ది గ్రేట్ అట్రాక్టర్: సూర్యుడు, భూమితో కూడిన గెలాక్సీని లాగేస్తున్న ఈ శక్తి ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెగ్జాండ్రో మిలన్ వాలెన్సియా
- హోదా, బీబీసీ ముండో
సౌర వ్యవస్థ ఎలా ఉంటుందో ఒక మోడల్ తయారుచేయాలని చాలా మంది పిల్లలకు స్కూళ్లో హోంవర్క్ ఇస్తుంటారు.
నిజానికి ఈ హోంవర్క్‌కు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. దీని వల్ల సౌర కుటుంబంపై పిల్లలకు అవగాహన పెరుగుతుంది. అయితే, ఈ మోడల్స్‌లో సూర్యుడిని కదలకుండా చూపిస్తారు.
నిజానికి సౌర కుటుంబంతోపాటు మన గెలాక్సీ సెకనుకు 600 కి.మీ. వేగంతో విశ్వంలో ప్రయాణిస్తోందని ఎప్పుడో ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు.
ఈ పయనం ఎటు వైపు కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 1970ల్లో దీనిపై పరిశోధనలు మొదలయ్యాయి. వీటిలోనే ‘‘ది గ్రేట్ అట్రాక్టర్’’గా పిలిచే ప్రాంతం దిశగా మన గెలాక్సీ వెళ్తోందని తేలింది.
‘‘మన గెలాక్సీ పయనించే మార్గాన్ని మనం స్పష్టంగా గమనించలేకపోవచ్చు. కానీ, దీని లక్ష్యం మాత్రం ది గ్రేట్ అట్రాక్టరే. కోట్ల కాంతి సంవత్సరాలపాటు విశ్వంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా ఇది ఏర్పడింది’’అని న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్స్ యూనివర్సిటీకి చెందిన కాస్మోలజిస్ట్ పాల్ సూటర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మన గెలాక్సీ చాలా వేగంగా కదులుతోంది. కానీ, ఇది ఆ గమ్యాన్ని చేరుకోలేకపోవచ్చు.
‘‘మనం ఆ గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేం. ఎందుకంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల్లో మొత్తం విశ్వాన్ని డార్క్ ఎనర్జీ నాశనం చేయొచ్చు’’ అని సూటర్ చెప్పారు.
డార్క్ ఎనర్జీని ఒక అంతుచిక్కని శక్తిగా అమెరికా అంతరిక్ష పరిశోధన చెబుతోంది. విశ్వం నానాటికీ విస్తరించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది.
దీని వల్ల గెలాక్సీలు ఒకదానిక మరొకటి మరింత దూరం జరుగుతున్నాయి. ఫలితంగా మరికొన్ని వందల కోట్ల కాంతి సంవత్సరాల్లో మనకు తెలిసిన విశ్వం పూర్తిగా నాశనం అవుతుంది.
కాబట్టి ‘‘గ్రేట్ అట్రాక్టర్’’ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే, విశ్వంలోని వ్యవస్థల గురించి మనకు అవగాహన వస్తుంది.
‘‘విశ్వంపై అధ్యయనంలో అసలు అది ఎలా ఏర్పడింది, ఎలా కదులుతోంది, దీనిలో భిన్న ఖగోళ వస్తువులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? లాంటి అంశాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం’’ అని బోగోటా ప్లానెటేరియంలో పనిచేస్తున్న కొలంబియా ఖగోళ శాస్త్రవేత్త కార్లోస్ అగస్టో మోలినా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దీన్ని ఎలా కనిపెట్టారు?
20వ శతాబ్దం ద్వితీయార్థంలో హబుల్ టెలిస్కోప్‌తో అంతరిక్ష అన్వేషణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పటివరకు తాము నిజమని భావిస్తున్న చాలా అంశాలు తప్పని దీనితో రుజువైంది.
