కోహినూర్ వజ్రం భారత్ నుంచి ఎన్నెన్ని దేశాలు తిరిగింది, ఇప్పుడెక్కడుంది

ఫొటో సోర్స్, Tim Graham Photo Library via Getty Images
- కింగ్ చార్ల్స్‌తో తాను విడిగా భేటీ అయితే కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని చెబుతానని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇటీవల అన్నారు.
- కింగ్ చార్ల్స్ అమెరికా పర్యటన సమయంలో మమ్దానీ ఆయన్ను కలిశారు కానీ ఇద్దరి మధ్య కోహినూర్ విషయం ప్రస్తావనకు వచ్చిందో లేదో స్పష్టత లేదు.
- అయితే.. మమ్దానీ వ్యాఖ్యల తరువాత కోహినూర్ వజ్రం మరోసారి చర్చల్లో నిలిచింది.
- ఈ నేపథ్యంలో కోహినూర్ వజ్రం భారత్ నుంచి బ్రిటన్ ఎలా చేరింది? అంతకుముందు ఈ వజ్రం ఎవరెవరి దగ్గర ఉందో చరిత్రలోకి వెళ్దాం.
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 10 నిమిషాలు
అది 1849, మార్చి 29వ తేదీ. పదేళ్ల వయసున్న మహారాజా దలీప్ సింగ్‌ను కోట నడిబొడ్డున ఉన్న శీష్ మహల్‌కు తీసుకువచ్చారు. ఆయన తండ్రి మహారాజా రంజిత్ సింగ్ అప్పటికి దశాబ్దం క్రితమే మరణించారు. ఆయన తల్లి రాణి జిందన్ కౌర్‌ను కొద్దిరోజులముందే నగరం వెలుపల ఉన్న మరో రాజభవనానికి బలవంతంగా తరలించారు.
ఎర్ర కోట్లు, టోపీలు ధరించిన బ్రిటిష్ సైనికులు దలీప్ సింగ్‌ను చుట్టుముట్టారు.
ఆ తర్వాత ఒక బహిరంగ కార్యక్రమంలో, తన ఆస్థానంలోని మిగిలిన కొద్దిమంది సర్దార్ల సమక్షంలో, బ్రిటిష్ ప్రభుత్వం ఏళ్లుగా ఎదురుచూస్తున్న పత్రంపై ఆయన సంతకం చేశారు.
ఆపై నిమిషాల వ్యవధిలోనే, లాహోర్ కోట వద్ద సిఖ్ ఖల్సా జెండాను దించి, దాని స్థానంలో ఈస్ట్ ఇండియా కంపెనీ జెండాను ఎగరేశారు.
దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ.. సిక్కు సామ్రాజ్యంపై ఆధిపత్యం సాధించడంతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వజ్రమైన కోహినూర్నూ తీసుకుంది.


ఫొటో సోర్స్, Ravi Kumar/Hindustan Times via Getty Images
చిన్న కోడి గుడ్డు పరిమాణంలో..
కోహినూర్ వజ్రాన్ని దక్షిణ భారతదేశంలోని ఒక ఆలయంలోని విగ్రహం కన్ను నుంచి తుర్కియేకి చెందినవారు తీసి ఉండవచ్చన్న కథనం ఒకటి ప్రచారంలో ఉంది.
"కోహినూర్ గురించిన మొట్టమొదటి అధికారిక ప్రస్తావన 1750లో పర్షియన్ చరిత్రకారుడు మహమ్మద్ మార్వి, నాదిర్ షా కలిసి భారతదేశాన్ని వర్ణించిన తీరులో కనిపిస్తుంది. తాను కోహినూర్‌ను తన కళ్లతో చూశానని మార్వి రాశారు" అని 'కోహినూర్: ద స్టోరీ ఆఫ్ ద మోస్ట్ ఇన్‌ఫేమస్ డైమండ్' అనే పుస్తక రచయిత విలియం డాల్రింపల్ చెప్పారు.
