ప్రపంచమంతా ఇప్పుడు ఈ ఐస్‌బర్గ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
- రచయిత, జోనాథన్ అమోస్, ఎర్వోన్ రివోల్ట్ , కేట్ గేనర్
- హోదా, బీబీసీ న్యూస్

ఫొటో సోర్స్, ROB SUISTED/REUTERS
ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్ కదులుతోంది. దీని సైజు గ్రేటర్ లండన్ కంటే రెండు రెట్లు పెద్దది.
ప్రతి రోజూ ఈ ఐస్‌బర్గ్ కరిగిపోతున్నా ఇప్పటికీ 3,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
ఇది బహ్రెయిన్, సింగపూర్ లాంటి 29 దేశాల కంటే పెద్దది.
అంటార్కిటికా సరిహద్దు ప్రాంతాలలో కొన్ని వారాల మందగమనం తరువాత, ఇప్పుడీ మంచు కొండ వేగం పెరిగింది.
ఈ ఐస్‌బర్గ్‌ను 'ఏ23ఏ'గా వ్యవహరిస్తున్నారు.
1986లో అంటర్కిటికా తీరప్రాంతం నుంచి ఇది విడిపోయింది.
తరువాత వేగంగా కదిలి వెడ్డెల్ సముద్రంలో 350 మీటర్ల లోతుకు చేరుకుని 30 ఏళ్ళపాటు ఒక మంచుద్వీపంలా ఉండిపోయింది.
కాలం గడిచే కొద్దీ క్రమంగా ఈ మంచు కొండ కరగడం మొదలైంది. 2020 నాటికి నీటిపై తేలడం మొదలైంది.
మొదట్లో ఇది మెల్లగా కదిలినా, తరువాత వేడిగాలులు, నీటి అలల కారణంగా ఉత్తర దిశగా సాగుతోంది.

ఫొటో సోర్స్, CHRIS WALTON/BAS
రోజురోజుకూ కరుగుతూ..
ప్రస్తుతం ఇది ‘ఐస్‌బర్గ్ అలీ’ పిలిచే మంచు కొండల శ్రేణి మీదుగా కదులుతోంది. ఒక మంచు కొండకు ఇది వినాశన మార్గంలో సాగడం లాంటిదే.
అది త్వరలో విచ్ఛిన్నమైపోతుంది. కొన్నినెలల్లోనే పూర్తిగా కరిగిపోనుంది. ఈ ఐస్‌బర్గ్ భూమధ్యరేఖకు ఉత్తరంగా 60 డిగ్రీల దూరంలో తేలియాడుతోంది.
ఈ ప్రాంతం అంటార్కిటిక్ ద్వీపకల్పానికి ఈశాన్యంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్క్నీ ద్వీపానికి సమీపంగా ఉంది.
ఈ ఐస్‌బర్గ్ మెల్లిగా కరిగిపోతోందని, అటుగా వెళుతున్న నౌకలలోని వారు తీసిన ఫోటోలు, ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది.
ప్రతిరోజూ ఈ ఐస్‌బర్గ్ ముక్కలుగా విరిగిపోయి సముద్రంలోకి పడిపోతోంది. ఈ ఏ23ఏ ఐస్‌బర్గ్ పై ఫుట్ బాల్ మైదానం సైజులో ఉండే మంచు శిలలు ఉన్నాయి.
రానున్న వారాలలో దీని ప్రయాణాన్ని గాలులు, తుపాన్లు, నీటి ప్రవాహం నిర్థరించనున్నాయి.
కానీ, ఇలాంటి మంచు కొండలు బ్రిటీషు ఓవర్సీస్ ప్రాంతానికి చేరుకునే సమయానికే కరిగిపోతాయి.

