ఎండోమెట్రియాసిస్: మహిళలకు మాత్రమే వచ్చే చికిత్స లేని ఈ నెలసరి రోగం ఏమిటి?

నొప్పితో బాధపడుతున్న మహిళ

ఫొటో సోర్స్, iStock

    • రచయిత, ఆమీ గ్రాంట్ కంబర్ బాచ్
    • హోదా, బీబీసీ కోసం

స్త్రీలలో కనీసం పది శాతం మందికి ఉండే ఈ రుగ్మత గురించి ఇప్పటికీ పెద్దగా పరిశోధనలు జరగలేదు. డాక్టర్లకు కూడా అవగాహన తక్కువే. ఇది వచ్చినప్పుడు చాలామంది పని చేసుకోలేనంత నొప్పితో బాధపడుతూ ఉంటారు. అయినా నేటికీ దీనికి చికిత్స లేదు.

నాకు నెలసరి 14 ఏళ్ళ వయస్సులో మొదలైంది. ప్రతిసారీ కూడా బాగా నొప్పిగానే ఉండేది. ఆ రోజుల్లో స్కూల్‌కి వెళ్ళాల్సి వస్తే హీట్ పాచెస్ (వేడి నీళ్ల కాపడం ప్యాకెట్లు) ఉపయోగించేదాన్ని. ఒక్కొక్కసారి అవి బాగానే పని చేసేవి. సాయంత్రం వరకు కూడా నొప్పి రాకుండా ఉండేది. కొన్నిసార్లు మాత్రం భయంకరమైన నొప్పితో గిలగిల్లాడేదాన్ని. అప్పుడు సిక్ రూమ్ లో మంచం మీద పడుకుని నొప్పితో మెలికలు తిరిగిపోతుంటే అక్కడ ఉండే రిసెప్షనిస్ట్‌కి ఏమి సలహా ఇవ్వాలో కూడా అర్ధమయ్యేది కాదు. మామూలుగా అయితే అపెండిసైటిస్ ఉందేమో చూపెట్టుకోమంటారు కానీ నా విషయంలో అలా చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అప్పటికే నాకు అపెండిక్స్ కూడా తీసేయడం అయిపొయింది.

పదేళ్ళు బాధ పడ్డాక చివరికి ఇప్పుడు అది ఎండోమెట్రియాసిస్ వ్యాధి కావొచ్చని చెపుతున్నారు. దానికో పేరు తెలిసినంత మాత్రాన పరిష్కారం తెలిసినట్టు కాదు. నేను ఈ పదేళ్ళలో అనేకమంది డాక్టర్లను కలిశాను కాబట్టి దీని గురించి వైద్యశాస్త్రానికి చాలా తక్కువ తెలుసని చెప్పగలను. రోగనిర్దారణ, చికిత్స రెండూ సంక్లిష్టమైనవే కాక దీర్ఘకాలిక ప్రక్రియలని కూడా చెప్పగలను.

ఎండోమెట్రియాసిస్ వ్యాధి నెలసరితో సంబంధమున్న ఒక రుగ్మత. గర్భకోశం లోపల మాత్రమే ఉండాల్సిన కణజాలంతో కూడిన పలచని పొర (టిష్యూ) ఇతర అవయవాలలో కూడా ఏర్పడడమే ఈ రుగ్మతకు కారణం. ఫెలోపియన్ ట్యూబ్స్ (అండాలను అండాశయం నుండి గర్భాశయానికి తీసుకెళ్ళే నాళం), కటి భాగం (పెల్విస్), పెద్ద పేగులు, చిన్న పేగులు, యోని (వెజైనా)లలో ఎక్కడైనా ఈ పొర ఏర్పడవచ్చు. అరుదుగా ఊపిరితిత్తుల్లో, కళ్ళల్లో, వెన్నెముకలో, మెదడులో కూడా ఏర్పడవచ్చు. ఇప్పటివరకు అది కనబడని ఒకే ఒక చోటు ప్లీహం (స్ప్లీన్). ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు విపరీతమైన నొప్పి (ముఖ్యంగా కటి భాగంలో), అలసట, నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం.

