భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉంది? భారత్ కంటే ఏయే దేశాల వద్ద ఎక్కువ బంగారం ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సయీదుజ్జమాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం చాలాకాలంగా ఒక కీలక భాగం. బంగారాన్ని అనిశ్చిత పరిస్థితులలో ఆదుకునే రక్షణాత్మకమైన పెట్టుబడిగా చాలామంది భావిస్తుంటారు. సంపదను నిల్వ చేసుకునే మార్గంగానూ పరిగణిస్తారు.
భారత్‌లో చాలా కుటుంబాల పొదుపు, ఖర్చుల్లో బంగారం కీలకమైనది కావడం ప్రపంచ అతిపెద్ద బంగారం మార్కెట్లలో భారత్‌ను ఒకటిగా నిలిపింది.
అయితే ఇటీవల వారాలలో బంగారం ధరలు తగ్గుతూవచ్చాయి.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి బంగారం ధర 10 శాతానికి పైగా పడిపోయిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
'భారత్‌లో బంగారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బంగారం ఉత్పత్తి ఇంకా చాలా తక్కువగా ఉంది' అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గతవారం ఒక వ్యాసంలో రాశారు.


ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో బంగారం
భారత్ దగ్గర నిజానికి ఎంత బంగారం ఉందో మీకు తెలుసా?
అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామిని బీబీసీ ఈ ప్రశ్న అడిగింది.
"వివిధ రకాల గణాంకాలు ఉన్నాయి, వాటిలో కొన్ని కచ్చితమైనవి. మిగిలినవి అంచనాలు. ఆర్‌బీఐ వద్ద సుమారు 800-820 టన్నుల బంగారం ఉంది. అలాగే దేశంలో ఆర్థికంగా వెలికితీయగల బంగారం సుమారు 70-80 టన్నులు మాత్రమే" అని ఆయన చెప్పారు.
ఆర్థికంగా వెలికితీయగల బంగారం అంటే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో లాభదాయకంగా తవ్వి తీసుకోగల బంగారం అని అర్థం.
"భారత్‌లో మంచి నాణ్యత గల బంగారం తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ మైనింగ్ పోటాపోటీగా ఏమీ జరగదు" అని ప్రొఫెసర్ సుందరవల్లి అంటున్నారు.
"భారతీయుల దగ్గర చాలా బంగారం ఉంది. ఎంత బంగారం ఉందనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అది సాధారణంగా 25 వేల నుంచి 27 వేల టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు" అని ఆయన అన్నారు.
ఈ అంకెకు ఆధారం ఏంటని అడగ్గా, ఇది చాలా మంది నమ్మే ఒక సాధారణ అంచనా మాత్రమే అని ఆయన అన్నారు.
"ప్రతిఏటా 600 నుంచి 700 టన్నుల బంగారం దిగుమతి అవుతుండగా, ఎగుమతి చాలా తక్కువ. అందుకే ఈ బంగారం ఇళ్లలో ఉండిపోయింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కంటే ఎక్కువ బంగారం ఉన్న దేశాలు ఎన్ని?
భారత్ వద్ద 2026 ఫిబ్రవరి నాటికి అధికారికంగా సుమారు 880 టన్నుల బంగారం ఉన్నట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.
ఈ విషయంలో భారత్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. దీనికంటే ముందు అమెరికా, జర్మనీ, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్ ఉన్నాయి.
అయితే అధికారిక నిల్వలు భారతదేశపు బంగారు కథలో ఒక భాగం మాత్రమే.
"మన దగ్గర సుమారు 50 కోట్ల టన్నుల పసిడి ధాతువు (అంటే బంగారం కలిగిన రాయి/మట్టి) ఉంది, కానీ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది" అని థరూర్ తన వ్యాసంలో రాశారు.
దేశంలో మొత్తం 518.23 మిలియన్ టన్నుల పసిడి ధాతువు ఉన్నట్టు నేషనల్ మినరల్ ఇన్వెంటరీ చెబుతోంది.అయితే దీనర్థం ఈ పసిడిధాతువునంతటినీ వెలికి తీయడం తేలికైన పని అని కాదు. ఇందులో 494.50 మిలియన్ టన్నుల బంగారం వెలికితీయడం కష్టపమైనది కాగా, 23.72 మిలియన్ టన్నులను మాత్రం రిజర్వ్‌గా పరిగణిస్తారు.
రిజర్వ్ అంటే బంగారాన్ని వెలికితీయడం లాభదాయకంగానూ, సులభంగా సాధ్యమయ్యే స్థితి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైవేట్ కంపెనీలు ఎందుకు పెట్టుబడి పెట్టవు
భారత్ 2023-24లో కేవలం 1.6 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేసినట్టు ఇండియన్ మినరల్స్ ఇయర్‌బుక్ 2024 ద్వారా తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా 2023లో సుమారు 3,300 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయగా, చైనా ఒక్కటే 375 టన్నులను ఉత్పత్తి చేసింది.
భారత్ సామర్థ్యానికి, ఉత్పత్తికి మధ్య తేడాకు అనేక కారణాలు ఉన్నాయి. బంగారు గనులను అన్వేషించడం ఖర్చుతో కూడుకున్నదే కాదు ప్రమాదకరమైనది కూడా.
