క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు: ఎవరు హాజరవుతున్నారు? ఎవరు హాజరుకావడం లేదు?

రాణి, జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

సోమవారం జరగనున్న రాణి అంత్యక్రియలు గత దశాబ్దకాలంలో బ్రిటన్‌లోని రాజవంశీకులు, రాజకీయ నాయకులతో నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమం కానుంది.

500 మందికిపైగా వివిధ దేశాల అధినేతలు, ఇతర ముఖ్యులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.

కుటుంబసభ్యులు, స్నేహితులు, రాజఆస్థానానికి చెందిన ఇతరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అతిథుల జాబితా ధ్రువీకరించనప్పటికీ ఎవరు వస్తున్నారు.. ఎవరు రావడం లేదన్నది చూద్దాం..

కింగ్ చార్లెస్

ఫొటో సోర్స్, Reuters

రాచకుటుంబం నుంచి..

రాజు చార్లెస్ దంపతులు, రాణి మిగతా ముగ్గురు సంతానమైన ఆనె, ఆండ్రూ, ఎడ్వర్డ్‌లు వారి భాగస్వాములతో కలిసి హాజరవుతారు. ఆండ్రూ మాజీ భార్య సారా ఫెర్గూసన్ కూడా రానున్నారు.

ప్రిన్స్ విలియమ్స్, హ్యారీ, ప్రిన్సెస్ బీట్రైస్, యూజినీ, జారా టిండాల్, పీటర్ ఫిలిప్, లేడీ లూయిస్ విండ్సర్, జేమ్స్, విస్కౌంట్ సెవర్న్ సహా రాణి మనవళ్లు, మనవరాళ్లు వారి జీవిత భాగస్వాములతో కలిసి హాజరవుతారని భావిస్తున్నారు.

అయితే, రాణి మునిమనవలు హాజరవుతారా లేదా అనేది స్పష్టంగా తెలియదు.

వీరితో పాటు ప్రిన్సెస్ డయానా సోదరుడు స్పెన్సర్, ప్రిన్సెస్ మైఖేల్ ఆఫ్ కెంట్, డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కెంట్ కూడా హాజరుకానున్నారు.

రాణితో జాన్ వారెన్, లేడీ సుసాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాణితో జాన్ వారెన్, లేడీ సుసాన్

రాణి స్నేహితులు, ఉద్యోగులు..

1960 నుంచి రాణి దగ్గర పనిచేస్తున్న లేడీ సుసాన్ హుస్సే, డేమ్ మేరీ మోరిసన్‌లు హాజరవుతారు.

30 ఏళ్లుగా రాణి వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసిన యాంజెలా కెల్లీ కూడా హాజరుకానున్నారు.

Angela Kelly

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, యాంజెలా కెల్లీ

రాణి సలహాదారు, ఫ్రెండ్ జాన్ వారెన్.. ఫార్ములా వన్ మాజీ ప్రపంచ చాంపియన్ సర్ జాకీ స్టీవార్ట్ కూడా హాజరవుతారని భావిస్తున్నారు.

వీరితో పాటు డేవిడ్ అటెన్‌బరో కూడా హాజరుకానున్నారు.

బ్రిటన్ రాజకుటుంబంతో నెదర్లాండ్స్ రాజ దంపతులు

ఫొటో సోర్స్, Reuters

ఐరోపా రాజకుటుంబాల నుంచి..

యూరప్‌లోని రాజకుటుంబాల ముఖ్యులు, వారిలో రాణి రక్తసంబంధీకులు. బెల్జియం రాజు ఫిలిప్, రాణి మెథిల్డెలు హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

నెదర్లాండ్స్ రాజు కింగ్ విల్లెమ్ అలెగ్జాండర్, ఆయన భార్య రాణి మేగ్జిమాలు రానున్నారు.

స్పెయిన్ రాజు ఫెలిప్, రాణి లెతీజియాలతో పాటు నార్వే, స్వీడన్, డెన్మార్క్, మొనాకో రాజకుటుంబాలూ రానున్నాయి.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

కామన్వెల్త్ దేశాల అధినేతలు..

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలు హాజరు కానున్నారు.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘెలు కూడా రానున్నారు.

భారత్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే బ్రిటన్ చేరుకున్నారు.

ఇటలీ, జర్మనీ అధ్యక్షులు

ఫొటో సోర్స్, CHRISTOF STACHE

ఇతర దేశాధినేతలు

అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్‌తో కలిసి అధ్యక్షుడు జో బైడెన్ హాజరవుతారని వైట్ హౌస్ ప్రకటించింది.

ఇన్విటేషన్లు యాక్సెప్ట్ చేసిన ఇతర ప్రపంచ నాయకులలో జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్, ఇటలీ అధ్యక్షుడు సెర్గీ మాటరెల్లా, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఐర్లాండ్ ప్రభుత్వాధినేత మైఖేల్ మార్టిన్ ఉన్నారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆహ్వానం అందింది. అయితే, ప్రజల సందర్శనార్థనం రాణి భౌతికకాయాన్నిఉంచినప్పుడు చైనా అధికారులు అక్కడకు రాకుండా నిషేధం విధించినట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. చైనాలో వీగర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిషేధం విధించారు.

కాగా, చైనా వైస్ ప్రెసిడెంట్ వాంగ్ కిషాన్ రాణి అంత్యక్రియలకు హాజరవుతారని ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ఆహ్వానం అందింది. అయితే, ఆయన రాణి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం లేదని యూకే విదేశాంగ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

అణు కార్యక్రమాల కారణంగా అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ నుంచి రాయబారుల స్థాయి ప్రాతినిధ్యం మాత్రమే ఉండనుంది.

పుతిన్

ఫొటో సోర్స్, Reuters

ఆహ్వానం అందనివారు..

సిరియా, వెనెజ్వెలా, అఫ్గానిస్తాన్ ప్రతినిధులకు ఆహ్వానం అందలేదు.

ఈ దేశాలతో బ్రిటన్‌కు పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు లేనందున ఆహ్వానాలు పంపలేదని బీబీసీ ప్రతినిధి జేమ్స్ లాండేల్ తెలిపారు.

రష్యా, బెలరూస్, మియన్మార్‌ దేశాలలోనూ ఎవరినీ ఆహ్వానించలేదు.

యుక్రెయిన్ యుద్ధం నాటి నుంచి రష్యా, బ్రిటన్‌ల దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి.

రష్యాకు మద్దతుగా ఉన్నందున బెలరూస్, సైనిక తిరుగుబాటుతో ప్రభుత్వం ఏర్పడినందున మియన్మార్‌ను ఆహ్వానించలేదు.

ఉత్తరకొరియా, నికరాగ్వువాల నుంచి దేశాధినేతలు కాకుండా రాయబారులు రావాలంటూ ఆహ్వానించారు.

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్ మరణం పట్ల సంతాపదినం ప్రకటించడంపై భిన్న వాదనలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)