పాయింట్ నెమో: అంతరిక్ష నౌకల శ్మశాన వాటిక అని దీనిని ఎందుకు అంటారు?

ఫొటో సోర్స్, The Ocean Race
- రచయిత, జరియా గార్వెట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాయింట్ నెమో రష్యా అంతరిక్ష నౌకల శ్మశానవాటికగా గుర్తింపు పొందడానికి కారణమేంటి? సముద్రంలోని ఈ పాయింట్‌ను ఎవరూ ఎందుకు చేరుకోలేరు?
దీనికి సమీపంలోని పొడి ప్రాంతం సుమారు 2668 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దక్షిణ పసిఫిక్ సముద్రం మధ్యలో ఉండే ప్రాంతమిది. ఇదో ప్రమాదకరమైన ప్రదేశం, క్షణక్షణానికి మారిపోయే వాతావరణం, ఉరిమే ఆకాశం, ఈదురుగాలులతో కూడిన ఉప్పెనలతో భయానకంగా ఉంటుంది.
‘‘ఈ దక్షిణ సముద్రం భారీ అలలతో అంతుపట్టని వాతావరణంతో ఉత్తేజంతోపాటు, కొంచె భయం గొలుపుతుంటుంది’’ అని డీ కాఫరీ చెప్పారు.
డీ కాఫరీ ఈ మారుమూల ప్రాంతాన్ని సందర్శించిన బ్రిటీషు నావికులలో ఒకరు. ఇంకా చెప్పాలంటే ఈ మారుమూల సముద్రభాగాన్ని సందర్శించి, భూమ్మీద బతికున్న అతికొద్ది మంది వ్యక్తులలో కూడా ఆయన ఒకరు.
ఈ ప్రాంతానికి నలువైపులా భూమి సుదూరంగా ఉంటుంది. అందుకే ఒకవేళ మీరిక్కడ చిక్కుకుంటే మిమ్మల్ని రక్షించడానికి అవకాశాలు చాలా పరిమితంగా మాత్రమే ఉంటాయి.
ఈ ప్రాంతంలో జీవం ఏదైనా ఉందా అంటే ఏడాదికోసారి యాచింగ్ పేరుతో జరిగే తెరచాప పడవల పందాలు మాత్రమే. ఆ సమయంలో మాత్రమే ఎవరైనా ఈ ప్రాంతాన్ని చూడగలరు.
ఈ ప్రాంతంలో నౌకాయానం, చేపలవేట లాంటి కార్యకలాపాలేవీ ఉండవు. అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములే ఈ సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండే మనుషులు.
ఈ ఐఎస్ఎస్ తనపరిభ్రమణలో పాయింట్ నెమోపైన 415 కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. అప్పుడు అందులో వ్యోమగాములే ఈ ప్రాంతానికి సమీపంలో ఉండే మనుషులు కింద లెక్క. అందుకే దీనిని దీనిని ఓషనిక్ పోల్ ఆఫ్ ఇన్ యాక్సెసబులిటీగానూ, పాయింట్ నెమో గానూ పిలుస్తుంటారు.
గ్లోబ్ పై పాయింట్ నెమోను చూడాలనుకుంటే న్యూజీలాండ్, దక్షిణ చిలేకి మధ్యన ఉండే సముద్ర ప్రాంతమే పాయింట్ నెమో. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఉత్తరాన పిట్క్రాన్ దీవులలోని డ్యూసీ దీవిలో జనావాసాలు లేని పగడపుదిబ్బలు, పశ్చిమాన చత్తమ్ దీవులు, తూర్పున చిలే ప్రాంతాల మధ్యన త్రిభుజాకారంగా ఉన్నదే ఈ పాయింట్ నెమో.
ఈ ప్రాంతాన్ని వర్ణించాలంటే అన్ని విషయాలలోనూ దీనికి అగ్రస్థానం ఇవ్వాల్సిందే. అంటే అత్యంత నిర్జన ప్రదేశంగానూ, అత్యంత నిర్జీవ సముద్ర ప్రాంతంగానూ చెప్పాలి. ఆఖరికి ఇక్కడ సముద్రపు లోతు కూడా ఉపరితలం నుంచి 13వేల అడుగులు ( సుమారు 4 కి.మీ.) లోతు ఉంటుంది.
ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, అతిశీతలమైన ఈ ప్రదేశానికి మధ్యన మరో లంకె కూడా ఉంది. అదేమిటంటే ఈ ప్రాంతం అంతరిక్ష నౌకల శ్మశాన వాటికగా ప్రసిద్ధి చెందింది. భూకక్ష్యలోని అంతరిక్షపు చెత్తంతా పాయింట్ నెమోలోనే పడుతుంది.
1971-2018 మధ్యన పాయింట్ నెమో పరిసరాలలోని సముద్ర జలాల్లో స్పేస్ దిగ్గజాలుగా ప్రసిద్ధి పొందిన అమెరికా, రష్యా, జపాన్, యూరోప్ 263కు పైగా రోదసి పరికరాలను ధ్వంసం చేశాయి.
ఈ జాబితాలో సోవియట్ యూనియన్ కాలం నాటి మిర్ అంతరిక్ష కేంద్రం, సల్యూట్ కార్యక్రమం కింద ప్రయోగించిన 6 అంతరిక్ష నౌకలతోపాటు 140 రష్యన్ రీసప్లై వెహికల్స్, జపాన్ ప్రయోగించిన 6 కార్గో వాహనాలు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 5 వాహనాలు కూడా ఉన్నాయి.
ఇటీవల స్పేస్ ఎక్స్ రాకెట్ కు చెందిన భాగం కూడా ఈ పాయింట్ నెమో జలాల్లోనే పడినట్టుగా భావిస్తున్నారు. కాకతాళీయంగా ఈ ప్రాంతానికి సమీపంగా ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరో ఎనిమిదేళ్లలో ఇక్కడే కూలిపోనుంది.

ఫొటో సోర్స్, @2023 Google INEGI
పాయింట్ నెమో వద్ద అంతరిక్ష నౌకలు ఎలా కూలతాయి?
23 మార్చి 2001, మాస్కోలో ఉదయం 8 గంటల 59 నిమిషాలు, రష్యన్ వ్యోమగాముల బృందం సౌత్ పసిఫిక్‌లోని ఫిజీ ద్వీపంలో ఆకాశం వైపు వేచి చూస్తున్నారు. ఈ క్షణం కోసమే రష్యా స్పేస్ ఏజెన్సీ ఏడాదికాలంగా సన్నద్ధమవుతోంది, కానీ ఈ నిరీక్షణ త్వరగా ముగిసిపోయింది.
ఆకాశంలో వీరు చూస్తున్న వస్తువు శబ్ద వేగాన్ని దాటి ప్రకంపనాలతో నిప్పులు చిమ్ముకంటూ నేలవైపు దూసుకొచ్చింది. ప్రపంచం చుట్టూ 1.9 బిలియన్ కిలోమీటర్ల మేర తన ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న మిర్ స్పేస్ స్టేషన్ లైఫ్ ముగిసిన నాటి దృశ్యాలు ఇవి. ఇది పాయింట్ నెమోలో పడిపోవడానికి వీలుగా మిర్ లోని థ్రస్టర్స్ మండేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
అలా 134 టన్నుల బరువున్న ప్రపంచ మొదటి మాడ్యూలర్ స్పేస్ స్టేషన్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఇది మొదట జపాన్ సమీపంలో అంతరిక్ష సరిహద్దును దాటాకా నిప్పులు చిమ్ముతూ సౌత్ పసిఫిక్ సముద్రంలోని నిర్జన ప్రదేశం (ఈ ప్రాంతం ఫ్రాన్స్ విస్తీర్ణం కంటే 34 రెట్లు ఎక్కువ) పాయింట్ నెమో పరిసరాలలో కూలిపోయింది.
కానీ.. మిర్ శిథిలాల పేరుతో ఆన్‌లైన్ వెంటనే అమ్మకాలు మొదలయ్యాయి. విచిత్రంగా ఇవి మిర్ శిథిలాలు కావని అంగీకరిస్తూనే అమ్మకాలు మాత్రం సాగించారు. అలాగే మిర్ నుంచి ఏవో కనుగొన్నట్టు ఏళ్ళ తరబడి వదంతులు వ్యాపించాయి.