ఫొటో సోర్స్, ASHLEY BENNISON/BAS
ఏ23ఏ సైజు ఎంత అనేది కచ్చితంగా కొలవడం సాధ్యమయ్యే పనికాదు.
యురోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు ఈ ఐస్‌బర్గ్ సైజును కొలవడానికి ప్రయత్నించినప్పుడు దాని ఎత్తు 920 అడుగులుగా గుర్తించారు.
దిల్లీలో ఉండే కుతుబ్ మినార్ ఎత్తు 238 అడుగులు. దీన్నిబట్టి ఈ మంచుకొండ ఎంత ఎత్తులో ఉంటుందో ఊహించుకోండి. వేగంగా ఢీకొడుతున్న అలల ఉధృతి ఈ మంచు కొండను కోతకు గురిచేస్తోంది.
దీనివల్ల ఇందులో గుహలాంటి ఆకారాలు ఏర్పడుతున్నాయి. అలాగే అనేక ఐస్ ముక్కలు సముద్రంలోకి పడిపోతున్నాయి. వేడి గాలులు కూడా ఐస్‌బర్గ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
మంచుకొండపైన కరిగిన నీరు అక్కడి నుంచి క్రమంగా ఐస్‌బర్గ్ చీలికల ద్వారా కిందకు జారిపోతోంది. ఈ ఏడాది చివరకు ఈ ఐస్‌బర్గ్ పూర్తిగా కరిగిపోయే అవకాశం ఉంది.
ఆ సమయంలో ఈ ఐస్‌బర్గ్‌లోని ఖనిజ వనరులు సముద్రంలో చెల్లా చెదురు కావడం వల్ల సముద్రపు ఆహార గొలుసుకు ఇదో పుష్కలమైన వనరుగా మారుతుంది.
దీనివల్ల ప్లాంక్టాన్ నుంచి గ్రేట్ వేల్స్ వరకు అనేక జీవులు ప్రయోజనం పొందుతాయి.
ఐస్‌బర్గ్‌లు హిమనీనదంలో భాగంగా ఉన్నప్పుడు అందులోని ఖనిజాలు ఈ ఐస్‌బర్గ్‌ను అంటిపెట్టుకుని ఉంటాయి. ఎప్పుడైతే ఐస్‌బర్గ్ విడిపోతుందో, అప్పుడు ఖనిజాలు కూడా దీనితోనే ప్రయాణిస్తాయి.

ఇలాంటి పెద్ద పెద్ద మంచు కొండల గురించి విన్నప్పుడల్లా ప్రజలందరూ ఇది వాతావరణ మార్పుకు సూచికగా భావిస్తుంటారు.
భూతాపం పెరగడం వల్ల ఏర్పడిన పరిణామంగా చూస్తారు.
కానీ నిజం ఎప్పుడూ మరింత క్లిష్టంగా ఉంటుంది.
ఇప్పటికీ మంచుతో కప్పుకుపోయిన అంటార్కిటిక్ ప్రాంతం నుంచి ఈ ఏ23ఏ ఐస్‌బర్గ్ విడిపోయింది.
దీని జన్మస్థలం ఫిల్చ్‌నర్ ఐస్ షెల్ఫ్.
ఈ ఐష్ షెల్ఫ్‌లు హిమనీనదంలో భాగంగా ఉంటాయి.
ఐస్ షెల్ఫ్‌ల నుంచే ఐస్‌బర్గ్‌లు ఏర్పడతాయి.
ప్రస్తుత ఐస్ బర్గ్ ఏ23ఏ కూడా అలా ఏర్పడిందే.
ఇది సహజంగా జరిగే ప్రక్రియే.
అందుకే శాస్త్రవేత్తలు దీనిని కాల్వింగ్ లేదంటే ఆవు దూడకు జన్మనివ్వడంతోనూ పోలుస్తుంటారు.
ఐస్‌షెల్ఫ్ నుంచి ఐస్ బర్గ్‌లు విడిపోయినా , అదే స్థాయులో దాని వెనుక భాగంలో మంచు కురుస్తుండటం వల్ల ఈ ఐస్ షెల్ఫ్ లు సముద్రంలో సమతాస్థితిలో ఉండగలుగుతాయి.
అయితే ఫిల్చ్‌నర్ ప్రాంతంలో ఉష్ణజలాల కారణంగా ఐస్‌బర్గ్‌లు ఏర్పడ్డాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
అంటర్కిటికాలో కొన్ని ప్రాంతాలలో వేడెక్కుతున్న నీటికారణంగా ఐస్ షెల్ఫ్‌లు
పూర్తిగా ధ్వంసమై అనేక ఐస్‌బర్గ్‌లు ఏర్పడుతున్నాయనేది నిజం.
కానీ ఏ 23ఏ మాత్రం అలా ఏర్పడినది కాదు.
ఐస్‌బర్గ్‌ల గుర్తులను చూడవచ్చు