దీంతో కొత్త విశ్వం మ్యాపులను రూపొందించడాన్ని పరిశోధకులు మొదలుపెట్టారు. దీనిలో సౌర వ్యవస్థ, మన గెలాక్సీల స్థానంపై చర్చ కూడా మొదలైంది.
‘‘1970ల నాటికి మన సౌర వ్యవస్థతోపాటు గెలాక్సీ కదలికలపైనా అధ్యయనాలు మొదలయ్యాయి. ఇతర గెలాక్సీ కదలికలతో వీటిని పోల్చడం కూడా మొదలుపెట్టారు. దీంతో విశ్వంలో ప్రతిదీ ఒకే దిశలో విస్తరిస్తున్నట్లు పరిశోధకులు అవగాహనకు వచ్చారు’’ అని సూటర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘అయితే, కొందరు ఖగోళ నిపుణులకు మరికొన్ని ఆసక్తికర అంశాలు కనిపించాయి. గెలాక్సీల కదలికలు ఒక దిశలో ఉన్నట్లు వారు మొదట ప్రతిపాదించారు. గెలాక్సీలన్నీ ఒక కేంద్ర బిందువు దిశగా కదులుతున్నట్లు మొదట వారు ప్రతిపాదించారు’’ అని సూటర్ అన్నారు.
అయితే, ఆ దిశ విషయంలో మొదట చాలా మంది ఖగోళ నిపుణులు తప్పటడుగులు వేసేవారు. ఒక్కోసారి అందుబాటులోనున్న సమాచారాన్ని అధ్యయనం చేయడంలోనూ కొన్ని లోపాలు కనిపించేవి.
అయితే, టెలిస్కోప్‌లు, వాటి టెక్నాలజీలు క్రమంగా మెరుగయ్యాయి. 1986లో మన గెలాక్సీతోపాటు సమీపంలో కొన్ని గెలాక్సీలు ఒకే దిశలో వెళ్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
‘‘కొత్త పరికరాలతో మన గెలాక్సీలు ఎటు వెళ్తున్నాయనే అంశంతోపాటు అవి ఎంత వేగంతో కదులుతున్నాయో కూడా తెలుసుకునేందుకు అవకాశం కల్పించాయి. అంటే పరిశోధనల్లో కచ్చితత్వం పెరిగింది’’ అని మోలినా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పుడే ‘‘ది గ్రేట్ అట్రాక్టర్’’ గురించి సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దమొత్తంలో డార్క్ మ్యాటర్ (కృష్ణ పదార్థంతో)కూడిన ఇది ‘‘లానియాకియా’’ అని పిలిచే గెలాక్సీల సూపర్ క్లస్టర్‌లో ఉంది. ఇది 30 కోట్ల కాంతి సంవత్సరాల కంటే తక్కువ దూరంలోని గెలాక్సీలను తన వైపుగా లాక్కుంటోంది.
విశ్వంలోని అంతుచిక్కని పదార్థాలలో ఈ డార్క్ మ్యాటర్ కూడా ఒకటి. దీన్ని నేరుగా మనం చూడలేం, పరిశీలించలేం. దీని నుంచి వచ్చే గురుత్వాకర్షణ తరంగాల వల్లే దీని ఉనికి మనకు తెలుస్తుంది.
భారీగా గెలాక్సీలను తమ వైపు లాగేస్తున్న ఈ డార్క్ మ్యాటర్ వలయాన్ని ‘‘ది గ్రేట్ అట్రాక్టర్’’గా పరిశోధకులు పిలుస్తున్నారు. భూమి నుంచి 20 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది.
ఖగోళ పరిశోధనల్లో చాలా పురోగతి కనిపిస్తున్నప్పటికీ, ‘‘ది గ్రేట్ అట్రాక్టర్’’ ఇప్పటికీ అంతుచిక్కని మర్మంగానే మిగిలిపోయిందని, అందుకే దీనిపై తనకు ఆసక్తి పెరిగిందని సూటర్ చెప్పారు.
