PUBGకి ప్రత్యామ్నాయంగా చైనాలో దేశభక్తి నింపే వీడియో గేమ్

పబ్ జి గేమ్

ఫొటో సోర్స్, PUBGMOBILE.IN.OFFICIAL/facebook

సూపర్ హిట్ వీడియో గేమ్‌ 'పబ్‌జి'కి నియంత్రణ మండలి ఆమోదం పొందడంలో విఫలమైన చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ ఆ గేమ్ లాంచింగ్‌ రద్దు చేసింది.

ప్లేయర్ అన్‌నోన్ బాటిల్ గ్రౌండ్స్(పబ్‌జి) అనేది ఒక యుద్ధ సంబంధిత వీడియో గేమ్.

ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన 'ఫోర్ట్‌నైట్' గేమ్‌లాగే ఉండే దీనిలో వంద మంది ఆటగాళ్లు తమ మనుగడ కోసం పోరాటం చేస్తారు.

పబ్‌జిని దక్షిణకొరియా రూపొందించింది. కానీ ఈ గేమ్ లైసెన్స్ టెన్సెంట్ దక్కించుకుంది. చైనాలో దీని మొబైల్ యాప్ వెర్షన్ పరీక్షించారు.

కానీ ఇప్పుడు ఈ కంపెనీ చైనాలో 'పబ్‌జి' గేమ్ ఆడాలనుకునేవారికి.. దానికి బదులు దేశంలో అనుమతించిన ఒక ప్రత్యామ్నాయ గేమ్ అందిస్తోంది.

వీడియో క్యాప్షన్, వీడియో: PUBG… ఈ ఆటకు ఎందుకంత క్రేజ్?

సోషలిస్ట్ థీమ్స్

పబ్‌జి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. 2018లో స్టీమ్ వీడియో గేమ్ స్టోర్‌లో ఇది అత్యధిక టైటిల్స్ సంపాదించిన వాటిలో ఒకటిగా నిలిచింది.

టెన్సెంట్ కంపెనీ చైనాలో పబ్‌జి మొబైల్ వెర్షన్‌ను పరీక్షించింది. దీనిని రోజూ 7 కోట్ల మంది ఆడేవారని చెప్పింది.

కానీ ఈ యాప్‌ అమ్మకాలకు అనుమతులు పొందలేకపోయిన ఈ సంస్థ పబ్‌జి మొబైల్ వెర్షన్ నుంచి డబ్బు సంపాదించలేకపోయింది.

దాంతో ఈ గేమ్ మూసేస్తున్నట్టు టెన్సెంట్ కంపెనీ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబోలో ప్రకటించింది. దానికి బదులు దేశంలో అనుమతించిన 'ఫోర్స్ ఫర్ పీస్' అనే గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

పబ్‌జీ గేమ్

ఫొటో సోర్స్, PUBG

ఇది సేమ్ టు సేమ్

ఈ గేమ్ కూడా పబ్‌‌జి శైలిలోనే సాగుతుంది. కానీ దానిలోని కొన్ని హింసాత్మక చిత్రణలకు బదులు, కొన్ని సోషల్ థీమ్స్ ఉంటాయి.

"ఇది దాదాపు అంతా పబ్‌జి లాగే ఉంటుంది" అని ఐహెచ్ఎస్ మర్కిట్‌ గేమ్స్ అనలిస్ట్ కుయ్ చెన్యు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.

"గేమ్ ఆడడం, దీని నేపథ్యం, గ్రాఫిక్ డిజైన్స్, పాత్రలు అన్నీ దాదాపు పబ్‌జీలో ఉన్నట్టే ఉంటాయి" అని ఆయన చెప్పారు.

ఈ కంపెనీ 'ఫోర్స్ ఫర్ పీస్' గేమ్‌ ఆడే ఆటగాళ్లు పబ్‌జి మొబైల్ గేమ్‌లో ఉన్న వస్తువులు, వాళ్ల ర్యాంకింగ్‌ ఇందులో కొనసాగించే అవకాశం కూడా కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)