మహమూద్ అన్సారీ: ఆయన గూఢచారి అని ఒప్పుకోకుండానే, రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎందుకు ఆదేశించింది?

మహమూద్ అన్సారీ

ఫొటో సోర్స్, FATIMA ANSARI

ఫొటో క్యాప్షన్, మహమూద్ అన్సారీ
    • రచయిత, నియాజ్ ఫరూఖీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత నిఘా సంస్థ, 1970 దశకంలో గూఢచారిగా తనను పాకిస్తాన్‌కు పంపించిందని ఆరోపించిన వ్యక్తికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు, భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అక్కడ ఆయనను పాక్ అధికారులు పట్టుకున్నారు. గూఢచార్యం ఆరోపణలతో 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

గూఢచర్యం ఆరోపణలతో వ్యక్తులను అరెస్ట్ చేయడం భారత్, పాక్‌లలో సాధారణమే. కానీ, ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించడం మాత్రం కచ్చితంగా అసాధారణ విషయం.

దీన్ని అసాధారణ కేసుగా పరిగణిస్తూ మహమూద్ అన్సారీ అనే వ్యక్తికి పరిహారం చెల్లించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, మహమూద్ అన్సారీ చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు. పాకిస్తాన్‌కు తాను గూఢచారిగా వెళ్లినట్లు ఆయన చెప్పిన వాదనతో పాటు ఆయనొక భారత గూఢచారి అనే అంశాన్ని కోర్టు ఒప్పుకోలేదు.

మహమూద్ అన్సారీ, రాజస్థాన్‌లోని కోట నగరానికి చెందినవారు.

ఈ కేసు విచారణలో ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) విక్రమ్‌జీత్ బెనర్జీ... అన్సారీతో భారత ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదని స్పష్టంగా చెప్పారు.

అయితే, దీని గురించి అన్సారీ లాయర్ సమర్ విజయ్ సింగ్, బీబీసీ ఉర్దూతో మాట్లాడారు.

అన్సారీ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యు.యు లలిత్ అధ్యక్షతన ద్వి సభ్య ధర్మాసనం విచారించింది

ఫొటో సోర్స్, REUTERS/ADNAN ABIDI

ఫొటో క్యాప్షన్, అన్సారీ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యు.యు లలిత్ అధ్యక్షతన ద్వి సభ్య ధర్మాసనం విచారించింది

''దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టాం. తపాలా శాఖ, స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్‌లతో మహమూద్ అన్సారీకి మధ్య జరిగిన సంప్రదింపుల వివరాలన్నింటినీ కోర్టు ముందు ఉంచాం. దీంతో ఆయన ఒక నిఘా సంస్థ తరఫున పనిచేసినట్లు రుజువైంది. దీని ఆధారంగానే కోర్టు ఆయనకు పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చింది'' అని ఆయన అన్నారు.

సాక్ష్యాల ఆధారంగా ఆయనను ఒక గూఢచారిగా కోర్టు కూడా అంగీకరించిందని ఆయన చెప్పారు.

''అవును, ఆయన గూఢచారిగా పనిచేశారు. కానీ, గూఢచారుల గురించి బహిరంగంగా చెప్పకూడదనేది ప్రభుత్వ విధానం. ప్రభుత్వం ఎలాగైతే ఆయన బాధ్యతను తీసుకోవడానికి నిరాకరించిందో, అలాగే మేం కూడా అన్సారీ వాదనలను తిరస్కరిస్తున్నాం'' అని కోర్టు వ్యాఖ్యానించినట్లు సమర్ తెలిపారు.

''ఏ ప్రభుత్వం కూడా తమ ప్రత్యేక ఏజెంట్ల గుర్తింపును ఒప్పుకోదు. ఏ ప్రభుత్వం కూడా ఏజెంట్ల బాధ్యతను తీసుకోదు. ఇది సరైన పద్ధతి కాదు. కానీ, ప్రతీ ప్రభుత్వం ఇలాగే ఉంటుంది'' అని కోర్టు వ్యాఖ్యానించినట్లు హిందూస్థాన్ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది.

మహమూద్ అన్సారీ, కోట నగరం నుంచి ఫోన్‌లో బీబీసీతో మాట్లాడారు. కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. న్యాయమే గెలిచిందని అన్నారు.

కానీ, ఆయన కూతురు ఫాతిమా మాట్లాడుతూ, తన తండ్రికి పూర్తిగా న్యాయం జరగలేదని అన్నారు. పాక్‌లో అన్సారీ పట్టుబడినప్పుడు ఆయన కూతురు ఫాతిమా 11 నెలల చిన్నారి.

