‘రెచ్చగొట్టే డ్రెస్ వేసుకుని వేశ్యాలోలత్వాన్ని ప్రేరేపించార’ని ఈజిప్టు నటి రనియా యూసఫ్‌పై కేసు

నలుపురంగు దుస్తుల్లో ఈజిప్టు నటి రనియా యూసఫ్

ఫొటో సోర్స్, Getty Images

వేశ్యాలోలత్వాన్ని ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈజిప్టు ప్రముఖ నటి రనియా యూసఫ్‌పై దాఖలు చేసిన కేసును ఆ దేశ న్యాయవాది సమీర్ సబ్రే ఉపసంహరించుకున్నారు.

44 ఏళ్ల రనియా యూసఫ్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టిన ఇద్దరిలో ఆయన ఒకరు. అయితే, ఈ కేసును ఉపసంహరించుకునేది లేదని, విచారణ కొనసాగిస్తామని ఈజిప్టు ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టం చేశారు.

రనియాపై నమోదైన కేసులో ఆరోపణలు రుజువైతే ఆమెకు ఐదేళ్ల వరకూ జైలు శిక్ష పడొచ్చు.

ఈ వ్యవహారంపై ఈజిప్టు రాజధాని కైరో నగర ప్రజలు సైతం నటికి మద్దతుగా, వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.

2018 నవంబర్‌ 29న ఈజిప్టు రాజధాని కైరో నగరంలో జరిగిన కైరో ఫిల్మ్ ఫెస్టివల్‌ ముగింపు వేడుకలో రనియా యూసఫ్‌ ఈ డ్రెస్‌ వేసుకున్నారు.

కాళ్లు చాలా భాగం బయటకు కనిపించేలా ఉన్న నల్లటి డ్రెస్ అది.

సామాజికంగా సంప్రదాయ విశ్వాసాలను అనుసరించే ఈజిప్టులో యూసఫ్ ధరించిన డ్రెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

వేశ్యాలోలత్వాన్ని ప్రేరేపించారని ఆరోపిస్తూ ఆమెపై కేసులు వేశారు.

ఈజిప్టు నటి రనియా యూసఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఆమెకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసిన న్యాయవాదుల్లో సమీర్ సబ్రే కూడా ఒకరు. గత కొన్నేళ్లలో ఇలాంటి వ్యవహారాలపై ఆయన వందలాది కేసులు దాఖలు చేశారు.

''అనైతిక వ్యవహారాలకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు చాలా తేడా ఉంది. ప్రతి పనినీ కళగా భావించలేం.

దీనికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలను, విమర్శలను భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యలుగా చూడకూడదు.

తమకు నచ్చినట్లు చేసేందుకు అందరికీ స్వేచ్ఛ ఉంది. అయితే వాళ్లు సామాజిక, నైతిక, మతపరమైన విలువలను కూడా పరిగణించాల్సి ఉంటుంది.

తమ చర్యల ద్వారా వాళ్లు ప్రేక్షకులకు పంపించే విధ్వంసకరమైన సందేశాల గురించి ఆలోచించాలి'' అని సమీర్ సబ్రే బీబీసీతో అన్నారు.

అయితే, శరీరం కనిపించేలా దుస్తులు వేసుకున్నందుకు రనియా యూసఫ్‌ క్షమాపణలు చెప్పారు.

''అది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పనికాదు'' అని ఆమె అన్నారు.

ఈజిప్టు నటి రనియా యూసఫ్

ఫొటో సోర్స్, Getty Images

''ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఏదేమైనా నేనొక మనిషిని.. మనమంతా కూడా(మనుషులం). నన్ను క్షమించండి, ఐ లవ్ యూ'' అని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇంత వివాదానికి దారితీస్తుందని ముందే తెలిసి ఉంటే.. తాను ఆ డ్రెస్ వేసుకునేదానిని కాదని అన్నారు. తాను తొలిసారి అలాంటి డ్రెస్ వేసుకున్నానని, దానివల్ల పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని ఊహించలేకపోయానని చెప్పారు.

‘‘నేను పెరిగిన ఈజిప్టు సంఘంలోని విలువలకు నేను కట్టుబడి ఉంటాను’’ అని తెలిపారు.

రనియా యూసఫ్ క్షమాపణలు చెప్పడంతో ఆమెపై పెట్టిన కేసును సమీర్ సబ్రే ఉపసంహరించుకున్నారు.

అయితే, కైరోలోని ప్రభుత్వ న్యాయవాదులు మాత్రం ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ, కేసు విచారణను కొనసాగించారు.

ఈ కేసుపై కైరో నగర ప్రజల్లో కొందరు నటికి మద్దతు తెలిపితే.. మరికొందరు ఆమెపై కేసు సమంజసమేనని అన్నారు.

మత విశ్వాసాలను గౌరవించి మహిళలు తమ శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని కొందరు, ఆమె చేసిన పనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఈజిప్టు పరువు పోతుందని కొందరు వ్యాఖ్యానించారు.

ఇంకొందరేమో ఒక డ్రెస్ వేసుకున్నందుకు కేసు పెట్టడం అనేది సరికాదని అంటున్నారు.

మ్యూజిక్ వీడియోలో అరటి పండుతో షైమా

ఫొటో సోర్స్, Shyma

ఫొటో క్యాప్షన్, వేశ్యాలోలత్వాన్ని ప్రేరేపించారంటూ గతంలో పలువురు మహిళా నటీమణులు, సింగర్స్‌పై కేసులు దాఖలయ్యాయి

''ఆమె ప్రముఖ నటి. ఇలాంటి బట్టలు వేసుకుంటే.. ఆమెను చూసి ప్రపంచమంతా ఈజిప్టును అంచనా వేస్తుంది. ఈజిప్టు పరువును ఆమె దిగజార్చారు'' అని ఒక యువతి బీబీసీతో అన్నారు.

''వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదు.. ముఖ్యంగా ఈజిప్టు, ఇతర మధ్యప్రాచ్చ దేశాల్లో. ఇక్కడ సంప్రదాయాలు ఉన్నాయి. మహిళలు తమ ముఖం కనిపించకుండా ముసుగు వేసుకోవాలని దేవుడు చెప్పాడు. పద్ధతిగా ఉండడానికి చేసే చాలా చిన్నపని అది'' అని ఒక యువకుడు అన్నారు.

''వందేళ్ల కిందటి పరిస్థితులను ఇది గుర్తు చేస్తోంది. 1960ల్లోనే మహిళా నటీమణులు సినిమాల్లో మినీ స్కర్టుల్లో కనిపించేవారని, అప్పుడు ఎవ్వరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇప్పటికీ ప్రజలు (మహిళలు) స్నానం చేసే దుస్తుల్లో.. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తుంటారు. ఎవ్వరూ ఏమీ అనరు'' అని మరొక యువతి అన్నారు.

''ఈ విషయంపై చాలా చర్చ జరుగుతోంది. అయితే, ఇంతకంటే వేరే అంశాలపై దృష్టి సారించాలి. ప్రజలు చలికి తాళలేక చనిపోతున్నారు. మంచి జీవితం గడపలేకపోతున్నారు. ఇలాంటి వాటిపై చర్చించాలి'' అని ఒక వ్యక్తి చెప్పారు.

2017లో గాయని షైమాకు రెండేళ్లు జైలు శిక్ష పడింది. ఒక మ్యూజిక్ వీడియోలో ఆమె అరటిపండు తింటున్నట్లుగా నటించటం అప్పట్లో వివాదాస్పదం అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)