బ్రిటన్ ప్యాలెస్‌లో ఇథియోపియా యువరాజు మృతదేహం, ఇవ్వడానికి నిరాకరిస్తున్న రాజకుటుంబం, కారణమేంటి?

ఫొటో సోర్స్, Alamy
విండ్సర్ క్యాసిల్‌లో ఖననం చేసిన 19వ శతాబ్దంనాటి ఇథియోపియా యువరాజు అవశేషాలను వెనక్కి ఇచ్చేందుకు బకింగ్‌హమ్ ప్యాలస్ నిరాకరించింది.
ఏడేళ్ల వయసులోనే యువరాజు అలేమయేహును బ్రిటన్‌కి తరలించారు. ప్రయాణంలోనే తల్లి మరణించడంతో అనాథగానే ప్రిన్స్ అలేమయేహు బ్రిటన్‌కు చేరుకున్నారు.
‘‘మా కుటుంబ సభ్యుడిగా, ఇథియోపియా వాసిగా ఆయన అవశేషాలు మాకు కావాలి. ఎందుకంటే ఆయన పుట్టింది ఆ దేశంలో కాదు’’ అని యువరాజు వారసుల్లో ఒకరైన ఫాసిల్ మినాస్ బీబీసీకి చెప్పారు.
బ్రిటన్‌లో ఆయన్ని ఖననం చేయడం సరైంది కాదని అన్నారు.
యూకేకు వెళ్లిన తర్వాత శ్వాసకోశ సంబంధిత వ్యాధితో 18 ఏళ్ల వయసున్న యువరాజు 1879లో మరణించారు. క్వీన్ విక్టోరియా అభ్యర్థన మేరకు రాయల్ కుటుంబం అప్పట్లో ఆయనకు ఆర్థికంగా సాయపడింది.
ఖననం చేసిన రాజు మృతదేహాన్ని వెలికితీస్తే, విండ్సర్ క్యాసిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్ కటాకాంబ్స్‌లో ఖననం చేసిన ఇతరుల అవశేషాలపై ప్రభావం పడే అవకాశం ఉందని బకింగ్‌హమ్ ప్యాలస్ అధికార ప్రతినిధి బీబీసీకి తెలిపారు.
సమీపంలోని ఇతరుల మృతదేహాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన అవశేషాలను తవ్వి వెలికితీయడం సాధ్యమయ్యే పని కాదని ప్యాలస్ తెలిపింది.
ప్రిన్స్ అలేమయేహు స్మారకాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని చాపెల్‌లోని అధికారులు ఎప్పుడూ గుర్తిస్తారని, అలాగే అక్కడ ఖననం చేసిన ఇతరుల గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పింది.
గతంలో కూడా చాపెల్‌ను సందర్శించేందుకు ఇథియోపియా అధికారుల నుంచి రాయల్ కుటుంబానికి అభ్యర్థనలు అందాయని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
చిన్న వయసులోనే ప్రిన్స్ అలేమయేహు ఎలా మరణించారు?
1862లో తమ సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రిన్స్ తండ్రి చక్రవర్తి టెవోడ్రోస్-2 బ్రిటన్‌తో సంబంధాలు పెట్టుకోవాలని చూశారు. కానీ, ఆయన రాసిన లేఖలకు క్వీన్ విక్టోరియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
రాణి మౌనంతో కోపం తెచ్చుకున్న చక్రవర్తి టెవోడ్రోస్-2 అన్ని విషయాలను తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు యూరోపియన్లను, వారిలో బ్రిటీష్ వారిని అదుపులోకి తీసుకున్నారు.
దీని తర్వాత భారీ ఎత్తున సైనిక చర్యలు జరిగాయి. దీనిలో బ్రిటన్, భారత్‌ల నుంచి 13 వేల మంది సైనికులు పాలుపంచుకుని, చక్రవర్తి నిర్బంధంలో ఉన్న వారిని రక్షించారు.
ఈ సైన్యంలో బ్రిటన్ మ్యూజియానికి చెందిన అధికారులు కూడా ఉన్నారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చక్రవర్తి తన జీవితాన్ని బ్రిటన్ జైలులో గడిపేందుకు ఇష్టం లేక, తనకు తానుగా ప్రాణం తీసుకోవాలనుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో ఆయనను ఒక హీరోగా నిలబెట్టింది.