నాదిర్ షా ఆ సమయంలో దిల్లీ నుంచి దోచుకుని ఇరాన్‌కు తీసుకువెళ్లిన తఖ్త్-ఏ-తౌస్ అనే ప్రసిద్ధ సింహాసనం పైభాగంలో దాన్ని పొదిగారు. ఆ కోహినూర్ చిన్న కోడిగుడ్డంత ఉండేది. దాన్ని అమ్మితే, ప్రపంచంలో ఉన్న అందరికీ రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టొచ్చని చెప్పుకొనేవారు.
తఖ్త్-ఎ-తౌస్ నిర్మాణానికి తాజ్ మహల్ నిర్మాణం కంటే రెండింతలు ఖర్చయింది. ఆ తర్వాత నాదిర్ షా తన చేతికి ధరించడం కోసం తఖ్త్-ఎ-తౌస్ నుంచి కోహినూర్‌ను తొలగించారు.

ఫొటో సోర్స్, History/Universal Images Group via Getty Images
దిల్లీలో మారణకాండ
నాదిర్ షా 150,000 మంది సైనికులతో కర్నాల్ సమీపంలో మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా రంగీలాకి ఉన్న 10 లక్షల సైన్యాన్ని ఓడించారు. దిల్లీకి చేరుకున్న తర్వాత నాదిర్ షా భయంకరమైన మారణకాండను సృష్టించారు.
"నాదిర్ షా 40 వేల మంది సైనికులు దిల్లీలోకి ప్రవేశించిన వెంటనే ధాన్యం ధరలు ఆకాశాన్నంటాయి. నాదిర్ షా సైనికులు బేరసారాలు ఆడటానికి ప్రయత్నించినప్పుడు.. వారికి, దుకాణదారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ప్రజలు సైనికులపై దాడి చేయడం మొదలుపెట్టారు" అని ప్రముఖ చరిత్రకారులు సర్ హెచ్.ఎం. ఇలియట్, జాన్ డాసన్ తమ 'ది హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టోరియన్స్' అనే పుస్తకంలో రాశారు.
‘‘మధ్యాహ్నానికల్లా దాదాపు తొమ్మిది వందల మంది పర్షియన్ సైనికులు చనిపోయారు. దాంతో దిల్లీ ప్రజలను ఊచకోత కోయమని నాదిర్ షా ఆదేశించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఊచకోత మొదలైంది. ఎర్రకోట, జామా మసీదు, దరిబా, చాందినీ చౌక్ పరిసరాల్లో ఎక్కువమంది ప్రజలు మరణించారు. మొత్తంగా 30 వేలమంది చనిపోయారు’’ అని రాశారు.
"మహ్మద్ షా సేనాపతి అయిన నిజాముల్ ముల్క్ తలపాగా లేకుండా నాదిర్ షా ముందు నిలబడ్డాడు" అని మరో చరిత్రకారుడైన విలియం ఫ్లోర్ 'న్యూ ఫ్యాక్ట్స్ ఆఫ్ నాదిర్ షాస్ ఇండియా క్యాంపెయిన్' అనే పుస్తకంలో రాశారు.
చేతులను వెనక్కి విరిచి ఆయన తలపాగాతోనే కట్టేశారు. నాదిర్ షా ముందు మోకరిల్లిన నిజాముల్ దిల్లీ ప్రజలపై కాకుండా తనపై ప్రతీకారం తీర్చుకోవాలని వేడుకున్నారు.
దిల్లీని విడిచి వెళ్లే ముందు తనకు వంద కోట్ల రూపాయలు చెల్లించాలనే షరతుపై నాదిర్ షా ఆ మారణహోమాన్ని ఆపారు. తదుపరి కొన్ని రోజుల పాటు నిజాముల్ ముల్క్ తన సొంత రాజధానినే దోచుకుని ఆ డబ్బును చెల్లించాడు.
"అంటే ఒక్క క్షణంలోనే 348 ఏళ్లుగా మొఘలులు కూడబెట్టిన సంపద మొత్తం ఇంకొకరి చేతికి వెళ్లిపోయింది" అని విలియం ఫ్లోర్ ఆ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, History/Universal Images Group via Getty Images
తలపాగాల మార్పిడి.. కోహినూర్ స్వాధీనం..
