అగ్నిపథ్ పథకం వెనుక ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏంటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అగ్నిపథ్ పథకంతో భారత రక్షణ బడ్జెట్ వ్యయం తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఒకవేళ ఖర్చు పెరిగితే, భారత్ అందుకు సిద్ధంగా ఉందా?
ఈ ప్రశ్న ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు చర్చిద్దాం.
అసలు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చింది. దీని వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు చాలా మందిని తొలచివేస్తున్నాయి.
వీటికి ప్రెస్ కాన్ఫెరెన్స్‌లు, ఇంటర్వ్యూల సాయంతో ప్రభుత్వం సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించింది. వీటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రభుత్వం ఏం అనుకుంటుందో మనకు అర్థం అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

అగ్నిపథ్ పథకం ముఖ్యాంశాలు

సైన్యంలో చేరేందుకు అర్హులైన అభ్యర్థుల వయసు: 17 నుంచి 21 ఏళ్లు
విద్యార్హతలు: పది లేదా 12వ తరగతి ఉత్తీర్ణత
నాలుగేళ్ల కాలానికి ఈ పథకం కింద సైన్యంలోకి తీసుకుంటారు
నాలుగేళ్ల కాలం తర్వాత ప్రతిభ ఆధారంగా వీరిలో 25 శాతం మందిని పూర్తికాల జవాన్లుగా తీసుకుంటారు
ఈ పథకం కింద తీసుకునే జవాన్లను అగ్నివీర్‌గా పిలుస్తారు
మొదటి ఏడాది అగ్నివీరులకు నెలకు రూ.30 వేల జీతం ఇస్తారు
నాలుగో ఏడాదికి దీన్ని రూ.40 వేలకు పెంచుతారు


ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి 20కి పైగా ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సులను నేను జాగ్రత్తగా పరిశీలించాను. అగ్నిపథ్ పథకంలో భారత రక్షణ బడ్జెట్ తగ్గుతుందా? లేదా అనే కోణంలో వీటిని విశ్లేషించాను.
వీటిలో మొదట భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను పరిశీలించాలి. ‘‘డబ్బులకు గురించి పక్కన పెట్టండి. అవసరమైతే మేం ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ పథకానికి డబ్బులకు సంబంధమే లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘అగ్నిపథ్‌కు, డబ్బులకు సంబంధం లేదు. ఇప్పుడు శిక్షణ కోసం ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. అయితే, దీని వల్ల మొత్తం బడ్జెట్‌పై ఎలాంటి ప్రభావమూ ఉండదు’’అని ఆయన అన్నారు.
భారత నావికా దళంలోని చీఫ్ ఆఫ్ పర్సనల్, వైస్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి, ‘‘ఆర్థిక అంశాలకు అతీతంగా ఈ పథకాన్ని చూడాలి. మా అవసరాలకు సరిపడా డబ్బులు లేని పరిస్థితి ఎప్పుడూ లేదు’’అని అన్నారు.
ఇంతకీ పై ప్రశ్నకు మీకు సమాధానం దొరికిందా?
ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకునేందు భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో నేను మాట్లాడాను.
అయితే, అప్పటికీ నాకు దీనికి సమాధానం దొరకలేదు. అయితే, అసలు ఈ ప్రశ్న ఎందుకు అంత ముఖ్యమైనదో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఫొటో సోర్స్, Indian Government
ఎందుకు ముఖ్యమైనది?
ఫిబ్రవరి 1న విడుదల చేసిన ఆర్థిక బడ్జెట్ ప్రకారం.. భారత రక్షణ బడ్జెట్ రూ.5.25 లక్షల కోట్లు. ఇది మొత్తం బడ్జెట్‌లో 13.31 శాతం.
రక్షణ బడ్జెట్‌లో రూ.1.52 లక్షల కోట్లను కొత్త పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కోసం ఉపయోగిస్తారు. మరో రూ.1.19 లక్షల కోట్లను ఉద్యోగుల పింఛను కోసం వెచ్చిస్తున్నారు.
వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులను రక్షణ మంత్రిత్వ శాఖ స్వాగతించింది. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.