ఎండో మెట్రియాసిస్ endometriosis

ఫొటో సోర్స్, BBC/Alamy

ఫొటో క్యాప్షన్, పిల్లల్ని కనగలిగిన వయస్సులో ఉన్న ప్రతి పదిమంది స్త్రీలలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నట్లు అంచనా

ఎండోమెట్రియాసిస్ ఒక్కటే కాదు మరెన్నో అనారోగ్యాలపై జరగాల్సినంత పరిశోధన జరగని మాట నిజమే అయినా, ఆ అనారోగ్యాలు వేటికీ చాలినన్ని నిధుల కేటాయింపు జరగడం లేదనే మాట కూడా నిజమే అయినా వాటిలో చాలా వాటి కంటే ఇది చాలా విస్తృతమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17.6 కోట్లమంది స్త్రీలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే పునరుత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి పదిమంది స్త్రీలలో ఒకరికి ఈ రుగ్మత ఉన్నట్టు లెక్కలు చెపుతున్నాయి. అయినా దీని పరిశోధనకు ఏడాదికి 6 మిలియన్ల డాలర్లు మాత్రమే కేటాయిస్తున్నారు (రూపాయిల్లో చెప్పాలంటే రూ.42.64 కోట్లు). నిద్ర మీద పరిశోధనలకు అంతకంటే 50 రెట్లు ఎక్కువ నిధులు ఇస్తున్నారంటే వాళ్ళ ప్రాధాన్యాలలో ఇది ఎక్కడ ఉందో అర్ధం చేసుకోండి.

ఎండోమెట్రియాసిస్ వల్ల వచ్చే కష్టం నొప్పి ఒక్కటే కాదు. పది దేశాలలో జరిపిన పరిశోధనల ప్రకారం ఎండోమెట్రియాసిస్ వల్ల దానితో బాధ పడే ప్రతి రోగీ ఏడాదికి సగటున 8,600 పౌండ్లు (సుమారు రూ.7.82 లక్షలు) ఆరోగ్యంపై ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంటే రోజుకు 23.45 పౌండ్లు (సుమారు రూ. 2,132). అంటే ఒక్కొక్కరు అన్ని రకాల మందులు వాడాల్సి వస్తోంది. అంతే కాదు దీని వలన పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం ఉంది. ఇతర రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశముంది.

"ఎండోమెట్రియాసిస్ నొప్పుల కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థలో మార్పులు జరగొచ్చు, భవిష్యత్తులో నొప్పికి స్పందించడంలో తేడాలు రావొచ్చు, శరీరం బలహీనమై సులభంగా ఇతర రకాల నొప్పులు కలిగించే స్థితిలోకి వెళ్లిపోవచ్చు" అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో నొప్పిపై పరిశోధనలు చేస్తున్న కాటీ విన్సెంట్ చెప్పారు.

ఎండో మెట్రియాసిస్ endometriosis

ఫొటో సోర్స్, BBC/Alamy

ఫొటో క్యాప్షన్, ఫలానా కారణమేదీ లేకుండానే కటి భాగంలో విపరీతమైన నొప్పి రావడం ఈ వ్యాధి తొలి లక్షణం

చాలామందికి రోగచిహ్నాలు ఏమీ లేకుండానే విపరీతమైన నొప్పి మొదలవుతుంది. కొందరికి రోగచిహ్నాలతో పాటు నొప్పి రావొచ్చు. కానీ ఫలానా కారణం వల్ల ఈ నొప్పి వస్తుందని చెప్పడానికి ఉండదు. మొదట కటి భాగంలో మొదలవుతుంది. అసలే ఎవరికీ అర్ధం కాకుండా ఉందనుకునే ఈ జబ్బు ఆడవాళ్ళకు సంబంధించింది కావడం, పైగా ఋతుస్రావానికి సంబంధించింది కావడం వల్ల మరింత గూడమైన వ్యాధిగా మారిపోయింది.

మొదట ఎప్పుడు కనుగొన్నారు?

