కింగ్ చార్లెస్ పట్టాభిషేకం: రాజు ఏం చేస్తారు?

కింగ్ చార్లెస్ III

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జెన్నిఫర్ క్లార్క్
    • హోదా, బీబీసీ న్యూస్

కింగ్ చార్లెస్‌కు మే 6న పట్టాభిషేకం జరగబోతోంది. వెస్ట్‌మినిస్టర్ అబేలో కిరీటాన్ని ధరించబోతున్న 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు.

2022 సెప్టెంబరులో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్‌ రాజు అయ్యారు.

రాజు ఏం చేస్తారు?

బ్రిటన్‌ అధిపతి రాజే. అయితే, ఆయన అధికారాలు నామమాత్రమైనవి. రాజకీయంగా ఆయన తటస్థంగా ఉంటారు.

ముఖ్యమైన సమావేశాల సారాంశాలు, ఆయన సంతకం అవసరమైన డాక్యుమెంట్లను రోజూ ఒక ఎర్రని పెట్టెలో పెట్టి ప్రభుత్వం ఆయనకు పంపిస్తుంది.

సాధారణంగా బకింగ్హమ్ ప్యాలెస్‌లో ప్రతి బుధవారం రాజును ప్రధానమంత్రి కలుస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు, విశేషాలను ఆయనకు ప్రధాని తెలియజేస్తారు.

ఈ సమావేశాలన్నీ ప్రైవేటుగా జరుగుతాయి. రాజుకు ప్రధాని ఏం చెప్పారో ఎలాంటి అధికారిక రికార్డుల్లోనూ ప్రస్తావించరు.

కింగ్ చార్లెస్, రిషి సునాక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్, రిషి సునాక్

రాజుకు ఇంకా ఏం అధికారాలు ఉంటాయి?

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం: ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరేందుకు రాజు బకింగ్హమ్ ప్యాలెస్‌కు ఆహ్వానిస్తారు. ఎన్నికలకు ముందుగా గడువు ముగిసిన ప్రభుత్వాన్ని అధికారికంగా రద్దుచేసేది కూడా రాజే.

రాజు ప్రసంగంతో పార్లమెంటు సమావేశాల మొదలు: రాజు పార్లమెంటు సమావేశాలకు ముందుగా ప్రారంభోపన్యాసం ఇస్తారు. దీనిలో ప్రభుత్వ ప్రణాళికలను ఆయన చదివి వినిపిస్తారు.

రాజ ముద్ర: పార్లమెంటు సమ్మతి తెలిపిన బిల్లులు చట్టాలుగా మారాలంటే రాజు ఆమోదముద్ర వేయాల్సిందే. 1708లో చివరిసారిగా రాజు ఓ బిల్లుపై ఆమోద ముద్ర వేసేందుకు నిరాకరించారు. ప్రస్తుతం దాదాపు అన్ని బిల్లులపై రాజు లేదా రాణి సంతకం చేస్తారు.

కింగ్ చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్ దంపతులతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా

యుద్ధాల్లో మరణించిన సైనికులను స్మరించుకునేందుకు లండన్‌లోని సెనోటాఫ్‌లో నిర్వహించే ‘రిమెంబెరెన్స్ ఈవెంట్‌’కు రాజు లేదా రాణి నేతృత్వం వహిస్తారు.

విదేశీ ప్రముఖులకు కూడా రాజు ఆతిథ్యం ఇస్తారు.

బ్రిటన్‌లోని విదేశీ రాయబారులు, హైకమిషనర్లు కూడా తరచూ రాజును కలుస్తారు.

రాజుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, తొలి విదేశీ పర్యటనగా కింగ్ చార్లెస్ జర్మనీకి వెళ్లారు. జర్మనీ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి బ్రిటిష్ చక్రవర్తిగానూ ఆయన చరిత్ర సృష్టించారు.

కామన్వెల్త్ కూటమికి కూడా అధిపతి బ్రిటన్ రాజే. దీనిలో 56 స్వతంత్ర దేశాలున్నాయి. వీటి మొత్తం జనాభా 250 కోట్ల వరకూ ఉంటుంది. ఈ కామన్వెల్త్ కూటమిలోని 14 దేశాలకు అధిపతిగా బ్రిటన్ రాజు కొనసాగుతున్నారు.

