జమ్ము-కశ్మీర్‌: మోదీ ప్రభుత్వం ఇక్కడ కొత్తగా ఏం చేయడానికి సిద్ధమవుతోంది?

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

కేంద్రపాలిత ప్రాంతం జమ్ము-కశ్మీర్ పేరు మరోసారి వార్తల్లో నిలుస్తోంది. కేంద్రం ఇక్కడ మళ్లీ చర్చలు మొదలుపెడుతోందని వార్తలు వస్తున్నాయి.

2019 ఆగస్టు 5న జమ్ము-కశ్మీర్ రాష్ట్రాన్ని మోదీ ప్రభుత్వం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి, ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ప్రస్తుతం కేంద్రం భావిస్తోంది.

అక్కడి అధికారులతో మాట్లాడి పీటీఐ వార్తా సంస్థ శుక్రవారం ఓ కథనం ప్రచురించింది.

‘‘రాజకీయ ప్రక్రియలను ముందుకు తీసుకెళ్లడానికి జూన్ చివరిలోగా ఇక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపైనా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది’’అని పీటీఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దిల్లీలోని అధినాయకత్వం నుంచి తనకు ఫోన్ వచ్చిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా ఓ ఇంగ్లిష్ పత్రికతో చెప్పారు. జూన్ 24న ఆ సమావేశం ఉండబోతోందని వివరించారు.

అయితే, ఇక్కడున్న అన్ని ప్రాంతీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించారో, లేదో తెలియదని ఆమె చెప్పారు.

మరోవైపు జమ్ము-కశ్మీర్ అప్నీ పార్టీకి కూడా ఈ చర్చలకు ఆహ్వానం వచ్చినట్లు పార్టీ అధికార ప్రతినిధి స్థానిక పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మెహబూబా ముఫ్తీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మెహబూబా ముఫ్తీ

చర్చలు ఎందుకు?

జమ్ము-కశ్మీర్‌లో డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (డీడీసీ) ఎన్నికల అనంతరం, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరిగింది. కానీ, ఎప్పుడు అనే విషయంపై ఎవరి దగ్గరా సమాధానం లేదు.

తాజాగా చర్చల ద్వారా.. నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ ఎన్నికలపై స్థానిక పార్టీలతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.

‘‘జమ్ము-కశ్మీర్‌లో రాజకీయ ప్రతిష్టంభనను తొలగించాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో ఇక్కడ అన్ని సవ్యంగానే జరుగుతున్నాయని అంతర్జాతీయ సమాజానికి సందేశం పంపుతోంది’’అని బీబీసీ కోసం పనిచేస్తున్న మాజిద్ జహంగీర్ చెప్పారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఫరూఖ్ అబ్దుల్లా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, విలేకరులతో మాట్లాడుతున్న ఫరూఖ్ అబ్దుల్లా

‘‘ఈ ప్రక్రియల్లో స్థానిక నాయకులను భాగస్వామ్యం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎందుకంటే వారి సాయం లేకపోతే ఇక్కడి రాజకీయ ప్రతిష్టంభన తొలగడం చాలా కష్టం’’.

కేంద్రంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు గత వారం గుప్కార్ అలయన్స్ సమావేశం అనంతరం నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు.

‘‘చర్చల ద్వారాలను మేం మూసివేయలేదు. మాకు ఆహ్వానం వస్తే, చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ఆయన అన్నారు.

అమిత్ షా సమీక్ష

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అమిత్ షా సమీక్ష

హోం మంత్రి సమీక్ష

జమ్ము-కశ్మీర్‌లో కొనసాగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులపై శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.

జమ్ము-కశ్మీర్ ప్రజల సంక్షేమం కేంద్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని సమీక్షా సమావేశంలో షా చెప్పారు.

అమిత్ షాతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, నిఘా విభాగం డైరెక్టర్ అరవింద్ కుమార్, ‘‘రా’’ చీఫ్ సమంత్ కుమార్ గోయల్, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ కుల్‌దీప్ సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బగ్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇది చాలా ముఖ్యమైన సమావేశం అని మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు కశ్మీర్‌లో మళ్లీ ఏదో జరుగుతోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా స్పందించింది.

2019 ఆగస్టు 5న ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రధాన నాయకులందరినీ గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజున ఆర్టికల్ 370ను రద్దు చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా అగ్ర నాయకులందరినీ గృహ నిర్బంధం నుంచి వదిలిపెట్టారు.

తర్వాత, జమ్ము-కశ్మీర్‌లోని ఏడు ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ)ని ఏర్పాటుచేశాయి. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని మళ్లీ తీసుకురావడమే ఈ అలయన్స్ లక్ష్యం.

పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి

పాకిస్తాన్ ఆందోళన..

కశ్మీర్‌లో భారత్ మళ్లీ ఏదో చేయాలని చూస్తోందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఐక్యరాజ్యసమితి ఎదుట ఆందోళన వ్యక్తంచేశారు.

‘‘కశ్మీర్‌లో భారత్ అక్రమంగా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలని చూస్తోంది. మళ్లీ కశ్మీర్‌ను విభజించి, ఇక్కడ జనాభాను సమూలంగా మార్చేయడానికి ఏదైనా చేయవచ్చు’’అని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌, భద్రతా మండలి అధ్యక్షులకు పాక్ విదేశాంగ మంత్రి లేఖలు రాశారు.

‘‘కశ్మీరీలను అణచివేసేందుకు 22 నెలలుగా భారత్ కుట్ర పన్నుతోంది. కశ్మీర్‌లో మానవ హక్కుల బహిరంగ ఉల్లంఘన జరుగుతోంది’’అని లేఖలో ఖురేషి ఆరోపించారు.

అయితే, కశ్మీర్ భారత్‌లో భాగమని, దీని గురించి మాట్లాడే హక్కు పాక్‌కు లేదని భారత్ మొదట్నుంచీ చెబుతూ వస్తోంది.

పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి

ఫొటో సోర్స్, Getty Images

‘‘కశ్మీరీల హక్కులను భారత్ కాలరాస్తోంది. నకిలీ ధ్రువపత్రాలతో భారత్‌లోని ఇతర ప్రాంతాల వారిని ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడి జనాభాలో సమూల మార్పులు చేయాలని చూస్తున్నారు’’అని ఖురేషి ఆరోపించారు.

‘‘1951 నుంచి భారత్ కశ్మీర్‌లో ఏకపక్షంగా, అక్రమంగా చర్యలు తీసుకుంటోంది. 2019 ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని వెనక్కి తీసుకోవడం కూడా దీనిలో భాగమే’’.

‘‘కశ్మీర్‌లో భారత్ ఏమైనా ఏకపక్ష చర్యలు తీసుకుంటే, భద్రతా మండలి తీర్మానాలు, జెనీవా కన్వెన్షన్‌లను ఉల్లంఘించడమే అవుతుంది’’.

‘‘తమ తీర్మానాలు అమలయ్యేలా చూసేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్యలు తీసుకోవాలి. మేం భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలే కోరుకుంటున్నాం. కశ్మీర్ సమస్యకు ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా పరిష్కారం చూపాలి’’.

‘‘దక్షిణాసియాలో శాంతి స్థాపనకు.. కశ్మీరీ ప్రజల సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం’’అని ఖురేషి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)