‘‘ది గ్రేట్ అట్రాక్టర్ ఉన్న లొకేషన్ వల్ల దీనిపై పరిశోధన చేపట్టడానికి కష్టంగా మారుతోంది. ఇది మన గెలాక్సీకి పూర్తి వ్యతిరేక దిశలో ఉంది’’ అని ఆయన వివరించారు.
‘‘మనం దానిపై దృష్టి సారించినప్పుడు, చాలా శబ్దం వినిపిస్తోంది. చాలా నక్షత్రాలు, గ్రహాలు, నెబ్యులాలు దీనిపై పరిశోధనకు అడ్డుగా నిలుస్తున్నాయి’’అని ఆయన అన్నారు.
కృష్ణ బిలం కాదు..
అటు సూటర్, ఇటు మోలినా ‘‘ది గ్రేట్ అట్రాక్టర్’’ కృష్ణబిలం కాదని చెప్పారు.
‘‘అది చాలా భిన్న శక్తి. దీనికి విశ్వంలోని కృష్ణ బిలాలకు ఎలాంటి సంబంధమూ లేదు’’ అని సూటర్ వివరించారు.
దీన్ని గుర్తించడం ద్వారా విశ్వంలో ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయని పరిశోధకులు అవగాహనకు వచ్చారు. వీటి ఉదాహరణగా డ్రాగ్ గెలాక్సీలను చెప్పుకోవచ్చు.
‘‘వీటి గురించి అర్థం చేసుకోవడం ద్వారా విశ్వానికి సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు. అసలు వీటిలో ఒక్కో గెలాక్సీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, దీని గురుత్వాకర్షణ శక్తి ఎంత మేర ఉంది? లాంటివి అర్థం చేసుకోవచ్చు’’ అని మోలినా చెప్పారు.
‘‘విశ్వంలోని ఈ ప్రాంతాలు కాంతి, గురుత్వాకర్షణ లాంటి బలాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో అర్థం చేసుకోవడం ద్వారా విశ్వాన్ని మెరుగ్గా మ్యాప్ చేయొచ్చు’’ అని మోలినా అన్నారు.
మన విశ్వం భవిష్యత్ గురించి తెలుసుకోవడానికి వీటిపై అధ్యయనం చాలా ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు.
‘‘మన గెలాక్సీ ఎంత వేగంగా కదులుతోంది? ఇది ఎటువైపుగా వెళ్తోంది? లాంటి అంశాలను తెలుసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు’’అని సూటర్ చెప్పారు.
‘‘మన విశ్వంలో మరో బలమైన శక్తి కూడా ఉంది. అదే డార్క్ ఎనర్జీ. ఇది గురుత్వాకర్షణ శక్తికి పూర్తిగా వ్యతిరేకం. అంటే తనవైపు లాక్కోడానికి బదులుగా ఇది నెట్టివేస్తుంది’’అని సూటర్ అన్నారు.
‘‘కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల్లో మనం ది గ్రేట్ అట్రాక్టర్‌కు దగ్గరగా వెళ్లినప్పుడు.. మన గెలాక్సీ దిశపై డార్క్ ఎనర్జీ ప్రభావం చూపిస్తుంది. బహుశా నక్షత్ర వ్యవస్థలన్నింటినీ అది ధ్వంసం చేయొచ్చు కూడా’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'భారత పార్లమెంట్ కొత్త భవనాన్ని మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన సావర్కర్ జయంతి రోజున ప్రారంభిస్తారా?'
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- జీ20 సదస్సు: కశ్మీర్లో ఆర్టికల్-370 రద్దు తర్వాత ఈ నాలుగేళ్ళలో ఏం మారింది?
- మానవ శరీరంలో ప్రకృతి చేసిన 'డిజైనింగ్ తప్పులు'
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