ఎక్కువమంది అభిప్రాయం ప్రకారం ఎండోమెట్రియాసిస్ను మైక్రోస్కోప్లో మొదట కనుగొన్నది చెకొస్లొవాకియాకు చెందిన కార్ల్ వాన్ రోకితన్స్కీ అనే శాస్త్రవేత్త. 1860లో ఆయన దీన్ని కనుగొన్నట్టు ఎక్కువమంది ఉటంకిస్తుంటారు కాని అంతకన్నా ముందే దీన్ని ఇతరులు అంత శాస్త్రీయంగా కాకపోయినా కనుగొన్నట్లు దాఖలాలు ఉన్నాయి. ఎండోమెట్రియాసిస్ ను పోలిన రోగ చిహ్నాలను చాలా ప్రాచీన కాలంలోనే గుర్తించిన దాఖలాలు కూడా ఉన్నాయి.

హిస్టీరియా లక్షణాలకు, వీటికి దగ్గరి పోలికలు కనిపిస్తాయి. హిస్టీరియా అనే పదానికి అర్ధమే 'గర్భకోశ సంబంధమ'ని. హిస్టీరియాగా భావించి కొట్టి పడేసిన అనేక కేసులు బహుశా ఎండోమెట్రియాసిస్ అయి ఉండొచ్చని 'కటి భాగంలో వచ్చే నొప్పి' పై జరిగిన ఒక ఇటీవలి పరిశోధన పేర్కొంది. "స్త్రీలు నేల మీద పడి గర్భస్థ శిశువులా ముడుచుకుని నొప్పితో గిలగిలలాడడం హిస్టీరియా లక్షణాలలో ఒకటిగా ఆనాడు భావించబడింద"ని ఈ అధ్యయనం చెపుతుంది. ఎండోమెట్రియాసిస్ వల్ల తీవ్రమైన కడుపునోప్పి వచ్చినప్పుడు కూడా అలాగే బాధపడతారనేది మనకు తెలిసిందే.

ఎండో మెట్రియాసిస్ endometriosis

ఫొటో సోర్స్, BBC/Alamy

ఫొటో క్యాప్షన్, గతంలో నొప్పితో గిలగిలలాడుతూ పడిపోవడాన్ని 'హిస్టీరియా' కేసులుగా భావించేవారు. నిజానికి అవి ఎండోమెట్రియాసిస్ కేసులు అయి ఉండొచ్చు

ఎండోమెట్రియాసిస్ ను తక్కువగా అంచనా వేయడం, అపార్ధం చేసుకోవడం ఆ కాలంలోనే కాదు ఈ కాలంలోనూ కొనసాగుతోంది. దీని మీద పరిశోధనలు తక్కువ జరగడమే కాదు వైద్యశాస్త్రానికి సైతం దీని గురించి చాలా తక్కువే తెలుసు. ఆ రుగ్మతకు కారణాలేమిటో ఇవాళ్టికీ ఎవరికీ తెలియదు. అలాగే దానికి చికిత్స కూడా తెలియదు. చాలాసార్లు వైద్యులు దాన్ని ఎండోమెట్రియాసిస్ అని గుర్తించడానికే పదేళ్ళు పడుతోంది. పైగా కచ్చితంగా తెలియాలంటే లాప్రోస్కోపీ తప్ప మరో మార్గం లేదు.

ఎండోమెట్రియాసిస్ తో బాధపడుతున్నట్టు నిర్ధరణ అయిన ముగ్గురు యువతులను నేను ఇటీవల కలిశాను. వారందరూ వయస్సురీత్యా 20 లలో, 30 లలో ఉన్నవాళ్ళు. చాలారోజుల నుంచి డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నా ఇది ఎండోమెట్రియాసిస్ అని వాళ్లకు ఎవరూ చెప్పిన పాపాన పోలేదట. వాళ్ళు చెప్పిన రోగ చిహ్నాలను తీసి పారేయడమో లేదా తక్కువగా అంచనా వేయడమో చేస్తూ వచ్చారట. "ఒక్క డాక్టర్ అయినా ఎండోమెట్రియాసిస్ అనే పదం ఉచ్చరించడం నేను వినలేదు. ఒక్కరూ కనీసం సరైన ప్రశ్నలు అడగడం కూడా నేను వినలేదు" అని 31 ఏళ్ళ ఆలిస్ బొడెన్ హామ్ చెప్పింది. "ఈ లక్షణం వేరే జబ్బుదై ఉండొచ్చు. లేదా నువ్వు కల్పిస్తున్నావు" వారి నోటి వెంట ఎప్పుడూ ఇదే మాట.

