గండికోట జలాశయం: ''మా ఇళ్లలోకి నీరొస్తోంది.. పరిహారం మాత్రం రాలేదు''

- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ తెలుగు కోసం
శ్రీశైలం జలాశయం నుంచి కడప జిల్లాలోని గండికోట జలాశయానికి వస్తున్న కృష్ణా జలాలతో, పరిహారం అందని నిర్వాసితులు, పరిహారం చెక్కులను ఇటీవలే అందుకున్నవారు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం గండికోట జలాశయంలో నీటిమట్టం 12 టీఎంసీలకు చేరడంతో మండల కేంద్రమైన కొండాపురంలోని రామచంద్రానగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరుతోంది.
ఇటీవల ఈ కాలనీని డేంజర్ జోన్‌గా ప్రకటించిన అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఓవైపు పరిహారం చెక్కులు ఇస్తూనే, మరోవైపు ఇల్లు కూలుస్తుండటంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.
చెక్కులు తీసుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న షేక్ గఫూర్ అనే వ్యక్తి మాట్లాడుతూ- నీళ్లు వదులుతారని తెలిసి కూడా కనీసం నెల ముందైనా పరిహారం ఇవ్వకపోవటం ప్రభుత్వం తప్పిదం కాదా అని ప్రశ్నించారు.

'దౌర్జన్యం సమంజసమేనా?'
''మాకు ఇక్కడ మూడు ఇండ్లు ఉన్నాయి . పరిహారం కింద మూడు చెక్కులు రావాల్సి ఉంటే నిన్న రెండు చెక్కులు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఓవైపు అధికారులు, పోలీసులు ఒత్తిడి చేస్తుంటే, మరోవైపు నీళ్లు ఇండ్లకు ఆనుకొని వస్తున్నాయి. తప్పక ఇల్లు విడిచిపోవాల్సిన పరిస్థితి. చెక్కులిచ్చినంత మాత్రాన వెంటనే ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలి? కనీసం చెక్కులు బ్యాంకులో వేసి డబ్బు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. గొంతు మీద కత్తి పెట్టి తరుముతున్నట్టుంది పరిస్థితి. నీళ్లు వదులుతారని తెలిసి కూడా కనీసం నెల రోజుల ముందైనా పరిహారం ఇవ్వకపోవటం ప్రభుత్వం, అధికారుల తప్పిదం కాదా? తీరా నీళ్లు వదిలాక ఇప్పుడు వచ్చి మా మీద అధికారులు దౌర్జన్యం చేయటం ఎంత వరకు సమంజసం? ఇతరుల ఇళ్లకుపోయి బతకాల్సిన పరిస్థితి తెచ్చింది ఈ ప్రభుత్వం " అని షేక్ గఫూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

డేంజర్ జోన్‌లో, పరిహారం అందనివారిలో కొంత మంది గత మూడు రోజుల్లో అనివార్య పరిస్థితుల్లో ఖాళీ చేసి వెళ్లిపోయారు. పరిహారం కోసం ఎదురుచూస్తూ దాదాపు 25 కుటుంబాలు ఇంకా అక్కడే ఉన్నాయి.
డేంజర్ జోన్‌లోని తమకు ఇప్పటివరకు పరిహారం చెక్కులు ఇవ్వలేదని, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని రామచంద్రానగర్ కాలనీకి చెందిన నిర్వాసిత మహిళలు ఆరోపించారు.
అధికారులు గ్రామంలో సర్వే నిర్వహించి గెజిట్ జాబితాను విడుదల చేశారని, జాబితాలో పేర్లున్నప్పటికీ తమకు పరిహారం ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని వారు ఆరోపించారు.
"మేం పరిహారం, పునరావాసం (ఆర్ అండ్ ఆర్) కోసం దరఖాస్తు చేసుకున్నాం. మా పేరొచ్చింది. స్థలం చూపించారుకాని చెక్కు ఇవ్వడం లేదు. అదేమని అడిగితే చెక్కులు రాలేదు, ముందు మీరు ఖాళీ చేసిపోండి, తర్వాత ఇస్తామంటున్నారు. చెక్కులివ్వకుండా ఎలా పోవాలి? తర్వాత ఇస్తారన్న గ్యారెంటీలేదు. మా పక్కింటివారికి వచ్చింది, మా కెందుకురాదు " అని ప్రశ్నించారు ఎల్లమ్మ అనే మహిళ.

