బంగారంలాగే వెండి ధర కూడా ఎందుకు పెరుగుతోంది, కొనడం సురక్షితమేనా? 5 సందేహాలు- సమాధానాలు

వెండి, పెట్టుబడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

వెండి ధర కూడా ఇటీవల గరిష్ఠ ధరల రికార్డులను తాకుతోంది. 14వ తేదీ ఉదయం, ఒక గ్రాము వెండి ధర రూ.9 పెరిగి రూ.206కి చేరుకుంది.

ఇక 15వ తేదీ ఉదయం, ఒక గ్రాము వెండి ధర రూ.1 పెరిగి రూ.207కి చేరుకుంది. ఒక కిలో వెండి రూ.2,07,000కి అమ్ముడైంది.

ఇలా 20 రోజుల్లోనే కిలో వెండి ధర దాదాపు రూ.62 వేలు పెరిగింది.

రాబోయే రోజుల్లో కూడా వెండి ధర పెరుగుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక డిమాండ్, పండుగ సీజన్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు సహా వెండి ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి.

ఎక్కువమంది వెండిలో పెట్టుబడి పెడుతున్నందున, దానికి డిమాండ్ కూడా పెరిగింది. తమిళనాడులో వెండి కడ్డీలు (సిల్వర్ బార్స్) పూర్తిగా అయిపోయాయని, ప్రస్తుతం ముందస్తు ఆర్డర్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చని ఆభరణాల వ్యాపారులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వెండి

"వెండికి డిమాండ్ గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగింది. గతంలో ఇంత డిమాండ్ లేదు. ఇంతకుముందు డబ్బు చెల్లించిన వెంటనే వెండి కడ్డీలు దొరికేవి. ఇప్పుడు, రిజర్వేషన్ చేసుకుని 10 రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఉన్న ధరకే వెండి కడ్డీని కొనుగోలు చేయవచ్చు" అని బంగారు, వజ్రాల వ్యాపారుల సంఘం ప్రెసిడెంట్ జయంతిలాల్ చలాని అన్నారు.

వెండి, పెట్టుబడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
వెండి

"పరిశ్రమలో వెండికి అధిక డిమాండ్ ఉంది. బ్యాటరీలు, సోలార్ ప్యానెల్‌లు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాలలో వెండిని ఉపయోగిస్తారు. అదే సమయంలో వెండిలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. దీని కారణంగా డిమాండ్ పెరిగింది" అని జయంతిలాల్ చలాని అన్నారు.

వెండి ఆభరణాల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ పరిమితి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దుర్వినియోగం కాకుండా చూడటానికి ఈ చర్య తీసుకున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ తెలిపింది.

వెండి దిగుమతి విధానం 'ఉచితం నుంచి పరిమితం'కి మారింది. ఇది వెంటనే అమలులోకి వచ్చింది. అయితే, ఈ దిగుమతి పరిమితి కారణంగా వెండి డిమాండ్‌ను తీర్చడం అసాధ్యంగా మారుతోందని జయంతిలాల్ చలాని అభిప్రాయపడ్డారు.

"వెండి ఆభరణాల దిగుమతి లేనందున, ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడం సాధ్యం కాదు" అని ఆయన చెప్పారు.

అంతేకాకుండా, ఇది పండుగ సీజన్ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. వెండిని ఎలక్ట్రానిక్ వాహనాల్లో కూడా ఉపయోగిస్తున్నందున దీనికి డిమాండ్ పెరిగిందని నిపుణులు అంటున్నారు.

"అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి వెండి ధర మారుతూ ఉంటుంది. డాలర్ విలువలో హెచ్చుతగ్గుల కారణంగా వెండి ధర పెరుగుతుంది" అని మద్రాస్ జ్యువెలర్స్ అండ్ డైమండ్ డీలర్స్ అసోసియేషన్ సభ్యుడు ఉస్మాన్ అన్నారు.

వెండి, పెట్టుబడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
వెండి

"ప్రస్తుతం వెండి మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. మీరు వెండి నాణేలు, వెండి కడ్డీలు, పాత్రలు లేదా నగలు ఏ రూపంలోనైనా పెట్టుబడి పెట్టవచ్చు" అని జయంతిలాల్ చలాని అంటున్నారు.

"ఇప్పుడు వెండిని కొని, దాని ధర పెరిగినప్పుడు అమ్మితే మంచి లాభం పొందవచ్చు" అని ఉస్మాన్ సూచిస్తున్నారు.

వెండి, పెట్టుబడులు, స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
వెండి

"బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా పొదుపు చేయాలని కోరుకుంటారు. మధ్యతరగతి వారు వెండిలో పెట్టుబడి పెడుతున్నారు. వెండిని బార్స్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈటీఎఫ్‌గానూ కొనొచ్చు. వెండి సురక్షితమైన పెట్టుబడి. వెండిలో వ్యర్థం ఉండదు. అధిక నాణ్యత కలిగి ఉంటుంది" అని ఇన్వెస్ట్‌మెంట్స్ అడ్వైజర్‌గా పని చేస్తున్న సతీశ్ చెప్పారు.

ఈటీఎఫ్‌ అంటే స్టాక్ మార్కెట్‌లో స్టాక్‌ల మాదిరి కొనుగోలు చేసి విక్రయించగల ఫండ్.

"వెండిని నేరుగా కొనుగోలు చేసి ఉంచుకోవడానికి బదులుగా, పెట్టుబడిదారులు ఈ ఈటీఎఫ్‌ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఇది వెండిని ఒక వస్తువుగా కొనడం, నిల్వ చేయడం, జాగ్రత్త చేసుకోవాల్సిన ఇబ్బందులు తగ్గిస్తుంది" అని సతీశ్ చెప్పారు.

వెండి

బంగారంలో 24 క్యారెట్లు, 22 క్యారెట్లు అనేవి దాని నాణ్యతను అంచనా వేయడానికి ఉపయోగించే యూనిట్లు. అదేవిధంగా, వెండిలో 99.9 శాతం అనేది స్వచ్ఛమైన వెండిని సూచిస్తుంది.

ఇదికాకుండా, 92.5 శాతం వెండితో స్టెర్లింగ్ వెండి అనేది మరోరకం వెండి ఉంటుంది. ఇందులో తక్కువ మొత్తంలో రాగి ఉంటుంది. నగలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

వెండి వస్తువులపై 3 శాతం జీఎస్టీ ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)