సరిహద్దు దాటకముందే అన్సారీని, పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరిహద్దు దాటకముందే అన్సారీని, పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు

అన్సారీ, పాకిస్తాన్‌ ఎలా చేరుకున్నారు?

మహమూద్ అన్సారీ, రైల్వే పోస్టల్ సర్వీస్ ఉద్యోగి. గూఢచర్యం కోసం పాకిస్తాన్‌కు వెళ్లాలని భారత ప్రభుత్వ ప్రత్యేక నిఘా (స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్) సంస్థ తనను కోరిందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అన్సారీ పేర్కొన్నారు. అంతే కాకుండా భారత ప్రభుత్వ నిఘా విభాగం అభ్యర్థన మేరకు తన ఉద్యోగాన్ని కోటా నగరం నుంచి జైపూర్‌కు బదిలీ చేశారని పిటిషన్‌లో తెలిపారు.

ఆయన పిటిషన్‌లో పేర్కొన్నదాని ప్రకారం, 1976లో ఆయన రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లొచ్చారు. ఈ రెండు దఫాలు కూడా అతి స్పల్ప కాలం మాత్రమే ఆయన పాక్‌లో ఉన్నారు. కానీ అదే ఏడాది డిసెంబర్‌లో 21 రోజుల పర్యటన కోసం పాక్‌కు వెళ్లారు. అప్పుడు పాక్‌ నుంచి భారత్‌కు తిరిగి వస్తుండగా, సరిహద్దు దాటక ముందే ఆయనను పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు.

నిజానికి తనను, తన గైడ్ మోసం చేశాడని బీబీసీతో మాట్లాడుతూ అన్సారీ చెప్పారు. బహుశా గైడ్‌గా పనిచేసిన ఆ వ్యక్తి డబుల్ ఏజెంట్ అయ్యుండొచ్చు అని అన్నారు.

''నేను ఒక పేపర్‌పై కోడ్ భాషలో ఏదో రాసి పాకిస్తాన్ నుంచి తెస్తున్నా. దాని నా చొక్కా కాలర్‌లో భద్రంగా దాచిపెట్టా. కానీ, హింసను భరిస్తూ ఒక వ్యక్తి ఎంతకాలం నోర్మూసుకొని ఉండగలడు. నేనేం మోసగాడిని కాదు. ఎంత కాలం ఆ హింసను సహించగలను. నిజానికి నా కాలర్ నుంచి ఆ కాగితాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. అందులో రాసిన కోడ్ ఆధారంగా వారికి అంతా అర్థమైపోయింది. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది'' అని అన్సారీ వివరించారు.

గూఢచర్యం ఆరోపణలతో తనకు 1978లో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారని అన్సారీ చెప్పారు.

పాకిస్తాన్‌కు వెళ్లి ఒక ముఖ్యమైన పని చేయాలంటూ తనకు ఆదేశాలు వచ్చాయని కోర్టులో ఆయన తెలిపారు.

'స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్' మార్గదర్శకత్వం, నియంత్రణలో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తన విధులను నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

గూఢచారి ఆరోపణలతో అన్సారీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గూఢచారి ఆరోపణలతో అన్సారీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు

పాకిస్తాన్‌లో పట్టుబడిన దాదాపు రెండేళ్ల తర్వాత కూడా ఆయన ఏదో ప్రమాదంలో పడి ఉంటారని తన కుటుంబం మొత్తం భావించిందని బీబీసీతో ఆయన కుమార్తె ఫాతిమా అన్నారు.

''మా నాన్న గురించి తెలుసుకోవడానికి ఆయన పనిచేసే సీనియర్ అధికారుల దగ్గరకు మా అమ్మ వెళ్లింది. కానీ, వారు చేతులెత్తేశారు. కానీ, ఆమె నిస్సహాయత చూసిన తర్వాత ఆయన తిరిగి వస్తారని సైగల ద్వారా చెప్పారు'' అని ఫాతిమా వివరించారు.

తన తండ్రి దూరం అయ్యాక, ఆయన కోసం పోరాటం చేస్తూ ఆస్తులన్నీ ఆమ్మేసినట్లు ఫాతిమా చెప్పారు. నగలు, భూమి, సైకిళ్లు, రేడియో, ఇంట్లోని వంట పాత్రలకు కూడా అమ్మేసినట్లు తెలిపారు. రాత్రి రెండు, మూడింటివరకు తన తల్లి కుట్టుపని చేసేదని, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించినట్లు చెప్పారు.

''ఎవరో మమ్మల్ని ఆకాశం నుంచి నేలకు విసిరేసినట్లు అయింది మా పరిస్థితి'' అని ఫాతిమా అన్నారు.

