‘అజినోమోటో’గా పేరొందిన మోనోసోడియం గ్లుకామేట్: ఆహారం రుచిని పెంచి, మాంసాహార రుచిని ఇచ్చే ఈ పదార్థం ఆరోగ్యానికి ప్రమాదకరమైనదా?

- రచయిత, బియాన్స్ నోగ్రడీ
- హోదా, బీబీసీ ఫ్యూచర్ కోసం
ఆహారం వల్ల కలిగే అనేక సైడ్ ఎఫెక్ట్‌లకు (అజినోమోటోగా ప్రాచుర్యం పొందిన) మోనోసోడియం గ్లుకామేట్ కారణమని చెబుతుంటారు. మరి, నిజంగానే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయా? అలా చెప్పడానికి ఆధారాలున్నాయా?
చైనీస్ ఫుడ్ కాస్త ఎక్కువగా తిన్న తరువాత కొందరికి తలనొప్పి, వికారం, తిమ్మిర్లు వంటివి చీకాకు పెడుతుంటాయి. దీన్నే 'చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్' అంటుంటారు కొందరు.
ఆ ఫుడ్‌లో ఉపయోగించే 'మోనోసోడియం గ్లుటామేట్'(ఎంఎస్‌జీ) వల్లే ఇలా జరుగుతుందని అంటుంటారు.
1968లో డాక్టర్ రాబర్ట్ హో మాన్ క్వాక్ 'న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్'కు రాసిన ఓ లేఖతో ఎంఎస్‌జీకి అపఖ్యాతి మొదలైంది.
అమెరికాలోని చైనీస్ రెస్టారెంట్‌లలో తిన్నప్పుడల్లా తాను అనుభవించిన ఇబ్బందులకు కారణం ఏమయ్యుంటుందా అనేది ఆయన విశ్లేషిస్తూ కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైనీస్ రెస్టారెంట్లలో తిన్న తరువాత తన మెడ వెనుక భాగంలో తిమ్మిర్లు వచ్చినట్లు అనిపించడం, అక్కడి నుంచి అది చేతులు, నడుము వరకు వ్యాపించడం, గుండెదడ కలగడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను తాను అనుభవించినట్లు ఆయన రాసుకొచ్చారు.
రాబర్ట్ క్వాక్ తన లేఖలో... దీనంతటికీ సోయా సాస్ కారణం కావొచ్చని అంచనా వేస్తూనే అది కాకపోవచ్చనడానికీ కారణాలు చెప్పారు. తన ఇంట్లో కూడా సోయా సాస్ వినియోగిస్తానని, ఇంట్లో సోయా సాస్ వినియోగించిన వంటకాలు తిన్నప్పుడు ఇలా జరగడం లేదని ఆయన విశ్లేషించారు. చైనీస్ కుకింగ్ వైన్ విస్తారంగా వాడడం వల్ల కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండొచ్చనుకున్నారు... ఆ తరువాత మోనోసోడియం గ్లుటామేట్ కారణం కావొచ్చనీ రాసుకొచ్చారు.
ఆయన లేఖ తరువాత ఒక్కసారిగా మోనోసోడియం గ్లుటామేట్‌పై అధ్యయనాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. చైనీస్ రెస్టారెంట్లు తమ దుకాణాల ఎదుట ఎంఎస్‌జీ లేని వంటలు తమ దగ్గర ఉంటాయని బోర్డులు కూడా పెట్టేవి.

ఫొటో సోర్స్, Alamy
మోనోసోడియం గ్లుటామేట్ అనేది గ్లుటామిక్ ఆమ్లపు సోడియం లవణం.
ఎంఎస్‌జీ అనేది గ్లుటామిక్ ఆమ్లం నుంచి ఏర్పడిన లవణమని 1908లో టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్ కికునె ఇకెడా గుర్తించారు. అంతేకాదు, మాంసాహారానికి ఉంటే సహజసిద్ధ రుచిలాంటి రుచిని ఇది అందిస్తుందని చెప్పారు.
నాలుగు ప్రాథమిక రుచులే కాకుండా ఉమామి (మాంసాహార రుచి) ఇంకోటి ఉంటుందని కికునె ఇకెడా ప్రతిపాదించారు.
ఎంఎస్‌జీలోని గ్లుటామేట్ నిజానికి అమైనో ఆమ్లం. టమోటాలు, చీజ్, పుట్టగొడుగులు, సోయా సాస్, కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, తల్లి పాలలో ఇది సహజసిద్ధంగా ఉంటుంది.
సాధారణ ఉప్పులోని మూలకాల్లో ఒకటైన సోడియంను గ్లూటామేట్‌కు కలిపి చూర్ణం రూపంలో ఆహారంలో కలపవచ్చని కికునె ఇకెడా గుర్తించారు. ఈ ఫార్ములా కికునెను ధనవంతుడిని చేసింది. ఎంఎస్‌జీ ఆధారిత మసాలా 'అజినోమోటో'ను ఆయనే ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది.

