జర్మన్ సిల్వర్: దీనికి పాపులారిటీ ఎందుకు పెరుగుతోంది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఇటీవలి కాలంలో వెండి ధరలు గణనీయంగా పెరగడంతో, వెండి స్థానంలో మరో లోహం పేరు వినిపిస్తోంది. అదే 'జర్మన్ సిల్వర్'.
పేరులో 'సిల్వర్' ఉన్నప్పటికీ ఇది అసలు వెండి కాదు. అయినా వెండిలాగే మెరుస్తుంది. అదే ఇప్పుడు దీనికి పాపులారిటీ తెచ్చిపెడుతోంది.
అసలేంటీ జర్మన్ సిల్వర్? వెండికి, దీనికి తేడాలేంటి?
దీని అమ్మకాలపై వ్యాపారులు, నిపుణులు ఏమంటున్నారు?
ఇంతకీ జర్మన్ సిల్వర్ ఇండియాలో దొరుకుతుందా? ధర ఎంత ఉంటుంది?


జర్మన్ సిల్వర్ అంటే
పేరులో 'సిల్వర్' ఉన్నా, జర్మన్ సిల్వర్‌లో అసలు వెండి ఉండదు.
"సుమారు 60 శాతం కాపర్, 20 శాతం నికెల్, 20 శాతం జింక్ కలిస్తే ఏర్పడే మిశ్రమం వెండిలాగే మెరుస్తుంది. ఈ మిశ్రమాన్నే జర్మన్ సిల్వర్ అంటారు" అని ఆంధ్ర విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగానికి చెందిన ఆనరరీ ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు చెప్పారు.
ఈ మిశ్రలోహాన్ని తొలిసారిగా జర్మనీలో అభివృద్ధి చేయడంతో అక్కడి నుంచే 'జర్మన్ సిల్వర్' అనే పేరు స్థిరపడింది. మెటలర్జీ భాషలో దీనిని 'నికెల్ సిల్వర్' అని కూడా పిలుస్తారు.

వెండికి, జర్మన్ సిల్వర్‌కి తేడా ఏంటంటే...
వెండి ధరలు పెరుగుతుండడంతో తక్కువ ధరలో వెండిలా కనిపించే జర్మన్ సిల్వర్ వస్తువుల వైపు కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. "చూడటానికి వెండి, జర్మన్ సిల్వర్ మధ్య పెద్దగా తేడా కనిపించదు. షైనింగ్ కూడా ఒకేలా ఉంటుంది. కానీ లోపల ఉండే లోహాలే అసలు తేడా" అని విశాఖపట్నంలోని జర్మన్ సిల్వర్ వ్యాపారి అమిత్ శర్మ బీబీసీతో చెప్పారు.
ధర విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉందన్నారు.
"ఒక కేజీ వెండితో చేసిన ఒక కుందు ధర 2లక్షల వరకు ఉంటే...అదే డిజైన్ జర్మన్ సిల్వర్‌లో అయితే సుమారు 15 వేలలోపే లభిస్తుంది. వెండి వస్తువుల ధర పెరగడంతో జర్మన్ సిల్వర్ ఒక ప్రత్యామ్నాయంగా మారింది" అని అమిత్ శర్మ తెలిపారు.
జర్మన్ సిల్వర్‌లో ఉన్న క్వాలిటీని బట్టి ప్రస్తుతం మార్కెట్ లో సిల్వర్ ప్లేటెడ్ జర్మన్ సిల్వర్ కేజీ ధర రూ.1500 నుంచి స్టాండర్డ్ జర్మన్ సిల్వర్ ధర కేజీ. రూ. 6000 వరకు ఉండొచ్చునని అమిత్ శర్మ చెప్పారు.
ఇక వెండి ధరైతే కేజీకి రూ. 2.45లక్షల పైనే ఉంది.