కానీ ఎవరూ కనీసం దీని తుక్కును కూడా సంపాదించలేకపోయారు. మిర్ మొత్తాన్ని పసిఫిక్ సముద్రమే తనలో కలిపేసుకుంది. ఇప్పటికీ అది అక్కడే ఉంది. మిర్ భాగాలు ఏమైనా ఉంటే అవి కిలోమీటర్ల లోతులోని ఈ సముద్ర జలాల అడుగన ఉంటాయి.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మిర్ కానీ, అలాంటి ప్రయాణాలే చేసిన ఇతర అంతరిక్ష నౌకలు కానీ తమ జీవితకాలం ముగియగానే భూవాతావరణంలో మండిపోతూ సముద్రంలో కూలిపోయినప్పుడు వీటిల్లోని కీలకమైన భాగాలు అలాగే ఉండి ఉంటాయా లేక అన్నీ మండిపోయి ఉంటాయా?

ఫొటో సోర్స్, Credit: Alamy
అంతరిక్షం నుంచి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించిన వస్తువులేవైనా మన భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయుమూలకాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది.
గంటకు 28,164 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చే ఈ అంతరిక్ష వ్యర్థాలు అంటే ఉల్కలైనా, గ్రహశకలాలైనా, పాత స్పేస్ క్రాఫ్ట్స్ అయినా, అవి గాలిని చీల్చుకుంటూ రావడం వలన గాలిలోని మూలకాల రసాయన బంధాన్ని విడగొడతాయి.
దీనివల్ల విద్యుత్‌తో నిండి ప్లాస్మా ఏర్పడుతుంది. ఇదే అంతరిక్షం నుంచి దూసుకు వచ్చే వస్తువులు మండిపోవడానికి కారణమవుతుంది. చిన్నపాటి వస్తువులైతే భూమికి చేరకముందే ఆవిరైపోతాయి.
స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో కొన్ని భాగాలు అత్యంత వేడిని, పీడనాన్ని తట్టుకుని పనిచేసేలా రూపొందించడం వల్ల ఇలాంటి భాగాలు అంతరిక్ష నౌకలు తిరిగి భూమికి చేరుకున్నప్పుడు కూడా చెక్కు చెదరకుండా నే ఉంటాయని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీలో స్పేస్ ఆర్కియాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అలైస్ గోర్మాన్ చెప్పారు.
చాలా తరచుగా ఇంధన ట్యాంకులు, రాకెట్ బూస్టర్లు మిగిలి ఉండటానికి కారణం వీటిలో క్రయోజనిక్ ఇంధనం ఉండటం ఒక కారణం కాగా, భారీ ఉష్ణోగ్రత వద్ద పనిచేయగలిగి ఉంటాయి.
అందుకే అంతరిక్ష నౌకలు కూలిపోయినప్పుడు ఇంధన ట్యాంకులు మిగిలి ఉండేందుకు అవకాశం ఉందని గోర్మన్ చెప్పారు. స్పేస్ క్రాఫ్ట్, రాకెట్లలోని ఈ పెద్దభాగాల తయారీలో స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం, టైటానియం మిశ్రమాలను వినియోగిస్తారు.
వీటిని ఇన్సులేషన్ చేయడానికి కార్బన్ ఫైబర్ నుంచి తయారుచేసిన కార్బన్ ను ఉపయోగించడం ఎప్పటి నుంచో ఉంది. ఇది 287 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా మండదు.

ఫొటో సోర్స్, Getty Images
ఏదేమైనా చాలా కేసులలో స్పేస్ క్రాఫ్ట్ భూవాతావరణంలోకి ప్రవేశించిననప్పటి నుంచి దాని తలరాత పూర్తిగా ఊహాజనితమే అవుతుంది.