విలియం డాల్రింపల్, అనితా ఆనంద్ కోహినూర్ చరిత్రపై పరిశోధన చేయడానికి కృషి చేశారు.
"నేను మొఘల్ రత్నాల నిపుణులతో మాట్లాడటం దగ్గరనుంచి మొదలు పెట్టాను నా పరిశోధన. వారిలో చాలా మంది కోహినూర్ గురించి ప్రజల్లో ప్రాచుర్యంలో ఉన్న కథలు పూర్తిగా నిజం కావని చెప్పారు. నాదిర్ షా వశమైన తర్వాతే కోహినూర్ మొదటిసారిగా ప్రజల దృష్టికి వచ్చింది" అని డాల్రింపల్ చెప్పారు.
"ఆస్థాన నర్తకి అయిన నూర్ బాయి.. మహమ్మద్ షా కోహినూర్‌ను తన తలపాగాలో దాచిపెట్టారని నాదిర్ షాకు తెలియజేసింది. ఇది విన్న నాదిర్ షా, మన స్నేహం కోసం తలపాగాలను మార్చుకుందాం అని మహమ్మద్ షాని అడిగాడు" అని థియో మెట్కాఫ్ రాశారు.
"ఈ విధంగా కోహినూర్ నాదిర్ షా చేతికి వచ్చింది. ఆయన కోహినూర్‌ను మొదటిసారి చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. "కాంతి పర్వతం" అని అర్థం వచ్చేలా దానికి కోహినూర్ అని పేరు పెట్టారు" అని థియో రాశారు.
పర్షియన్ చరిత్రకారుడు మహ్మద్ కాజిమ్ మార్వీ తన "ఆలం ఆరా-ఎ-నాదరీ" పుస్తకంలో దిల్లీ దోపిడీ గురించి వివరించారు.
"దిల్లీలో 57 రోజులు గడిపిన తరువాత, నాదిర్ షా 1739 మే 16న తన దేశానికి బయలుదేరాడు. తరతరాలుగా పోగుపడిన మొఘల్ సంపద మొత్తాన్ని తనతో తీసుకువెళ్ళాడు. అతను దోచుకున్న వాటిలో అత్యంత విలువైనది తఖ్త్-ఎ-తౌస్. అది కోహినూర్, తైమూర్ కెంపులతో పొదిగిన నెమలి సింహాసనం" అని మార్వి రాశారు.
"దోచుకున్న సంపద మొత్తాన్ని 700 ఏనుగులు, 400 ఒంటెలు, 17,000 గుర్రాలపై ఇరాన్‌కు పంపారు. సైన్యమంతా చీనాబ్ నది వంతెనను దాటేటప్పుడు ప్రతి సైనికుడినీ సోదా చేశారు. తమ దగ్గర ఉన్న రత్నాలు పోతాయనే భయంతో చాలా మంది సైనికులు వాటిని భూమిలో పాతిపెట్టారు. మరికొందరు తర్వాత తీసుకుందామని ఆశతో వాటిని నదిలో పడేశారు" అని మార్వి రాశారు.

ఫొటో సోర్స్, Fine Art Images/Heritage Images via Getty Images
మహారాజా రంజిత్ సింగ్ వద్దకు..
నాదిర్ షా దగ్గర కూడా కోహినూర్ ఎక్కువ రోజులు లేదు. ఆయన హత్య తర్వాత, ఆ వజ్రం ఆయన అఫ్ఘాన్ అంగరక్షకుడైన అహ్మద్ షా అబ్దాలీ వశమైంది. అక్కడి నుంచి అనేక మంది చేతులు మారుతూ చివరకు 1813లో మహారాజా రంజిత్ సింగ్ దగ్గరకు వచ్చింది.
