నదులు సముద్రంలో కలవకపోతే ఏమవుతుంది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
నదులు సముద్రంలో సంగమించే ప్రాంతాన్ని చూడటం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇంతకీ నదులు సముద్రంలో కలవకపోతే ఏమవుతుంది?
కొండల్లో పుట్టి వందల, వేల కిలోమీటర్ల ప్రయాణం చేసిన నదులు సముద్రానికి చేరకపోతే? అదేంటి. కలవకుండా ఎలా ఉంటాయని ప్రశ్నించవచ్చు. కలవకపోవడమనేది ఊహాజనితంగా కొట్టిపారేయచ్చు...
కానీ, నదులపై నిర్మించే డ్యామ్‌లు, మానవ అవసరాల కోసం భారీగా వినియోగిస్తున్న నీరు, వాతావరణ మార్పుల వలన కొన్ని నదుల నీరు సముద్రంలో పూర్తి స్థాయిలో చేరడం లేదని పరిశోధనలు చెబుతున్నాయి.

"నదులు సముద్రంలో కలవకపోతే?" అనే ప్రశ్న ఊహాజనితంగా అనిపించినా, ఇదో హెచ్చరిక లాంటిదని జియాలజీ, ఓషనోగ్రఫీ నిపుణులు అంటున్నారు.
మనం నదుల నీటిని ఎక్కువగా వినియోగిస్తూ, వాటిపై అనేకచోట్ల డ్యామ్‌లు, ప్రాజెక్టులు కడితే భవిష్యత్తులో నదులు సముద్రంలో కలవని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ అంశంపై ఏయూ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఏ. యుగంధర్ రావు, ఓషనోగ్రఫీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ బి. సీతారాముల రెడ్డితో బీబీసీ మాట్లాడింది.
నదుల నీరు సముద్రంలోకి చేరకపోతే ఏమవుతుందో ఫ్రొఫెసర్ ఏ. యుగంధర్ రావు చెప్పిన వివరాల ప్రకారం...


- నదులు సముద్రానికి చేరడమనేది కేవలం సముద్రంలోని నీటి పరిమాణం పెరగడం కాదు.
- సముద్రానికి నదులు రోజూ కోట్ల లీటర్ల "ఫ్రెష్ వాటర్" తీసుకెళ్తుండటంతో... సముద్రంలోని ఉప్పుతనం సర్దుబాటు అవుతూ ఉంటుంది. సముద్రాల్లో సరాసరి ఉప్పదనం 35000 PPM (parts per million) ఉంటుంది. అది సర్దుబాటు కాకపోతే సముద్ర జీవ వ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు అనేక సముద్ర జీవులు ఉప్పదనం ఎక్కువగా ఉన్న నీటిలో బతకలేవు.
- నదులు తీసుకువచ్చే పోషకాలతో సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు విస్తరిస్తాయి. నదీ పోషకాలు లేకపోతే తీర ప్రాంత మత్స్య సంపద తగ్గిపోతుంది.
- డెల్టాలు, మడ అడవులు, నదులు సముద్రానికి చేరడం వల్లే నిలబడి ఉంటాయి. ఇవి లేకపోతే తీర ప్రాంతాలు తుపాన్ల ప్రభావానికి మరింత సులభంగా దెబ్బతింటాయి.

- నదులనేవి నేలకూ, పంటలకూ ప్రాణం పోసే ఓ సహజ వ్యవస్థ.
- నదుల నీరు సముద్రంలోకి వెళ్లకపోతే నదులు పొంగిపొర్లే అవకాశం పెరుగుతుంది.
- డ్యామ్‌లు, బరాజ్‌లు, చెరువులు నీటితో నిండిపోతాయి. ఆ నీటిని మేనేజ్ చేయకపోతే ప్రమాదాలు జరగొచ్చు.
- అదుపు లేకుండా నిల్వ అయిన భూగర్భజలాలు భూమిని బలహీనపరుస్తాయి.
- గోదావరి, కృష్ణా వంటి డెల్టాలు, దేశంలోనే సారవంతమైన భూభాగాలు.
- నదులు సముద్రానికి చేరకపోతే ఈ డెల్టాలు క్రమంగా పొడిబారిపోతాయి.


నదుల నీరు సముద్రానికి పూర్తిగా వెళ్లకపోవడం కాదు కానీ... నదులపై నిర్మాణాల వలన సముద్రంలోకి చేరే నదుల నీటి పరిమాణం తగ్గుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.
నదీ నీరు సహజంగా ప్రవహించకపోతే ఏమవుతుందనే విషయంపై ఏయూ చేసిన పరిశోధనల ప్రకారం ఒకప్పుడు కృష్ణా, గోదావరి నదులు సముద్రంలోకి తీసుకు పోయే నీరు, మట్టితో డెల్టాలు జీవంతో కనిపించేవి.
ఆ మట్టి వలనే తీర ప్రాంత భూముల్లో పుష్కలంగా పంటలు పండేవని ఏయూ ఓషనోగ్రఫీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ బి. సీతారాములు రెడ్డి బీబీసీతో చెప్పారు.
కానీ, గత కొన్ని దశాబ్దాలుగా కృష్ణా, గోదావరి నదులపై డ్యామ్‌లు, బరాజ్‌ల వలన ఆ ప్రవాహం గణనీయంగా తగ్గిపోయిందన్నారు.