‘‘ అవెక్కడ ఉంటాయనే విషయం కొద్దో గొప్పో మనకు తెలిసే ఉంటుంది. కానీ వాటిని మనం చూడలేం. పాయింట్ నెమో వద్ద రీసెర్చ్ షిప్స్‌తో సిద్ధంగా, అవి పడిపోగానే సముద్రం లోపలికి వెళ్ళి వాటి స్థితిగతులు చూడటం లేదు కదా’’ అని గోర్మెన్ చెప్పారు.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎస్సారెన్స్ పట్టణంలో ఉన్న ఎస్పారెన్స్ మ్యూజియంలో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. ఈ మ్యూజియంలో పాత మోటారు బైక్, 19వ శతాబ్దం నాటి ట్రైన్ క్యారేజీ, వ్యవసాయ పరికరాలు ఉన్నాయి.
అయితే ఈ మ్యూజియంలో అందరినీ ఆకర్షించే విషయం ఏమిటంటే 1970వ దశకంలో ప్రపంచాన్ని వణికించిన స్కైలాబ్ కు సంబంధించిన భాగాలు ఇక్కడ ప్రదర్శించడమే.
1973 మే 14న స్కైలాబ్ ఆరేళ్ల తరువాత భూకక్ష్యలోకి ప్రవేశించింది. నిజానికి స్కైలాబ్ మరికొంత కాలం పనిచేస్తుందని నాసా భావించింది.
కానీ దీని కక్ష్య ఊహించినదానికన్నా త్వరగా తగ్గిపోయింది....1979 ప్రారంభం నాటికి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ 77 టన్నుల స్పేస్ స్టేషన్ను కొనసాగించలేమని అర్థమైంది.
మిగిలిన అన్నిపెద్ద అంతరిక్ష వస్తువులలానే స్కైలాబ్ ను కిందకు దించడం, దానిని సముద్రంలో పడేలా చేయడం చాలా ముఖ్యమైన విషయంగా కనిపించింది. కానీ దీన్ని ఎలా తిరిగి భూమిపైకి తీసుకురావాలనే విషయాన్ని ఎవరూ ఆలోచించలేదు.
దీనివలన స్కైలాబ్ తిరిగి వచ్చే సమయంలో నాసా ఇంజినీర్లు ఏమీ చేయలేకపోయారు. స్కైలాబ్ చివరి రోజున దాని కక్ష్య తగ్గించుకుని, తన ఇంజిన్లు మండించుకుని ఇండియన్ ఓషన్‌లో పడిపోతుందని భావించారు. కానీ అలా జరగలేదు.
1979 జులై 11 ఉదయం సెంట్రల్ ఆస్ట్రేలియా మీదుగా స్కైలాబ్ వ్యర్థాలు పడటాన్ని గమనించారు. స్కైలాబ్ ఇంధన ట్యాంకుల భాగాలు, ఎయిర్ లాక్ చాంబర్ ను చుట్టి ఉండే 22 అడుగుల కవచం, పెద్ద ఆక్సిజన్ ట్యాంక్ పొలాల్లో పడి ఉండటాన్ని ప్రజలు చూశారు.
కనీసం 450 కేజీల బరువుండే స్కైలాబ్ కు చెందిన 38 వ్యర్థభాగాలను కనుగొన్నట్టు నాసా ప్రకటించింది. చివరగా ఈ అంతరిక్ష వ్యర్థాలన్నీ ఎస్పారెన్సో రాష్ట్రంలో పడ్డాయి.
దీంతో ఈ రాష్ట్రం నాసాకు 400 డాలర్ల జరిమానా విధించింది. ఈ విషయం నాసాకు అసౌకర్యం కలిగించినా, అంతరిక్షం నుంచి ఇంత పెద్ద మొత్తంలో వ్యర్థాలు నేలకూలినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని పరీక్షించడానికి అవకాశం చిక్కింది.
నిజానికి ఇలా కూలిపోయినప్పుడు మొత్తం కాలిబూడిదైపోతుందని భావించారు కానీ, ఒక తలుపుతో సహా కొన్ని సంక్లిష్టమైన నిర్మాణాలు యథాతథంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పాయింట్ నెమో వద్ద స్పేస్ క్రాఫ్ట్ వ్యర్థాలు ఏ స్థాయిలో ఉన్నాయి?