"మహారాజా రంజిత్ సింగ్ దీపావళి, దసరా, ఇతర ప్రధాన పండుగలలో కోహినూర్‌ను తన చేతికి ధరించి తిరిగేవారు. బ్రిటిష్ అధికారులు ఆయన దర్బార్‌కు వచ్చినప్పుడల్లా కోహినూర్‌ను ప్రత్యేకంగా వారికి చూపించేవారు. ముల్తాన్, పెషావర్ లేదా ఇతర నగరాలకు వెళ్ళినప్పుడు కూడా కోహినూర్ ఆయనతో పాటే ఉండేది" అని ఇండియా నేషనల్ ఆర్కైవ్స్‌లో భద్రపరిచిన ఒక పత్రంలో ఉంది.
రంజిత్ సింగ్ 1839లో మరణించారు. అధికారం కోసం తీవ్రమైన పోరాటం జరిగాక 1843లో ఐదేళ్ల దలీప్ సింగ్‌ను పంజాబ్ రాజుగా పట్టాభిషేకం చేశారు. అయితే రెండవ ఆంగ్లో-సిక్కు యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచాక వారి సామ్రాజ్యంతోపాటు కోహినూర్‌ను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. దలీప్ సింగ్‌ను తన తల్లి నుంచి విడదీసి, బ్రిటన్ దంపతులతో నివసించడానికి ఫతేగఢ్ కోటకు పంపించారు.
లార్డ్ డల్హౌసీ కోహినూర్‌ను తీసుకోవడానికి స్వయంగా లాహోర్‌కు వచ్చారు. ఖజానా నుంచి ఆ వజ్రాన్ని తీసి డల్హౌసీ చేతుల్లో పెట్టారు. ఆ సమయంలో దాని బరువు 190.3 క్యారెట్లు. తర్వాత కోహినూర్‌ను మెడియా అనే ఓడలో క్వీన్ విక్టోరియాకు పంపాలని లార్డ్ డల్హౌసీ నిర్ణయించుకున్నారు. ఆ ఓడ ప్రయాణంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
కోహినూర్‌ను తీసుకువెళ్తున్న ఓడకు కష్టాలు
"కోహినూర్‌ను తీసుకెళ్తున్న ఓడలోని సిబ్బందికి వారు ఎంత విలువైన వస్తువు తీసుకెళ్తున్నారో ముందుగా చెప్పలేదు. మెడియా అనే ఆ ఓడ ఇంగ్లాండ్‌కు బయలుదేరిన తర్వాత వారం, రెండు వారాల పాటు ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఆ తర్వాత కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. ఓడలో కలరా వ్యాపించింది. మారిషస్ మార్గంలోనే ఉంది కాబట్టి ఆందోళన చెందవద్దని కెప్టెన్ సిబ్బందికి చెప్పాడు" అని "కోహినూర్: ద స్టోరీ ఆఫ్ ద మోస్ట్ ఇన్‌ఫేమస్ డైమండ్" పుస్తక సహ రచయిత్రి అనితా ఆనంద్ వివరించారు.
అక్కడ మందులు, ఆహారం దొరుకుతాయి, అంతా సర్దుకుంటుంది అనుకున్నారు. కానీ ఆ ఓడ మారిషస్‌కు చేరువవుతుండగా, అందులోని ప్రయాణికులు అనారోగ్యంతో ఉన్నారనే వార్త అక్కడి ప్రజలకు చేరింది. దాంతో ఆ ఓడ తమ తీరానికి సమీపిస్తే ఫిరంగులతో పేల్చేస్తామని అక్కడివారు హెచ్చరించారు.
కలరాతో బాధపడుతున్న సిబ్బంది అంతా ఎలాగైనా ఇంగ్లాండ్ చేరుకోవాలని ప్రార్థిస్తూనే ప్రయాణం కొనసాగించారు. ఈ ప్రయాణంలో ఓ భారీ తుపాను కూడా ఎదురైంది, దాంతో ఓడ దాదాపు రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. వారు ఇంగ్లాండ్‌కు చేరుకున్న తర్వాతే, తాము కోహినూర్‌ను తీసుకెళ్తున్నామని తెలిసింది. దాంతో బహుశా తాము అంతగా నష్టపోవడానికి అదే కారణమై ఉండవచ్చని అనుకున్నారు.

