వైరస్‌లే లేకుంటే మనిషి మనుగడ ఇలా ఉండేది కాదా?

వైరస్‌

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మైకెల్ మార్షల్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

వైరస్‌లు సాధారణంగా వ్యాధులకు కారణం అవుతాయి. కొన్నిసార్లు వీటి వల్ల మహమ్మారులు కూడా చెలరేగుతాయి. అయితే, మీకు తెలుసా? ఇవి మానవ పరిణామ క్రమంలో ప్రధాన పాత్ర పోషించాయి. అవిలేకపోతే, మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.

కొలంబియాలోని ఆండీస్ పర్వతాల్లో జీవించే మబుయా లిజర్డ్స్ ఇతర పాకే జీవుల కంటే భిన్నమైనవి. సరీసృపాలు చాలావరకూ గట్టి పెంకులుండే గుడ్లను పెడతాయి. దీనికి భిన్నంగా మబుయాలు చిన్నచిన్న పిల్లలకు జన్మనిస్తాయి.

ఆడ మబుయాల కడుపులో ‘‘ప్లాసెంటా’’లు ఉంటాయి. శరీరంలో పిండ దశలో పిల్లలకు ఆహారం అందించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనుషులు, ఎలుకలు లాంటి క్షీరదాల్లో ఈ ప్లాసెంటాలు కనిపిస్తాయి. అయితే, కొన్ని ఇతర జంతువుల్లోనూ ప్లాసెంటాలు ఉంటాయి.

2001లో కొలంబియాలోని ఇండస్ట్రియల్ యూనివర్సిటీ ఆఫ్ శాంటాండెర్‌కు చెందిన జంతువుల నిపుణులు మార్తా పేట్రీసియా రమీరెజ్ పినిలా, అడ్రియానా జెరోజ్‌లు చేపట్టిన అధ్యయనంలో మబుయాల్లోనూ పూర్తిగా అభివృద్ధి చెందిన ప్లాంసెటాలు ఉంటున్నట్లు వెల్లడైంది.

గుడ్లు పెట్టే సరీసృపాల్లో ఇలాంటి అవయవాలు కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి వెనుక కారణాలపై రమీరెజ్ పినిలా, ఫ్రాన్స్‌లోని గుస్తావే రోసీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు థియెరీ హీడ్‌మాన్‌తో కలిసి పనిచేశారు. దీంతో ప్లాసెంటా రూపుదిద్దుకోవడంలో కీలకంగా పనిచేసే ఒక జన్యువు వైరస్ నుంచి వచ్చినట్లు తేలింది.

గత 2.5 కోట్ల సంవత్సరాల్లో ఈ మబుయాలకు పూర్వీకులైన సరీసృపాలకు ఆ వైరస్ సొకింది. ఫలితంగా ఆ జంతువుల జన్యువుల్లోకి వైరస్ డీఎన్‌ఏ చేరింది. అయితే, ఇక్కడ ఆరోగ్యానికి ముప్పు కలిగేందుకు బదులుగా, వైరల్ డీఎన్‌ఏతో కలిసి జీవించడానికి ఆ జంతువు శరీరం అలవాటు పడింది. అలా వాటిలో తొలి ప్లాసెంటాలు అభివృద్ధి అయ్యాయి. మొత్తంగా ఆ వైరస్ సోకడంతో వాటిలో కొత్త అవయవాలు పుట్టుకొచ్చాయి.

‘‘కొత్త జన్యువులు చేరడంతో మబుయాలు ప్లాసెంటా లేని జీవుల నుంచి ప్లాసెంటా జీవులుగా రూపాంతరం చెందాయి’’అని హీడ్‌మాన్ చెప్పారు.

వైరస్‌

ఫొటో సోర్స్, Getty Images

అసాధారణం కాదు...

ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇదేమీ అసాధారణ పరిణామం కాదు. మనుషుల్లో పదో వంతు జన్యువులు ఇలా వైరస్‌ల నుంచి వచ్చినవే. ఆ వైరల్ డీఎన్‌ఏ మన పరిణామ క్రమంలో ప్రధాన పాత్ర పోషించింది. ప్లాసెంటా అభివృద్ధిలోనూ దీనిదే కీలకపాత్ర. వ్యాధులపై పోరాడేలా రోగ నిరోధక శక్తి మారడం, కొత్త జన్యువులు రూపుదిద్దుకోవడంలోనూ ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. వైరస్‌లే లేకపోతే, మనుషుల పరిణామక్రమం ఇంతవరకు వచ్చుండేది కాదు.

వైరస్‌లు చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి. అందుకే వీటిని పూర్తి జీవులుగా చాలా మంది పరిశోధకులు పరిగణించరు. అయితే, ఒక్కో వైరస్‌ను ఒక్కో జన్యు పదార్థ ప్యాకేజీగా చెప్పుకోవచ్చు. సజీవంగా ఉండే కణాలకు సోకడం ద్వారా ఇవి తమ సంఖ్యను రెట్టింపు చేసుకోగలవు. దీనిలో అడ్డుగా వచ్చే ఆ కణ వ్యవస్థలను నాశనం కూడా చేస్తాయి. ఫలితంగా వీటికి ఆశ్రయమిచ్చే కణాలు అనారోగ్యానికి గురవుతాయి.

కణాల్లోకి సొంత జన్యు పదార్థాన్ని చొప్పించే వైరస్‌లను రెట్రోవైరస్‌లుగా పిలుస్తారు. వీటి స్వభావం, చర్యలపై 1960, 1970లల్లో తొలి పరిశోధనలు జరిగాయి. అతిథేయి జన్యుపదార్థంలోకి కొన్ని వైరస్‌లు తమ సొంత జన్యుపదార్థాన్ని చొప్పించగలవని 1964లో కొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అనంతరం చేపట్టిన పరిశోధనలో కోడిపిల్లల జన్యువుల్లో వైరల్ డీఎన్‌ఏను పరిశోధకులు గుర్తించారు.

వైరస్‌లలో చాలా రకాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు మనుషులకు సోకే నాలుగు రెట్రోవైరస్‌లను మాత్రమే పరిశోధకులు గుర్తించారు. ఇవన్నీ కూడా 1980లలో గుర్తించినవే. క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ టీ-లింఫోట్రాపిక్ వైరస్ 1 (హెచ్‌టీఎల్‌వీ-1), దీనికి దగ్గర సంబంధముండే హెచ్‌టీఎల్‌వీ-2, ఎయిడ్స్‌కు కారణమయ్యే హ్యూమన్ ఇమ్యునోడిఫీషియన్సీ వైరస్ (హెచ్ఐవీ)-1, 2లు వీటిలో ఉన్నాయి.

ఒక వ్యక్తి ఊపిరితిత్తులు లేదా చర్మంలోని కణాలకు రెట్రోవైరస్‌ సోకితే, దాన్ని చెడు వార్తగా చెప్పుకోవాలి. అయితే, ఇప్పుడు ఇది పరిణామక్రమంపై అంత ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే తర్వాత తరాలకు ఇవి వారసత్వంగా వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉంటోంది.

అయితే, కొన్నిసార్లు రెట్రోవైరస్‌లు అండాలు, వీర్యం ఉత్పత్తికి కారణమయ్యే ‘‘జెర్మ్‌లైన్’’లోకి కూడా ప్రవేశించొచ్చు. అప్పుడే ఆ వైరస్‌లు భవిష్యత్ తరాలకూ చేరే అవకాశం పెరుగుతుంది. ఇలాంటి వైరల్ డీఎన్‌ఏలను ఎండోజీనస్ రెట్రోవైరస్‌ లేదా ఈఆర్‌వీగా పిలుస్తారు. వీటిని మన పరిణామ క్రమాన్ని మార్చే శక్తి ఉంటుంది.

