కశ్మీర్: ఆత్మీయుల మృతదేహాల కోసం ఇప్పటికీ వేచి చూస్తున్న కుటుంబాలు

ఎదురు కాల్పుల్లో గుల్ మరణించారని అధికారులు చెప్తున్న కథనాన్ని ఆయన కుటుంబీకులు సవాలు చేస్తున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, ఆమిర్ పీర్జాదా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది నవంబర్ నెలలో ఓ సాయంత్రం. కశ్మీర్‌లో ఇద్దరి మృతదేహాల కోసం వారి కుటుంబాలు వేచి చూస్తున్నాయి.

అవి అందగానే రెండోసారి ఖననం చేయవచ్చని ఆశిస్తున్నాయి.

అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్‌ల మృతదేహాలను భద్రతా దళాలు ఇంతకుముందే ఓసారి ఖననం చేశాయి.

శ్రీనగర్ పట్టణంలో తీవ్రవాదులపై జరిపిన ఎదురు కాల్పుల్లో వీరిద్దరూ మరణించారని భద్రతా దళాలు వెల్లడించాయి.

గుల్‌కు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, భట్ పరస్పర కాల్పుల్లో చిక్కుకుని మరణించారని తెలిపాయి.

అయితే, వారిద్దరినీ "మానవ కవచాలు" (హ్యూమన్ షీల్డ్స్)గా వాడుకున్నారని వారి కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

ఖననం చేసిన వారిద్దరి మృతదేహాలను వెలికితీసి వారి కుటుంబాలకు అప్పజెప్పేందుకు అనేక నిరసనల అనంతరం అధికారులు అంగీకరించారు. ఈ ప్రాంతంలో ఇది అరుదైన విషయం.

అలాగే, వారి మీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.

అయితే, వారి కుటుంబ సభ్యులకు ఇది ఊరట కలిగించలేదు.

"గత 30 ఏళ్లల్లో ఎవరికీ న్యాయం జరగలేదు. ఇప్పుడు జరుగుతుందని ఎలా ఆశించగలం?" అని అల్తాఫ్ భట్ అన్నయ్య అబ్దుల్ మజీద్ భట్ వాపోయారు.

అల్తాఫ్‌ భట్‌, ముదాసిర్‌ గుల్‌‌ల మృతదేహాలను అప్పగించమంటూ బంధువులు నిరసనలు చేస్తున్నారు

ఫొటో సోర్స్, MUKHTAR ZAHOOR

ఫొటో క్యాప్షన్, అల్తాఫ్‌ భట్‌, ముదాసిర్‌ గుల్‌‌ల మృతదేహాలను అప్పగించాలంటూ బంధువులు నిరసనలు చేస్తున్నారు.

'చట్టాన్ని అతిక్రమించి భద్రతా బలగాలు హత్యలు చేస్తున్నాయి'

భద్రతా బలగాలు కశ్మీర్‌లో స్థానికుల పట్ల అతిగా ప్రవర్తిస్తాయనే ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి.

భద్రతా దళాలు సామాన్య పౌరులను తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నాయని, కొన్నిసార్లు ప్రమోషన్ కోసం చట్టాన్ని అతిక్రమించి హత్యలు చేస్తున్నాయని కొన్ని కుటుంబాలు ఆరోపించాయి.

2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి పరిస్థితి మరింత దిగజారిందని యాక్టివిస్టులు అంటున్నారు.

"2019 నుంచి ఉద్యమంపై ఆంక్షలు అమలుచేస్తూ భద్రతా దళాలు అనేకమార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి. చెక్‌పాయింట్ల వద్ద వేధింపులు, అసభ్యంగా ప్రవర్తించడం, అకారణంగా నిర్బంధించడం, చిత్రహింసలు, చట్టాన్ని అతిక్రమించి హత్యలు ఇలా ఎన్నో రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి" అని హ్యూమన్ రైట్స్ వాచ్ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఈ ఆరోపణలన్నింటినీ భద్రతా దళాలు తిరస్కరించాయి.

సరైన సాక్ష్యాధారాలు చూపించకుండా ఎన్‌కౌంటర్ హత్యలు బూటకమని స్థానిక కుటుంబాలు తరచూ ఆరోపిస్తూనే ఉన్నాయని జమ్మూ, కశ్మీర్ పోలీసు మాజీ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ ఖోడా బీబీసీతో చెప్పారు.