ఫొటో సోర్స్, CHANDAN KHANNA/AFP via Getty Images
కోహినూర్ లండన్‌కు చేరిన తర్వాత దాన్ని క్రిస్టల్ ప్యాలెస్‌లో బ్రిటిష్ ప్రజల ముందు ప్రదర్శించారు. "కోహినూర్‌ను బ్రిటన్‌కు తీసుకెళ్లిన మూడేళ్ల తర్వాత, దాన్ని అక్కడ ప్రదర్శించారు. లండన్‌లో ఇంతకు ముందెన్నడూ ఇంత పెద్ద జనసమూహాన్ని చూడలేదని 'ది టైమ్స్' పత్రిక రాసింది. ఈ ప్రదర్శన మొదలైనప్పుడు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది" అని విలియం డాల్రింపల్ చెప్పారు.
ప్రదర్శన చూడటానికి వచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చేది. ఆ వజ్రం తూర్పున బ్రిటిష్ పాలన శక్తికి, పెరుగుతున్న బ్రిటన్ సైనిక శక్తి ప్రభావానికి చిహ్నంగా మారింది.
ఈ సమయంలో ఫతేగఢ్ కోటలో నివసిస్తున్న మహారాజా దలీప్ సింగ్ లండన్ వెళ్లి రాణి విక్టోరియాను కలవాలని కోరారు. రాణి అందుకు అంగీకరించారు. అక్కడ దలీప్ సింగ్ కోహినూర్ వజ్రాన్ని ఆమెకు బహూకరించారు.
"తన ప్రభుత్వం ఒక చిన్నారి పట్ల చేసిన దానికి క్వీన్ విక్టోరియా ఎప్పుడూ బాధపడేవారు" అని అనితా ఆనంద్ వివరించారు.
ఆమె దలీప్ సింగ్‌ను ఎంతో ఇష్టపడేవారు. అందువల్లే ఆయన పట్ల ప్రవర్తించిన తీరుకు ఆమె బాధపడేవారు. కోహినూర్ అప్పటికే ఆమె వద్దకు చేరినా, ఆమె దాన్ని రెండు సంవత్సరాలు ప్రజల్లో ధరించలేదు. దలీప్ సింగ్ దాన్ని చూస్తే ఏమనుకుంటాడో అన్న భావన ఆమెకు ఉండేది.
ఆ కాలంలో ఫ్రాంజ్ జేవియర్ వింటర్‌హాల్టర్ అనే ఒక ప్రఖ్యాత చిత్రకారుడు ఉండేవారు.
రాణి అతనిని దలీప్ సింగ్ చిత్రాన్ని తయారు చేయమని కోరింది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో దలీప్ సింగ్ తన చిత్రానికి పోజ్ ఇస్తున్న సమయంలో, రాణి ఒక పెట్టె తీసుకురమ్మని సైనికుడిని పంపింది. ఆ పెట్టెలో కోహినూర్ వజ్రం ఉంది.
ఆమె దలీప్ సింగ్‌తో "నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను" అని చెప్పారు. దలీప్ సింగ్ వెంటనే కోహినూర్‌ను చేతిలోకి తీసుకున్నారు. ఒక కిటికీ దగ్గరకు తీసుకువెళ్లి సూర్యకాంతిలో పరిశీలించారు. అప్పటికే కోహినూర్ ఆకారం మారిపోయింది. దాని సైజు తగ్గినట్టు కనిపించింది.
అది దలీప్ సింగ్ పంజాబ్ మహారాజుగా ఉన్నప్పుడు ధరించిన కోహినూర్ కాదు. కోహినూర్‌ను కాసేపు చూసిన తర్వాత, దలీప్ సింగ్ రాణితో "మహారాణీ, ఈ వజ్రాన్ని మీకు సమర్పించడం నాకు గొప్ప గౌరవం" అని అన్నారు. విక్టోరియా ఆయన నుంచి ఆ వజ్రాన్ని స్వీకరించి, తన మరణం వరకు దాన్ని ధరించారని చెబుతారు.

ఫొటో సోర్స్, Photo12/Universal Images Group via Getty Images
తల్లికోసం భారత్‌కు..