మిర్ విషయంలో... అది తిరిగి భూకక్ష్యలోకి వచ్చినప్పుడు...13 మీటర్ల కేంద్రకం, ఐదు లేబరేటరీ మాడ్యుల్స్ కలిగి ఉన్న ఈ స్పేస్ స్టేషన్ 1500 ముక్కలవుతుందని ఊహించారు. ఈ ముక్కల్లోని పెద్ద భాగం ఓ చిన్నకారంతా ఉండొచ్చని నిపుణులు చెప్పారు.
వీటిల్లో ఇంధన ట్యాంకులు, బ్యాటరీలు, బల్క్ హెడ్స్, స్టోరేజీ బాక్సులు లాంటి భారీ వస్తువులతోపాటు తేలికపాటివి కూడా పాయింట్ నెమో సముద్రజలాల్లో అడుగుభాగాన ఉండిపోయాయి.
2031లో ఐఎస్ఎస్ ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినప్పుడు, 400 టన్నుల బరువు ఉండే అంతరిక్ష కేంద్రాన్ని పాయింట్ నెమో లాంటి ప్రదేశంలో పడేలా చూడటం చాలా ముఖ్యం. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ సిద్ధమవుతోంది.
ఇందుకోసం యూఎస్ డీ ఆర్బిట్ వెహికల్ (USDV)ని తయారుచేయాల్సిందిగా నాసా అమెరికా పరిశ్రమలకు పిలుపునిచ్చిందని జాన్సన్ స్పేస్ సెంటర్ కు చెందిన ఓ ప్రతినిధి ఈ మెయిల్ ద్వారా తెలిపారు.
డీ ఆర్బిట్ వాహనం ఓ ఏడాది ముందే అంటే 2030లోనే ఐఎస్ఎస్‌ను చేరుకుంటుంది. ఈ వాహనం ఐఎస్ఎస్ ఎక్కడ భూకక్ష్యలోకి ప్రవేశించాలి, ఎక్కడ పడిపోవాలనే విషయాన్ని నియంత్రిస్తుంది.
ఐఎస్ఎస్‌లో కొన్ని భాగాలు మండిపోవచ్చని, వేడిని తట్టుకోగలిగే వస్తువులు అలాగే ఉండవచ్చని నాసా భావిస్తోంది. వీటిల్లో ఐఎస్ఎస్‌కు వెన్నెముకగా నిలిచిన ట్రస్సర్లు, ఇనుప నిర్మాణాలు ఉండొచ్చని భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
చారిత్రాత్మక రికార్డ్
ఇవన్నీ చూశాకా పాయింట్ నెమో ఇప్పుడు, వచ్చేరోజులలో కూడా పురావస్తు శాస్త్రవేత్తలకు ఓ బంగారు గని గానే భావించాలి.
ఒకప్పుడు తాము తవ్వితీసిన వస్తువుల ద్వారా అప్పటి ప్రజలు ఎలా జీవించారు, ఏం తినేవారు, వారికేది ముఖ్యమనే విషయాన్ని పురావస్తు శాస్త్రజ్ఞలు కనుగొన్నట్టుగానే ఈ స్పేస్ క్రాఫ్ట్స్ శ్మశానాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు అని గోర్మెన్ చెప్పారు.
వీటిని పరిశీలించడం ద్వారా పాత క్రాఫ్ట్ లు ఏవీ, కొత్తవి ఏవీ అనే విషయాలతోపాటు మధ్యలో ఎలాంటి సాంకేతిక మార్పులు వచ్చాయో కూడా గమనించవచ్చని ఆమె తెలిపారు.
రాబోయే వెయ్యేళ్ళ తరువాత పాయింట్ నెమో చరిత్రను పరిశీలించే పురావస్తు శాస్త్రవేత్తలకు మనం పునర్వినియోగ రాకెట్లు కూడా వాడినట్టు అర్థమవుతుంది.
