#BBCShe: రేప్ వార్తల రిపోర్టింగ్‌లో మీడియా 'ఆనందం' దాగి ఉందా?

- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
''అత్యాచారానికి సంబంధించిన వార్తలను మీడియా నిరంతరాయంగా అందిస్తుంది. బాధితురాలిని పదేపదే ప్రశ్నిస్తుంటుంది. బాధితురాలికి ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.''
''అత్యాచారానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలంటే బాధితుల తల్లిదండ్రులు భయపడతారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తే తమ కుమార్తె వివరాలు మీడియా ద్వారా బయటకు తెలుస్తాయని, అమ్మాయికి, కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని ఆందోళన చెందుతారు.''
''మీడియా ప్రతినిధులు బాధితుల ఇరుగుపొరుగును వివరాలు అడుగుతారు. బాధితురాలితో పరిచయమున్నవారికి, తెలిసినవాళ్లకు అందరికీ జరిగిన ఘటన గురించి సమాచారం చేరుతుంది. ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది''
అత్యాచార ఘటనలకు సంబంధించి మీడియా వార్తలు అందించే విధానంపై మీ అభిప్రాయాలు, ఆలోచనలు ఏమిటని పట్నాలోని మగధ్ కళాశాల విద్యార్థినులను #BBCShe కార్యక్రమంలో భాగంగా అడిగినప్పుడు వారు ఇలా స్పందించారు.
తమ ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని, గందరగోళాన్ని అంతటినీ ఇప్పుడు వ్యక్తపరచాలనే గట్టి అభిప్రాయంతో వారు మాట్లాడుతున్నట్లు అనిపించింది. వారు అన్ని అంశాలనూ లోతుగా విశ్లేషించుకొని మాట్లాడారు. అత్యాచార కేసులపై మీడియా వార్తలు అందించే విధానం పట్ల వారిలో అంత తీవ్రమైన ఆగ్రహం ఉంటుందని నేను అనుకోలేదు.

#BBCShe కార్యక్రమంలో భాగంగా భారత్‌లోని ఆరు నగరాలకు వెళ్లి మహిళలతో మాట్లాడతాం. వారి ఆందోళనలు, ఆలోచనలు తెలుసుకుంటాం. అందుకు అనుగుణంగా వార్తాకథనాలు, విశ్లేషణలు అందిస్తాం. కార్యక్రమంలో భాగంగా తొలుత పట్నాకు వెళ్లాం. #BBCShe బృందం ఈ నెల 26న అంటే సోమవారం విశాఖపట్నం రానుంది.


'రేప్' వార్తలను ప్రసార సాధనాలు అందించే విధానంపై మీ అభిప్రాయం ఏమిటని విద్యార్థినులను అడగ్గా, చెప్పేందుకు చాలా మంది ముందుకొచ్చారు.
వాళ్లు చెబుతున్నది వింటుంటే దిల్లీలోని వైశాలి ప్రాంతంలో జరిగిన ఓ ఘటన నాకు గుర్తుకు వచ్చింది. వైశాలిలో ఒక అమ్మాయి తను ఉండే హాస్టల్‌కు సమీపాన అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై కనిపించింది. ఆమె దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి.
అత్యాచార బాధితుల వివరాలను బహిర్గతపరచకూడదని చట్టం చెబుతున్నా, ఆ అమ్మాయి పేరును మీడియా వెల్లడించింది.
పట్నా మగధ్ కళాశాలలో #BBCShe బృందంతో మాట్లాడిన విద్యార్థినుల్లో ముందు వరుసలో ఉన్నవారు కాలేజీలో అంతకుముందు మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి ముందు పట్నాలో ఈ విద్యార్థినుల వయసున్న ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి తన మేనమామతో కలిసి వెళ్తోంది. మరుసటి రోజు వార్తాపత్రికల్లో- యాసిడ్ దాడి కంటే, ఆ అమ్మాయికి, ఆమె మేనమామకు ఉన్న సంబంధంపైనే ప్రధానంగా కథనాలు వచ్చాయి.
ఈ తరహా రిపోర్టింగ్‌తో అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు.

'అమ్మాయిలపైనే ఎందుకు అనుమానాలు?'
''వార్తల్లో ఎప్పుడూ బాధిత అమ్మాయిలపైనే అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తుతారు. అసలు ఆ అమ్మాయి ఎలాంటి దుస్తులు ధరించింది? ఏ సమయంలో ఇంట్లోంచి బయటకు వెళ్లింది? ఆమె వెంట ఎవరున్నారు- ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. సమాజంలో పరిస్థితులు ఇలా ఉంటే ఏ అమ్మాయైనా ఎందుకు నోరు మెదుపుతుంది, మౌనంగా ఉండటమే ఉత్తమమనుకుంటుంది. అమ్మాయిల దుస్తుల గురించి ప్రస్తావిస్తుంటారు. సల్వార్-కమీజ్ వేసుకున్న అమ్మాయిలపై హింస జరగడం లేదా, వారిపైనా జరుగుతోంది'' అని విద్యార్థినులు పేర్కొన్నారు.
#BBCShe బృందంతో మాట్లాడిన విద్యార్థినుల్లో చాలా మంది సల్వార్-కమీజ్ ధరించారు. కొందరు జీన్స్ వేసుకున్నారు. ఈ కాలేజీ అమ్మాయిల్లో అత్యధికులు పట్నాలో పుట్టి పెరిగినవారే.
బిహార్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఉపకార వేతనాల కారణంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిల సంఖ్య పెరిగింది. మగధ్ కాలేజీ మహిళా కశాశాల.
అమ్మాయిల ఆలోచనలకు దిశానిర్దేశం చేసేందుకు, వారు స్వేచ్ఛగా మాట్లాడేందుకు అనువైన వాతావరణం ఉండటం కీలకమని ఈ కాలేజీలోని మనస్తత్వ శాస్త్ర విభాగాధిపతి చెప్పారు.