వైరస్‌

ఫొటో సోర్స్, Getty Images

మిగతా జీవుల్లో ఈఆర్‌వీలు...

మనుషుల జీనోమ్‌ను మొదటిసారిగా 2001లో ప్రచురించారు. అప్పుడే ఈఆర్‌వీల పాత్ర గురించి వెలుగులోకి వచ్చింది. ‘‘మన జన్యువుల్లో పెద్ద మొత్తంలో వైరస్ జన్యువులు ఉన్నట్లు అప్పుడే వెల్లడైంది’’ అని హీడ్‌మాన్ చెప్పారు. మనుషుల జన్యువుల్లో ఈఆర్‌వీల వాటా 8 శాతం వరకూ ఉండొచ్చని తెలిపారు.

వీటిలో కొన్ని చాలా పురాతనమైనవి. హ్యూమన్ క్రోమోజోమ్‌-17లోని ఒక ఈఆర్‌వీ బహుశా 10.4 కోట్ల కంటే పురాతనమైనది కావచ్చని 2013లో నిర్వహించిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అంటే భూమిపై డైనోసార్లు జీవించినప్పుడు బహుశా ఈ వైరస్‌లు మనకు సోకి ఉండొచ్చు. ప్లాసెంటాలు కలిగిన క్షీరదాలు, సరీసృపాల్లోనే ఈఆర్‌వీలు కనిపిస్తాయి.

అయితే, వెన్నెముక కలిగిన అన్ని జీవుల్లోనూ ఈఆర్‌వీలు కనిపిస్తాయని ఇటలీలోని కాగ్లియారి యూనివర్సిటీకి చెందిన నికోల్ గ్రాండీ చెప్పారు.

మనుషుల్లో కనిపించే చాలా ఈఆర్‌వీలు కేవలం మన జాతికి మాత్రమే పరిమితం కాదు. ఇంపాంజీలు లాంటి ఇతర పురాతన జీవుల్లోనూ ఇవి కనిపిస్తాయి. అంటే కొన్ని మిలియన్ల ఏళ్లకు ముందే మన పూర్వీకులకు ఈ వైరస్‌లు సోకాయి. అంటే మన జాతి పరిణామక్రమం పూర్తిగా అభివృద్ధి చెందడానికి చాలా కాలం ముందు నుంచే, ఇవి మనకు వారసత్వంగా వస్తూ ఉన్నాయి.

కొత్తవి కనిపించడం లేదు..

గత కొన్ని వేల సంవత్సరాల్లో కొత్త ఈఆర్‌వీలు మనుషుల జన్యు పదార్థంలోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పే ఆధారాలేమీ కనిపించడం లేదు. ప్రస్తుతం మన జాతికి సోకుతున్న రెట్రోవైరస్‌లలో హెచ్‌టీఎల్‌వీ, హెచ్ఐవీలు మాత్రమే కనిపిస్తున్నాయని గ్రాండీ చెప్పారు. ‘‘అయితే, ఈ రెండూ జెర్మ్‌లైన్ కణాలకు సోకుతున్నట్లు చెప్పే ఆధారాలేవీ లేవు’’అని గ్రాండీ వివరించారు.

అయితే, కొన్ని ఇతర జీవుల్లో దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. వీటికి ఉదాహరణగా కోలాలను చెప్పుకోవచ్చు. వీటిలో కోలా రెట్రోవైరస్ వ్యాపిస్తోంది. అయితే, కొన్ని కోలాల్లో మాత్రమే ఈ రెట్రోవైరస్‌లు కనిపిస్తున్నాయి. అంటే, ఇక్కడ ప్రత్యక్షంగా వైరస్ జన్యువులు కోలా జన్యువులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో మనం చూడొచ్చు.

వైరస్‌

ఫొటో సోర్స్, Getty Images

ప్లాసెంటా ఎలా వచ్చింది?