నదీ ప్రవాహంలో 1965-2008 మధ్య జరిగిన మార్పులను ఆధారంగా తీసుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియో ఇంజనీరింగ్ విభాగం 2009లో పరిశోధనలు చేసింది.
శాటిలైట్ చిత్రాల ద్వారా చేసిన ఈ పరిశోధనలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన డ్యామ్‌ల వలన సముద్రానికి చేరే మట్టి గణనీయంగా తగ్గిపోయిందని తేలింది.
1950లలో కృష్ణా నది సముద్రానికి 62 క్యూబిక్ కిలోమీటర్ల నీరు తీసుకెళ్లగా, 2000 నాటికి అది 12 క్యూబిక్ కిలోమీటర్లకి తగ్గిపోయింది.
అలాగే మట్టి 9 మిలియన్ టన్నుల నుండి 0.4 మిలియన్ టన్నులకే పడిపోయిందని చెప్పారు.
1 క్యూబిక్ కిలోమీటరు = 1 ట్రిలియన్ (1,00,00,00,00,0000) లీటర్ల నీరు.
అలాగే 43 ఏళ్లలోపే సుమారు కృష్ణా, గోదావరి డెల్టాకి చెందిన 76 చదరపు కిలోమీటర్ల భూమి సముద్రంలో కలిసిపోయిందని తేలింది.
దీనిని హెచ్చరికగానే తీసుకోవాలన్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ బి. సీతారాముల రెడ్డి.


"నదులు సముద్రాన్ని చేరకపోవడం అనేది అసాధ్యమే అనిపించవచ్చు. కానీ, వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం డ్యామ్‌లు, బరాజ్‌లు. నదుల నీటిని సాగు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కోసం ఎక్కువగా వినియోగించుకోవడమే ఆ పరిస్థితికి దారి తీస్తుంది" అని ప్రొఫెసర్ ఏ. యుగంధర్ రావు చెప్పారు.
ఉదాహరణకు.. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల గుండా ప్రవహించే దామోదర్ నది.
ఈ నదిపై మైథన్, పంచేత్, తిలాయా, కొనార్ వంటి డ్యామ్‌లు, అలాగే దుర్గాపూర్ వద్ద పెద్ద బరాజ్ కట్టారు. ఈ కట్టడాలు నది సహజ ప్రవాహాన్ని మార్చేశాయి.
"డ్యామ్ కట్టే ముందు, తర్వాత నీటి ప్రవాహం ఎలా మారిందో రేంజ్ ఆఫ్ వేరియబులిటీ అప్రోచ్ అనే పద్ధతితో శాస్త్రవేత్తలు లెక్క కట్టారు.
2022లో ప్రచురితమైన ఓ పరిశోధనలో చేపల జీవనంపై వీటి ప్రభావం కనిపించింది’’ అని ప్రొఫెసర్ ఏ. యుగంధర్ రావు తెలిపారు.
‘‘డ్యామ్‌లు, బరాజ్‌లు కట్టడంతో పాటు.. హైడ్రోపవర్ కోసం ఒక్కసారిగా నీటిని వదిలేస్తారు. కొన్నిసార్లు పూర్తిగా ఆపేస్తారు. దీంతో చేపల జీవనం అస్థిరంగా మారుతుంది’’ అని చెప్పారు.

‘‘ సముద్రానికి చేరలేకపోయిన నీరు భూమిలోకి దిగిపోతుంది. భూగర్భజలాలు పెరుగుతాయి. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడి వరద ముప్పు పెరుగుతుంది’’ అని తెలిపారు.
"ఒకరకంగా చూస్తే సముద్రం అనేది నదులకి 'సేఫ్టీ ట్యాంక్'. నదులు తీసుకెళ్లిన నీటిని అది నిల్వచేసి, మళ్ళీ ఆవిరి రూపంలో వర్షాలుగా మనకు తిరిగి ఇస్తుంది" అని ప్రొఫెసర్ యుగంధర్ రావు చెప్పారు.


ఆస్ట్రేలియాలోని ముర్రుంబిడ్జీ నదిపై యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు 2024లో ప్రచురితమయ్యాయి.
గత మూడు దశాబ్దాల్లో ముర్రుంబిడ్జీ నదిలోని సహజ ప్రవాహం, హే పట్టణం (Hay Town) దగ్గరకు వచ్చే సరికి దాదాపు 55 శాతం వరకు తగ్గిపోయిందని వారు గుర్తించినట్లు పేర్కొన్నారు.
దీనికి కారణం ఈ పట్టణానికి పైన ఆనకట్టలు కట్టడం, మానవ అవసరాల కోసం నీటి మళ్లింపులు చేయడం.
ఈ నీటి లోటు వలన నది దిగువన ఉన్న లోవ్‌బిడ్జీ ఫ్లడ్‌ప్లెయిన్ వెట్‌లాండ్స్ (Lowbidgee wetlands) అనే విస్తారమైన చిత్తడి నేలలు ఎండిపోతూ, అక్కడి జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతిందని అధ్యయనంలో తేలింది.

ఏ కారణంతోనైనా నదులు సముద్రంలో కలవకపోతే ఏమవుతుందనే ప్రశ్న చాలా ముఖ్యమైనదేనని ప్రొఫెసర్ ఏ. యుగంధర్ రావు అన్నారు.
‘‘ నదులు సముద్రంలో కలవడమనేది ప్రకృతి సమతుల్యతకు మూలం. నదుల ప్రవాహం సముద్రానికి చేరడంపైనే మన ఆహారం, నీరు, వాతావరణం ఆధారపడి ఉంటుంది. అందుకే 'ఒకవేళ కలవకపోతే' అనే అంశంపై పరిశోధకులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నదుల సహజ ప్రవాహంలో వచ్చే ఏ చిన్న మార్పైనా పర్యావరణంపై పెద్ద ప్రభావం చూపుతుందనేది నిజం" అని ప్రొఫెసర్ ఏ. యుగంధర్ రావు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