ఎండోమెట్రియాసిస్ వల్ల వచ్చే నొప్పులను ఆడవాళ్లకు వచ్చే సాధారణ నొప్పి కింద తీసి పారేయడమనే అలవాటే ఈ సమస్య ఇంత నిర్లక్ష్యానికి గురవడానికి కొంత కారణం. నా అనుభవమే దీనికి ఉదాహరణ. ఒకసారి నాకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నప్పుడు బాగా నొప్పిగా అనిపించి డాక్టర్లకు చెపితే వాళ్ళు ఆ తర్వాత తమ రిపోర్ట్ తో పాటు ఒక నోట్ పంపిస్తూ అందులో "స్కాన్ చేస్తున్నప్పుడు రోగి కొద్దిపాటి అసౌకర్యానికి గురయ్యింది" అని రాశారు. చాలా నొప్పి అని నేను చెపితే అది వాళ్ళకు కొద్దిపాటి అసౌకర్యంగా అర్ధమైందన్న మాట! వ్యాధి తీవ్రతకు, అనుభవించిన నొప్పికి మధ్య పరస్పర సంబంధం ఎంత ఉంటుందో కూడా వాళ్లకు తెలియకపోవడం మరో దారుణమైన విషయం.

ఎండో మెట్రియాసిస్ endometriosis

ఫొటో సోర్స్, BBC/Alamy

ఫొటో క్యాప్షన్, చాలాసార్లు స్త్రీలు చెప్పే నొప్పి చిహ్నాలను తీసిపారేస్తారు

ఎండోమెట్రియాసిస్ విషయంలో రోగి చెప్పే చిహ్నాలను వైద్యుడు నమ్మకపోతే పరీక్షల ద్వారా దాన్ని నిర్ధరించుకునే మార్గం ఏదీ లేదు. ఆపరేషన్ ద్వారా తప్ప ఇతర ఏ పరీక్ష ద్వారా దీన్ని కచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేదు. "అన్నీ నీ తలలోనే ఉన్నాయి" అని వైద్యుడు తీసిపారేస్తుంటే ఇక ఆమెకు చికిత్స పొందే మార్గం ఏముంటుంది?

బ్రిటన్ ప్రభుత్వం 2,600 మంది ఎండోమెట్రియాసిస్ రోగులపై జరిపిన ఒక సర్వేలో రోగులలో 40 శాతం మంది స్పెషలిస్ట్ దగ్గరికి పంపబడే ముందు కనీసం 10, అంతకంటే ఎక్కువసార్లే మామూలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందని తేలింది. ఆశ్చర్యమేమీ లేదు. డాక్టర్ల అజ్ఞానం అలా ఉంది. బొడెన్ హామ్ ఉదాహరణ చెప్పాలంటే చాలాసార్లు నేల మీద కుప్పకూలి పడిపోయిన తర్వాతే ఆమె నొప్పిని వైద్యులు సీరియస్ గా తీసుకున్నారట.

కైట్లిన్ కాన్యేర్స్ 24 ఏళ్ళ యువతి. 'మై ఎండోమెట్రియాసిస్ డైరీ' పేరుతో ఆమె ఒక బ్లాగ్ నడుపుతుంది. తన అధ్యయనం ద్వారానే ఆమె తనకు ఈ వ్యాధి ఉన్నట్టు కనుగొంది కాని డాక్టర్లు ఆమె అనుమానాన్ని కొట్టిపడేశారు. "దాదాపు మూడేళ్ళ క్రితం నేను ఒక అర్జెంటు కేర్ సెంటర్ లో చేరాల్సి వచ్చింది. అప్పటికే నేను ఇంటర్నెట్ లో శోధించి నా స్థితికి ఎండోమెట్రియాసిస్ ఒక కారణమై ఉండొచ్చని తెలుసుకున్నాను. నేను డాక్టర్లకు ఆ విషయం చెపితే వాళ్ళు కచ్చితంగా అది కానే కాదు అన్నారు. నెలసరి బాగా నొప్పిగా ఉంటోందని, కడుపులో కూడా నొప్పిగా ఉంటోందని చెప్పినా వాళ్ళు కానే కాదనేశారు."