హ్యూమన్ ఈఆర్‌వీలు వాస్తవానికి క్రియాశీలంగా లేని జన్యువులు లేదా ‘‘జంక్ డీఎన్ఏ’’లుగా భావించేవారు. అయితే, వాస్తవానికి వీటిలో చాలా ఈఆర్‌వీలు అచేతనమైనవి కాదు.

హ్యూమన్ జీనోమ్‌లోని హెచ్‌ఈఆర్‌వీ-డబ్ల్యూగా పిలిచే ఈఆర్‌వీపై ఎక్కువ పరిశోధనలు జరిగాయి. వీటిని 1999లో తొలిసారి గుర్తించారు. ప్లాసెంటాలోని సిన్సిటిన్స్‌గా పిలిచే ప్రోటీన్ల ఉత్పత్తిలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. మబుయా లిజార్డ్స్ తరహాలోనే ప్లాసెంటా రూపుదిద్దుకోవడంలో ఈ వైరల్ జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

సిన్సిటిన్స్ ఎలా పనిచేస్తాయో మీరు దృష్టిసారించినప్పుడు వైరస్‌లు, ప్లాసెంటాల మధ్య సంబంధం గురించి అవగాహన వస్తుంది. రెండు లేదా అంత కంటే ఎక్కువ కణాలను ఒకటిగా చేయడంలో సిన్సిటిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

మొదట ఇవి వైరల్ ప్రొటీన్‌లుగా ఉండేటప్పుడు, కణం బయటి పొరతో కలవడానికి, కణానికి సోకడానికి వైరస్ వీటిని ఉపయోగించి ఉండొచ్చు. ఈ కలిపే సామర్ధ్యమే ప్లాసెంటాలోనూ క్రియాశీలంగా పనిచేస్తుంది. తల్లి, పిండంల కణాలను కలపడం ద్వారా.. పోషకాలను పిండానికి ప్లాసెంటా బదిలీ చేస్తుంది. వ్యర్థాలను కూడా బయటకు పంపిస్తుంది.

ఇది కేవలం మనుషుల్లోనే కాదు. గొరిల్లాలు లాంటి కోతులలోనూ ఇలాంటి సిన్సిటిన్ ప్రోటీన్లు కనిపిస్తాయి . రెట్రోవైరస్‌లు క్షీరదాలకు వాటి పరిణామక్రమంలో మళ్లీమళ్లీ సోకినట్లు తాజా అధ్యయనాలు నిరూపించాయి. క్షీరదాల్లోని భిన్న సమూహాల్లో భిన్న రెట్రోవైరస్ల నుంచి పొందిన భిన్న సిన్సిటిన్‌లు కనిపిస్తాయి.

‘‘బహుశా 15 కోట్ల ఏళ్ల క్రితం ఈ ఈఆర్‌వీలు సోకి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఇదే ప్లాసెంటా క్షీరదాల ఆవిర్భావంలోనూ ప్రధాన పాత్ర పోషించొ ఉండొచ్చు’’ అని హీడ్‌మాన్ చెప్పారు.

అప్పటి నుంచి, పదేపదే వచ్చే అంటువ్యాధుల వల్ల ఈర్ఆర్‌వీలో మార్పులు జరిగి ఉండొచ్చు. కాబట్టి ఏ సజీవ క్షీరదంలోనూ తొలిసాటి ఈఆర్‌వీలు కనిపించడం లేదు.

కానీ మబుయా అధ్యయనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మొదట వైరస్ నుంచి ఆర్‌వీలను పొందిన తర్వాతే ప్లాసెంటా అభివృద్ధి చెందిందని దీనిలో నిరూపితమైంది. అన్ని ప్లాసెంటా క్షీరదాల పూర్వీకులలో ఇదే జరిగిందని దీని బట్టి తెలుస్తోంది.