అత్యాచార వార్తల రిపోర్టింగ్‌పై బిహార్‌లోని సీనియర్ పాత్రికేయురాలు రజినీ శంకర్ మాట్లాడుతూ- నేర వార్తలను చాలా వరకు మగ జర్నలిస్టులే అందిస్తారని, వీరిలో 'కొందరికి' మహిళల పట్ల ఉండాల్సినంత సున్నితత్వం ఉండదని విచారం వ్యక్తంచేశారు.
మహిళలపై హింస జరిగితే కొందరు మగ రిపోర్టర్లు అవసరమైనదాని కంటే ఎక్కువ సమాచారం తెలుసుకొని, ఆ తర్వాత వార్త రాస్తారని ఆమె చెప్పారు. అలాంటి ఘటనలను 'మజా' ఇచ్చే ఘటనలుగా వారు చూస్తున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
రజినీ శంకర్ దక్షిణాసియాలోని మహిళా మీడియా ప్రతినిధుల సంస్థ- 'సౌత్ ఏసియన్ విమిన్ ఇన్ మీడియా' బిహార్ శాఖకు సారథ్యం వహిస్తున్నారు. 'హిందుస్తాన్' వార్తాసంస్థ బిహార్ విభాగం అధిపతిగానూ వ్యవహరిస్తున్నారు.
మహిళలపై హింస వార్తల రిపోర్టింగ్‌లో సున్నితత్వంతో వ్యవహరించేలా చూసేందుకు తమ వార్తాసంస్థలోని మగ జర్నలిస్టులకు ఆమె వర్క్‌షాప్‌లు నిర్వహించారు.
గతంతో పోలిస్తే పరిస్థితిలో మార్పు రాలేదని చెప్పడం లేదు. కొంతలో కొంత మార్పు కనిపిస్తోంది.
బిహార్‌లో 'దైనిక్ భాస్కర్' పత్రిక ఎడిటర్ ప్రమోద్ ముకేశ్ మాట్లాడుతూ- మహిళల అంశాల పట్ల లోతైన ఆలోచనలు, విషయ పరిజ్ఞానం ఉన్న ముగ్గురు మహిళలను తన బృందంలో నియమించినట్లు చెప్పారు. ఆయన బృందంలో మొత్తం 30 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఈ ముగ్గురు మహిళలు నేర వార్తల రిపోర్టింగ్ కానీ, ఇతరత్రా 'బీట్' రిపోర్టింగ్ కానీ చేయరు. మహిళల అంశాలపై మాత్రమే వీరు వార్తాకథనాలు అందిస్తారు.

'మహిళా జర్నలిస్టులు పెరగాలి'
మగధ్ కాలేజీలో అమ్మాయిలతో నా సంభాషణ సారాంశాన్ని ప్రమోద్ ముకేశ్‌కు వివరించాను.
మహిళలపై అత్యాచారాలు, ఇతర దాడులపై రిపోర్టింగ్‌లో మీడియా సున్నితత్వంతో వ్యవహరించడం లేదా, దీనివల్లే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అమ్మాయిలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారా అని ప్రమోద్ ముకేశ్‌ను అడిగాను.
మీడియాపై ఇలాంటి అభిప్రాయం చాలా సంవత్సరాలుగా ఉందని, మారడానికి సమయం పడుతుందని ఆయన బదులిచ్చారు. మహిళా జర్నలిస్టుల సంఖ్యను పెంచాల్సి ఉందని, ఈ సమస్య పరిష్కారంలో ఇది మొదటి అడుగు అవుతుందని చెప్పారు. మగ జర్నలిస్టుల్లో సున్నితత్వాన్ని పెంపొందించడం రెండో అడుగు అవుతుందని అభిప్రాయపడ్డారు.
మగధ్ కళాశాల విద్యార్థినులు కూడా కొన్ని సూచనలు చేశారు.
''అత్యాచారం జరిగితే అత్యాచారంపై వార్తలు అందించాలి, బాధితులైన అమ్మాయిలపై కాదు. మీడియా తన దృష్టిని అత్యాచారానికి గురైన అమ్మాయిలపై కాకుండా అత్యాచారానికి పాల్పడ్డ మగవారిపై కేంద్రీకరించాలి. వారి దుస్తులు, ప్రవర్తనపై ప్రశ్నలు వేయాలి. అత్యాచారానికి పాల్పడ్డ ఎవరైనా అబ్బాయికి శిక్ష పడితే, దానిని ఒక ఉదాహరణగా చూపించాలి'' అని ఆ విద్యార్థినులు సూచించారు.
విద్యార్థినుల మాటలను బట్టి వారిలో ఒక నిశ్చితమైన ఏకాభిప్రాయం ఉంది. అదేంటంటే- ''మాలో సాధికారతను పెంచేలా మీడియా వార్తలు అందించాలి, మాలో భయాన్ని కలిగించేలా కాదు.''


ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