జర్మన్ సిల్వర్ ఎక్కడెక్కడ వాడతారంటే...
జర్మన్ సిల్వర్ అమ్మే దుకాణాలకు గతంలో కంటే ఎక్కువ కస్టమర్లు వెళ్తున్నారని విశాఖలోని వెండి వస్తువుల వ్యాపారి వెంకట సత్య సుబ్బరామ్ బీబీసీతో అన్నారు.
" డెకరేటివ్ వస్తువులు, పూజా సామాగ్రి, ఇమిటేషన్ జ్యువెలరీ, రిటర్న్ గిఫ్ట్స్ తయారీలో జర్మన్ సిల్వర్ వాడతారు. కొనుగోలుదార్లు కూడా ఇవే ఎక్కువగా కొంటారు. కాకపోతే ఇప్పుడు వెండి ధర చాలా ఎక్కువ పెరిగిపోవడంతో...రిటర్న్ గిప్ట్స్, పూజా సామాగ్రి వంటివి వెండివి కాకుండా జర్మన్ సిల్వర్‌తో తయారు చేసినవే కొంటున్నారు" అని జర్మన్ సిల్వర్ వ్యాపారి అమిత్ శర్మ చెప్పారు.
"వంగే గుణం ఎక్కువగా ఉండటంతో ఆటోమొబైల్ పార్ట్స్, సైన్స్ పరికరాలు, ప్లగ్ పిన్స్, కనెక్టర్ల తయారీలోనూ జర్మన్ సిల్వర్ వినియోగం ఉంది" అని ఆనరరీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పారు.
ఇటీవలి కాలంలో ఇంటీరియర్ డెకరేషన్ ట్రెండ్ కూడా జర్మన్ సిల్వర్ డిమాండ్‌ను పెంచుతోందని వ్యాపారులు చెబుతున్నారు.

వెండికి, జర్మన్ సిల్వర్‌కు మధ్య తేడాని గుర్తించడం ఎలా?
వెండి, జర్మన్ సిల్వర్ చూడటానికి రెండూ ఒకేలా ఉండటంతో వినియోగదారులు కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే చిన్న పరీక్షతో తేడా తెలుసుకోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
"గీటు వేసి చూస్తే లోపల ఉన్న లోహం రంగు బయటపడిపోతుంది. వెండి అయితే రంగు మారదు. బ్రాస్ లేదా కాపర్ ఉంటే ఆ రంగు స్పష్టంగా కనిపిస్తుంది" అని జర్మన్ సిల్వర్ వ్యాపారి కల్యాణి బీబీసీతో చెప్పారు.
‘‘వెండిలా కాకుండా జర్మన్ సిల్వర్‌కు రిసేల్ విలువ ఉండదు. దీనికి బులియన్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఇది వెండి కేటగిరీలోకి రాకపోవడంతో హాల్‌మార్క్, బీఎస్ఐ గుర్తింపు వంటివి కూడా ఉండవు. కాబట్టి దీని లెక్కలు అధికారికంగా ఎక్కడ లభించవు’’ అని అమిత్ శర్మ తెలిపారు.
రీసేల్ విలువ లేకపోయినా.. వీటి ఫినిషింగ్ డల్ అయితే మళ్లీ పాలిష్ చేయించుకుని వాడుకోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
‘‘జర్మన్ సిల్వర్ పై పెట్టుబడులు పెట్టేంత స్థాయిలో ఇంకా దీని డిమాండ్ పెరగలేదు" అని అమిత్ శర్మ అన్నారు.

'మిడిల్ క్లాస్ వెండి'గా మారుతున్న జర్మన్ సిల్వర్
వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో తమలాంటి మధ్యతరగతి కుటుంబాలు జర్మన్ సిల్వర్‌ను తమ అవసరాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయని విశాఖపట్నానికి చెందిన రామలక్ష్మీ చెప్పారు.
"తక్కువ ధరలో వస్తుంది, చూడటానికి వెండిలాగే ఉంటుంది, గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది" అన్నారు రామలక్ష్మి. గతంలో వెండివే కొనేవారమని, వెండి ధరలు పెరగిపోవడంతో అల్టర్నేటివ్ గా జర్మన్ సిల్వర్ వస్తువులు కొన్నామని చెప్పారు.