పక్కా ఆధారాలు లేకుండా ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వెనుకాడతాయి.
"మైనింగ్ అనేది ఖరీదైన వ్యాపారం. దీనికి మానవ వనరులు, సాంకేతికతలో గణనీయమైన పెట్టుబడి అవసరం, అది ప్రభుత్వం వద్ద లేదు. ప్రైవేట్ కంపెనీలకు నమ్మకం కలిగినప్పుడు మాత్రమే రంగంలోకి వస్తాయి" అని బాత్ విశ్వవిద్యాలయ అభివృద్ధి కేంద్రంలో విజిటింగ్ ప్రొఫెసర్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్ సంతోష్ మల్హోత్రా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దిగుమతులు ఎక్కువ..
ఉత్పత్తి తక్కువగా ఉండడంతో భారత్ దిగుమతులపై ఆధారపడింది.
భారత్ 2023-24లో సుమారుగా 3,600 టన్నుల ముడి బంగారాన్ని, 795 టన్నుల శుద్ధి చేసిన బంగారాన్ని దిగుమతి చేసుకుంది.
అలాగే భారతీయుల వద్ద సుమారు 24,000 టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతదేశంలో బంగారం ఎప్పటినుంచో పొదుపు కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు అసోచామ్ పేర్కొంది.
ఇది కనీస అంచనా మాత్రమే, వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రొఫెసర్ సుందరవల్లి అంటున్నారు.
మార్కెట్ విలువ పరంగా చూస్తే భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ చాలా ఎక్కువ.
భారత్‌లో ఇళ్లలో 3.8 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 352.75 లక్షల కోట్లు) బంగారం ఉంది. ఇది దేశ జీడీపీలో దాదాపు 88.8 శాతానికి సమానమని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.
ఇక వినియోగానికి సంబంధించి ఎమ్ఎమ్‌టీసీ-పీఏఎమ్‌పీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సమిత్ గుహా బీబీసీతో మాట్లాడారు.
"భారత్ 2025లో 710.9 టన్నుల బంగారాన్ని వినియోగించింది. ఇది 2024లోని 802.8 టన్నుల కంటే 11 శాతం తక్కువ. కానీ విలువ పరంగా డిమాండ్ 30% పెరిగి రూ.7,51,490 కోట్లకు చేరింది, ఇది ఒక రికార్డు" అన్నారు.
బంగారం కొనుగోలు తీరులో కూడా మార్పు కనిపిస్తోంది.
"బంగారం కొనడానికి ప్రజలు వెనుకాడటం లేదు, వారు ప్రతి రూపాయికి అత్యధిక విలువను ఇచ్చే ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారు" అని గుహా అన్నారు.
దీనర్థం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది ఆభరణాలకు బదులుగా బంగారు కడ్డీలు/బిస్కెట్లు, నాణేలను కొనుగోలు చేస్తున్నారు.
ఫలితంగా ఆభరణాల పరిమాణం 24 శాతం తగ్గి 430.5 టన్నులకు పడిపోగా, కడ్డీలు, నాణేల డిమాండ్ 17 శాతం పెరిగి 280.4 టన్నులకు చేరిందని, ఇది దశాబ్దానికి పైగా కాలంలో అత్యంత బలమైన పెట్టుబడి డిమాండ్‌ను సూచిస్తోందని గుహా అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం ఎందుకు ముఖ్యం?
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. బంగారం ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, కరెన్సీని కూడా ప్రభావితం చేస్తుంది.
ఒక దేశం ఎక్కువ బంగారాన్ని ఎగుమతి చేస్తే, దాని కరెన్సీ బలపడుతుంది. అయితే భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, ధరలు పెరిగినప్పుడు రూపాయి ఒత్తిడికి గురవుతుంది.
ఒక దేశ ఆదాయంలో ఎక్కువభాగం అక్కడ తయారైన లేదా ఉత్పత్తి చేసిన వస్తువుల ఎగుమతుల నుంచి వస్తుంది. అంటే ప్రధాన ఎగుమతులు, దిగుమతుల కంటే ఎక్కువ ఆదాయాన్ని తీసుకువస్తే ఆ దేశ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇదే సూత్రం బంగారానికి కూడా వర్తిస్తుంది.
మొత్తం మీద భారతదేశపు బంగారాన్ని మూడు భాగాలుగా విభజించారు. ప్రభుత్వ నిల్వలు, బంగారు గనులు, భారతీయుల వద్ద ఉన్న బంగారం.
వాస్తవానికి భారత్‌లోని బంగారంలో అధిక భాగం ప్రభుత్వం వద్ద గానీ, గనులలో గానీ లేదు, అది ప్రజల వద్దనే ఉంది. అందుకే భారత ఆర్థిక వ్యవస్థకు బంగారం చాలా ముఖ్యమైంది.
ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ప్రజల పొదుపు, భద్రతకు ఒక ముఖ్యమైన సాధనం కూడా.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