30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా
"మావి ఐదు కుటుంబాలు 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా. గెజిట్ జాబితాలో మా పేర్లు రాలేదు . మాకు మొత్తం ఐదుగురికి చెక్కులు రావాలి. మా అమ్మకు మాత్రమే ఇచ్చారు. మిగిలిన నలుగురి పేర్లు జాబితాలో లేవు. మా స్థానికతను తెలిపే పత్రాలను అధికారులకు అనేక సార్లు అందజేశాం. ఓ వైపు ఇండ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చినా.. ఇప్పటికీ అధికారులు న్యాయం చేయడం లేదు. గట్టిగా అడిగితే 'మీరు బోగస్' అంటున్నారు. మేము ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చదివాం.. ఇక్కడే ఉంటున్నాం.. ఇక్కడే రేషన్ తీసుకుంటున్నాం.. ఇక్కడే ఓట్లేస్తున్నాం. ఇన్ని ఆధారాలున్నా మేం ఎలా బోగస్ అయ్యాం. మాకు న్యాయం చేయకుంటే ఇక్కడే ఆ వచ్చే నీటిలోనే మునిగి చస్తాం కాని.. ఇక్కడి నుంచి పోనేపోం " అని జయలక్ష్మి అనే మహిళ వాపోయారు.

పరిహారంలో గందరగోళమెందుకు?
26.86 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన గండికోట జలాశయంతో కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు కృష్ణా మిగులు జలాలు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం.
జలాశయం పరిధిలో 22 గ్రామాలను ముంపు గ్రామాలుగా అధికారులు గుర్తించారు. 22 గ్రామాలకుగాను దాదాపు 20 వేల కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించిన జిల్లా యంత్రాంగం పరిహారంగా వెయ్యి కోట్ల రూపాయలను ప్రతిపాదించింది.
ఇందుకుగాను 2006వ సంవత్సరం కటాఫ్‌తో సర్వే నిర్వహించినా దాదాపు పదేళ్లపాటు బాధితులెవరికీ పరిహారం అందలేదు. తర్వాత నిర్వాసితులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి నేపథ్యంలో 2016 కటాఫ్‌గా పరిహారం ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది.

ఏడు టీఎంసీలకే ముంపులోకి వెళ్లిన కొండాపురం
మెుదటి విడత లక్ష్యంగా గండికోటలో 12 టీఎంసీలు నిల్వ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐదు టీఎంసీల నిల్వతో ఎనిమిది గ్రామాలు, 12 టీఎంసీల నిల్వతో మరో ఆరు గ్రామాలు మునుగుతాయని అధికారులు నిర్ధరించారు. ఈ 14 గ్రామాలకుగాను 9,096 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించిన ప్రభుత్వం 2017లో పరిహారం, పునరావాసానికి రూ.479 కోట్లు విడుదల చేసింది.
గత సంవత్సరం పునరావాస చర్యల అనంతరం ప్రభుత్వం నీటిని విడుదల చేసింది.
జలాశయానికి ఏడు టీఎంసీలు చేరేసరికి మెుదటి విడత 14 గ్రామాల జాబితాలోలేని, పరిహారం అందని కొండాపురం ముంపులోకి వెళ్లింది.
21 టీఎంసీల నీరువస్తే మునగాల్సిన కొండాపురం ఏడు టీఎంసీలకే మునగడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనతో నీటి విడుదలను ప్రభుత్వం నిలిపివేసింది.
ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 12 టీఎంసీలుగా ఉంది.