జైల్లో ఉన్న సమయంలో ఒక అవకాశం దొరకడంతో తన పరిస్థితి గురించి తపాలా విభాగం, భారత నిఘా సంస్థ, తన భార్యకు చేరవేశానని అన్సారీ చెప్పారు.

తనను నిర్దోషిగా విడుదల చేయాలంటూ... కువైట్‌లో ఉండే తన బంధువు, లాహోర్ హైకోర్టులోని బహవల్పురా బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారని అన్సారీ పేర్కొన్నారు.

చివరకు 1987లో తనను విడుదల చేయాలంటూ ఆదేశాలు వచ్చాయని తెలిపారు.

విడుదలైన తర్వాత అన్సారీని భారత్‌కు తీసుకురాకుండా 1989 వరకు పాక్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంచారని ఆయన తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో చెప్పినట్లు న్యాయ వ్యవహారాల వెబ్‌సైట్ లైవ్ లా పేర్కొంది.

వీడియో క్యాప్షన్, హిమాలయాల్లో గల్లంతైన భారత సైనికుడి మృతదేహం 38 ఏళ్ల తర్వాత దొరికింది.

పరిహారం ఎందుకు?

పాక్ జైలు నుంచి విడుదలై కోటలోని తన ఇంటికి వచ్చిన తర్వాత తనను ఉద్యోగం నుంచి తొలిగించినట్లు తెలిసిందని అన్సారీ చెప్పారు.

జైలులో తన పరిస్థితి గురించి అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ, 1976 నవంబర్ 26 నుంచి చాలా కాలం పాటు విధులకు గైర్హాజరు అయ్యాననే ఆరోపణలతో తనను ఉద్యోగం నుంచి తొలిగించారని అన్సారీ వివరించారు.

తనను ఉద్యోగం ఎందుకు తీసివేశారో వివరించే పత్రాలను ఇవ్వాలని అన్సారీ, అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే, వారు రెండు పేజీలుగా ఉన్న పత్రాలను ఫొటో తీసి పంపించారు. వాటిలోని వివరాలు చదవడానికి అనువుగా లేవని ఆయన చెప్పారు.

ఆయనకు ఇచ్చిన పేపర్లలో దర్యాప్తు నివేదిక, ఇతర రిపోర్టులకు సంబంధించిన వివరాలేమీ లేవని ఆయన అన్నారు.

తనతో సంప్రదింపులు జరిపిన నిఘా సంస్థకు చెందిన అధికారి చనిపోవడంతో తన కష్టాలు మరింత పెరిగాయని ఆయన చెప్పారు.

సంవత్సరాల తరబడి తన కేసులో పోరాడానని అన్సారీ అన్నారు. పిటిషన్ దాఖలు చేయడంలో జాప్యాన్ని కారణంగా చూపుతూ 2017లో తన పిటిషన్‌ను రాజస్తాన్ హైకోర్టు కొట్టేసిందని చెప్పారు.

తాను దేశానికి సేవ చేస్తున్న సంగతి నిఘా సంస్థ అధికారులకు తెలుసు అని, అందుకే తనకు 'ఎ ఫోర్' అనే గుర్తింపును నిఘా సంస్థ ఇచ్చిందని అన్సారీ తెలిపారు.

వీడియో క్యాప్షన్, సైన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు తుపాకీ పట్టిన యువకుడు

''1975-76లో పదోన్నతి కోసం ఒక పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నా. కానీ, నేను ఆ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్‌లో నాకు 'ఎ ఫోర్' అనే కొత్త రోల్ ఇవ్వడంతో ఈ పరీక్షకు నన్ను నిరాకరించారు. అత్యంత జాగ్రత్తగా ఇలాంటి విధులు చేయాలని నన్ను ఆదేశించారు'' అని అన్సారీ వివరించారు.

రాజస్తాన్ హైకోర్టు తన పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత, సుప్రీంకోర్టుకు వెళ్లానని అన్సారీ తెలిపారు. సుప్రీం కోర్టు, ఆయనకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ యు.యు లలిత్, జస్టిస్ ఎస్. రవీందర్ భట్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మూడు వారాల్లో ఆయనకు రూ. 10 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అన్సారీ కూతురు ఫాతిమా మాట్లాడుతూ... ఇంకా తన తండ్రికి ఇంకా న్యాయం జరగలేదని అన్నారు. ఆయనను ఒక సైనికుడితో పోలుస్తూ... ''ఒకవేళ సైనికుడు, యుద్ధానికి వెళితే ఆయనను గౌరవిస్తారా? లేదా? అలాగా మా నాన్న కూడా ఆ గౌరవానికి అర్హుడు'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)