దీనివల్ల భద్రతా దళాలు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నాయనే నిందలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన అన్నారు.

అయితే, కుటుంబాలకు ప్రాథమిక సమాచారం కూడా అందట్లేదని విమర్శకులు అంటున్నారు.

భద్రతా దళాలు 1989 నుంచి చట్టాన్ని అతిక్రమించి చేసిన అన్ని హత్యలపై విచారణ వివరాలను అందించాలని కోరుతూ 2017లో యాక్టివిస్ట్ ముహమ్మద్ అహ్సన్ కశ్మీర్ మానవ హక్కుల కమిషన్‌లో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఒక ఏడాది తరువాత ముహమ్మద్ అహ్సన్‌కు జవాబు లభించింది. 1989, 2018 మధ్య కాలంలో ఆదేశించిన 506 విచారణల్లో ఒక్కటి మాత్రమే పూర్తయింది.

భద్రతా దళాలు పౌరులపై మిలిటెంట్లుగా ముద్ర వేస్తున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భద్రతా దళాలు పౌరులపై మిలిటెంట్లు అనే ముద్ర వేస్తున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు

ఎన్నో కేసులు, సమాధానాలు లేవు

2020 జులైలో, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు "కరడుగట్టిన ఉగ్రవాదులను" హతమార్చినట్లు భారత సైన్యం ప్రకటించింది.

ఆ ముగ్గురినీ సుదూర ప్రాంతాల్లో రహస్యంగా ఖననం చేశారు.

2020లో కరోనా నిబంధనలను ఉటంకిస్తూ భద్రతా దళాలు అనుమానిత మిలిటెంట్ల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించడం మానేశాయి. ఉద్రిక్తతలను నివారించడానికే ఇలా చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.

ఈ కేసులో, ఆ ముగ్గురి ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అలాగే, వారి కుటుంబాలకు కూడా చేరాయి.

వాళ్లు కూలీలని, కొన్నాళ్లుగా కనిపించట్లేదని ఆ కుటుంబాలు తెలిపాయి.

దాంతో, ప్రజాగ్రహం వెల్లువెత్తింది. వెంటనే ఆర్మీ ప్రాథమిక విచారణ జరిపింది.

ఈ హత్యలతో ప్రమేయం ఉన్న సిబ్బంది సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్‌పీఏ) కింద తమ పరిధిని మించి ప్రవర్తించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఏఎఫ్ఎస్‌పీఏ ఒక వివాదాస్పద చట్టం. వారెంట్లు లేకుండా ప్రజలను అరెస్టు చేయడానికి, కొన్నిసార్లు కాల్చి చంపడానికి కూడా సైనికులకు ప్రత్యేక అధికారాన్ని ఇస్తుందీ చట్టం.

2020 డిసెంబర్‌లో ఈ కేసుకు సంబంధించి ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు పౌరులపై అపహరణ, హత్య కేసులను పోలీసులు నమోదు చేశారు.

పౌరులపై విచారణ స్థానిక కోర్టులో నడుస్తోంది. కానీ, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆర్మీ ఆఫీసర్ సంగతి అస్పష్టంగా ఉంది. ప్రజలకు, మీడియాకు అనుమతి లేని ఆర్మీ కోర్టులో ఆయనపై విచారణ జరుగుతోంది.

ఈ కేసు గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ అధికారి స్పందించలేదు.

వీడియో క్యాప్షన్, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అంటే..?

సమాచారం అందకపోవడం మాత్రమే సమస్య కాదు

2020 డిసెంబర్‌లో భద్రతా బలగాల చేతిలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు నిరసనలు వ్యక్తం చేశారు. అందుకు వారిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)కింద కేసు మోపారు. ఇందులో బెయిల్ పొందడం దాదాపు అసాధ్యం.

తన కొడుకు ఒక పాఠశాల విద్యార్థి అని, తనకు తీవ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని 42 ఏళ్ల ముస్తాక్ అహ్మద్ వానీ బీబీసీతో చెప్పారు.

