్చించారు.
హరాడ్స్‌లో జమీరా చేసిన ఖర్చుల వివరాలివి..
- బౌషెరాన్ నగలు: రూ.30 కోట్లు
- కార్టియర్ నగలు: రూ.12 కోట్లు
- డెన్నిస్ బాసో, అమెరికా ష్యాషన్ డిజైనర్ : రూ.3.5 కోట్లు
- టామ్ డిక్సన్ డిజైనర్ వస్తువులు: 2.92 కోట్లు
- పెర్‌ఫ్యూమ్‌ల కోసం: రూ.1.4 కోట్లు
- మొత్తం ఖర్చు: రూ.143 కోట్లు
ఆధారం: బ్రిటన్‌లోని హైకోర్టు పత్రాలు

ఫొటో సోర్స్, Getty Images
ఆట బొమ్మలకు రూ.2.2 కోట్లు
చిన్న పిల్లలకు డిస్నీ బొమ్మల్లా మేకప్ చేసే ఓ బోటిక్‌లో జమీరా రూ.87 లక్షలు ఖర్చు పెట్టారు. దేనిపై ఇంత వెచ్చించారనేదానిపై స్పష్టత లేదు. సాధారణంగా ఆ బోటిక్ మేకోవర్ల కోసం గంటకు రూ.88 వేలకు మించి తీసుకోదు. అదే రోజు బౌషెరాన్‌లో ఆమె మరో రూ.1.4 కోట్లతో నగలు కొన్నారు.
గిఫ్ట్‌ల చుట్టూ చుట్టే వ్రాపింగ్ కోసం జమీరా ఓసారి రూ.1.2 లక్షలు ఖర్చు చేశారు.
ముగ్గురు సంతానం ఉన్న ఆమె ఆటబొమ్మల కోసం చేసిన ఖర్చు రూ.2.2 కోట్లు.
జమీరా వాడిన 54 క్రెడిట్ కార్డుల్లో ఆమె భర్త బ్యాంకుకు చెందిన కార్డులు 35 ఉన్నాయి. దాదాపు రూ.52 కోట్లు వాటి ద్వారా ఆమె ఖర్చు చేశారు.
మొత్తంగా ఆమె 2006 సెప్టెంబర్ 29 నుంచి 2016 జూన్ వరకు హరాడ్స్‌లో రూ.143 కోట్లు వెచ్చించారు.
హరాడ్స్‌లో ఎవరికీ సందేహాలు రాలేదా?
జమీరా చేసిన ఖర్చులు ‘పెద్ద మొత్తంలో’నే ఉన్నాయని ఎన్‌సీఏ ఆర్థిక విచారణకర్త నికోలా బార్ట్‌లెట్ వ్యాఖ్యానించారు.
జమీరా భర్త హజియేవ్ తన బ్యాంకు ద్వారా బంధువులకు క్రెడిట్ కార్డులు జారీ చేసేవారని, వారు పెద్ద మొత్తాల్లో ఖర్చులు చేసి డబ్బు తిరిగి బ్యాంకుకు చెల్లించేవారు కాదని ఆమె అన్నారు.
జమీరా షాపింగ్ వ్యయాలపై హరాడ్స్‌కు ఎప్పుడూ సందేహాలు రాలేదా?
విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని, మనీ ల్యాండరింగ్‌కు వ్యతిరకేంగా కఠినమైన విధానాలు అమలు చేస్తున్నామని హరాడ్స్ ఓ ప్రకటనలో బీబీసీకి తెలిపింది.
నిబంధనలకు విరుద్ధంగా సంస్థ నడుచుకున్న దాఖలాలు లేవని పేర్కొంది.

పెద్ద పెట్టుబడిదారుగా తనను తాను చూపించుకుని బ్రిటన్‌లో శాశ్వత నివాస ఉండేందుకు జమీరా అనుమతి పొందారు.
ఇందుకోసం 2010లో రూ.8 కోట్ల విలువైన బ్రిటన్ ప్రభుత్వ బాండ్లను ఆమె కొనుగోలు చేశారు. ఇందుకోసం జమీరా భర్త నుంచి డబ్బులు వచ్చినట్లు కోర్టు పత్రాలు పేర్కొంటున్నాయి.
2015లో తన భార్య వద్ద, తన వద్ద తగినన్ని నిధులు ఉన్నాయంటూ బ్రిటన్ హోం ఆఫీస్‌కు జమీరా భర్త హామీ పత్రం రాశారు.
ఆ తర్వాత కొన్ని నెలలకే ఆయన అజర్బైజాన్‌లో అరెస్టయ్యారు.
అయితే, తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని జమీరా అంటున్నారు. ఎన్‌సీఏ చర్యలపై ఆమె అప్పీలుకు వెళ్తున్నారు. తన భర్త జైల్లో ఉండటంతోనే ఆస్తుల గురించి పత్రాలు ఇవ్వలేకపోతున్నానని ఆమె కోర్టుకు తెలిపారు.
బ్రిటన్ తనను అజర్బైజాన్‌కు తిప్పి పంపకుండా ఉండేందుకు ఆమె కోర్టులో పోరాడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- కొందరు ఆడవారి శరీరం నుంచి వచ్చే వాసనకు మగవారు ఎందుకు ఆకర్షితులవుతారు?
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- సైక్లింగ్‌తో లైంగిక సామర్థ్యానికి ముప్పుందా?
- ఎండోమెట్రియాసిస్: మహిళలకు మాత్రమే వచ్చే చికిత్స లేని ఈ నెలసరి రోగం ఏమిటి?
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