ఫొటో సోర్స్, Richard Masoner/Cyclelicious/Flickr/CC BY-SA 2.0
రాబర్ట్ క్వాక్ లేఖ తరువాత మోనోసోడియం గ్లుటామేట్‌పై పెద్దఎత్తున పరిశోధనలు సాగాయి. జంతువులు, మనుషులపై ప్రయోగాలు చేశారు. నోటి ద్వారా, నరాల్లోంచి అధిక మోతాదులో ఎంఎస్‌జీ అందించి అది ఎలాంటి ప్రభావం కలిగిస్తుందో పరిశీలించారు.
వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనకర్త డాక్టర్ జాన్ డబ్ల్యూ ఓల్నీ దీనిపై పరిశోధనలు చేశారు. ఓల్నీ పరిశోధనలలో.. అప్పుడే పుట్టిన ఎలుకల చర్మం కింద ఎక్కువ మోతాదులో ఎంఎస్‌జీ ఇంజెక్ట్ చేస్తే మెదడులో మృతకణజాలాల ప్యాచెస్ పెరుగుతాయని గుర్తించారు. ఇలా అధిక మోతాదులో ఎంఎస్‌జీ ఎంజెక్ట్ చేసిన ఎలుకలు పెద్దవయ్యేటప్పటికి అనేక సమస్యలకు లోనైట్లు గుర్తించారు. కొన్ని పెరుగుదల లోపంతో బాధపడగా మరికొన్ని ఊబకాయానికి లోనయ్యాయి. మరికొన్ని ఎలుకలు పునరుత్పత్తి శక్తిని కోల్పోయాయి.
రెసస్ కోతులపైనా ఓల్నీ ఇదే ప్రయోగం చేశారు. అయితే, వాటికి ఎంఎస్‌జీ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం కాకుండా నోటి ద్వారా అధిక మోతాదులో అందించారు. అనంతరం ఆ కోతుల్లోనూ ఇవే సమస్యలను గుర్తించారు.
కానీ, కోతులపై మరికొందరు శాస్త్రవేత్తలు చేసిన 19 అధ్యయనాలలో ఇలాంటి ఫలితాలు కనిపించలేదు.

ఫొటో సోర్స్, Richard Masoner/Cyclelicious/Flickr/CC BY-SA 2.0
మరోవైపు మనుషులపై చేసిన ప్రయోగాలలో ఇలాంటి లక్షణాలు, ఆధారాలు కనిపించలేదు.
అలాంటి ఒక అధ్యయనంలో ఆరోగ్యవంతులైన 71 మందిలో కొందరికి ఎంఎస్‌జీ క్యాప్సూళ్ల రూపంలో ఇచ్చారు. మరికొందరు ఎంఎస్‌జీ లేని క్యాప్సూళ్లు ఇచ్చారు.
ఎంఎస్‌జీ తీసుకున్నవారు, తీసుకోనివారిలోనూ చైనీస్ సిండ్రోమ్ లక్షణాలు ఒకేలా కనిపించాయి.
ఆ తరువాత 1995లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఈ విషయంలో జోక్యం చేసుకుని అసలు ఎంఎస్‌జీ మంచిదేనా కాదా అనేది అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశోధించి నిర్ణయించాలంటూ ఆ బాధ్యతను ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్‌కు అప్పగించింది.
దీనిపై పరిశోధనలు చేసిన నిపుణులు 'చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్' అనే పదం సరికాదని.. ఇది లక్షణాలను ప్రతిబింబించడం లేదని చెబుతూ 'ఎంఎస్‌జీ సిమ్టమ్ కాంప్లెక్స్' అనే పదాన్ని ఉపయోగించారు.

