మూసీ నది.. పుట్టుక నుంచి కృష్ణానదిలో కలిసే వరకు 18 చిత్రాల్లో

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ నగర పునాది, విస్తరణకు మూలం మూసీ నది.
ప్రస్తుతం మురికికూపంగా మారిన మూసీ నది చుట్టూ ఏదో ఒక చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది.
తరచూ వరదలు వచ్చి పరివాహక ప్రాంతాల్లోని బస్తీలు, ఇళ్లు నీట మునుగుతుంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులు తెరపైకి వస్తుంటాయి.
ఈ నేపథ్యంలో మూసీ నది ప్రస్థానం ఏమిటి? ఎక్కడ పుట్టింది? ఎలా మలుపులు తిరిగింది? ఎక్కడెక్కడ ఎలా మారింది? చివరికి కృష్ణా నదిలో ఎలా కలుస్తుంది? ఓసారి చూద్దాం.

తెలంగాణలోనే పుట్టిన మూసీ ప్రయాణం తెలంగాణలోనే ముగుస్తుంది.
వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టిన మూసీ నది నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

వికారాబాద్ జిల్లా నుంచి మొదలుకుని రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల మీదుగా సుమారు 240 కిలోమీటర్ల మేర మూసీ ప్రయాణం సాగుతుంది.
సముద్ర మట్టానికి 4,660 మీటర్ల ఎత్తులో పుట్టి.. సముద్ర మట్టానికి 61 మీటర్ల ఎత్తులో కృష్ణాలో కలుస్తుంది.

అనంతగిరి అడవులలో అనంత పద్మనాభస్వామి ఆలయం వద్ద చిన్న గుండం (నీటి మడుగు) నుంచి వచ్చే ఊటల నుంచి మూసీ పుడుతుంది.

పిల్ల కాలువగా మొదలైన మూసీ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి వద్దకు చేరుకునేసరికి నది రూపం సంతరించుకుంటుంది.

మార్కండేయ పురాణం ప్రకారం మూసీ నదిని 'ముచుకుంద' నదిగా కూడా పిలుస్తుంటారు.
ముచుకుంద అనేది ఓ రాజు పేరు. కాకతీయ 13 వ శతాబ్దపు శాసనాల్లో 'ముసేరు' అని, తర్వాత 'మూసీ ఏరు' అని ఉంటుందని చరిత్ర పరిశోధకుడు ప్రశాంత్ చెల్లి చెప్పారు.
1908 సెప్టెంబరు 26, 27, 28 తేదీల్లో మూసీకి వచ్చిన భారీ వరదలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి.
ఈ వరదల్లో సుమారు 15వేల మంది చనిపోయారని అప్పటి నిజాం ప్రభుత్వం అంచనా వేసింది.

ఆ వరదల సమయంలో సుమారు 150 మంది ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న చింత చెట్టుఎక్కి, తమ ప్రాణాలు కాపాడుకున్నారని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.
దీనికి సంబంధించి ప్రత్యేకించి గుర్తులేవీ అక్కడ లేవు కానీ ఒక పలక చింతచెట్టుకు వేలాడదీసి ఉంటుంది. ఈ చింతచెట్టు ఇప్పటికీ సజీవంగా ఉంది.

1908 వరదల తర్వాత మూసీ నదికి వచ్చే వరదల నియంత్రణకు, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు అప్పటి ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఆలోచనల మేరకు ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రెండు రిజర్వాయర్లు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.
అవే గండిపేట(ఉస్మాన్ సాగర్) రిజర్వాయర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్.

ఉస్మాన్ సాగర్‌ను మూసీపై నిర్మిస్తే, హిమాయత్ సాగర్‌ను ఈసీ నదిపై నిర్మించారు.
1908లో మూసీ నదికి 4.5లక్షల క్యూసెక్కుల వరద నీరు రాగా,
1962, 65… 40వేల క్యూసెక్కులు
2020.. 35వేల క్యూసెక్కులు
2023.. 33వేల క్యూసెక్కులు
2024.. 30వేల క్యూసెక్కులు
2025.. 34వేల క్యూసెక్కుల వరద మూసీ నదికి వచ్చింది.