రాజు తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆయన భార్య, రాణి కామిలా సాయం చేస్తారు. అంతేకాదు, ఆమె మద్దతుతో నడుస్తున్న 90కిపైగా స్వచ్ఛంద సంస్థల బాధ్యతలనూ ఆమె చూసుకుంటారు.

వీటిలో చాలా సంస్థలు ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం కృషి చేస్తుంటాయి. లైంగిక దాడుల బాధితుల కోసం కూడా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి.

కింగ్ చార్లెస్ పట్టాభిషేకం

ఫొటో సోర్స్, Reuters

పట్టాభిషేకం ఎలా జరుగుతుంది?

వెస్ట్‌మినిస్టర్ అబేలో నిర్వహించే వేడుకలో కింగ్ చార్లెస్‌ను పట్టాభిషిక్తుడిని చేస్తారు.

పట్టాభిషేకం అనేది ఒక మతపరమైన కార్యక్రమం లాంటిది. కాంటెర్‌బరీ ఆర్చిబిషప్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. 'పవిత్రమైన' నూనెను రాజు తల, భుజాలు, ఛాతిపై ఆర్చిబిషప్ చల్లుతారు. ఆ తర్వాత రాచరికానికి చిహ్నాలైన ఆర్బ్ (శిలువ ముద్రతో కనిపించే గోళం), సెప్టెర్ (రాజదండం)లను రాజు చేతికి అందిస్తారు.

ఈ కార్యక్రమం చివర్లో చార్లెస్ తలపై సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని రాజుకు పెడతారు. ఈ బంగారు కిరీటం 1660ల నాటిది.

టవర్ ఆఫ్ లండన్‌లోని రాజాభరణాల్లో ఈ కిరీటం కూడా మనకు కనిపిస్తుంది. పట్టాభిషేకంలో మాత్రమే రాజు దీన్ని ధరిస్తారు.

రాజ కుటుంబంలో వివాహాల్లా కాకుండా పట్టాభిషేకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దీనికి ఎవరు హాజరు కావాలో నిర్ణయించేది కూడా ప్రభుత్వమే.

కింగ్ చార్లెస్

ఫొటో సోర్స్, PA Media

రాజ కుటుంబంలో ఎవరుంటారు?

రాజు చార్లెస్, ఆయన తొలి భార్య ప్రిన్సెస్ డయానాల పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం.

ఎలిజబెత్ మరణం తర్వాత, ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’, ‘డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్‌’ బాధ్యతలను విలియం తీసుకున్నారు. ‘డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్‌’గా కూడా ఆయనే కొనసాగుతున్నారు. ఆయన భార్య పేరు క్యాథరీన్. ఆమె ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’, ‘డచెస్ ఆఫ్ కార్న్‌వాల్, కేంబ్రిడ్జ్’గానూ కొనసాగుతున్నారు. విలియం, క్యాథరీన్ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వారే ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ షార్లెట్, ప్రిన్స్ లూయిస్.

ప్రిన్సెన్ రాయల్ (ప్రిన్సెస్ అన్నే).. ఎలిజబెత్ 2 రెండో సంతానం, ఏకైక కుమార్తె. ఆమె భర్త వైస్ అడ్మిరల్ టమతీ. మొదటి భర్త కెప్టెన్ మార్క్ ఫిలిప్స్‌తో ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వారే పీటర్ ఫిలిప్స్, జారా టిండాల్.

డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా (ప్రిన్స్ ఎడ్వర్డ్). క్వీన్ ఎలిజబెత్ చివరి సంతానం ఎడ్వర్డ్. ఆయన డచెస్ ఆఫ్ ఎడిన్‌బరా (సోఫీ రయీస్-జోన్స్)ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారే లేడీ లూయిస్ విండ్సర్, ‘ద ఎర్ల్ ఆఫ్ వెసెక్స్’ జేమ్స్ మౌంట్‌బ్యాటెన్ విండ్సర్.