వానీ, తన కొడుకు కోసం ఇంటి పక్కనే ఒక సమాధి తవ్వి ఉంచారు. సుదూర ప్రాంతంలో రహస్యంగా ఖననం చేసిన తమ బిడ్డ మృతదేహాన్ని తమకు అప్పగించాలని వానీ ఇప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

ముస్తాక్ అహ్మద్ వానీ కుమారుడు 2020లో హత్యకు గురయ్యారు

ఫొటో సోర్స్, MUKHTAR ZAHOOR

ఫొటో క్యాప్షన్, ముస్తాక్ అహ్మద్ వానీ కుమారుడు 2020లో హత్యకు గురయ్యారు

శ్రీనగర్ కాల్పులు

ఇటీవల శ్రీనగర్ ఘటనలో, ఓ భవనంలో తీవ్రవాది ఉన్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

ఆ భవనానికి యజమాని భట్. అందులో గుల్ రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతుండేవారు.

"భవన ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. కానీ, తీవ్రవాది దొరకలేదు" అని జమ్మూ కశ్మీర్ ఉన్నత స్థాయి పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ ఘటన గురించి మాట్లాడే అధికారం తనకు లేదని చెప్తూ, తన పేరు బయటపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భట్, గుల్, అమీర్ మాగ్రే (గుల్‌తో పనిచేసే వ్యక్తి)లను పై అంతస్థుకు పంపి తాళాలు వేసి ఉన్న తలుపులను తీయమని చెప్పారు. అక్కడే మిలిటెంట్ దాక్కుని ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ ముగ్గురినీ సాయుధ పోలీసులు అనుసరించారు.

"15 నిమిషాల లోపే రెండుసార్లు కాల్పులు జరిపిన శబ్దం వినిపించిది. వెంటనే మా బలగాలు ప్రతిస్పందించాయి. అప్పుడే, ఒక వ్యక్తి చేతిలో తుపాకీతో భవనం నుంచి బయటకు పరిగెత్తారు. ఆయనపై కాల్పులు జరిపాం"

ఆ వ్యక్తి "విదేశీ తీవ్రవాది" అయిన బిలాల్ భాయ్‌గా పోలీసులు తరువాత గుర్తించారు.

మాగ్రే, భట్‌ల మృతదేహాలు కింది మెట్ల దగ్గర కనిపించాయని, మాగ్రే చేతిలో తుపాకీ ఉందని, గుల్ మృతదేహం పైఅంతస్థులో కనిపించిందని పేరు రహస్యంగా ఉంచమని కోరిన పోలీసు అధికారి తెలిపారు.

మాగ్రే అమాయకుడని, ఆయన మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆయన కుటుంబం కోరింది.

అల్తాఫ్ భట్(ఎడమ), ముదసర్ గుల్

ఫొటో సోర్స్, SPECIAL ARRANGEMENT

ఫొటో క్యాప్షన్, అల్తాఫ్ భట్(ఎడమ), ముదసర్ గుల్

అయితే, పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రత్యక్ష సాక్షి ఈ కథనంపై సందేహం వ్యక్తం చేశారు.

కాల్పులకు ముందు సాధారణ దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారని ప్రత్యక్ష సాక్షి బీబీసీకి తెలిపారు.

చుట్టూ ఉన్నవారిని తనిఖీ చేసి, వారి మొబైల్ ఫోన్లు లాక్కుని సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లమని కోరారు.

భట్‌ను మూడుసార్లు గది నుంచి వెలుపలికి రమ్మని పిలిచారు. మూడోసారి పిలిచినప్పుడు భట్, గుల్‌ను తోడు తీసుకుని పైఅంతస్థుకు వెళ్లారు.

"ఆ తరువాత మాకు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి"

ఎలాంటి రక్షణా లేకుండా సామాన్య పౌరులైన వారిద్దరినీ ఆ భవనంలోకి ఎందుకు పంపించారని ప్రత్యక్ష సాక్షి ప్రశ్నించారు.

మూడేళ్ల వయసున్న భట్ కొడుకు తనను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతూనే ఉన్నాడని భట్ సోదరుడు అబ్దుల్ మజీద్ భట్ చెప్పారు.

"మా నాన్నను తీసుకురండి అని భట్ కొడుకు అడుగుతూనే ఉన్నాడు. కానీ, నేను ఎక్కడి నుంచి తీసుకురాను?" అని ఆయన ప్రశ్నించారు.

(శ్రీనగర్‌కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఔకిబ్ జావీద్ ఈ కథనానికి సహాయం అందించారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)