వాళ్ళలా తీసి పారేయడానికి జెండర్ వివక్షే కారణమని ఆక్స్ ఫర్డ్ పరిశోధకురాలు విన్సెంట్ నిర్మొహమాటంగా అంటారు. "ప్రతి 14 ఏళ్ళ అబ్బాయి డాక్టర్ దగ్గరకు వెళ్లి 'ప్రతి నెలా నాకు రెండు రోజులు క్లాసులు పోతున్నాయి' అని చెపితే వెంటనే ఈ సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది" అంటుందామె.

ఎండో మెట్రియాసిస్ endometriosis

ఫొటో సోర్స్, BBC/Alamy

ఫొటో క్యాప్షన్, మొదటి స్కాన్ లలో డాక్టర్లు ఒక్కోసారి గాయాల గుర్తులను కనుక్కోలేకపోతారు

మొదటి స్కాన్ లలో డాక్టర్లు ఒక్కొక్కసారి గాయాల గుర్తులను కనుక్కోలేకపోతారు. ముఖ్యంగా అవి ఉపరితలంలో మాత్రమే ఉన్నప్పుడు. అప్పుడు సమస్య మరింత జటిలమవుతుంది. ఎండోమెట్రియాసిస్ గ్రూపులలో ఈ తప్పుడు స్కానింగుల కథనాలు ఎన్ని కనబడతాయో!

రోగికి తన స్థితి గురించి అవగాహన లేకపోతే కూడా రోగనిర్ధారణ ఆలస్యమవుతుంది. నెలసరి నొప్పులకు సంబంధించి ఇప్పటికీ కొందరికి సరైన అవగాహన లేదని కొంతమందితో మాట్లాడినప్పుడు నాకు అర్ధమైంది. ఇద్దరు స్త్రీలు కుటుంబ సభ్యుల ద్వారానో, సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారానో నెలసరి నొప్పిగా ఉండొచ్చని, అసౌకర్యంగా ఉండొచ్చని తెలుసుకున్నారట. అయితే ఎంత నొప్పిగా ఉంటుందో వాళ్లకు తెలియదు. కాబట్టి తమకు వచ్చే నొప్పి నెలసరి నొప్పో, ఎండోమెట్రియాసిస్ నొప్పో వారికి అవగాహన లేదు.

ఎండో మెట్రియాసిస్ endometriosis

ఫొటో సోర్స్, BBC/Alamy

ఫొటో క్యాప్షన్, ఋతుస్రావం గురించి తప్పుడు అవగాహన వల్ల చాలామంది స్త్రీలకు అది నిజంగా ఎంత నొప్పిగా ఉంటుందో, అసలు నొప్పి ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియదు

అందుకే ఈ రుగ్మత గురించి అవగాహన పెంచడానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎండోమెట్రియాసిస్ సేవా సంస్థలు, ప్రచారకులు ఎంతో కృషి చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియా ప్రభుత్వం 2017 లో ఎండోమెట్రియాసిస్ కోసం ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా వ్యాధి గురించి ప్రజలలో అవగాహన పెంచడం, కొత్త చికిత్సా పద్ధతులను పెంపొందించడం, దీని కోసం ఖర్చు చేసే నిధులను 4.5 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లకు పెంచడం, కొత్త క్లినికల్ మార్గదర్శకాలను రూపొందించడం, మరీ ముఖ్యంగా ప్రాధమిక ఆరోగ్య వైద్య విద్యలో దీన్ని భాగం చేయడం వంటి చర్యలు చేపట్టింది.

దీని రోగనిర్ధరణ, చికిత్సా పద్ధతులను ప్రామాణికం చేయడానికి యు.కె లోని 'నైస్' సంస్థ సలహా సంఘం కూడా 2017 లో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా స్పెషలిస్ట్ కేంద్రాలు నెలకొల్పాల్సిన అవసరం కూడా ఉందని ప్రపంచ ఎండోమెట్రియాసిస్ సొసైటీ ప్రధాన అధికారి లోన్ హమ్మెల్ షోజ్ కోరుతున్నారు.

ఎండో మెట్రియాసిస్ endometriosis

ఫొటో సోర్స్, BBC/Alamy

ఫొటో క్యాప్షన్, కొందరు వైద్యులు ఇప్పటికీ గర్భం దాల్చడమే దీనికి మంచి పరిష్కారమని సూచిస్తుంటారు

సులభ పరిష్కారాలేమీ లేవు

రోగ నిర్ధరణ జరిగాక కూడా రోగ లక్షణాలకు చికిత్స చేయడం అంత తేలికేమీ కాదు. అందులోనూ అవగాహనా లేమి చాలానే ఉంది.