ఎందుకంటే ఇక్కడ పడే అంతరిక్ష వ్యర్థాల శాతం ఎక్కువగా ఉండటం వలన వారీ నిర్ణయానికి వస్తారు అని గోర్మెన్ తెలిపారు. ఎందుకంటే పర్యావరణానికి హాని చేయకుండా ఉండేందుకు పునర్వినియోగ వస్తువులకు ప్రజలు విలువ ఇవ్వడం ప్రారంభించారు కాబట్టి, రాకెట్ల పునర్వినియోగమూ మొదలవుతుంది.
తద్వారా పాయింట్ నెమో వద్ద అంతరిక్ష వ్యర్థాల శాతమూ తగ్గుతుంది. భవిష్యత్తులో శాస్త్రవేత్తలకు పాయింట్ నెమో చరిత్ర ద్వారా అర్థమయ్యేది ఇదేనంటారు గోర్మన్.
తొలినాళ్ళలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి కూడా పాయింట్ నెమో చాలా ముఖ్యమైన ప్రాంతం.
ఆకాశం నుంచి అక్కడ కూలిన వస్తువులు ఎక్కడికీ పోవు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కారణంగా ఇక్కడి వస్తువులన్నీ చెక్కు చెదరకుండా ఉంటాయి. పాయింట్ నెమో భూమికి చాలా దూరంలో ఉంటుంది. దీనివలన భూమి నుంచి వచ్చే లవణాలు, పోషకాలు ఇక్కడ చేరవు.
ఫలితంగా ఇక్కడ జీవం ఉండదు. దీంతోపాటు లోతైన సముద్రపు జలాల్లో ఆక్సిజన్ లేకపోవడం, అతి శీతల వాతావరణం, సూర్యరశ్మి పడకపోవడం లాంటి పరిస్థితుల వలన రసాయన ప్రక్రియలు ఏవీ జరగవు కాబట్టి... ఇక్కడి వస్తువలు తుప్పు పట్టే అవకాశం ఉండదు.
‘‘మహా అయితే ఉప్పునీటి కారణంగా జరిగే రసాయన చర్యల వల్ల ఎంతో కొంత ప్రభావం పడొచ్చు.’’ అని గోర్మన్ చెప్పారు. కానీ చాలా అంతరిక్ష నౌకలలోని భాగాలు ఇటువంటి ప్రభావానికి గురి కాకుండా తయారుచేస్తారు.
వెయ్యేళ్ళ తరువాత కూడా పాయింట్ నెమో వద్ద ఉండే వస్తువులన్నీ మంచి కండీషన్ లో ఉంటాయని గోర్మన్ ఊహిస్తున్నారు.
సముద్రపు అడుగున ఈ భాగాలన్నీ సురక్షితంగా ఉంటాయి. వాటిని నేలపైకి తీసుకువచ్చినప్పుడే వాటి క్షీణత మొదలవుతుంది’’ అని గోర్మన్ చెప్పారు.
ఇప్పటిదాకా పాయింట్ నెమో వద్ద ఉన్న అంతరిక్ష నౌకల భాగాలను ఎవరూ గుర్తించలేదు.. అక్కడ సముద్రపు అడుగున చీకటిలో ఎన్నో భాగాలు ఉండవచ్చు.
వాటిని ఎవరూ కనిపెట్టకపోవడం వలన ఆ యంత్రాలు అంతరిక్షంలోని నిర్జన ప్రదేశం నుంచి సముద్రంలోని నిర్జన ప్రదేశానికి వచ్చి సేద తీరుతున్నట్టుగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- హమాస్, ఫతాల మధ్య ఘర్షణకు మూలం ఏంటి... పాలస్తీనా కలను ఈ కలహమే చిదిమేస్తోందా?
- గాజా: తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత... అక్కడి ప్రతి కథా విషాదమే
- IND vs PAK మ్యాచ్ గురించి సచిన్ టెండూల్కర్, షోయబ్ అఖ్తర్ మధ్య మాటల పోటీ... పాక్‌కు టాలెంట్ లేదని షోయబ్ ఎందుకు అన్నాడు?
- కిబ్బుట్జ్: ఇజ్రాయెల్ దశ దిశ మార్చిన ఈ కమ్యూనిటీ కథేంటి?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