ఫొటో సోర్స్, MARIE BUSFIELD
ఐస్‌షెల్ఫ్‌ల నుంచి ఎప్పుడు, ఎలా ఎంత తరుచుగా భారీ మంచు కొండలు ఏర్పడుతున్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు.
ఐస్ షెల్ఫ్‌ల సమతాస్థితిలో మార్పులు ఏమైనా వస్తున్నాయా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పరిశీలన పనికొస్తుంది.
దీనితోపాటు ఐస్ బర్గ్‌ల లోతైన చరిత్రను అర్థం చేసుకోవడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు.
కానీ వారికి 50 ఏళ్ళ స్పల్ప పరిమాణపు ఉపగ్రహ రికార్డులు మాత్రమే లభిస్తున్నాయి.
దీంతో మరింత మెరుగైన దృక్పథం కోసం పరిశోధకులు ఐస్‌బర్గ్ అల్లేలో సముద్రపు అడుగుకు చేరి తవ్వకాలు జరిపారు.
ఈ తవ్వకాలలో అంటార్కిటిక్ ఖండం నుంచి ఐస్‌బర్గ్స్ సముద్రంలోకి జారుకుని కరిగిపోయినప్పుడు నిక్షిప్తమైపోయిన వాటి అవక్షేపాలను శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు.
ఈ అవక్షేపాల వల్ల ఐస్ బర్గ్‌లు ఏ సమయంలో కరిగిపోయాయానే చరిత్రను తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు 12 లక్షల సంవత్సరాల కిందట పశ్చిమ అంటర్కిటికా ప్రాంతంలో వేడికారణంగా మంచు అరలు విచ్ఛిన్నమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మంచు కొండలు గతంలో ఏ ప్రాంతం వరకు వచ్చాయో భౌతికంగా తెలుసుకునేందుకు
ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి.
తీవ్రమైన ఒత్తిడి కారణంగా మంచుకొండలు తమ ప్రయాణ మార్గాలలో బలమైన గుర్తులను ఏర్పాటు చేస్తాయి.
అంటే మీరేదైనా గోడమీద గోళ్ళతో గీస్తే ఎలా గీతలు పడతాయో, మంచుకొండలు కూడా సముద్రపు అడుగున అలా గీరుకుంటూ పోతాయి.
అలాంటి గుర్తులపై మీరు నడవాలనుకుంటే దక్షిణాఫ్రికా ఓ మంచి ఉదాహరణ.
అప్పట్లో ఈ ప్రాంతం నీటి అడుగున దక్షిణ దృవానికి దగ్గరగా ఉంది.
ఇప్పటికీ అక్కడ మంచు కొండలు ఏర్పరిచిన ఎగుడుదిగుడు గుర్తులు కనిపిస్తుంటాయి.
ప్రస్తుతం ఏ23ఏ ఐస్‌బర్గ్ ప్రయాణం కూడా వెడెల్ సీ అడుగు భాగానా ఇలాంటి గుర్తులనే వదిలి ఉంటుంది.
ఏ23ఏ ఐస్‌బర్గ్ గీసిన చిత్రాలు ఇవే అని గుర్తు చేస్తూ ఈ గుర్తులు వేలాది సంవత్సరాలు లేదంటే లక్షలాది సంవత్సరాలు అలాగే ఉండొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి :
- ప్రిసిల్లా హెన్రీ: హాలీవుడ్ సినిమాను తలపించే ఓ 'సెక్స్' సామ్రాజ్యాధినేత్రి కథ
- దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడ?
- సూర్యగ్రహణం సమయంలో కొన్ని జంతువులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తాయి?
- ఒళ్లంతా కణితులు, బొడిపెలు.. ఏమిటీ వ్యాధి? ఎందుకు వస్తుంది?
- హైదరాబాద్‌కు కూడా భవిష్యత్తులో బెంగళూరులాగా నీటి కష్టాలు తప్పవా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