వీడియో క్యాప్షన్, చైనాలో కోతి నుంచి కొత్త వైరస్ కేసు, ఒకరి మృతి

పరిణామ క్రమాన్ని వైరల్ డీఎన్‌ఏలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడానికి సిన్సిటిన్స్, ప్లాసెంటాల మధ్య సంబంధం చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హ్యూమన్ జీనోమ్‌లో మనకు పూర్తి వైరల్ జీన్ కనిపిస్తుంది. ఇక్కడ వైరల్ ప్రోటీన్‌లను కూడా చూడొచ్చు. కానీ, చాలా ఈఆర్‌వీలు ప్రోటీన్‌ల ఉత్పత్తిలో పాలుపంచుకోవు. అయినప్పటికీ వాటికంటూ ప్రత్యేక విధులు ఉంటాయి.

వీటిలో కొన్ని మూలకణాల పాత్ర పోషిస్తాయి. మరికొన్ని పిండాల అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తాయి. కొన్ని మూల కణాలకు శరీరంలోని ఏ రకమైన కణంగానైనా అభివృద్ధి చెందే శక్తి ఉంటుంది. దీన్నే ప్లూరిపోటెన్సీగా పిలుస్తారు. దీనిలో హెచ్ఈఆర్‌వీ-హెచ్‌గా పిలిచే రెట్రోవైరస్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే, ప్రోటీన్ల ఉత్పత్తిలో ఇవి ఎలాంటి పాత్ర పోషించవు.

"వీటిలో మార్పులు చేస్తే, ఆ కణ స్వరూపమే మారుతుంది. అంతేకాదు దాని సామర్థ్యాన్ని కోల్పోతుంది" అని మేరీల్యాండ్‌లోని బెథెస్డాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌కు చెందిన వైరాలజిస్ట్ క్రిస్టీన్ కొజాక్ చెప్పారు.

కొన్ని ఈఆర్‌వీలు జన్యువుల చర్యలను నియంత్రిస్తాయి. ఫలితంగా శారీరక ప్రక్రియలను శాశిస్తాయి. ఉదాహరణకు మనం తీసుకొనే ఆహారంలోని పిండి పదార్థాలు లాంటి కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడానికి అమైలేస్ అనే ఎంజైమ్‌ అవసరం. ‘‘కాలేయంతోపాటు నోటిలోని లాలాజలంలో అమైలేస్ కనిపిస్తుంది. దీని ఉత్పత్తిలో ఈఆర్‌వీ ప్రధాన పాత్ర పోషిస్తుంది’’ అని గ్రాండి చెప్పారు.

ఆరోగ్యంగా ఉంచే వైరస్‌లు

వైరస్‌ల నుంచి ఈఆర్‌వీలు రావడంతో.. మన ఆరోగ్యంపై ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయోననే అంశంపై చాలా అధ్యయనాలు జరిగాయి. వీటిలో 2022లో న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో సెడ్రిక్ ఫెస్కోట్ నేతృత్వంలోని జరిగిన అధ్యయనమూ ఒకటి.

ఇతర జంతువులలో కనిపించే కొన్ని జన్యువుల చర్యలను మానవుల్లోనూ కనుగొనడానికి ఫెస్కోట్ బృందం ప్రయత్నిస్తోంది. ఈఆర్‌వీల చర్యల్లో భాగంగా ఉత్పత్తయ్యే కొన్ని ప్రోటీన్లను కొత్త ఈఆర్‌వీలపై పోరాడటానికి రోగ నిరోధక వ్యవస్థ ఎలా ఉపయోగిస్తుందనే అంశంపై వీరు దృష్టిసారించారు.

‘‘ఈఆర్‌వీల నుంచి వచ్చే యాంటీవైరల్ ప్రోటీన్లు ఎలుకలు, కోళ్లలలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో చాలా పరిశోధనలు జరిగాయి. కానీ, మనుషుల్లో ఈ సంబంధాన్ని నిరూపించే పరిశోధనలేవీ జరగలేదు" అని ఫెస్కోట్ చెప్పారు.