అయితే, ఈ ప్రశంసల వెనుక ఆందోళన చెందాల్సిన అంశం కూడా ఒకటుంది. అదేమిటంటే ఏటా జీతాలు, పింఛనుల కోసం చేస్తున్న ఖర్చు పెరుగుతోంది. ఇది కొత్త ఆయుధాలు, పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కేటాయించే నిధులపై ప్రభావం చూపుతోంది.

ఫొటో సోర్స్, Indian Government
ఇదే విషయంపై అక్టోబరు 2020లో 15వ ఆర్థిక సంఘం కూడా స్పందించింది. ‘‘2011-12లో మొత్తం బడ్జెట్‌లో రక్షణ బడ్జెట్ వ్యయం 12.6 శాతంగా ఉండేది. 2018-19లో ఇది నుంచి 15.1 శాతానికి పెరిగింది. అయితే, ఈ పెంపు మొత్తం జీతాలు, పింఛనులకే వెళ్లిపోతోంది మరోవైపు మొత్తం రెవెన్యూ వ్యయంలో రక్షణ శాఖ మూలధన వ్యయం 43.8 శాతం నుంచి 32.4 శాతానికి తగ్గింది’’అని తమ నివేదికలో పేర్కొంది. ఈ మూలధన వ్యయాన్ని మౌలిక సదుపాయాల కల్పన, కొత్త ఆయుధాల కొనుగోలుకు ఉపయోగిస్తారు.
అదే నివేదికలో 2011 నుంచి 2021 మధ్య పింఛనుల వ్యయం ఏడాదికి సగటున 15.7 శాతం చొప్పున పెరుగుతోందని పేర్కొన్నారు. అయితే, మొత్తం రక్షణ శాఖ వ్యయం మాత్రం 9.6 శాతం చొప్పున మాత్రమే పెరిగిందని వివరించారు. పింఛనులు, జీతాల వ్యయం నానాటికీ పెరుగుతండటంతో.. సైన్యం ఆధునికీకరణకు అందుబాటులో ఉండే నిధులు తగ్గిపోతున్నాయని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే జీతాలు, పింఛనుల వ్యయాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఆ నివేదికలో సూచించారు.
ఇలాంటి పరిస్థితుల్లో అగ్నిపథ్ పథకం వ్యయం తగ్గించడానికే తీసుకొచ్చారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ఫొటో సోర్స్, Dr Laxman Behera
ఆర్థిక అంశాల సంగతి..
అయితే, ఈ పథకం వెనుక ఆర్థిక అంశాలపై బహిరంగంగా మాట్లాడేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సుముఖత వ్యక్తం చేయడం లేదు.
దీంతో ఈ అంశంపై 15ఏళ్లుగా దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అధ్యయనం చేపడుతున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ బెహరాతో బీబీసీ మాట్లాడింది.
‘‘జవాన్లు సగటు వయసు తగ్గించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది. అయితే, దీని వెనుక ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి’’అని ఆయన అన్నారు.
‘‘ప్రభుత్వం ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధి కల్పన విషయంలో వారు చేయాల్సింది చాలా ఉంది. అదే సమయంలో ప్రభుత్వం దీనిలో ఆర్థిక అంశాల గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. అయితే, ఇలాంటి పథకం అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక పరమైన సవాళ్లతోపాటు వనరుల కొరత కూడా మన సైన్యాన్ని వేధిస్తోంది’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, వనరులు లేకపోవడం అంటే ఏమిటి? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది.
దీనిపై బెహరా మాట్లాడుతూ.. ‘‘ఈ పథకాన్ని ప్రకటించే ముందు, సిబ్బందికి సంబంధించిన వ్యయమే బడ్జెట్‌లో 60 శాతం వరకూ ఉండేది. కేవలం 40 శాతం నిధులనే సైనికల పరికరాల కొనుగోలు, పరిశోధనలు, రవాణాలకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. నిజానికి ఇది అసలు సరిపోదు. కొన్నిసార్లు ఒప్పందాలకు చెల్లింపులు చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు మిగలడం లేదు. దీని వల్ల కొన్ని ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రి రావడానికి ఒక్కోసారి ఐదేళ్ల కంటే ఎక్కువే ఆలస్యం అవుతోంది. మరోవైపు రక్షణ పరికరాలు, ఆయుధాల మెయింటెనెన్స్‌పైనా ప్రభావం పడుతోంది. అంటే మన దగ్గర పరికరాలు ఉంటాయి. కానీ, వాటికి సర్వీసింగ్ ఉండదు. ఫలితంగా అవసరమైనప్పుడు అవి మెరుగ్గా పనిచేయవు. వనరుల కొరత అనేది చాలా పెద్ద సమస్య’’అని ఆయన అన్నారు.