కొందరు వైద్యులు ఇప్పటికీ గర్భం దాల్చడమే దీనికి మంచి పరిష్కారమని సూచిస్తుంటారు. ఈ ఏడాదే ఒక డాక్టర్ నాతో "నీ సమస్య ఎండోమెట్రియాసిస్ అనే అనుకుంటున్నాను. కాని దానికి చికిత్స పెద్దగా ఏమీ లేదు నువ్వు గర్భం దాల్చాలను కుంటే తప్ప" అంది. నిజానికి ఈ రుగ్మత వల్ల పిల్లలు పుట్టకపోయే ప్రమాదం ఉన్నపుడు సరదాకైనా ఈ రకమైన మాటలు మాట్లాడడం చాలా అనుచితం. పైగా గర్భం దాల్చడం పరిష్కారమూ కాదు. గర్భం దాల్చడం వల్ల ఎండోమెట్రియాసిస్ బాధలు కొన్ని తగ్గొచ్చేమో కాని అది ఆ తొమ్మిది నెలల కాలం వరకే. తర్వాత మామూలే.

రచయిత లెనా డన్హమ్ మరో పరిష్కారం సూచించారు. అదేమిటంటే గర్భసంచి తీసేయించుకుంటే ఎండోమెట్రియాసిస్ తగ్గుతుందని, తను త్వరలో ఆ శస్త్రచికిత్సే చేయించుకోబోతున్నానని కూడా ఆమె 'వోగ్' పత్రికలో రాసింది. ఇదీ వివాదాస్పదమైన చికిత్సే. ఎందుకంటే ఎండోమెట్రియాసిస్ వ్యాధి కారకాలైన గాయాలు గర్భసంచిలో కాదు గర్భసంచి బయట ఉంటాయి. అందువల్ల గర్భసంచి తీసేయడం ఎండోమెట్రియాసిస్‌కి పరిష్కారం కానే కాదు, పైగా మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది.

ఎండోమెట్రియాసిస్ కు కారణమైన గాయాల పెరుగుదలను నియంత్రించేది ఈస్ట్రోజన్ కాబట్టి డాక్టర్లు మొదట ఇచ్చేది హర్మోన్ చికిత్సే. దాని వలన నొప్పి తగ్గుతుంది కాని అది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. పైగా దాని దుష్ఫలితాలు (సైడ్ ఎఫెక్ట్స్) దానికీ ఉంటాయి. డెన్మార్క్ లో 2016 లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం గర్భనిరోధక హార్మోన్లు తీసుకునే స్త్రీలు ఆ తర్వాత మానసిక కుంగుబాటుకు (డిప్రెషన్) చికిత్స తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోందట. ఎండోమెట్రియాసిస్ కి ఇచ్చే మందులలో గర్భనిరోధక మాత్రలే ప్రధానంగా ఉంటాయి.

ఎండో మెట్రియాసిస్ endometriosis

ఫొటో సోర్స్, BBC/Alamy

ఫొటో క్యాప్షన్, గర్భసంచిని తీసేయడం చికిత్స కాదు, ఎండోమెట్రియాసిస్ ఆ తర్వాత కూడా రావొచ్చు

డాక్టర్లు చెప్పే మరో పరిష్కారం మెడికల్ మెనోపాజ్ (మందుల ద్వారా నెలసరులు ఆగిపోయేలా చేయడం). కాని అది ఎండోమెట్రియాసిస్ ను శాశ్వతంగా నయం చేయదు. పైగా ఈ మెడికల్ మెనోపాజ్ వలన వచ్చే ఇబ్బందులు ఎన్నో! ఈ చికిత్స వల్ల ఎముకల సాంద్రత దెబ్బ తింటుంది, ముఖ్యంగా యువతులలో. దీని దుష్ఫలితాలలో ఒకటి ప్రమాదవశాత్తూ పూర్తి మెనోపాజ్ సంభవించే అవకాశం. ఇది చాలా అరుదుగానే జరగొచ్చు కాని ఆ ప్రమాదమైతే ఉంది. సరైన అవగాహన కలిగించకుండానే చాలామందికి ఈ చికిత్స చేస్తున్నారని కుక్ అనే ఆవిడ అంటుంది. సమగ్రంగా తెలుసుకోకుండానే చాలామంది స్త్రీలు మెడికల్ మెనోపాజ్ కు మాత్రలు లేదా ఇంజక్షన్లు తీసేసుకుంటున్నారని, దేనికి తీసుకుంటున్నారనేది కూడా వారికి తెలియడం లేదని ఆమె చెపుతోంది.

ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం ఇప్పుడు కొన్ని పరిశోధనలు మొదలయ్యాయి.

నిజానికి ఎండోమెట్రియాసిస్ కోసం ఇస్తున్న మందుల్లో ప్రధానంగా హార్మోన్లే ఉంటున్నాయని, వాటి వలన చాలామంది స్త్రీలకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రినా జొండర్వాన్ చెపుతున్నారు. దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటున్నందువల్ల స్త్రీలు ఈ చికిత్సతో సంతృప్తి చెందడం లేదని కూడా ఆమె అన్నారు.

వ్యాధికి కాక వ్యాధి లక్షణాలకు మాత్రమే చికిత్స ఇస్తారు కాబట్టి నొప్పి నివారణ మాత్రలు వేసుకోవడం ప్రస్తుతం దీనికి మరొక పరిష్కారంగా ఉంది. అయితే వాటి వల్ల కూడా ప్రతికూల ఫలితాలే వస్తున్నాయని బొడెన్ హామ్ తన స్వీయానుభవాన్ని వివరించారు. గత మూడేళ్ళుగా నల్లమందుతో తయారైన నొప్పినివారణ మందులు వాడడం వలన తనకు రక్తహీనత, హైపర్ టెన్షన్ వంటి అనేకానేక దుష్ఫలితాలు కలిగాయని, ఇంతకుమందు తాను వారానికొకసారి 5 కిలోమీటర్ల పరుగు పోటీలలో పాల్గొనగలిగే దానినని, ఇప్పుడు కిందకెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చుకోవడమే పెద్ద పరుగు పందెంలో పాల్గొనడంలా ఉందని ఆమె చెప్పింది.

ఎండో మెట్రియాసిస్ endometriosis

ఫొటో సోర్స్, BBC/Alamy

ఫొటో క్యాప్షన్, నొప్పినివారణ మాత్రలు ఎండోమెట్రియాసిస్ లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడే మాట నిజమే కానీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది

అయినా ఆశ లేకపోలేదు. ఈ రుగ్మతకు ఇప్పుడు ఒక గుర్తింపైతే వచ్చింది. జబ్బు లక్షణాల గురించి డాక్టర్లకు, కటిభాగంలో వచ్చే నొప్పి గురించి రోగులకు అవగాహన పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ డాక్టర్లు రోగులను అర్ధం చేసుకోవడంలో చాలా వెనకబడే ఉన్నారు. వారు అర్ధం చేసుకోవడం ఆలస్యం అయ్యే కొద్దీ అది రోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎండోమెట్రియాసిస్ చికిత్సలో భాగంగా గర్భనిరోధక మాత్రలను వాడడం వలన నా మానసిక ఆరోగ్యం ఎలా దెబ్బ తిందో నాకు తెలుసు కాబట్టి నా తదుపరి చికిత్సా మార్గం ఏమిటనేదే ఇప్పుడు నా ఆలోచన. తక్కువ మోతాదులో హర్మోన్ చికిత్స తీసుకోవాలా లేక లాప్రోస్కోపీ ద్వారా కచ్చితమైన రోగ నిర్ధారణకు వెళ్ళాలా అనే మీమాంసలో ఉన్నాను. లాప్రోస్కోపీ చేయించుకుంటే నేను చాలా రోజులు సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఉద్యోగ భద్రత లేని ఒక ఫ్రీలాన్స్ రచయితను కాబట్టి మరిన్ని డబ్బులు కూడబెట్టుకుంటే తప్ప నేను ఆ పని చేయలేను. ఎండోమెట్రియాసిస్ నొప్పితో బాధపడే స్త్రీలకు ఎన్ని సమస్యలో చూశారా!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)