డ్యూక్ ఆఫ్ యార్క్ (ప్రిన్స్ ఆండ్రూ).. ఎలిజబెత్ రెండో కుమారుడు. ఆయనకు తొలి భార్యతో ఇద్దరు సంతానం ఉన్నారు. వారే ప్రిన్సెస్ బియాట్రిస్, ప్రిన్సెస్ యూజీన్. అయితే, ఒక మహిళపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో 2019లో ఆయన రాజ కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

ద డ్యూక్ ఆఫ్ ససెక్స్ (ప్రిన్స్ హ్యారీ).. విలియం తమ్ముడు. ‘డచెస్ ఆఫ్ ససెక్స్’ మేఘన్ మార్కెల్ ఆయన భార్య. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వారే ప్రిన్స్ ఆర్చీ, ప్రిన్సెస్ లిలిబెట్. 2020లో వీరు కూడా రాజకుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వీరు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు.

ప్రిన్స్ విలియం

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, వారసత్వ క్రమం ప్రకారం కింగ్ చార్లెస్ తర్వాత బాధ్యతలు తీసుకునేది ఆయన పెద్ద కుమారుడు విలియం.

తర్వాత అధికారం ఎవరికి వస్తుంది?

ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజు లేదా రాణి మరణించినా లేదా బాధ్యతల నుంచి తప్పుకున్నా వారసత్వ క్రమాన్ని అనుసరించి కొత్త రాజు లేదా రాణిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

రాజు లేదా రాణి తొలి సంతానానికి తర్వాత రాజయ్యే అవకాశం వస్తుంది. దీని ప్రకారం, కింగ్ చార్లెస్ తర్వాత బాధ్యతలు తీసుకునేది ఆయన పెద్ద కుమారుడు విలియం.

ఆ తర్వాత స్థానంలో విలియం పెద్ద కుమారుడు ప్రిన్స్ జార్జ్ ఉన్నారు. ఆ తర్వాత ప్రిన్సెస్ షార్లెట్, ఆ తర్వాత ప్రిన్స్ లూయిస్, ఆ తర్వాత ప్రిన్స్ హ్యారీ వరుసలో ఉన్నారు.

వీడియో క్యాప్షన్, బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 బాల్యం ఎలా గడిచిందంటే..

రాచరికానికి ప్రజల మద్దతు ఉందా?

పట్టాభిషేకానికి ముందుగా రాజ కుటుంబం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బీబీసీ పనోరమా ఒక అభిప్రాయ సేకరణను నిర్వహించింది.

దీని ప్రకారం, రాజ కుటుంబానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. దాదాపు 58 శాతం మంది రాజుకు మద్దతు పలకగా, 26 శాతం మంది మాత్రం దేశాధిపతిని ఎన్నిక ద్వారా నియమించాలని భావించారు.

రాచరికానికి ఎక్కువగా 65 ఏళ్లకు పైబడిన వారు మద్దతు పలుకుతున్నారు. వీరిలో 78 శాతం మంది రాజు లేదా రాణి ఉండాలని కోరుకుంటున్నారు. 18-24 ఏళ్ల వయసు వారిలో ఇది కేవలం 32 శాతమే. వీరిలో 38 శాతం మంది దేశాధిపతి పదవికి కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణ వార్తను బీబీసీ న్యూస్ ఎలా చెప్పిందంటే..

రాజ కుటుంబం నివాసం ఎక్కడ?

కింగ్ చార్లెస్, కామిలా.. బకింగ్హమ్ ప్యాలెస్‌లో నివసిస్తారు. ఇదివరకు వీరు లండన్‌లోని క్లారెన్స్ హౌస్, గ్లోస్టెషైర్‌లోని హైగ్రోవ్‌లో ఉండేవారు.

మిగతా రాజ కుటుంబం నార్‌ఫ్లాక్‌లోని విండ్సర్, శాండ్రింగ్హమ్, హోలీరూడ్‌హౌస్, బల్మోరల్ ప్యాలెస్‌లలో ఉంటారు.

2022 ఆగస్టులో ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్.. వెస్ట్ లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ నుంచి ఆడిలైడ్ ప్యాలెస్‌కు మారారు.

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్‌-2 పెళ్లి ఎలా జరిగిందంటే..

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)