ఫొటో సోర్స్, Alamy
ఈ యుద్ధం తర్వాత, బ్రిటన్ వారి సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన వేలాది కళాఖండాలను దోచుకుంది. వీటిల్లో బంగారపు కిరీటాలు, నెక్లస్‌లు, వస్త్రాలు, మాన్యు స్క్రిప్ట్‌లు ఉన్నాయి. అలాగే యువరాజు అలేమయేహు, ఆయన తల్లి రాణి తిరువర్క్ వ్యూబ్‌ను కూడా తమ దేశానికి తీసుకెళ్లారు.
టెవోడ్రోస్ శత్రువుల నుంచి వారిని కాపాడి, సురక్షితంగా ఉంచేందుకు వీరిని తమ దేశానికి తీసుకెళ్తున్నట్లు బ్రిటన్ చెప్పింది. అలేమయేహుకి ఏం జరిగిందో తెలుపుతూ రాసిన ‘ది ప్రిన్స్ అండ్ ది ప్లండర్’ పుస్తకంలో రచయిత ఆండ్య్రూ హెవెన్స్ ఈ విషయాలను ప్రస్తావించారు.
1868 జూన్‌లో ఆయన్ను బ్రిటన్‌కు తరలించిన తర్వాత, ప్రిన్స్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవడం, అనాథగా మారడాన్ని విన్న క్వీన్ విక్టోరియా ఆయనపై జాలి చూపించారు. ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో ఉన్న ఐల్ ఆఫ్ వెయిట్‌లోని క్వీన్ హాలిడే ఇంట్లో ప్రిన్స్‌ను క్వీన్ విక్టోరియా కలుసుకున్నారు.
ప్రిన్స్‌కి ఆర్థికంగా సాయం చేసేందుకు ఆమె అంగీకరించారు. కెప్టెన్ ట్రిస్ట్రామ్ చార్లెస్ సాయెర్ స్పీడిని సంరక్షకుడిగా నియమించారు. ఇథియోపియా నుంచి తీసుకొచ్చిన ప్రిన్స్‌కు ఆయన తోడుగా నిలిచారు.
తొలుత ఐల్ ఆఫ్ వెయిట్‌లో ఇద్దరు కలిసి నివసించే వారు. ఆ తర్వాత కెప్టెన్ స్పీడీ ప్రిన్స్‌ను ప్రపంచమంతా తిప్పి చూపించారు. ఈ ప్రయాణంలో భాగంగానే వారు భారత్‌కు కూడా వచ్చారు.
ప్రిన్స్‌కి చదువు అవసరమని గుర్తించిన తర్వాత, బ్రిటన్ పబ్లిక్ స్కూల్ రగ్బీలో అలేమయేహును చేర్పించారు. కానీ, అక్కడ ఆయన సంతోషంగా లేరు. ఆ తర్వాత శాండ్‌హర్ట్స్‌లోని రాయల్ మిలటరీ కాలేజీలో చేరారు.
అక్కడ కూడా ప్రిన్స్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఒక దశలో ప్రిన్స్ తిరిగి తన దేశానికి వెళ్లిపోవాలనుకున్నారని హెవెన్స్ ప్రతినిధి తెలిపారు. కానీ, ఆ ఆలోచనకు బ్రిటన్ నుంచి అనుమతి రాలేదు.
లీడ్స్‌లోని ఒక ప్రైవేట్ ఇంట్లో ఉంచి, ఆయనకు ట్యూషన్ ఇప్పించారు. కానీ, ట్యూషన్ తీసుకునే సమయంలోనే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. న్యూమోనియాతో బాధపడ్డారు. ఒకానొక సమయంలో తనపై విషప్రయోగం జరిగిందని భావించి, చికిత్సను కూడా ప్రిన్స్ నిరాకరించారు.

ఫొటో సోర్స్, Alamy
ఆయన్ను అదుపులోకి తీసుకుని బ్రిటన్‌కి తరలించిన పదేళ్ల తర్వాత, తన 18వ ఏట 1879లో ప్రిన్స్ మరణించారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో యువరాజు మరణించినట్లు ప్రకటించారు. ఆయన మరణంపై క్వీన్ విక్టోరియా కూడా అప్పట్లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తన డైరీలో నివాళి మెసేజ్‌ను కూడా ఆమె రాశారు. ‘‘ఈ ఉదయం పూట అలేమయేహు మరణించారని టెలిగ్రామ్ ద్వారా తెలుసుకుని నేను తీవ్ర షాక్‌కు గురయ్యాను. ఆయనకు చెందిన ఒక వ్యక్తి లేదా బంధువులు లేని ఒక తెలియని దేశంలో ఒంటరిగా మరణించడం నిజంగా బాధాకరం!’’ అని ఆమె అన్నారు.
‘‘ఆయనకు సంతోషకరమైన జీవితం లేదు. ప్రతి విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన రంగును చూసి ప్రతి ఒక్కరూ వింతగా చూసేవారు. దీనికి అందరూ క్షమాపణ చెప్పాలి..’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత విండ్సర్ క్యాసిల్‌లో ఆయన అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు.
అయితే, ప్రిన్స్ మృతదేహాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరడం ఇదే తొలిసారి కాదు.
ప్రిన్స్ మృతదేహాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరుతూ క్వీన్ ఎలిజబెత్ 2కి ఆ దేశ అధ్యక్షుడు గిర్మా వోల్డ్ జియోర్జిస్ 2007లో లేఖ రాశారు.
అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
‘‘ఆయన వెనక్కి రావాలని మేం కోరుకుంటున్నాం. ఆయన మృతదేహం విదేశాల్లో ఉండటం మాకు ఇష్టం లేదు’’ అని వారసురాలు అబెబెచ్ చెప్పారు.
ఆయన చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవించారని, ఆయన గురించి తలుచుకుంటే తమకు కన్నీళ్లు వస్తాయని చెప్పారు.
ప్రిన్స్ మృతదేహం అప్పగింతపై కొత్త కింగ్ చార్లెస్ 3 నుంచి అనుకూలమైన స్పందన వస్తుందని ఆమె ఆశించారు.
బ్రిటన్ తన గతంపై పునరాలోచించుకునేందుకు ఈ మృతదేహం అప్పగింత ఒక మార్గమని బ్రిటన్-ఇథియోపియా సంబంధాల స్పెషలిస్ట్, ప్రొఫెసర్ అలులా ఫంక్‌హర్ట్స్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలోకి దళితులను రానివ్వరు.. ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోరు
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














