అహింసా దినోత్సవం రోజే అన్నదాతలపై రబ్బర్ తూటాల ప్రయోగం

రైతు యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వికాస్ త్రివేది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అక్టోబర్ 2న ప్రపంచమంతా మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న వేళ దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలపై రబ్బర్ తూటాలతో దాడి జరిగింది.

తమ డిమాండ్‌లను నెరవేర్చాలంటూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు యూపీ-దిల్లీ సరిహద్దులోకి రాగానే పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

రైతు యాత్ర

ఫొటో సోర్స్, BBC/BUSHRA

ఎన్డీయే ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని, రుణాలు సక్రమంగా మంజూరు చేయడం లేదని, గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు.

భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు వివిధ రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలి వచ్చారు.

రైతు యాత్ర

ఫొటో సోర్స్, BBC/BUSHRA

రైతుల డిమాండ్‌లు ఏమిటి?

వివిధ రాష్ట్రాల నుంచి రైతులు తరలి వచ్చినప్పటికీ వారందరి డిమాండ్ మాత్రం ఒక్కటే. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని రైతులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించి వివిధ సూచనలను అందించేందుకు 14 ఏళ్ల కిందట 2004లో స్వామినాథన్ చైర్మన్‌గా జాతీయ కమిటీ ఏర్పడింది.

వ్యవసాయ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు, రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కమిటీ ప్రభుత్వానికి అనేక సూచనలు చేసింది.

రైతు యాత్ర
ఫొటో క్యాప్షన్, రైతు నేత రాకేశ్

స్వామినాథన్ కమిటీలో కొన్ని సూచనలు..

  • ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం లాభం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలి.
  • కనీస మద్దతు ధర నిర్ణయానికి ప్రాతిపదికగా తాజా గణాంకాలే తీసుకోవాలి. దీనివల్ల వాస్తవ వ్యయాల ఆధారంగా మద్దతు ధర నిర్ణయం సాధ్యం అవుతుంది.
  • వ్యవసాయ సంక్షోభ నిధిని ఏర్పాటు చేయాలి.
  • నాణ్యమైన విత్తనాలను తక్కువ ధరకే అందించాలి.
  • మిగులు భూమిని కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇవ్వాలి.
  • మహిళా రైతులకు క్రెడిట్ కార్డులు అందించాలి.

అయితే, ఈ సిఫారసులు అమలుకు నోచుకోలేదు.

రైతు యాత్ర

కిసాన్ చానెల్‌లో కిసాన్‌ వార్తలు రావు!

కేంద్రప్రభుత్వం రైతులకు ఉపయోగపడేలా కిసాన్ చానెల్‌ను ప్రారంభించింది. అయితే, అందులో తమకు ఉపయోగపడే విషయాలు ఏవీ ఇవ్వడం లేదని రైతులు తెలిపారు.

‘అది కేవలం 10 రోజులు నడిచింది. తర్వాత ఏ చానెల్ కూడా మా కష్టాలను పట్టించుకోలేదు.’ అని రైతు నేత రాకేశ్ తైలట్ బీబీసీకి చెప్పారు.

రైతు యాత్ర

రైతులపై రబ్బర్ బుల్లెట్‌లు, టియర్ గ్యాస్ ప్రయోగం దేనికి?

ర్యాలీగా దిల్లీకి వచ్చిన రైతులను అదుపు చేసేందుకు దాదాపు వెయ్యి మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. అయితే, వాస్తవంగా ఎంతమంది రైతులు, పోలీసులు అక్కడున్నారనేదానిపై కచ్చితమైన సమాచారం లేదు.

‘‘నాయకులు మీడియా ముందుకు వచ్చి రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. మీ సమస్యలు పరిష్కరించడానికి దిల్లీ వెళుతున్నామని చెబుతారు. అదే మేం దిల్లీకి వస్తే ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ మా రక్తం చిందుతోంది’’ అని ఓ రైతు బీబీసీతో అన్నారు.

రైతులు ఆందోళన జరుపుతున్నా ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరపలేదని మీరట్ జోన్ అడిషనల్ డైరక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు.

‘‘దిల్లీ పోలీసులే రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. కాల్పులు జరిగాయని కొంత మంది రైతులు చెప్పారు. అయితే, విచారణ తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.’’ అని అన్నారు.

ఈ ఆందోళనలో గాయపడిన రైతులు యూపీ-దిల్లీని కలిపే ఫ్లై ఓవర్‌ల కింద పడి ఉండటం కనిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)