"ఇప్పుడైతే కొందరికి ఇదే వెండి"
ఆర్టికల్స్ తయారికీ ఫ్లెక్సిబుల్ గా ఉండటం, తక్కువ ధరలో దొరకడం, అచ్చం వెండిలా కనిపించడంతో జర్మన్ సిల్వర్ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని జర్మన్ సిల్వర్ వ్యాపారి కల్యాణి అన్నారు.
‘‘కొంతమంది వినియోగదారుల్లో జర్మన్ సిల్వర్ అంటే వెండి కాదనే విషయంపై సరైన అవగాహన లేదు. దీనికి వెండి అంత విలువ, అధికారిక గుర్తింపులు ఉండవన్న విషయాన్ని వినియోగదారులు స్పష్టంగా తెలుసుకోవాలి.
జర్మన్ సిల్వర్‌నే వెండి అని చెప్పి విక్రయాలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి వెండి కొనేటప్పుడు వెండిలా ఉండే జర్మన్ సిల్వర్ ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది" అని కల్యాణి వివరించారు.

జర్మన్ సిల్వర్ హానికరకమా?
జర్మన్ సిల్వర్ మిశ్రమ లోహం కావడంతో దీనిలో చర్మ వ్యాధులకు కారణమయ్యే నికెల్ లోహం ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు.
నికెల్ అలర్జీ ఉన్నవారు జర్మన్ సిల్వర్ ఉపయోగిస్తే చర్మ సమస్యలు రావచ్చని చెప్పారు.
ఆమ్లాలతో జర్మన్ సిల్వర్ చర్యపొందే లక్షణం ఉండటంతో...ఆమ్లాలుండే ఆహారాన్ని అందులో నిల్వ చేయకుండా ఉండటం మంచిది. అందుకే జర్మన్ సిల్వర్‌ను వంటకు కాకుండా డెకరేటింగ్, గిఫ్టింగ్, ఆభరణాలకు పరిమితం చేయడం మంచిదని చెప్పారు.
ఇటీవల యువత ఎక్కువగా జర్మన్ సిల్వర్ ఆభరణాలను ఎంపిక చేసుకుంటోందని.. జర్మన్ సిల్వర్ తో తయారు చేసిన చెవిపోగులు, గొలుసులు, గాజులు, చేతి కడియాలు, ట్రైబల్ ఆర్ట్ స్టైల్ నగలను ఇష్టపడుతోందని అమిత్ శర్మ చెప్పారు.
"స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారు చేసే జర్మన్ ప్లేటెడ్ సిల్వర్, బ్రాస్, కాపర్ మీద సిల్వర్ కోట్ వేసి మరోరకం ఉంది. మిశ్రమాలు మారితే తేడా వస్తుంది. ఇందులో రెండు, మూడు వెరైటీలు కూడా వస్తాయి. కానీ అన్నింటినీ జర్మన్ సిల్వరే అంటారు" అని వ్యాపారి కల్యాణి చెప్పారు.

పర్యవేక్షణ ఉందా?
జర్మన్ సిల్వర్ అసలు వెండి కాదు కాబట్టి బీఎస్ఐ గుర్తింపు, హాల్‌మార్క్ వర్తించవు. ప్రభుత్వం పర్యవేక్షణ చేయదు.
‘‘మార్కెట్లో మోసాలు పెరగకుండా ఉండేందుకు జర్మన్ సిల్వర్ కొనుగోలు చేసేటప్పుడు అది జర్మన్ సిల్వర్ అని తెలిపే విధంగా అమ్మేవారు స్టాంపులు వేయాలి. అలాగే వెండి కొనేటప్పుడు '925 సిల్వర్', 'స్టెర్లింగ్ సిల్వర్', 'హాల్‌మార్క్' 'బీఎస్ఐ’ గుర్తూ ఉంటాయి. వాటిని గమనించాలి" అని జర్మన్ సిల్వర్ వ్యాపారి అమిత్ శర్మ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