ఫొటో సోర్స్, Thinkstock
సాధారణ జనాభాలో కొందరిపై ఎంఎస్‌జీ వల్ల ఆరోగ్య దుష్ప్రభావాలు కలగొచ్చని ఈ నిపుణులు తమ అధ్యయనంలో గుర్తించారు. నీటిలో 3 గ్రాముల కంటే ఎక్కువ మోతాదులో ఎంఎస్‌జీ కలిపి ఇచ్చి వీరు ప్రయోగాలు చేశారు.
అయితే, వాస్తవ పరిస్థితులలో ఇలా ఎవరూ ఎంఎస్‌జీని తీసుకోరని.. అంతేకాకుండా రోజుకు సగటున మనిషికి 0.55 గ్రాములకు మించి ఎంఎస్‌జీ వినియోగం ఉండదని ఎఫ్‌డీఏ చెబుతోంది.
2000 సంవత్సరంలో 130 మందిపై ఎంఎస్‌జీతో ఓ ప్రయోగం చేశారు. వారిలో కొందరికి ఆహారంలో కాకుండా విడిగా కొంత మోతాదులో ఎంఎస్‌జీ ఇచ్చారు. అయితే, కేవలం ఇద్దరిలోనే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. అయితే, ఆ ఇద్దరికి కూడా ఆహారంలో భాగంగా ఎంఎస్‌జీ ఇచ్చినప్పుడు ఆ లక్షణాలు కనిపించలేదు. దీంతో ఎంఎస్‌జీ దుష్ప్రభావాలపై స్పష్టత రాలేదు.
నిజానికి గ్లుటామేట్ ఏమంత విషపూరిత పదార్థం కాదు. ఎలుకలు తమ శరీర బరువులో కిలోకు 15 నుంచి 18 గ్రాముల లెక్కన గ్లుటామేట్‌ను తిన్నప్పటికీ అవి చనిపోవు. అయితే, ఎలుక పిల్లలకు మాత్రం ఎంఎస్‌జీ అధిక మోతాదుతో మరణ ప్రమాదం ఉందందటున్నారు శాస్త్రవేత్తలు.
అంతవరకు ఎంఎస్‌జీ దుష్ప్రభావాలకు సంబంధించి సరైన ఆధారాలు లభించనప్పటికీ 2018లో ఈ కథ మరో మలుపు తిరిగింది.
న్యూయార్క్‌లోని హామిల్టన్‌లోని కోల్‌గేట్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ లెమెసూరియర్‌కు హోవార్డ్ స్టీల్ అనే రిటైర్డ్ వైద్యుడి నుండి ఫోన్ కాల్ వచ్చింది.. ఆయన తానే డాక్టర్ రాబర్ట్ హో మాన్ క్వాక్ అని, అప్పట్లో న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌కు తాను లేఖ రాశానన్నది పెద్ద జోక్ అని చెప్పారు.
అయితే, కొందరు పాత్రికేయులు రాబర్ట్ క్వాక్ పిల్లలు, మాజీ సహోద్యోగులతో మాట్లాడిన తర్వాత అప్పట్లో ఆయన లేఖ రాయడం నిజమేనని తేల్చారు.
ఇక డాక్టర్ జాన్ ఓల్నీ తన ప్రయోగాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఎంఎస్‌జీ నియంత్రణ కోసం తన జీవితాంతం ప్రచారం చేశారు.
మరోవైపు ఎఫ్‌డీఏ ఇప్పుడు ఎంఎస్‌జీని వంటల్లో వినియోగించడం సురక్షితమేనని తేల్చింది.
ఇవి కూడా చదవండి:
- కింగ్ చార్లెస్ 3: ఆయనకున్న 12 భవనాల్లో ఏది రాజనివాసం కాబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్, 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం నిజమేనా?
- పిటిషనర్ తాను గూఢచారినని చెప్పినా ఒప్పుకోలేదు, కానీ ప్రభుత్వం రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎందుకు ఆదేశించింది?
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













