దేవదాసి సీతవ్వ: 3600 మంది మహిళలను కాపాడిన ‘మాస్’ లీడర్

తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఒకప్పుడు దేవదాసి వ్యవస్థ ఉండేది. ఆలయాల్లో దేవుళ్లకిచ్చి పెళ్లిచేయించే పేరిట మహిళలను లైంగిక బానిసత్వంలోకి నెట్టేసేవారు.
కర్నాటకలోని బెల్గాం ప్రాంతంలో ఈ ఆచారాన్ని రూపుమాపడంలో కీలక పాత్ర పోషించారు సీతవ్వ జోడట్టి.
ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
2018 ఏప్రిల్‌లో సీతవ్వ జోడట్టికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసింది.
ఈ నేపథ్యంలో ఆమె తన జీవన ప్రయాణాన్ని బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్‌తో పంచుకున్నారు.

''జనవరి 25న నేను ఇంటి పనుల్లో బిజీగా ఉన్నాను. టీవీలో సువర్ణ న్యూస్ చానల్ చూస్తుండగా హెడ్‌లైన్స్‌లో చెబుతున్నారు... సీతవ్వ జోడట్టికి పద్మశ్రీ అవార్డు లభించింది అని. అసలు నాకు పద్మశ్రీ అంటే ఏంటో కూడా తెలియదు.'' అని సీతవ్వ అన్నారు.
''నా మెడలో నల్లపూసల దండవేసి నన్ను దేవదాసిగా మార్చే సమయానికి నాకు ఏడేళ్లు. నా చేతికి పచ్చని గాజులు, పచ్చని చీర, మెట్టెలు చూసి చాలా సంతోషంగా అనిపించింది. సౌందట్టిలోని ఎల్లమ్మ ఆలయంలో నన్ను దేవదాసిని చేశారు. అమ్మాయిల్ని ఇలా దేవదాసిగా చేయడానికి చాలా కారణాలుంటాయి. కానీ నా విషయానికొస్తే.. మాత్రం నా తల్లిదండ్రులకు పుత్రసంతానం లేకపోవడమే.'' అని తాను ఎలా దేవదాసిగా మారిందీ వివరించారు.
1982లోనే కర్నాటక ప్రభుత్వం దేవదాసీ సంప్రదాయాన్ని రద్దు చేసినప్పటికి ఈ సమస్య పూర్తిగా కనుమరుగవలేదు.

''90 శాతం మంది దేవదాసిలు వేధింపులకు గురవుతుంటారు. కొంతమంది మీద అత్యాచారాలు కూడా జరిగాయి. ఆర్థిక అవసరాల రీత్యా వారితో వెళ్లమని తల్లిదండ్రులే చెబుతుంటారు. అలా దేవదాసి కుటుంబమంతా ఆమె సంపాదన మీదే ఆధారపడి బతుకుతుంది. అయితే ఇందులో అన్యాయానికి గురయ్యేది మాత్రం దేవదాసినే.'' అని సీతవ్వ చెప్పారు.
''1991లో కర్నాటక మహిళా సంక్షేమ శాఖ వారు వచ్చి మాకు చాలా విషయాలు తెలియజేశారు. అప్పుడే 'అసలు మేం దేవదాసిలుగా ఎందుకు మారాలి' అన్న ప్రశ్న మొదలైంది. 'మేం ఎందుకింత ఇబ్బందులు పడుతున్నాం' అన్పించింది. ఎవరి మీదో ఆధారపడి బతికేకంటే మా బతుకు మేమే బతకాలనుకున్నాం.'' అని నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు సీతవ్వ.

ఈమె 1997 సెప్టెంబర్‌లో మరికొందరితో కలిసి 'మహిళా అభివృద్ధి మట్టు సంస్కరణ సంస్థే' - మాస్‌ను ఏర్పాటు చేశారు.
''మమ్మల్ని ఎంతగానో వేధించారు. ఈ కూపం నుండి మొత్తం 3600 మంది మహిళలను బయటపడేయడానికి మేం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మమ్మల్ని అనరాని మాటలనేవారు. మమ్మల్ని వెనకడుగు వేసేలా చేయాలన్నదే వారి ఆలోచన. అయితే, మరెవ్వరూ మా లాగా బాధ పడకూడదని భావించాం కాబట్టే మేం ఎన్నో ఇబ్బందులను భరించాం.'' అని సీతవ్వ చెప్పారు.
సీతవ్వ, తను ఏర్పాటు చేసిన సంస్థతో కలిసి మొత్తం 4800 మంది దేవదాసిలను, వారి పిల్లలను ఈ ఉచ్చు నుండి కాపాడారు.

దేవదాసిల పిల్లల కోసం ఉపకారవేతనాలను కూడా అందించారు.
'కర్నాటకలోని బెల్గాంలో దేవదాసి వ్యవస్థ పూర్తిగా రద్దయినప్పటికీ, మేం చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళల అక్రమరవాణా... వీటన్నింటి పైనా మేం పని చేయాలనుకుంటున్నాం.' అని ఆమె తన భవిష్యత్తు ప్రణాళికను వివరించారు.
ఇవి కూడా చదవండి
- డస్టర్ క్లాత్ పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
- వైరల్ వీడియో: కొండముచ్చును స్టీరింగ్‌పై ఉంచి బస్సు నడిపిన డ్రైవర్
- ఇండోనేసియాలో భారీ నష్టానికి కారణం ‘మట్టి ప్రవాహం’... అసలేంటిది?
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- 'ఇక్కడే పుట్టా, ఇక్కడే చచ్చిపోతా... అడవిని మాత్రం వదలను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