అయితే, బడ్జెట్ కోణంలో ఈ అగ్నిపథ్ ఎలా సాయం చేస్తుంది? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగులపై ప్రభుత్వం వెచ్చించే ఖర్చు చాలా తగ్గుతుంది. నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే.. అగ్నివీర్‌ల గరిష్ఠ జీతం రూ.40 వేలు. అదే పూర్తికాల జవాన్‌కు అయితే, రూ.80 వేల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా చూసుకున్నా.. ఒక్కో జవాన్ దగ్గర నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు మిగులుతుంది. ఇక పింఛను విషయానికి వస్తే, నాలుగింట మూడొంతుల మందికి పింఛను ఇవ్వాల్సిన పనిలేదు. అయితే, బడ్జెట్ మీద ఇది ఎంత మేర ప్రభావం చూపుతుందో కచ్చితంగా తెలియాలి అంటే మరో పదేళ్లు మనం వేచి చూడాలి. కనీసం ఐదేళ్లయినా ఆగితే ఈ పథకం ప్రభావాన్ని మనం గమనించొచ్చు’’అని ఆయన అన్నారు.
ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?
ప్రస్తుతం సైన్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను పరిశీలిస్తే, సైనికుల సంఖ్యను ప్రభుత్వం తగ్గించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై లెఫ్టినెంట్ జనరల్ పురీ చెప్పిన అంశాలను పరిశీలిస్తే దీనిలో కొంత స్పష్టత వస్తుంది. ‘‘ఈ మొత్తం పథకం ఉద్దేశం సైన్యంలో జవాన్ల వయసు తగ్గించడమే. ఇక్కడ సైనికుల సంఖ్యను తగ్గించడం లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరమ్మతులు, నిర్వహణ లాంటి పనులను మనం ఒప్పంద కార్మికులతో చేయించుకోవచ్చు. అలాంటి చోట్ల సంఖ్యను తగ్గిస్తాం కానీ, సైనికుల సంఖ్య కాదు’’అని ఆయన అన్నారు.
అయితే, డిసెంబరు 2021నాటి గణాంకాలను పరిశీలిస్తే, సైన్యంలో మూడు విభాగాల్లో 1,13,000 జవాన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా స్వచ్ఛంద పదవీ విరమణ కోరుకునే జవాన్ల సంఖ్య దీనికి అదనం. మొత్తం మూడు విభాగాల్లో ఏటా 75,000 మంది ఇలా పదవీ విరమణ తీసుకుంటారు.
అగ్నివీరుల నియామకాలను పరిశీలిస్తే, తొలి ఏడాది మొత్తంగా 46,000 మందిని తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నాలుగైదేళ్లలో ఇది 50,000 నుంచి 60,000కు పెంచుతామని, ఆ తర్వాత 1,00,000కు తీసుకెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. దీని ప్రకారం.. చాలా పోస్టులు ఖాళీగా ఉంటాయని స్పష్టం అవుతోంది.
ఇప్పుడు మన మొదటి ప్రశ్నను పరిశీలిద్దాం. అగ్నిపథ్ పథకంతో రక్షణ వ్యయం తగ్గుతుందా? ప్రభుత్వం మాత్రం ఈ పథకం వెనుక ఆర్థిక లక్ష్యాలేమీ లేవని చెబుతోంది.
కానీ, దీని వెనుక పరిణామాలను పరిశీలిస్తే ఆర్థిక లక్ష్యాలను అందుకోవడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని వచ్చిందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
- భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
- పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