అనంతరం ప్రభుత్వ ప్రతినిధులు కొండాపురంలోని నిర్వాసితులతో చర్చించి ఒక్కో కుటుంబాన్ని ఒక యూనిట్‌గా, ఒకవేళ ఒక ఇంట్లో వివాహమైన కుమార్తెగాని కుమారుడు గాని ఉంటే వారిని ప్రత్యేక యూనిట్‌గా పరిగణించి రెండు రకాల ప్యాకేజీలను ప్రతిపాదించారు.
వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద రూ.6.75 లక్షలు, లేదా పరిహారం, పునరావాసం కింద నివాస స్థలంతోపాటు రూ.3.75 లక్షలు పరిహారంగా చెల్లించేందుకు హామీ ఇచ్చారు. ఇదే అంశాలను గత నెల విడుదల చేసిన జీవోలోనూ ప్రభుత్వం పొందుపరిచింది.

అధికారిక గుర్తింపు పత్రాలు, సర్వే నివేదికల ఆధారంగా నిర్వాసితుల జాబితాను అధికారులు రూపొందించారు.
ఏడాది కాలంగా ఈ ప్రక్రియ జరుగుతున్నా నేటికీ కొండాపురంలో పరిహార పంపిణీ పూర్తికాలేదు. ముఖ్యంగా డేంజర్ జోన్‌గా ప్రకటించిన రామచంద్రానగర్ కాలనీలోనూ ఇదే పరిస్థితి ఉంది.
ఓవైపు పరిహారం అందకపోవడం, మరోవైపు ఊళ్లోకి నీరు చేరుతుండటంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

'పట్టించుకోని పాలక, ప్రతిపక్ష నేతలు'
ఈ విషయంపై పౌరహక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీని సంప్రదించగా- పరిహారం ఇచ్చే వరకు నీటిని నిలుపుదల చేసే వీలున్నా అధికారులుగాని, ప్రభుత్వంగాని పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
త్వరగా పులివెందులకు నీరందించి మంచి పేరు తెచ్చుకోవటమే లక్ష్యంగా ఉన్న పాలకులు పరిహార పంపిణీలో ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. చెక్కులు ఇవ్వకుండానే నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేసి వెళ్లగొట్టేందుకే నీటి నిల్వ పెంచుతున్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
''ఇంత జరుగుతున్నా కడప జిల్లాకు చెందిన అధికార పక్షం, ప్రతిపక్షం నేతలు ఏ మాత్రం పట్టనట్టుగా వ్వవహరిస్తున్నారు. ఇందులో తలదూర్చితే పులివెందులకు నీరిచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారన్న అపవాదును మోయాల్సి వస్తుందని వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారు'' అని జయశ్రీ ఆరోపించారు.

అర్హులైన అందరికీ చెక్కులు పంచుతున్నాం: ఆర్డీవో
పరిహారం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై జమ్మలమడుగు ఆర్డీవో నాగన్నను వివరణ కోరగా- అర్హులైన అందరికీ చెక్కులు పంచుతున్నామని చెప్పారు. కొందరు నిర్వాసితులపై ఫిర్యాదులందాయని, వాటితోపాటు గెజిట్‌లో పేర్లు రాలేదని అందిన అర్జీలను పరిశీలిస్తున్నామని ఆర్డీవో తెలిపారు.
గండికోట జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతోనే డేంజర్ జోన్‌లో ఉన్న నిర్వాసితులను వెంటనే ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నామని నాగన్న చెప్పారు. వారి కోసం తాత్కాలిక నివాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ముంపు గ్రామాల్లో ఒక చోట పరిహారం తీసుకొని, మళ్లీ కొండాపురంలో పరిహారం తీసుకొన్నారంటూ 70 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి:
- తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?
- వైసీపీ ఎంపీల రాజీనామాలు: ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఎందుకు పెట్టలేదు?
- #UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు"
- నోబెల్ ప్రైజ్: భూతాపం, ఆర్థికాభివృద్ధి మధ్య సంబంధాన్ని ఆవిష్కరించిన పరిశోధకులకు ఆర్థికశాస్త్రంలో నోబెల్
- తెలంగాణ: హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ నిర్ణయం ఎలా తీసుకుంది?
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- ప్రపంచయుద్ధంలో మునిగిన చమురు ట్యాంకర్‌తో ముప్పు
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