ఫెస్కోట్ నేతృత్వంలోని బృందం మానవ జన్యువులో కొన్ని ఈఆర్‌వీలను పరిశీలించింది. యాంటీవైరల్ ప్రోటీన్‌లను ఉత్పత్తి చేయగల వందలాది సీక్వెన్స్‌లను గుర్తించింది. వీటిలో ప్రధానంగా ‘‘సప్రెసిన్’’గా పిలిచే జన్యువుపై వీరు దృష్టి కేంద్రీకరించారు.

సప్రెసిన్ నుంచి వచ్చే ప్రోటీన్.. కణాలలోకి రెట్రోవైరస్‌లు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ప్లాసెంటాతోపాటు అభివృద్ధి చెందుతున్న పిండంలో ఈ సప్రెసిన్ కనిపిస్తుంది.

‘‘బలహీనమైన రోగనిరోధక వ్యవస్థల ఉండే పిండాలకు రెట్రోవైరస్లు సోకకుండా అడ్డుకోవడమే వీటి విధి. ఇది జెర్మ్‌లైన్‌కు రక్షణగా పనిచేస్తుంది" అని ఫెస్కోట్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, చన్నీటి స్నానంతో జరిగే మేలు.. శాస్త్రీయ కారణాలు

ఈఆర్‌వీలు అనారోగ్యానికి కారణం అవుతాయా?

మనల్ని వ్యాధుల నుంచి రక్షిస్తున్నప్పటికీ, వీటి వల్ల కూడా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. ఈవీఆర్ వల్ల వచ్చే వ్యాధులపై నేడు పరిశోధకులు దృష్టిసారిస్తున్నారని మేరీలాండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అలెర్జీ లండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌కు చెందిన క్రిస్టీన్ కోజాక్ అన్నారు.

‘‘రెట్రోవైరస్‌లు వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ చాలా మంది వీటిని క్యాన్సర్‌తో ముడిపెడుతున్నారు’’అని ఫెస్కోట్ చెప్పారు. ఎందుకంటే జంతువులలో కొన్ని ఈఆర్‌వీలు క్యాన్సర్‌కు కారణం అవుతున్నాయి.

‘‘ఈఆర్‌వీ పరిశోధనపై భారీగా డబ్బులను వెచ్చిస్తున్నారు. ఇవి ఏమైనా కాన్సర్‌కు కారణం అవుతున్నాయా? అనే విషయం వీటిలో తెలియొచ్చు’’అని ఆయన అన్నారు.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మనుషుల్లో కనిపించే చాలా ఈవీఆర్‌లు వైరస్‌ల జననానికి కారణం కాలేవు. ఫలితంగా ఇవి ఇతర కణాలకు సోకలేవు. ‘‘ఎలుకలు, కోళ్లలో ఇవి వ్యాధులకు కారణం అవుతున్నాయి. కానీ, మనుషుల్లో ఇవి నియంత్రణలో ఉన్నాయి. కాబట్టి వీటితో వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల ముప్పు ఉండకపోవచ్చు’’అని ఫెస్కోట్ చెప్పారు.

వ్యాధులలో ఈవీఆర్‌ల పాత్రపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ ఇక్కడ స్పష్టమైన విషయం ఏమిటంటే అవి పరిణామక్రమంలో ప్రధాన పాత్ర పోషించాయి. మన జన్యువుల్లో వాటి డీఎన్‌ఏలను చొప్పించడం ద్వారా చాలా మార్పులకు ఇవి కారణమయ్యాయి. అవే లేకపోతే, మనుషులతోపాటు ఏ జంతువూ ప్రస్తుత రూపంలో ఉండేది కాదు.

మనలో చాలా మందిలో నియాండెర్తాల్ జాతి జన్యువులు 2 శాతం వరకూ కనిపిస్తాయి. మరికొంత మందిలో డెనిసోవాన్స్ జన్యువులు ఉండొచ్చు. కానీ, మన అందరి జన్యువుల్లో దాదాపు 8 శాతం వైరస్‌ల నుంచి వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)