విక్టోరియా రాణికి ఎంతో ప్రియంగా ఉన్నప్పటికీ, కొన్ని సంవత్సరాల తర్వాత దలీప్ సింగ్ తన అసలు తల్లి జిందన్ కౌర్‌ను కలవడానికి భారత్ వెళ్లాలని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో జిందన్ కౌర్ నేపాల్‌లో ఉండేవారు. తల్లీకొడుకులను కలిపేందుకు ఆమెను కలకత్తాకు తీసుకువచ్చారు.
"దలీప్ అప్పటికే అక్కడికి చేరుకున్నారు. రాణి జిందన్ కౌర్‌ను అతని ముందుకు తీసుకువచ్చారు. తాను అతడిని మళ్లీ ఎప్పటికీ విడిచిపెట్టనని జిందన్ చెప్పారు" అని అనితా ఆనంద్ వివరించారు.
ఆయన ఎక్కడికెళ్ళినా ఆమె కూడా వెళ్ళేవారు. అప్పటికే జిందన్ తన కంటి చూపును కోల్పోయారు. ఆమె దలీప్ సింగ్ తల నిమిరినప్పుడు, ఆయన జుట్టు కత్తిరించుకున్నారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధపడ్డారు. సరిగ్గా అదే క్షణంలో కొంతమంది సిక్కు సైనికులు ఓపియం యుద్ధంలో పాల్గొని చైనా నుంచి తిరిగి వస్తున్నారు.
జిందన్ కలకత్తాకు చేరుకుందని తెలుసుకున్న వారు, జిందన్ తన కొడుకు దలీప్ను కలుస్తున్న స్పెన్స్ హోటల్‌కెళ్లారు. "బోల్ సో నిహాల్, సత్ శ్రీ అకాల్" అని నినాదాలు చేశారు. దీంతో భయపడిన బ్రిటిష్ వారు, తల్లి కొడుకులను ఒక ఓడలో ఎక్కించి ఇంగ్లాండ్‌కు పంపించేశారు.
దలీప్ సింగ్ క్రమంగా విక్టోరియా రాణి పట్ల వ్యతిరేకతను పెంచుకున్నారు. తనకు అన్యాయం జరిగిందని ఆయన భావించారు. తన సామ్రాజ్యాన్ని తిరిగి జయించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఆయన ఓడలో భారతదేశానికి బయలుదేరినా అదెన్ వరకు మాత్రమే రాగలిగారు.
1886 ఏప్రిల్ 21న పోర్ట్ సెయిడ్లో ఆయనను, ఆయన కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. తర్వాత విడిచిపెట్టినప్పటికీ, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 1893 అక్టోబర్ 21న పారిస్‌లోని ఒక చిన్న హోటల్లో ఆయన ఒంటరిగా మరణించారు. దాంతో మహారాజా రంజిత్ సింగ్ రాజవంశం శాశ్వతంగా అంతమైంది.
క్వీన్ విక్టోరియా మరణానంతరం, ఆమె కుమారుడైన కింగ్ ఎడ్వర్డ్ VII తన కిరీటంలో కోహినూర్‌ను పెట్టుకోలేదు. కానీ ఆయన భార్య క్వీన్ అలెగ్జాండ్రా కిరీటంలో దాన్ని పొదిగారు. కోహినూర్‌ను తాకిన ఏ పురుషుడైనా నాశనమవుతాడనే మూఢనమ్మకం వ్యాపించింది. అయితే మహిళలు దాన్ని ధరించడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు.
ఆ తర్వాత కాబోయే రాజు జార్జ్ V భార్య అయిన యువరాణి మేరీ కూడా దీన్ని తన కిరీటంలో ధరించారు. తర్వాత క్వీన్ ఎలిజబెత్ II కిరీటంలో కోహినూర్ లేదు. నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన ఈ వజ్రాన్ని లండన్ టవర్లోని జ్యూవెల్ హౌస్‌లో భద్రపరిచారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