లంగర్ హౌస్ ప్రాంతంలోని బాపూఘాట్ వద్ద మూసీ నది హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తుంది.
ఇక్కడే ఈసీ నది (వాగు), ముచుకుందా అనే మరో వాగు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయి.
ఈసీ నది పూడూరు మండలం కొంకల్ గ్రామం వద్ద మొదలవుతుంది.
బాపూఘాట్ ప్రాంతం నుంచి ఇండస్ర్టియల్, డొమెస్టిక్ వ్యర్థాలు కలిసి మూసీ నది ప్రవాహం మురికికూపంగా మారిపోయింది.
మూసీ ఒడ్డున నగరంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కనిపిస్తుంటాయి. హైకోర్టు భవనం, ఉస్మానియా ఆసుపత్రి, పేట్ల బుర్జు ఆసుపత్రి, సిటీ కాలేజీ, సాలార్ జంగ్ మ్యూజియం, కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీ... ఇవన్నీ నది ఒడ్డునే ఉంటాయి.
పురానాపూల్ నుంచి మొదలుకుని పర్వాతాపూర్ వరకు దోబీఘాట్ ప్రాంతాలు మూసీ పరివాహకంలో ఉన్నాయి.
మూసీలో నగరంలోని ఆక్రమణలతోపాటు కొబ్బరి, అరటి వంటి తోటలు పెంచుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

నదిపై చాలాచోట్ల కత్వాలు (పెద్ద సైజు చెక్ డ్యాంలు), వంతెనలు పెద్దసంఖ్యలో నిర్మించారు.
మూసీ నది ప్రక్షాళనకు గత మూడు దశాబ్దాల్లో కొన్ని ప్రణాళికలు తెరపైకి వచ్చాయి.
1997లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నందనవనం ప్రాజెక్టు చేపట్టగా.. పర్యావరణవేత్తల నుంచి వచ్చిన అభ్యంతరాలతో 2001లో నిలిచిపోయింది.

తర్వాత 2005లో సేవ్ మూసీ ప్రాజెక్టు చేపట్టాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించినా, ముందుకు సాగలేదు.

2017లో టీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాకులు, పార్కులు, ఎస్టీపీలు ప్రతిపాదించింది.
ఇందులో నాగోలు, చాదర్‌ఘాట్, పురానాపూల్ ప్రాంతాల్లో వాకింగ్ ట్రాకులు నిర్మించింది.

2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూసీ పునరుజ్జీవం పేరుతో కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చింది. దీనిపై పురోగతి ఏమీ లేదు.
నగరంలో మూసీ పురానాపూల్ వద్ద రెండు పాయలుగా విడిపోయి, మళ్లీ ఎంజీబీఎస్ వద్ద కలుస్తుంది.
శుద్ధి చేయకుండా మురికి నీటిని నేరుగా విడిచిపెడుతుండటంతో మురికి సమస్య తీవ్రంగా మారింది.

హైదరాబాద్ నగరం నుంచి విడుదలయ్యే మురికి నీరు, ఎగువ నుంచి వచ్చే వరద కారణంగా.. నగరం దాటాక వాడపల్లిలో కృష్ణా నదిలో కలిసేవరకు నది ప్రవాహం ఎక్కువగా కనిపిస్తుంది.

మూసీ నీటిపై ఆధారపడి వరి, ఆకుకూరలు, కూరగాయల పంటలతోపాటు గడ్డిని రైతులు పెంచుతుంటారు.
సూర్యాపేట జిల్లా సోలిపేట సమీపంలో 1963లో మూసీ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం నిర్మించింది.
4.6 టీఎంసీల సామర్థ్యంతో 30వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో దీన్ని నిర్మించారు.

హైదరాబాద్‌కు ముందు, తర్వాత మూసీ నది కుంచించుకపోయినప్పటికీ.. మూసీ ప్రాజెక్టు వద్ద నుంచి దిగువన ఎంతో విశాలంగా వెడల్పుగా పూర్తి స్థాయి నదిని తలపించేలా కనిపిస్తుంది.

కృష్ణా నదికి మూసీ ఉపనది.
రెండు నదులు కలిసే ప్రాంతం 'వి' ఆకారంలో కనిపిస్తుంటుంది. అక్కడి నుంచి కృష్ణా నది తూర్పువైపునకు ప్రవాహం కొనసాగిస్తుంది.
రెండు నదుల సంగమ ప్రదేశంలోనే అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














